కర్ణాటక: హిందూ ఆలయంలో అరటి పండ్ల ముస్లిం వ్యాపారిపై ఏమిటీ వివాదం, అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, KUDUPUTEMPLE.COM
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక ప్రచారం జరిగింది. హిందూ దేవాలయాల్లో ఉత్సవాల సమయంలో ముస్లిం వ్యాపారులను అనుమతించకూడదనేది ఆ ప్రచారం. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకొక డిమాండ్ లేవనెత్తుతున్నారు.
దేవాలయాలకు అరటి పండ్లను సరఫరా చేసే వ్యాపారులు ముస్లింలు. కాబట్టి వారి కాంట్రాక్టు లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
మంగళూరు నగరానికి దాదాపు 10 కి.మీ దూరంలోని కోడుపులో శ్రీ అనంతపద్మనాభ దేవాలయం ఉంది. ఈ గుడికి అరటిపండ్లను సరఫరా చేసే కాంట్రాక్టును ఒక ముస్లిం వ్యాపారికి అప్పగించారు. టెండర్‌లో ఆయన అతి తక్కువ ధర కోట్ చేయడంతో అధికారులు ఆ కాంట్రాక్టును ముస్లిం వ్యాపారికే కట్టబెట్టారు.
కొన్ని హిందూ మత సంస్థలు ఇప్పుడు ఈ కాంట్రాక్టును వ్యతిరేకిస్తున్నాయి. రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఈ కాంట్రాక్టు జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతుందని, ఆలోగా కాంట్రాక్టును రద్దు చేయలేమని జిల్లా పాలనాధికారులు స్పష్టం చేశారు.
బజ్‌రంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు శరణ్ పంప్‌వెల్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, KUDUPUTEMPLE.COM
''ఇలాంటి కాంట్రాక్టులకు కేవలం హిందూ వ్యాపారులకే ఇవ్వాలని, మరే ఇతర మతాల వ్యాపారులకు ఇవ్వకూడదని హిందూ సంస్థలు, దేవాలయ కమిటీకి చెప్పాయి. అయితే, ఇది గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టు అని జిల్లా పాలనాధికారులు చెప్పారు. మరి కొన్ని రోజుల్లో అంటే జూన్ 30న ఇది ముగుస్తుందని, అంతవరకు ఎదురుచూడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు'' అని ఆయన అన్నారు.
అయితే, కర్ణాటక ట్రాన్స్‌పరెన్సీ అండ్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్ (కేటీపీపీఏ), కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఎండోమెంట్ యాక్ట్‌లను ఉదహరించిన జిల్లా పాలనా యంత్రాంగం, నిబంధనలను పాటించాల్సి ఉంటుందని చెప్పింది.
దక్షిణ కన్నడ జిల్లా ఉప కమిషనర్ డాక్టర్ కేవీ రాజేంద్ర, బీబీసీతో మాట్లాడుతూ, ''కేటీపీపీఏ ప్రకారం, కాంట్రాక్టును పొందకుండా ఏ వ్యాపారిని కూడా ఆపలేం. ఎండోమెంట్ చట్టం ప్రకారం, హిందూ ఆలయాల పరిసరాల్లో హిందువులకు మాత్రమే స్థలాన్ని కేటాయించాలి.
ఇవి రెండూ వేర్వేరు చట్టాలు. అందరి కంటే తక్కువ ధరను కోట్ చేసిన వారికి కాంట్రాక్టును అప్పగించేందుకు ఎవరూ నిరాకరించరు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. వ్యాపారులు, స్థానిక ప్రజల మత విశ్వాసాలను పూర్తిగా గౌరవించాలని కాంట్రాక్టులో రాసి ఉంటుంది.
మేం ఒక స్పష్టతను ఇవ్వగలం. ముస్లిం వ్యాపారి కూడా కాంట్రాక్టును పొందవచ్చు. కానీ, అతను స్థానిక ప్రజల మత విశ్వాసాలను గౌరవించాల్సి ఉంటుంది'' అని అన్నారు.
హిజాబ్ వివాదంతో మొదలైందా?
''ఒకవేళ వస్తువులను గర్భగుడి వరకు తీసుకెళ్లాల్సి ఉంటే, దాని కోసం మరో వ్యక్తిని నియమించుకోవచ్చు'' అని కేవీ రాజేంద్ర చెప్పారు.
కేటీపీపీఏ ప్రకారం కొన్ని ప్రామాణిక మార్గదర్శకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి ప్రకారం, ఎవరైనా ఈ సమస్యను అధికారుల ముందుకు తీసుకురావాలని భావిస్తే వారు అప్పీల్ చేయవచ్చు. అధికారులకు తమ సూచనలను అందించవచ్చు అని సూచించారు.
హిజాబ్ వివాదం చెలరేగినప్పటి నుంచి కర్ణాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి భాగం కాదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఈ తీర్పు వెలువరించిన తర్వాత అక్కడి ముస్లిం సమాజానికి చెందిన మత పెద్దలు, కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి బదులుగా ఈ తీర్పుపై విచారం వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మూసి ఉంచాలని అక్కడి ముస్లింలకు అప్పీల్ చేశారు.
దీని తర్వాత హిందూ సంస్థలు అక్కడొక ప్రచారాన్ని నిర్వహించాయి. హిందూ పండగల సమయంలో ముస్లింలు తాత్కాలిక దుకాణాలను తెరవకూడదంటూ హిందూ సంస్థలు ప్రచారం చేశాయి.
ఈ ప్రచార ప్రభావం మంగళూరుకు 22 కి.మీ దూరంలో ఉన్న బప్పనాడు దుర్గాపరమేశ్వరీ దేవాలయానికి చేరింది. ఈ గుడిని బప్పా అనే ముస్లిం వ్యక్తి నిర్మించారు.
ఒకసారి బప్పా కలలో దేవత కనిపించి, గుడిని కట్టాలని కోరిందని చెబుతుంటారు. హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా ఈ గుడిలో పూజలు చేయడానికి వస్తుంటారు.
ఆలయంలో ముస్లిం వ్యాపారులపై ఈ గుడి నిర్వాహకులు ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ, కొన్ని హిందూ సంస్థలు, ముస్లిం వ్యాపారులను అనుమతించవద్దంటూ గుడి బయట పోస్టర్లను అంటించాయి.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: రెండు వారాల్లో 10 భూకంపాలు... ఈ ప్రాంతంలోనే ఎందుకిలా?
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













