అమెరికా: ట్రక్కులో మృతదేహాల కేసులో డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మాక్స్ మట్జా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఓ కంటైనర్ ట్రక్కు నుంచి 53 మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటన జూన్ 27న జరిగింది. ఈ ట్రక్కు టెక్సస్ శివార్లలోని శాన్ ఆంటోనియాలో రోడ్డు పక్కన కనిపించింది.
ట్రక్కులో సజీవంగా ఉన్న వ్యక్తులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల బాధితులకు వడదెబ్బ తగిలి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మరణించినవారు కూడా వడదెబ్బకు తాళలేక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.
కంటైనర్ ట్రక్కులో ఏసీ పని చేయడం లేదని, లోపల తాగడానికి నీళ్లు కూడా లేవని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
పరారీలో ఉన్న టక్కు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
అయితే, ట్రక్కులో ఎయిర్ కండీషనర్ పనిచేయడం లేదన్న సంగతి ట్రక్కు డ్రైవర్‌కు తెలియలేదని కోర్టు పత్రాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ట్రక్కు డ్రైవరును పట్టుకున్నారు
హోమెరో జామొరానో (45) ట్రక్కు పక్కనే దాక్కున్నట్టు సోమవారం గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురిలో జామొరానో ఒకరు.
జామొరానో, మరొక అనుమానిత కుట్రదారు క్రిస్టియన్ మార్టినెజ్ (28) ట్రక్కును కనుగొనడానికి ముందు, తరువాత కూడా వలసదారుల స్మగ్లింగ్ గురించి సందేశాల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా-మెక్సికో సరిహద్దుకు శాన్ ఆంటోనియో సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వచ్చే ప్రయత్నంలో వీరు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన మానవ అక్రమ రవాణా ఇది.
ట్రక్కులో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు, పిల్లలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితులు మెక్సికో, హోండురాస్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా ప్రాంతాలకు చెందినవారు.
జామొరానో పొదల్లో దాక్కుని ఉన్నాడని, బాధితుల్లో ఒకరిగా నటిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని అధికారులు తెలిపారు.
అయితే, జామొరానో ట్రక్కు నడుపుతున్నట్టు నిఘా ఫొటోల్లో బయటపడడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. టెక్సాస్‌లోని లారెడోలో అమెరికా బోర్డర్ పెట్రోల్ చెక్‌పాయింట్ దాటి వస్తుండగా ట్రక్కు నిఘా కెమెరాలకు చిక్కింది.
'ఏసీ పనిచేయట్లేదని డ్రైవరుకు తెలీదు'
కోర్టు పత్రాల్లో వివరాల ప్రకారం, ట్రక్కులోని వ్యక్తుల మరణాలను అధికారికంగా వెల్లడించిన తరువాత కూడా జామొరానో, మార్టినెజ్ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు టెక్సాస్ పోలీసుల కోసం పనిచేస్తున్న ఒక అధికారి బయటపెట్టారు.
"ట్రక్కులో ఏసీ పనిచేయడం లేదన్న సంగతి డ్రైవరుకు తెలీదు. వేడికి తట్టుకోలేక వారంతా ప్రాణాలు కోల్పోయారు" అని మార్టినెజ్ చెప్పారు.
ఈ సంభాషణ జరిగినప్పుడు జామొరానో, మార్టినెజ్ కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారని కూడా కోర్టు పత్రాలు చెబుతున్నాయి.
నిందితులు ఇద్దరూ దోషులుగా తేలితే, అక్రమ రవాణా, కుట్ర నేరాల కింద వారికి మరణశిక్ష విధించవచ్చు.
ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. జువాన్ క్లాడియో డి'లూనా-మెండెజ్, ఫ్రాన్సిస్కో డి'లూనా-బిల్బావో అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర తుపాకీలు ఉన్నాయని, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ మెక్సికన్ పౌరులు.
ట్రక్కు ఘటన బాధితుల్లో 27 మంది మెక్సికన్లు, 14 మంది హోండురాస్ పౌరులు, ఏడుగురు గ్వాటెమాలన్ వ్యక్తులు, ఇద్దరు సాల్వడోరన్ పౌరులు ఉన్నారు.
ట్రక్కులో మొత్తం 67 మంది వలసదారులు ఉన్నారని మెక్సికన్ అధికారులు చెప్పగా, 64 మందే ఉన్నట్టు శాన్ ఆంటోనియోలోని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
మరణించిన 53 మందిలో ఆరుగురిని "గుర్తించినట్టు" బెక్సర్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
"42 మందిని చూచాయిగా గుర్తించినట్టు", అయిదుగురిని గుర్తించలేకపోయినట్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వలసదారుల సంక్షోభం సున్నితమైన అంశం
ట్రక్కును కనుగొన్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే 18 చక్రాల మరో ట్రక్కును కనుగొన్నారు. దానిపై కూడా శుక్రవారం దర్యాప్తు ప్రారంభించినట్టు బెక్సర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
దీనిలో 13 మంది వలసదారులు ఉన్నట్టు అధికారులు సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
అయితే, "ట్రక్కులో ఉన్నవారెవరూ గాయపడలేదని ప్రాథమికంగా తెలుస్తోంది" అని షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.
వలసదారుల సంక్షోభం అమెరికాలో చాలా సున్నితమైన అంశం. మే నెలలో ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 2,39,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది అత్యంత ప్రమాదకర మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలసదారుల స్మగ్లింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది.
మధ్య అమెరికాలో పేదరికం, హింస నుంచి పారిపోవడం కోసం, మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాలోకి జొరబడడానికి ప్రయత్నిస్తారు. చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటేందుకు పెద్ద మొత్తాల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అక్రమ రవాణాల్లో మరణాలు అరుదు కాదుగానీ, ఇప్పటివరకు ఏ సంఘటనలోనూ ఇంత మంది చనిపోలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆరెంజ్ జ్యూస్ తాగితే అసిడోసిస్ తగ్గుతుందా... ఈ పాపులర్ పండ్ల రసం కథేమిటో తెలుసా?
- మహమ్మద్ జుబైర్‌కు బెయిల్ నిరాకరణ... ఆయనకు పాకిస్తాన్, సిరియా నుంచి విరాళాలు అందాయా?
- ఉదయ్‌పుర్: కన్నయ్యలాల్ హత్య కేసులో పాకిస్తాన్‌లోని 'దావత్-ఎ-ఇస్లామ్' పేరు ఎందుకు వినిపిస్తోంది?
- బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












