Afghanistan: తాలిబాన్‌ల నుంచి జీతాలు రావు, గుర్తింపూ ఇవ్వలేదు. మరి దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఎలా నెట్టుకొస్తోంది?

అఫ్గానిస్తాన్ సంస్థలపై పట్టుకోసం తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటికీ చాలా సంస్థలు వారి ఆధీనంలో లేవు.
దాదాపు 70 దేశాల్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలు ఇప్పటికీ తాలిబాన్లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో పరిస్థితులను తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అక్కడకు వెళ్లారు.
భారత రాజధాని దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం లోపలకు వెళ్తూనే సందర్శకులకు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీ ఫొటో కనిపిస్తుంది. గత ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఘనీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఆయన ప్రభుత్వానికి పశ్చిమ దేశాలు గట్టి మద్దతు ఇచ్చేవి.
దిల్లీలోని ప్రధాన రాయబారి ఫరిద్ మముదంద్‌జాయ్ కార్యాలయంలోనూ ఘనీ ఫొటో కనిపించింది. మరోవైపు ఘనీ ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచిన నలుపు, ఎరుపు, పచ్చ రంగుల జెండా కూడా ఫరిద్ కార్యాలయంలో కనిపించింది.
‘‘తాలిబాన్లతో మాకు సమన్వయం చాలా తక్కువగా ఉంది’’అని ఫరీద్ చెప్పారు. ఫరీద్‌తోపాటు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది.. వీసాలు, పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు. తమను నియమించిన ఘనీ ప్రభుత్వం తరఫునే వీరు పాస్‌పోర్టులు ఇస్తున్నారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తోంది. రష్యా, పాకిస్తాన్, చైనా, తుర్క్‌మెనిస్తాన్‌లకు మాత్రమే వారు రాయబారులను నియమించారు. అయితే, ఈ దేశాలు కూడా తాలిబాన్లతో అధికారికంగా సంబంధాలను ఏర్పరచుకోలేదు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గాన్‌లో ఏం జరిగింది?
- అఫ్గాన్‌లో తాలిబాన్ల పాలన కొనసాగుతోంది: గత ఏడాది అఫ్గాన్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 20ఏళ్ల కిందట తాలిబాన్లు ఇలానే ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు కూలదోశాయి.
- ప్రస్తుతం అఫ్గాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది: దేశంలోని మూడో వంతు మంది ప్రజలకు మౌలిక అవసరాలు కూడా తీరడం లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మరోవైపు విదేశీ సాయం కూడా నిలిచిపోయింది.
- మహిళా హక్కులపై వేటు: బయటకు వచ్చేటప్పుడు అమ్మాయిలు ముఖానికి బురఖా వేసుకోవాలని తాలిబాన్లు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు టీనేజీ బాలికల చదువుపైనా ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని రాయబార కార్యాలయాన్ని ఇదివరకటి ప్రభుత్వ విభాగంగానే కొనసాగేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. 1996 నుంచి 2001 మధ్య తాలిబాన్లు అధికారంలో కొనసాగినప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు తాలిబాన్లు అఫ్గాన్‌పై పట్టు సాధించినప్పటికీ.. మాజీ అధ్యక్షుడు బుర్హానుద్దీన్ రబ్బానీ ప్రభుత్వ విభాగంగా భారత్‌లో అఫ్గాన్ రాయబార కార్యాలయం పనిచేసేది.
అఫ్గాన్‌లో అధికారం చేతులు మారినప్పటికీ, తాము ఇప్పటికీ ఇదివరకటి ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాలనే పాటిస్తున్నట్లు ఫరీద్ చెప్పారు.
‘‘మేం ఇప్పటికీ ఇదివరకటి ప్రజాస్వామ్య ప్రభుత్వం తరఫునే పనిచేస్తున్నాం. మేం తాలిబాన్ల నుంచి ఎలాంటి ఆదేశాలు తీసుకోవడం లేదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, AP Images
ప్రపంచ వ్యాప్తంగా భిన్న దేశాల్లోని రాయబార కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ విషయంలో వారు విజయం సాధించలేకపోతున్నారు. నిధుల సమస్యే దీనికి ప్రధాన కారణం. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. విదేశీ నిధులు కూడా నిలిచిపోయాయి. మానవ హక్కులు, మహిళలపై వివక్ష లేకుండా చూడటం లాంటి చర్యలతో నిధులకు పశ్చిమ దేశాలు ముడిపెడుతున్నాయి.
దిల్లీతోపాటు ఇతర దేశాల్లోని రాయబార కార్యాలయాలు తాలిబాన్ల నుంచి ఎలాంటి ఆదేశాలు తీసుకోవడం లేదని ఫరీద్ చెప్పారు. ‘‘ముందు తాలిబాన్లు అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. మహిళలకు ప్రాథమిక హక్కులు కల్పించాలి’’అని ఆయన అన్నారు.
తాలిబాన్లు అధికారంలో వచ్చిన తర్వాత మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కానీ, గత కొన్ని నెలలుగా మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చారు.
గత వారం విధ్వంసక భూకంపం అఫ్గాన్ కుదిపేసింది. దీని వల్ల 1000 మందికిపైగా మృతి చెందారు. దీంతో తమవారి ఆచూకీ కోసం చాలా మంది దిల్లీలోని అఫ్గాన్ కార్యాలయానికి వచ్చారు.

ఇప్పుడు తాము వీసాలు, పాస్‌పోర్టులను పాత ప్రభుత్వం తరఫునే జారీ చేస్తున్నట్లు ఫరీద్ చెప్పారు. తాలిబాన్లు కూడా వీటికి గుర్తింపునిస్తున్నారని ఆయన వివరించారు.
‘‘ఇదివరకటి ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టులతోనే తాలిబాన్ నాయకులు కూడా విదేశాలకు వెళ్తున్నారు’’అని ఆయన అన్నారు. తాలిబాన్లు జారీచేసే పాస్‌పోర్టులు, ఇతర ధ్రువపత్రాలను విదేశాలు గుర్తించడం లేదు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్తాన్, భారత్‌ల మధ్య ప్రయాణాలు చాలా తగ్గిపోయాయి. అయితే, కొందరు మాత్రం అఫ్గాన్‌లోని తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు, ధ్రువపత్రాల కోసం అక్కడికి వెళ్తున్నారు.
భారత్‌లో దాదాపు లక్ష మంది అఫ్గాన్ పౌరులు జీవిస్తున్నట్లు దిల్లీలోని అఫ్గాన్ దౌత్య కార్యాలయం అంచనా వేస్తోంది. వీరిలో 30,000 నుంచి 35,000 మంది శరణార్థులు కాగా.. మరో 15,000 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్, ముంబయిలలోని దౌత్యా కార్యాలయాలు.. అఫ్గాన్ విదేశాంగ శాఖలోని రాయబార కార్యాలయాల విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. పెళ్లిళ్లు, విడాకులు, జనన, మరణ ధ్రువపత్రాల కోసం రోజూ ఈ కార్యాలయాలకు అఫ్గాన్‌వాసులు వస్తుంటారు.
మరోవైపు అఫ్గాన్‌కు ఆర్థిక సాయం సమీకరించే విషయంలోనూ ఈ రాయబార కార్యాలయాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి.
‘‘భూకంపం అనంతరం ఆర్థిక, మానవతా సాయాన్ని భారత్ పంపించింది. దీని కోసం కాబుల్‌లోని విదేశాంగ కార్యాలయంతో మేం సమన్వయం చేసుకున్నాం’’అని ఫరీద్ చెప్పారు.
నిధుల కొరత
ఘనీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత విదేశాల్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలను నిధుల కొరత వేధిస్తోంది.
‘‘ఒకప్పుడు ఇక్కడి నుంచి వారానికి 10 నుంచి 15 విమానాలు తిరిగేవి. రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా బావుండేది. మేం తీరిక లేకుండా ఉండేవాళ్లం. ఇప్పుడు అలా లేదు. మా ఆదాయం 80 శాతం పడిపోయింది’’అని ఫరీద్ చెప్పారు.
మిగతా దేశాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. మే నెలలో వాషింగ్టన్‌లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాన్ని అమెరికా తమ నియంత్రణలోకి తీసుకుంది. మరోవైపు న్యూయార్క్, లాస్ ఏంజిలిస్‌లలోని మిషన్లు కూడా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
‘‘ఇక్కడ ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. ఈ కార్యాలయం సొంత భవనంలోనే ఉంది. కాబట్టి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. వీసా, పాస్‌పోర్టుల జారీతో కొంత ఆదాయం వస్తోంది’’అని ఫరీద్ చెప్పారు.
దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లలోని 21 మంది దౌత్యవేత్తలు తమ జీతాల్లో కొతలకు కూడా అంగీకరించినట్లు ఆయన వివరించారు.
‘‘మేం మా మాతృభూమి, ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నాం. దీని కోసం కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమే’’అని ఫరీద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












