INDvsENG ఐదో టెస్టు రద్దు: ‘బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు’ - ఈసీబీ

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దు

ఫొటో సోర్స్, Getty Images

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దైంది. భారత బృందంలోని సభ్యులకు కోవిడ్-19 సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని కేసులు వ్యాప్తి చెందుతాయనే భయంతో భారత్ జట్టు బరిలోకి దిగలేకపోతోంది.

ఈ వార్త చెబుతూ అభిమానులు, భాగస్వాములకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు క్షమాపణలు తెలిపింది.

''ఇది చాలా మందికి తీవ్ర నిరాశ, అసౌకర్యాన్ని కలిగిస్తుందని మాకు తెలుసు''.

సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, చివరి టెస్టును కోల్పోయిందని, సిరీస్ 2-2తో డ్రా అయినట్లు ఈసీబీ తొలుత తన ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సవరించిన ప్రకటనలో ''భారత్ టీమ్‌ను బరిలోకి దించలేకపోయింది'' అని చెప్పింది.

కాగా, తుది ఫలితంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది.

భారత్ నాలుగో టెస్టును గెలుచుకున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటే ఐసోలేషన్లోకి వెళ్లారు.

సిబ్బందిలో మరొక సభ్యుడికి నిర్వహించిన పరీక్షల్లో గురువారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

భారత్ గురువారం జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుంది. ఆ వెంటనే చేసిన పరీక్షల్లో ఆటగాళ్లలో ఎవరికీ కరోనా సోకలేదని తేలింది. దాంతో ప్రణాళిక ప్రకారమే టెస్టు మ్యాచ్ జరుగుతుందని ప్రకటించారు.

అయితే, మాంచెస్టర్‌లో మ్యాచ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

2020లో ఇంగ్లండ్ లో ప్రణాళిక ప్రకారం జరగాల్సిన మ్యాచ్ లను కరోనా మహమ్మారి కారణంగా రీషెడ్యూల్ చేశారు. కానీ, కరోనా కారణంగా ఇలా రద్దు చేసిన తొలి మ్యాచ్ మాత్రం ఇదే.

కరోనా వైరస్ భయంతో ఇంగ్లండ్ డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో మూడు వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

ఐదో టెస్టును రీషెడ్యూల్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అడ్డంకిగా మారుతుంది. ఈ లీగ్ ఈ నెల 19న పునఃప్రారంభం కావాల్సివుంది.

భారతదేశంలో జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ మేలో వాయిదా పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మళ్లీ ప్రారంభం కానుంది.

ఐపీఎల్‌ కోసమే ఇలా జరిగిందా?

బీబీసీ క్రికెట్ కరస్పాండెంట్ జోనాథన్ అగ్న్యూవిశ్లేషణ

ఇది చాలా వింతగా ఉంది. ఎందుకంటే గత రాత్రి ఆటగాళ్లకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షల్లో కరోనా సోకనట్టు స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ జరుగుతుందని మేం భావించాం.

ఐపీఎల్‌తో దీనితో సంబంధం ఉందని నేను అనుమానిస్తున్నాను. ఈ లీగ్ మరో 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)కి ఐపీఎల్ విలువ దాదాపు 3 వేల కోట్ల రూపాయలు.

వారు తమ వారిని కాపాడుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆటగాళ్ళు వారి ఒప్పందాలను కాపాడుకుంటారు. దీని వల్ల ఈసీబీ దాదాపు 203 కోట్ల రూపాయలు నష్టపోతుంది. బీసీసీఐతో దాని గురించి కొంత చర్చలు జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారు.

అద్భుతమైన సిరీస్‌లో కోవిడ్ జోక్యం చేసుకోవడం సిగ్గుచేటు.

ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయడానికి ముందుకొచ్చిన బీసీసీఐ

రద్దైన ఐదో టెస్టు మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే, మున్ముందు ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు.

వచ్చే ఆదివారం ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో రీషెడ్యూల్ కష్టతరంగా మారింది.

''ఈ టెస్ట్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయడానికి రెండు బోర్డులు కలిసి పని చేస్తాయి" అని బీసీసీఐ వెల్లడించింది.

బీసీసీఐ భయపడుతోంది - ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్

ఇండియా తన బలాన్ని ప్రదర్శిస్తోందని, ఆటగాళ్లు ఐపీఎల్ ఆడలేరేమోనని బీసీసీఐ భయపడుతోంది అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు.

దీనికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి సుదీర్ఘంగా చట్టపరంగా పోరాడాల్సి ఉంటుందని చెప్పారు.

బీసీసీఐ తలుచుకుంటే ఈ రోజు ఆటను ప్రారంభించడానికి ఇండియాకు కచ్చితంగా 11 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండేవారని అన్నారు.

2021 ఐపీఎల్ రెండో భాగం విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఇండియా అసలు ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడటానికి ఇష్టపడలేదని ఆయన చెప్పారు.

ఓవల్ మ్యాచ్‌కు, ఈ మ్యాచ్‌కు మధ్య ఉన్న తేడా.. వచ్చే వారం ఐపీఎల్ పునఃప్రారంభం కాబోతుండటం మాత్రమే అని అన్నారు.

ఆటగాళ్లు కరోనా సోకుతుందని, ఒంటరిగా ఉండాల్సి ఉంటుందని, ఐపీఎల్లో ఆడే అవకాశం కోల్పోతామని భయపడుతున్నారని చెప్పారు.

వాస్తవానికి ఓవల్ మ్యాచ్ సందర్భంగానే భారత క్రికెట్ జట్టులోని వారికి కరోనా సోకినట్లు తేలింది.

బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు - ఈసీబీ

''మేం ఈ టెస్టును వేరే సమయంలో ఆడొచ్చు. అయితే, నాలుగు అద్భుతమైన మ్యాచ్‌ల తర్వాత ఆడుతున్న భావన అప్పుడు రాకపోవచ్చు'' అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ అన్నారు.

''బీసీసీఐ, భారత జట్టు, వారి కెప్టెన్ టెస్టు క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక అజెండా ఉందని భావించే వ్యక్తులు ఐపీఎల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు''.

''నేను రాత్రంతా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. ఒకసారి ఆ భయాలు చొరబడితే చెలరేగిపోతాయి. అవి మారడం చాలా కష్టం. ఇందులో విజేతలు ఎవరూ లేరు.''

''బీసీసీఐ ఈ ఆటను ఆడాలని వంద శాతం కోరుకుంది. ఈసీబీ, బీసీసీఐల మధ్య బలమైన సంబంధం ఉంది. మేం దీని నుంచి కచ్చితంగా బయటపడతాం.''

క్రికెటర్ల కుటుంబాల్లో ఆందోళన

ఆటగాళ్లందరూ ఐసోలేషన్ లో ఉన్నారని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌ గుప్తా అన్నారు.

‘‘వారు పూర్తి నిబంధనలను పాటిస్తూ గదులకే పరిమితమయ్యారు. చాలా మంది వారి కుటుంబాలతో ఇక్కడికి వచ్చారు. వారిలో కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు కరోనా సోకితే పిల్లల పరిస్థితి ఏంటి? ఫిజియో యోగేశ్ పర్మార్ ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఆయనకూ కరోనా సోకింది. తమ పిల్లలతో ఉన్నవారు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు‘‘ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)