సిమోనా హాలెప్: సెరెనా విలియమ్స్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్న రొమేనియన్

ఫొటో సోర్స్, Getty Images
సిమోనా హాలెప్ తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకుంది. 24వ గ్రాండ్ స్లామ్ సాధించి రికార్డ్ సమం చేయాలన్న సెరెనా విలియమ్స్ కలలను ఆమె చెల్లాచెదరు చేసింది. 56 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరాటంలో అద్భుతమైన అథ్లెటిసిజం ప్రదర్శించి విజయం సాధించింది సిమోనా.
రొమేనియాకు చెందిన సిమోనా సెంటర్ కోర్టులో సెరెనా నుంచి అన్ని వైపులకూ దూసుకొస్తున్న బంతులను తిప్పికొడుతూ 6-2, 6-2 స్కోరుతో టైటిల్ గెల్చుకుంది.
"ఇది నా అత్యుత్తమ మ్యాచ్" అని చెప్పిన 27 ఏళ్ళ సిమోనాకు ఇది రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్. ఆమె 2018లో ఫ్రెంచి ఓపెన్ టైటిల్ గెల్చుకుంది.
అమెరికాకు చెందిన 37 ఏళ్ళ సెరెనా విలియమ్స్‌కు గత 12 నెలల్లో ఇది మూడవ ఫైనల్ ఓటమి.
"ఆమె అలవోకగా ఆడింది. జింక పిల్లలా వేగంగా గెంతుతూ దూసుకొస్తున్నట్లు నాకనిపించింది" అని సెరెనా సిమోనాకు కితాబిచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
అంచనాలను తలకిందులు చేసిన సిమోనా
గత ఏడాది ఫైనల్‌లో ఆంజెలిక్ కెర్బర్ చేతిలో ఓడిన సెరెనా విలియమ్స్ మీద క్రీడాభిమానుల అంచనాలు ఈసారి కాస్త తగ్గాయి. ఆట మొదట్లోనే ఆమె 4-0 స్కోరుతో వెనకబడడంతో ఆ అంచనాలు మరింత బలపడ్డాయి.
ఆట ప్రారంభానికి ముందే తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పిన సిమోనా అచ్చంగా అలాగే ఆడింది.
ఎంతో ఆత్మ విశ్వాసంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె విలియమ్స్ విసిరే సర్వీసులను తిప్పి కొట్టింది. ఇక ర్యాలీలు కొనసాగించడంలో ఆమె చూపించిన బలానికి అమెరికన్ క్రీడాకారిణి తడబడక తప్పలేదు.
విరామ సమయాల్లో విలియమ్స్ తన శక్తియుక్తులు కూడగట్టుకోవడానికి కళ్ళు మూసుకుని కనిపిస్తే, సిమోనా హాలెప్ మాత్రం ప్రైజ్ వైపు చూస్తూ కనిపించింది.
పెద్దగా పొరపాట్లేమీ లేకుండా స్థిరంగా ఆడిన సిమోనా వరసగా రెండు సెట్లు గెలిచి సెరెనా విలియమ్స్ మీద విజయం సాధించింది.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








