సర్ఫరాజ్ ఖాన్: ప్రాక్టీస్‌లో అతడి వికెట్ పడగొడితే పైసలిస్తానంటూ ప్రతి రోజూ పందెం కాసిన తండ్రి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌరభ్ సోమాని
- హోదా, స్పోర్ట్స్ రైటర్
అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2014 పోటీలకు భారత జట్టు బెంగళూరు నుంచి బయలుదేరటానికి ముందు.. నౌషాద్ ఖాన్ తన కొడుకును కలవటానికి నగరానికి వచ్చారు.
15 మంది సభ్యులున్న ఆ జట్టులో శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హూడా, కుల్‌దీప్ యాదవ్ వంటి క్రీడాకారుల సరసన సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కింది. తర్వాతి కాలంలో భారత ఫాస్ట్-బౌలింగ్ విప్లవానికి రూపశిల్పిగా మారిన భరత్ అరుణ్ నాడు ఈ జట్టుకు కోచింగ్ ఇచ్చారు.
నౌషాద్ వచ్చిన విషయం తెలిసిన అరుణ్ ఆయనను తన గదికి పిలిపించుకున్నారు. ''ఆందోళనేమీ వద్దని, అంతా బాగానే ఉందని ఆయన నాతో చెప్పారు. 'సార్, సర్ఫరాజ్‌ను కాస్త చూసుకోండి. వాడు కొంచెం అల్లరి పిల్లాడు' అని నేను ఆయనను కోరాను'' అని నౌషాద్ గుర్తుచేసుకున్నారు.
అయితే.. సర్ఫరాజ్ హాస్యచతురత నిజానికి జట్టుకు ఒక బలమని నౌషాద్‌తో అరుణ్ చెప్పారు.
''ఆస్ట్రేలియా క్రికెటర్లు, పాకిస్తాన్ క్రీడాకారుల కళ్లలో కళ్లు పెట్టి చూసి జోకులు వేయటానికి సర్ఫరాజ్ భయపడడు. అది మూడ్‌ను తేలికపరుస్తుంది. అది అతడి వైఖరి. ఆ వైఖరి కోల్పోయిన రోజు అతడి ఆటతీరు కూడా దెబ్బతింటుంది'' అంటారు అరుణ్.
అప్పటి నుంచి పెద్ద మార్పు లేదు. సర్ఫరాజ్ ఇప్పటికీ జోకులు వేస్తుంటాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''జట్టుకు జీవం సర్ఫరాజ్'' అని ముంబై టీం కోచ్ అమోల్ మజుందార్ అభివర్ణిస్తారు. క్రికెట్ మైదానంలో అతడికి ఇప్పటికీ భయం లేదు. ఇప్పటికీ భారీ పరుగులు స్కోర్ చేస్తూనే ఉన్నాడు.
గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో సర్ఫరాజ్ కేవలం 12 మ్యాచ్‌లలో 136.42 సగటుతో 1,920 పరుగులు చేశాడు. 18 ఇన్నింగ్స్‌లో ఏడు సెంచరీలు, 11 అర్థ సెంచరీలు చేశాడు.
ఇది అద్భుత ప్రదర్శన అంటే అతిశయోక్తి కాదు.
ఒక రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక పరుగుల ఆల్-టైమ్ రికార్డ్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు మీద ఉంది. 1999-2000 సీజన్‌లో లక్ష్మణ్ 1,415 పరుగులు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఇదే ఇప్పటికీ గోల్డ్ స్టాండర్డ్. ఆ సీజన్‌లో లక్ష్మణ్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడారు. సర్ఫరాజ్ గత రెండు సీజన్‌లలో ఒక్కో సీజన్‌కు ఆరు మ్యాచ్‌లు చొప్పున మాత్రమే ఆడాడు. ఈ వరుసలో చూసినపుడు తొమ్మిదో మ్యాచ్ ముగిసే సరికి సర్ఫరాజ్ 1,479 పరుగులు చేశాడు.
అదీ అతడి ముద్ర. ఇందుకు అతడి కఠోర శ్రమ, అంకితభావం చాలా వరకూ కారణమే, అయితే నౌషాద్‌కు కూడా కొంత క్రెడిట్ దక్కుతుంది. సర్ఫరాజ్‌కు, అతడి తమ్ముడు ముషీర్‌కు నౌషాద్ కోచింగ్ ఇచ్చారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న ముషీర్ కూడా క్రికెటర్‌గా సంచలనాలు సృష్టిస్తున్నాడు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సర్ఫరాజ్ తన బాల్యం గురించి మాట్లాడేటపుడు అతడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తన తండ్రి తనకు అండగా లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని అంటుంటాడు.
ప్రాక్టీస్ సెషన్లలో సర్ఫరాజ్‌ను ఔట్ చేసిన ప్రతిసారీ సదరు బౌలర్‌కు 50 రూపాయల చొప్పున బహుమతి ఇచ్చేవారు నౌషాద్. నెట్ సెషన్లలో బౌలర్లందరూ తన కొడుకుని బాగా ఇబ్బంది పెట్టేలా బౌలింగ్ చేయటం కోసం ఆయన ఈ పనిచేసేవారు.
ఒక్కో రోజు 300, 400 రూపాయలు అలా వికెట్ల మీద ఖర్చుచేయాల్సి వచ్చేది. ఈ మధ్య తరగతి కుటుంబానికి ఆ మొత్తం చాలా ఎక్కువ. ఇది.. సర్ఫరాజ్ తన వికెట్‌ను సులభంగా కోల్పోకుండా ఉండటానికి కష్టపడేలా చేసింది.
''ఆయన నా తండ్రి కాబట్టి నేనిది చెప్పటం లేదు. కానీ ఈ ప్రపంచంలో అటువంటి మనిషి దొరకటం కష్టం. ఆయన అంకితభావం స్థాయే వేరు. ఆయనకు మోకాళ్లలో సమస్యలున్నాయి. ఆపరేషన్ చేయించుకోవాలని ఎనిమిదేళ్ల కిందటే చెప్పారు. కానీ ఆపరేషన్‌లో ఏదైనా తేడా జరిగి తాను చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సి వస్తే మాకు కోచింగ్ ఇవ్వలేనని ఆయన ఆపరేషన్ చేయించుకోవటానికి నిరాకరించారు'' అని సర్ఫరాజ్ చెప్తాడు.

ఫొటో సోర్స్, Getty Images
ముంబైలో స్కూల్‌లో చదువుకుంటున్నపుడు క్రికెట్‌లో పృథ్వీ షా, అర్మాన్ జాఫర్‌ల సరసన సర్ఫరాజ్ అసాధారణ ప్రతిభ చూపేవాడు. కానీ ముంబైలో అవకాశాలు రావటం కష్టమని భావించిన నౌషాద్ కొంత కాలం పాటు తన సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌కు నివాసం మారారు.
కానీ యూపీ జట్టులో ఆడిన సీజన్ కూడా అంత బాగాలేదు. దీంతో వారి కుటుంబం మళ్లీ ముంబై తిరిగి వచ్చింది. సర్ఫరాజ్ తిరిగి ముంబై జట్టులో ఆడటానికి తప్పనిసరిగా కొంత కాలం 'విరామం' పాటించాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఐపీఎల్ టీ20 టోర్నమెంట్‌లో సర్ఫరాజ్ ప్రతిభకు గుర్తింపు లభించింది. 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు నిలుపుకున్న ముగ్గురు ప్లేయర్లలో.. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఎ.బి. డివిలియర్స్‌తో పాటు సర్ఫరాజ్ కూడా ఉన్నాడు.
కొత్త వేలం విధానం ప్రకారం ఐపీఎల్ జట్లు కేవలం కొద్ది మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుంటాయి. మిగతా క్రికెటర్లు వేలంలోకి వెళ్లాల్సి ఉంటుంది. సర్ఫరాజ్ మెరుపు వేగంతో స్కోర్ చేయగల అతి కొద్ది మంది క్రీడాకారుల్లో ఒకరని తాము గుర్తించినట్లు ఆర్‌సీబీ విశ్లేషకులు ఒకరు ఆ తర్వాత చెప్పారు.
అయితే ఆ సీజన్‌లో సర్ఫరాజ్ ఫామ్ కొనసాగలేదు. అతడికి క్రమశిక్షణ లేదనే అంశంపై ప్రశ్నలకు జవాబు కూడా చెప్పాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Deepak Malik /SPORTZPICS for BCCI
కానీ లాంగ్ ఫార్మాట్ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున సర్ఫరాజ్ భారీ స్కోరు సాధించటం కొనసాగింది. దీనివల్ల భారత జాతీయ జట్టులో చోటు కోసం అతడు ముందు వరుసలోకి వచ్చాడు.
సర్ఫరాజ్ బరువు గురించి చాలా చర్చ జరిగింది. కానీ అదేమీ అతడిని ఇబ్బంది పెట్టలేదు. ''నా చేతుల్లో బ్యాట్ ఉన్నపుడు నేను అందులో లీనమైపోతాను. అప్పుడు ఎవరు చూస్తున్నారనేదానితో నిమిత్తం ఉండదు. ప్రేక్షకులా, సెలక్టర్లా అనేదానితో సంబంధం ఉండదు. అల్లా ఆకాంక్షిస్తే నేను సెలక్ట్ అవుతాను'' అంటాడు సర్ఫరాజ్.
అతడికి అతడి కఠోర శ్రమ, అతడి తండ్రి ఇచ్చిన శిక్షణ అండగా ఉన్నాయి. ప్రాక్టీస్ కోసం సర్ఫరాజ్ ప్రతి ఏటా 'దేశదిమ్మరి' కావాల్సి వచ్చింది. ముంబైలో వర్షా కాలంలో ప్రాక్టీస్ వేదికలు చాలా వరకూ మూతపడుతుంటాయి. కాబట్టి ఆ కాలంలో సర్ఫరాజ్‌ను అతడి తండ్రి ఉత్తర్ ప్రదేశ్ తీసుకెళుతుంటారు. ఆ 1,400 కిలోమీటర్ల ప్రయాణంలో దారిలో ప్రాక్టీస్ సదుపాయం ఉన్న ప్రతి ఊర్లో వాళ్లు ఆగుతారు.
సర్ఫరాజ్ భారత జట్టులో ఆడాలన్న తమ కలను నిజం చేసుకోవటానికి ఈ తండ్రీకొడుకులు చేస్తున్న కఠోర శ్రమకు అదొక ఉదాహరణ మాత్రమే. అతడి గురించి మీడియాలో జరుగుతున్న కోలాహలం చూస్తే.. భారత జట్టులో సర్ఫరాజ్ అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే...ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- జూలై 1: కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవీ...
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
- ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













