Single use plastics:జులై 1 నుంచి దేశమంతా ప్లాస్టిక్ నిషేధం - ఈ లిస్ట్‌లోని వస్తువులు వాడితే అయిదేళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాడి పారేసే స్ట్రా... తాగి పారేసే ప్లాస్టిక్ గ్లాసు.. తిని పడేసే ప్లాస్టిక్ ప్లేటు... ఇలాంటివన్నీ రీసైకిల్ కాకుండా వందల ఏళ్ల వరకూ భూమిపై అలానే ఉండిపోతాయనే వార్తలను ఎప్పటికిప్పుడు చూస్తూనే ఉన్నాం.
ప్లాస్టిక్ కాలుష్యంలో అన్నింటికన్నా ముందుండేది నిత్య జీవితంలో మనం ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులే. అందుకే ఇప్పటి వరకు సుమారు 77 దేశాల్లో కొన్ని పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా నిషేధం విధించాయి.
తాజాగా జులై 1 నుంచి భారత్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
మన దేశం విషయానికి వస్తే గ్లోబల్ ప్లాస్టిక్ వాచ్ వెబ్‌సైట్ డిసెంబర్ 7, 2021న విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
ఏటా ఒక్కో వ్యక్తి సుమారు ఈ భూమ్మీద 4 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్నాడు. 2019-20 సంవత్సరానికి గాను సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో విడుదలైన ప్లాస్టిక్ వ్యర్థాలు అక్షరాలా 34 లక్షల 69 వేల 780 టన్నులు. తర్వాత రెండేళ్లలో ఇది సుమారు 50 లక్షల టన్నులకు చేరి ఉండవచ్చన్నది ఓ అంచనా.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ఈపీ) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. వాటి బరువు విషయానికి వస్తే ఈ భూమ్మీద ఉన్న మొత్తం మానవాళి బరువుతో సమానంగా ఉంటుందని యూఎన్‌ఈపీ అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే?
నిజానికి ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, అర్థం కాని విషయమూ కాదు. యూరోపియన్ యూనియన్ నిర్వచించిన ప్రమాణాల ప్రకారం చెప్పాలంటే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌గా చెప్పవచ్చు.
అయితే ఈ ప్రమాణాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. మన దేశం విషయానికే వస్తే 2021 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్‌మెంట్ రూల్స్ ప్రకారం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. కొన్నిసార్లు వాటిని రీసైకిల్ చెయ్యవచ్చు లేదా వ్యర్థాలుగా వదిలేయవచ్చు కూడా.
అంటే రోజూ మనం వాడి పారేసే స్ట్రాలు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, ప్లాస్టిక్ బ్యాగ్‌లు, సోడా సీసాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు, ఇయర్ బడ్ విత్ ప్లాస్టిక్ స్టిక్స్, సిగిరెట్ ఫిల్టర్స్ తదితర ప్లాస్టిక్ వస్తువులన్నీ ఈ జాబితాలోకి వస్తాయి.
ఏటా మిగిలిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తుండగా, మరో 12 శాతం వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. మిగిలిన 79శాతం వ్యర్థాలు భూమ్మీద, సముద్రంలోనూ ఏటేటా మేటలుగా పేరుకుపోతున్నాయి.

ఫొటో సోర్స్, DAVID SHUKMAN
ఉత్పత్తి ఎలా జరుగుతోంది?
1950 నుంచీ ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. నేడు మిగతా పదార్థాలన్నింటినీ ప్లాస్టిక్ దాటుకుపోయింది. ఈ ఉత్పత్తి ప్రధానంగా శిలాజ హైడ్రోకార్బన్లపై ఆధారపడుతుంది. ఇవి పునరుద్ధరించలేని ఇంధన వనరులు.
ఉత్పత్తి ఇలానే కొనసాగితే... 2050 నాటికి ప్రపంచ చమురు వినియోగంలో 20 శాతం ప్లాస్టిక్ పరిశ్రమలకే మళ్లించాల్సి ఉంటుందని ఐరాస వెల్లడించింది.
పాలిథీన్ సంచులపై 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. వీటిని కట్టుదిట్టంగా అమలు చేయట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ నివేదికలో తెలిపింది. కర్నాటక, పంజాబ్‌లలో 2016లోనే నిషేధం అమలులోకి వచ్చిందని, అయితే ఇప్పటికీ అక్కడ సంచులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని వివరించింది.

ఫొటో సోర్స్, KATE STEPHENS
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లలో అవగాహన కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పింది. మరోవైపు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో క్రమంగా ఫలితాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దిల్లీ, తమిళనాడు, నాగాలాండ్, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రల్లోనూ నిషేధం అమలులో ఉంది.
ఈ పరిస్థితినంతా దృష్టిలో పెట్టుకొనే 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండ పాలిథిన్ సంచుల్ని గత ఏడాది సెప్టెంబర్లోనే కేంద్ర పర్యావరణ శాఖ నిషేధించింది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధించింది.
ప్లాస్టిక్ సంచుల తయారీదారులకు నిర్దేశిత గడువును ఇచ్చి విడతల వారీగా నిషేధం విధిస్తూ వస్తున్నామని గతంలో అధికారులు తెలిపారు.
2016 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు, గుట్కా, టుబాకో, పాన్ మసాలాల ప్యాకింగ్‌లలో ఉపయోగించే పాలిథిన్ సాషేలను కూడా నిషేధించింది.
జూలై 1 నుంచి మొదలయ్యే నిషేధాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షించనుంది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు సీపీసీబీకి నేరుగా రిపోర్ట్ చేయనున్నాయి.
ఇకపై నిషేధిత వస్తువులు తయారుచేసే ఏ పరిశ్రమకు పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ ముడి సరకులు సరఫరా చెయ్యవు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కడ అమ్మకుండా చూసే బాధ్యత స్థానిక అధికారులది. ఒకవేళ ఎవరైనా అమ్ముతూ పట్టుబడితే వారి కమర్షియల్ లైసెన్సులను రద్దు చేస్తారు కూడా.
భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ వస్తువుల తయారు చేసే మొత్తం 200 పరిశ్రమలకు వన్ టైం సర్టిఫికేట్లను సీపీసీబీ గత వారంలోనే జారీ చేసింది.
కేంద్రం విధించిన నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. అంతేకాదు వాటితో పాటు స్థానిక ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో మున్సిపల్ చట్టాల ప్రకారం కూడా జరిమానాలు విధించవచ్చు.
నిషేధిత జాబితాలో ఉన్నవి..
నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో కొన్ని..
* ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్‌లు, కప్‌లు, స్ట్రాలు, ఫోర్క్‌లు
* స్వీట్ బాక్స్‌లు, ఫుడ్ ప్యాకింగ్‌లో వాడే ప్లాస్టిక్ కవర్లు
* ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్ బడ్స్
* బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్
* ప్లాస్టిక్ జెండాలు
* లాలీపాప్, చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్
* ఐస్క్రీమ్ పుల్లలు
* థర్మోకోల్
* 100 మైక్రాన్ల లోపు మందం గల పీవీసీ బ్యానర్లు
* ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














