వందేళ్ల కింద లాక్కున్న బీచ్ రిసార్ట్స్‌ను తిరిగిచ్చేశారు, ఇప్పుడు దాని విలువ రూ.158 కోట్లు

ఫొటో సోర్స్, Los Angeles Times vis Getty Images
అమెరికాలో సుమారు 100 ఏళ్ల కిందట నల్లజాతీయుల నుంచి లాక్కున్న బీచ్ రీసార్ట్‌ను ఇప్పుడు తిరిగి వారి వారసులకు అధికారులిచ్చారు.
అమెరికాలో జాతి వివక్ష అత్యంత తారా స్థాయిలో ఉన్న కాలంలో నల్లజాతీయుల కోసం చార్ల్స్ బ్రూస్, విల్లా బ్రూస్ 1912లో దక్షిణ కాలిఫోర్నియాలో ఒక బీచ్‌ను కొన్నారు.
మాన్‌హట్టన్ బీచ్ నగరంలో ఉన్న బ్రూస్ బీచ్‌ను 1924లో స్థానిక ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది.
ఇటీవల అంటే మంగళవారం ఆ బీచ్ రిసార్ట్‌ను బ్రూస్ కుటుంబానికి తిరిగి ఇవ్వాలని లాస్ ఏంజెలీస్ కౌంటీ నిర్ణయించింది. 'జాతి వివక్షతోనే నల్లజాతీయుల వ్యాపారాలను దెబ్బతీసేందుకు నాడు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.' అని ఈ సందర్భంగా కౌంటీ కమిటీ వ్యాఖ్యానించింది.
1912లో 1,225 డాలర్లకు బీచ్ రిసార్ట్‌ను చార్ల్స్ బ్రూస్, విల్లా బ్రూస్ కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 20 మిలియన్ డాలర్లు.
'బీచ్ రిసార్ట్‌కు అవసరమైన స్థలం కోసం మేం చాలా చోట్ల తిరిగాం. కానీ మాకు ఎవరూ అమ్మలేదు. కానీ ఇది నా స్థలం. దీన్ని నేను వదులుకోను.' అని నాడు 1912లో ఒక పత్రికా రిపోర్టర్‌తో మాట్లాడుతూ విల్లా బ్రూస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని నల్లజాతీయులకు ఆటవిడుపు
నాడు దక్షిణ కాలిఫోర్నియాలోని నల్లజాతీయులకు బ్రూస్ బీచ్ ఆట విడుపు స్థలంగా ఉండేది. రిసార్ట్‌లో డైనింగ్ రూం, బాల్ రూం, బాతింగ్ ఏరియా వంటివి నిర్మించారని బ్రూస్ కుటుంబం ప్రతినిధి యెల్లో ఫీదర్ షెఫర్డ్ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని అన్ని ప్రాంతాల నుంచి నల్లజాతీయులు సరదాగా గడపడానికి ఇక్కడకు వచ్చే వారని వెల్లడించారు.
1914-15 మధ్య తెల్లజాతి ఆధిపత్యాన్ని కోరుకునే 'కు క్లక్స్ క్లాన్' అనే సంస్థ, బ్రూస్ కుటుంబం మాన్‌హట్టన్ బీచ్‌లో ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
స్థానిక పోలీసులు రిసార్ట్ మీద అనేక ఆంక్షలు విధించారు. రిసార్ట్ పక్కనే ఉండే భూయజమాని దారి ఇవ్వకపోవడంతో నల్లజాతీయులు సుమారు కిలోమీటరు నడిచి బీచ్ రిసార్ట్‌ను చేరుకునేవారని యెల్లో ఫీదర్ షెఫర్డ్ వివరించారు.
అయినా కూడా నల్లజాతీయులు ఆగకుండా బీచ్‌కు వస్తుండటంతో స్థానిక అధికారులు బ్రూస్ కుటుంబం నుంచి బలవంతంగా రిసార్ట్‌ను లాక్కున్నారు. ప్రజాభవనాలు, రోడ్లు వేయడానికి తప్పనిసరిగా అవసరమైనే ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చనే చట్టాలను ఇందుకు ఉపయోగించుకున్నారు.
బ్రూస్ కుటుంబం నుంచి లాక్కున్న బీచ్ రిసార్ట్‌లో పార్క్ నిర్మిస్తామని నాడు అధికారులు చెప్పారు. కానీ ఆ తరువాత కొన్ని దశాబ్దాల వరకు అక్కడ పార్క్‌ను నిర్మించలేదు. 1957 వరకు రిసార్ట్ అలా ఖాళీగా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాదికి రూ.3.26 కోట్ల అద్దె
బ్రూస్ కుటుంబం నుంచి అధికారులు బలవంతంగా లాక్కున్న బీచ్ రిసార్ట్ కోసం యెల్లో ఫీదర్ షెఫర్డ్ పోరాటం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా ర్యాలీలు చేపట్టడంతోపాటు అధికారుల దృష్టికి తరచూ ఈ విషయాన్ని తీసుకెళ్తూ ఉండే వాళ్లు.
బ్రూస్ కుటుంబం వారసులకు ఏడాదికి 4,13,000 డాలర్లు అద్దె చెల్లించేటట్లు ఒప్పందం కుదుర్చుకుంది లాస్ ఏంజెలీస్ కౌంటీ. భవిష్యత్తులో అన్ని రకాల ఖర్చులతో కలిపి 20 మిలియన్ డాలర్లకు బీచ్ రిసార్ట్‌ను కొనుగోలు చేసే క్లాజ్‌ను కూడా ఒప్పందంలో చేర్చారు.
'ఈ రోజు వస్తుందని మేం ఎన్నడూ ఊహించలేదు. నాడు బీచ్ రిసార్ట్‌ను లాక్కోవడంతో మా తాతల కలలు కల్లలయ్యాయి. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. వారు ఉండి ఉంటే ఇప్పుడు ఎంతో సంతోషపడేవారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దే దిశగా పడిన అడుగ్గా దీన్ని చూస్తాను.' అని విల్లా బ్రూస్ మునిమనవడు ఆంథోని బ్రూస్ అన్నారు.
నాడు తమను మాన్‌హట్టన్ బీచ్ నుంచి దాదాపుగా తరిమివేశారని యెల్లో ఫీదర్ షెఫర్డ్ అన్నారు. అందువల్లే నేడు ఇక్కడి జనాభాలో నల్లజాతీయుల వాటా ఒక్కశాతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్ల నుంచి జీతాలు రావు, గుర్తింపూ ఇవ్వలేదు. మరి దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఎలా నెట్టుకొస్తోంది?
- ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరగడానికి అసలు కారణాలేంటి?
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- కొత్త కార్మిక చట్టాలు: జూలై 1 నుంచి ఉద్యోగుల జీవితాల్లో వచ్చే మార్పులేంటి?
- మహారాష్ట్ర రిసార్ట్ రాజకీయాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఈ లగ్జరీ హోటళ్లలో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











