ఐపీఎల్ కోసమే INDvsENG ఐదో టెస్టు రద్దు చేశారా? ఈ ప్రశ్నకు బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ ఇచ్చిన సమాధానం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణంగానే ఇంగ్లండ్- ఇండియా మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు అయిందా లేక దీనికి కరోనా మాత్రమే కారణమా అనే చర్చ ఇంకా జరుగుతోంది. మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దుతో, ఈ నిర్ణయాన్ని ఐపీఎల్‌తో ముడిపెడుతున్నారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఐపీఎల్ కారణంగానే ఐదో టెస్టు మ్యాచ్ రద్దు అయ్యిందంటూ ఆరోపించారు.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయింది. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 19నుంచి దుబాయ్‌లో జరపాలని తర్వాత నిర్ణయించారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడ్డారు. తొలుత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, తర్వాత భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
యూఏఈలోని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, ఆటగాళ్లు అక్కడికి చేరుకున్న తర్వాత ఆరు రోజులపాటూ క్వారంటైన్‌లో ఉండాలి. కానీ, ఐదవ టెస్ట్ అనుకున్న సమయానికి పూర్తయితే, చాలా మంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లను కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ఇదే అంశాన్ని ఉటంకిస్తూ, భారత జట్టుతోపాటూ బీసీసీఐపైనా పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Gareth Copley - ECB
రవిశాస్త్రికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు భారత జట్టు మ్యాచ్ ఆడటానికి నిరాకరించలేదని, అయితే సహాయక సిబ్బందికి కరోనా సోకిన కారణంగానే మ్యాచ్‌ను ఎందుకు రద్దు చేశారని కొంతమంది వ్యక్తులు వాదిస్తున్నారు.
కోచ్ రవిశాస్త్రి పుస్తకావిష్కరణ వేడుకలో అనేక మంది భారత ఆటగాళ్లు పాల్గొనడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ది టెలిగ్రాఫ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవే అంశాలను ప్రస్తావించారు.
''బహుశా వచ్చే ఏడాది రెండు దేశాల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్''
"ఆటగాళ్లు ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. కానీ, దీనికి వారిని నిందించడం సరికాదు. ఫిజియో యోగేష్ పర్మార్ ఆటగాళ్లందరితో చాలా సన్నిహితంగా కలిసి పని చేశారు. నితిన్ పటేల్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన తర్వాత యోగేష్ పర్మార్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. యోగేష్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. యోగేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నందున వారు భయపడ్డారు" అని ఒక ప్రశ్నకు గంగూలీ బదులిచ్చారు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ రద్దు కారణంగా ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ చాలా నష్టపోయిందని సౌరవ్ గంగూలీ అంగీకరించారు. బోర్డుతో చర్చలు జరుగుతున్నాయని, బహుశా వచ్చే ఏడాది రెండు దేశాల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఈ సిరీస్‌ను ఇప్పుడు మాత్రం కొనసాగించలేమని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Visionhaus
రవిశాస్త్రి పుస్తకావిష్కరణ కార్యక్రమంపై వ్యాఖ్యానించడానికి గంగూలీ నిరాకరించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బోర్డు నుంచి రవిశాస్త్రి అనుమతి తీసుకోలేదని చెప్పారు.
రవిశాస్త్రిపై ఏవైనా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆలోచిస్తోందా అని సౌరవ్ గంగూలీని అడిగినప్పుడు, లేదు అని బదులిచ్చారు.
"మీరు మీ హోటల్ రూమ్‌లోనే ఎంతకాలమని ఉండగలుగుతారు? ప్రతిరోజూ మీ ఇంట్లోనే మిమ్మల్ని మీరు నిర్భంధించుకోగలుగుతారా? మీరు హోటల్ నుంచి మైదానానికి, తర్వాత తిరిగి మైదానం నుంచి హోటల్‌కి మాత్రమే ఎలా పరిమితం కాగలుగుతారు. మానవీయ కోణంలో ఆలోచిస్తే ఇది సాధ్యపడదు. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు జీవితం ఇలా మారింది" అని ఆయన అన్నారు.
ఇంగ్లండ్‌తో ఐదవ టెస్టును రద్దు చేయడంలో ఐపీఎల్ పాత్ర ఉందా అని సౌరవ్ గంగూలీని అడిగినప్పుడు, సున్నితంగా లేదని తిరస్కరించారు.
"బీసీసీఐ బాధ్యతారాహిత్యమైన బోర్డులా ప్రవర్తించదు. ఇతర క్రికెట్ బోర్డుల ప్రాముఖ్యతను కూడా మేము అర్థం చేసుకుంటాము" అని గంగూలీ అన్నారు.

ఫొటో సోర్స్, Robert Cianflone
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రద్దుకావడంతో, సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. ఈ సిరీస్ విజేతగా భారత్‌ను ప్రకటిస్తారా లేక ఏం జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిని అంగీకరించాలని, దీంతో సిరీస్ 2-2తో ముగుస్తుందని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ అన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే బీసీసీఐ దీనిని తిరస్కరించింది.
భారత ఓటమికి సంబంధించి ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. అయితే వెంటనే దానిని సవరించి మరో ప్రకటనను విడుదల చేసింది.
బీసీసీఐ, ఈసీబీల మధ్య దీనిపై చర్చ జరిగినా, ఈ టెస్ట్ మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని ఐపీఎల్‌తో ముడిపెడుతూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఐపీఎల్ కారణంగానే మ్యాచ్ రద్దు అయిందని ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కోవిడ్ కారణంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా, మైకెల్ వాన్ ట్వీట్‌కు బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ఆ సమయంలో కూడా నేను వారితో ఏకీభవించలేదు. ఇప్పుడు భారతదేశం చేసినదానితో కూడా నేను ఏకీభవించను'' అని ఆకాష్ చోప్రా ట్విట్‌కు తిరిగి మైఖేల్ వాన్ బదులిచ్చారు.
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ నిర్ణయాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడాన్ని తప్పుపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మాంచెస్టర్ టెస్ట్ రద్దు తర్వాత ఐపీఎల్ జట్లు తమ ఆటగాళ్లను చార్టర్డ్ విమానాల్లో యూఏఈకి తీసుకువెళుతున్నాయని మైఖేల్ వాన్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?
- 9/11: మూడు వేల మందిని చంపిన నిందితులపై 20 ఏళ్లు గడిచినా అమెరికా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- అఫ్గానిస్తాన్: కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








