Bromance to Breakup: టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఎందుకు విడిపోయారు? తాజా డాక్యుమెంటరీలో ఏముంది?

లియాండర్ పేస్, మహేశ్ భూపతి

ఫొటో సోర్స్, ZEE5

ఫొటో క్యాప్షన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి
    • రచయిత, సుప్రియా సోగ్లే
    • హోదా, బీబీసీ కోసం

వాళ్లిద్దరినీ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అని పిలుస్తారు. కోర్టు లోపల ఎన్నో విజయాలు సాధించిన ఈ జోడీ కోర్టు వెలువల గొడవపడ్దారు, విడిపోయారు.

ప్రముఖ టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతి క్రీడా ప్రయాణంపై డాక్యు-డ్రామా అక్టోబర్ 1న విడుదల అయింది. వారి జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనల సమాహారంగా ఈ డాక్యుమెంట్‌ను చిత్రీకరించారు.

ఈ సీరీస్ పేరు 'బ్రేక్ పాయింట్ - బ్రొమాన్స్ టు బ్రేకప్'.

లియాండర్ పేస్, మహేశ్ భూపతి జోడీ అంతర్జాతీయ టెన్నిస్‌లో డేవిస్ కప్ మొదలుకొని వింబుల్డన్ సహా అనేక గ్రాండ్‌స్లామ్‌లలో తమ విజయ యాత్ర కొనసాగించారు.

భారతదేశంలో టెన్నిస్‌కు ఒక క్రేజ్ తీసుకురావడంలో వీరి జోడీ కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు.

ఈ సీరీస్, జ్ఞాపకాల తేనెతుట్టెను కదిలించిందని మహేశ్ భూపతి బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

"ఆ సంఘర్షణలను గుర్తు చేసుకోవడం భావోద్వేగాలను కలిగిస్తోంది. కానీ, మేము దీనికి సిద్ధంగా ఉన్నాం. ఈ సీరీస్ ప్రారంభం కావడానికి ముందే మాకు తెలుసు, మేం ఎందులో కాలు పెట్టబోతున్నామో. మేము తయారుగా ఉన్నాం. ఇది చేసినందుకు ఆనందిస్తున్నాం."

లియాండర్ పేస్, మహేశ్ భూపతి

ఫొటో సోర్స్, MAHESH BHUPATI INSTA

ఫొటో క్యాప్షన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి

లియాండర్ పేస్ టెన్నిస్‌లో భారతదేశానికి పెద్ద పెద్ద విజయాలు అందించారు.

పేస్, భూపతి టెన్నిస్ కోర్టులో విజయ ఢంకా మోగిస్తూ ఉండేవారు. కానీ, కోర్టు వెలుపల వారిద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణలు పొడజూపుతుండేవి.

ఇరువురి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు, 2006లో ఈ జోడీ విడిపోయింది.

తనకు, లియాండర్ పేస్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి సినిమా తీయడానికి గత పది సంవత్సరాలలో అనేక ఆఫర్లు వచ్చాయని, కానీ, అవేవీ తన ఆలోచనలకు దగ్గరగా లేవని మహేశ్ భూపతి చెప్పారు.

చివరికి, నితేశ్ తివారీ, అశ్విని అయ్యర్ తివారీ కథ చర్చించినప్పుడు డాక్యుమెంటరీ తీయడానికి ఒప్పుకున్నారు.

"ప్రస్తుత సీరీస్‌లో మా కథ చెప్పడానికి తగిన స్వతంత్రం మాకు లభిస్తుందని హామీ ఇచ్చారు. నితేశ్, అశ్విని మా కథను సరిగ్గా చెప్తారని మాకు అనిపించింది."

భారతదేశంలో క్రీడలపై వచ్చే డాక్యుమెంటరీ సీరీస్ పెద్ద పాపులర్ కాదు.

"భారతదేశంలో మార్కెట్ లేదు కాబట్టి డాక్యుమెంటరీ డ్రామా చేయవద్దని మాకు చాలామంది చెప్పారు. కానీ, నేను, లియాండర్ ఎప్పుడూ ట్రెండ్‌సెట్టర్లమే. మా కథ రెండు గంటల్లో చెప్పేది కాదని మేం భావించాం. అందుకే ఈ రిస్క్ తీసుకున్నాం. దీని తరువాత మరిన్ని స్పోర్ట్స్ డాక్యుమెంటరీలు వస్తాయని ఆశిస్తున్నాం" అని మహేశ్ భూపతి అన్నారు.

paes

ఫొటో సోర్స్, ZEE5

లియాండర్‌తో పరిచయం

తండ్రి మాట విని మూడేళ్ల వయసులో మహేశ్ భూపతి టెన్నిస్‌లో అడుగుపెట్టారు. ఉన్నత స్థాయిలో టెన్నిస్ ఆడడమే లక్ష్యంగా ముందుకు సాగారు.

పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా లియాండర్ పేస్‌ను కలిశారు.

జూనియర్ టోర్నమెంట్ కోసం మహేశ్, లియాండర్ ఇద్దరూ శ్రీలంక వెళ్లారు. అక్కడే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు.

తనకు, లియాండర్‌కు మధ్య ఉన్న అనుబంధం, వివాదాల గురించి ప్రపంచానికి తెలుసని, తాము ఏదీ దాచే ప్రయత్నం చేయలేదని మహేశ్ అన్నారు.

కానీ, చాలామంది ఇంకా వివరాలు తెలుసుకోవాలని కోరుకున్నారు. వారి ప్రశ్నలకు, సందేహాలన్నింటికీ ఈ సీరీస్‌లో జవాబులు దొరుకుతాయి.

లియాండర్ పేస్, మహేశ్ భూపతి

ఫొటో సోర్స్, ZEE5

ఫొటో క్యాప్షన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి

భారతదేశం, టెన్నిస్

భారతదేశంలో క్రీడలలో ఎప్పుడూ క్రికెట్‌కే అగ్రస్థానం. అయితే, టెన్నిస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉందని మహేశ్ భూపతి అభిప్రాయపడ్దారు.

మొదట విజయ్ అమృతరాజ్, రామనాథన్ కృష్ణన్, తరువాత లియాండర్ పేస్, మహేశ్ భూపతి జోడీ. వీరి విజయాలు భారత టెన్నిస్‌ను ప్రపంచ పటంపై నిలిపాయి.

వీరంతా భారత టెన్నిస్ క్రీడాకారులకు మార్గాన్ని సుగమం చేశారని, అయితే, ప్రస్తుతం భారత టెన్నిస్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదని ఆయన అన్నారు.

తమ జోడీ తరువాత సానియా మీర్జా, రోహన్ బోపన్న వచ్చారు కానీ ప్రస్తుతం భారత టెన్నిస్‌లో స్తబ్దత వచ్చినట్లు కనిపిస్తోందని మహేశ్ అన్నారు.

ఇందులోంచి బయటపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్లు గెలవాల్సి ఉంటుందని చెప్తూ ఈ పరిస్థితికి కారణాలు వివరించారు మహేశ్.

"భారతదేశంలో టెన్నిస్‌కు సరైన వ్యవస్థ లేదు. దీనికంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తయారుచేయాలి అప్పుడే పరిస్థితులు బాగుపడతాయి."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)