అఫ్గానిస్తాన్: వందల కొద్దీ భూకంపాలు, గత పదేళ్లలో 7 వేల మరణాలు... ఈ ప్రాంతంలోనే ఎందుకిలా?

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
ఇటీవల వచ్చిన భారీ భూకంపంతో సుమారు వెయ్యి మంది చనిపోయారు. మూడు వేల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. వందల ఇళ్లు కూలి పోయాయి.
గత రెండు వారాల్లో ఒక మాదిరిగా ప్రభావం చూపే 10 భూకంపాలు అఫ్గానిస్తాన్‌లో వచ్చాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేలు మీద 4 కంటే పైనే ఉంది.
ఇటీవల 1,000 మందికి పైగా చనిపోవడానికి కారణమైన భూకంపం తీవ్రత 5.9. గత 20 సంవత్సరాలలో సంభవించిన భూకంపాలలో ఇదే అతి భయంకరమైనది.
అఫ్గానిస్తాన్‌లో ఇన్ని భూకంపాలు ఎందుకు వస్తున్నాయ్?
భూమి ఉపరితలమైన క్రస్ట్‌లో ఉండే టెక్టానిక్ పలకల్లో అకస్మాత్తుగా కదలికలు చోటు చేసుకున్నప్పుడు భారీ స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూమిపైకి చేరుకుంటుంది. ఫలితంగా భూమి కంపిస్తుంది. విడుదలయ్యే శక్తి ఆధారంగా భూకంపం తీవ్రత ఉంటుంది.
హిమాలయాల్లో ఉండే హిందు కుష్ రీజియన్‌లో అఫ్గానిస్తాన్ దేశం ఉంది. ఈ ప్రాంతంలోనే ఇండియన్, యూరేసియన్ ప్లేట్స్ కలుసుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా భూపలకల్లో కదలికలు చోటు చేసుకునే ప్రాంతాల్లో హిందు కుష్ ఒకటి. అందువల్ల అఫ్గానిస్తాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
గత ఏడాదిలో 219 చిన్నా పెద్ద భూకంపాలను అఫ్గానిస్తాన్ చవి చూసింది.

పక్తికా భూకంపం ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది?
ఇండియన్, యూరేసియన్ పలకలు ఢీ కొని విడుదలైన శక్తి వల్ల పక్తికా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద దాని తీవ్రత 5.9గా నమోదైంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిరోషిమా మీద వేసిన అణుబాంబు తీవ్రత కంటే ఇది 37 రెట్లు ఎక్కువని అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ చెబుతోంది.
ఈ ప్రకంపనల ప్రభావం 500 కిలోమీటర్ల పరిధిలో పాకిస్తాన్, భారత్‌లో కూడా కనిపించింది.
'అఫ్గానిస్తాన్‌లో భూకంపం వచ్చిన ప్రాంతం హిమాలయాల పాదాల వద్ద ఉంటుంది. ఇక్కడ టెక్టానిక్ ప్లేట్లు సమానంగా కాక ఒకటి ముందుకు మరొకటి వెనుకకు ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతంలో భూమి ఉపరితలానికి చాలా తక్కువ లోతులోనే కంపాలు వస్తుంటాయి. ఆ ప్రభావం కూడా చాలా తక్కువ సమయంలోనే భూమి మీదకు చేరుతుంది. పరిమాణం పరంగా చూస్తే పక్తికాలో సంభవించింది ఒక మాదిరి భూకంపమే. కానీ అది భూమి ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల దాని ప్రభావం భయంకరంగా ఉంది.' అని బ్రయన్ వివరించారు.

అఫ్గానిస్తాన్‌లో సంభవించిన ఇతర భూకంపాలు...
గత పదేళ్ల కాలంలో భూకంపాల కారణంగా అఫ్గానిస్తాన్ 7,000కు పైగా ప్రజలు చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం నివేదించింది. భూకంపాల కారణంగా ప్రతీ ఏడాది సగటున 560 మంది మరణిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో వెంటవెంటనే సంభవించిన భూకంపాల కారణంగా 20 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
2015లో హిందూకుష్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. దీనివల్ల 399 మంది ప్రజలు కన్నుమూశారు. ఎక్కడో దూరాన ఉన్న చైనా షిన్‌జియాంగ్ ప్రావిన్సులో కూడా ఈ భూకంప ప్రభావం కనిపించింది.
2002 మార్చిలో హిందూకుష్ పర్వతాల్లో వరుసగా సంభవించిన రెండు భూకంపాల వల్ల 1100కు మందికిపైగా మరణించారు.
ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని తఖర్, బడఖ్‌షాన్ ప్రావిన్సులలో మే నెలలో వచ్చిన వచ్చిన భూకంపంతో దాదాపు 4000 మంది చనిపోగా, సుమారు 100 గ్రామాలు, 16 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. 45 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
1998 ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా 4000 మంది చనిపోయారు. 15 వేల మంది నిరాశ్రయులుగా మారారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లోనే భూకంపాలు వల్ల ఇంత నష్టం ఎందుకు జరుగుతోంది?
అఫ్గానిస్తాన్ కంటే కూడా జపాన్, దక్షిణ అమెరికా దేశాల్లో భూకంపాలు అధికంగా వస్తాయని డాక్టర్ బాప్టీ అన్నారు.
''అఫ్గాన్‌లోని భవనాలు భూకంపాన్ని తట్టుకొని నిలిచేలా ఉండవు. దీని కారణంగానే అక్కడ ఎక్కువ నష్టం జరుగుతోంది'' అని ఆయన చెప్పారు.
కొండచరియలు కూడా అఫ్గాన్‌లో ఈ నష్టం ఎక్కువ కావడానికి కారణం అవుతున్నాయి.
కొండచరియలు విరిగిపడటం వల్ల పర్వత ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇవి నదుల్లో పడిపోవడంతో పెద్ద ఎత్తున వరదలకు కారణమవుతున్నాయి.
ఈ విపత్తు గురించి అధికారులకు తెలిసేసరికి ఒక్కోసారి కొన్ని రోజుల సమయం పడుతుంది.
కొండచరియల వల్ల రహదారులపై రాకపోకలకు అంతరాయాలు ఏర్పడతాయి. సహాయక సిబ్బంది సేవలకు ఆటంకం కలుగుతుంది.
వర్షం, పొగమంచు, విపరీతమైన చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా తరచుగా సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతుంటాయి.
గత వారం ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలోనే అప్గాన్‌లో భూకంపం సంభవించిందని ఐక్యరాజ్య సమితి చెప్పింది.
''అఫ్గానిస్తాన్ భయంకరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 35 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆకలి, పేదరికం స్థాయిలు పెరుగుతుండటంతో మిలియన్ల మంది ప్రజలు మనుగడ సాగించేందుకు పోరాడుతున్నారు'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...
- భారత్-రష్యా: పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా?
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన సానుభూతి - డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
- గ్యాస్ట్రిక్ అల్సర్ల కోసం కనిపెట్టిన మాత్రను అబార్షన్ల కోసం ఎలా ఉపయోగిస్తున్నారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











