వరల్డ్ ఆర్డర్‌ని మార్చేయాలనే ట్రంప్ ప్లాన్ యూరప్‌కి సమస్యలు తెస్తుందా?

- రచయిత, ఎలన్ లిటిల్
- హోదా, బీబీసీ సీనియర్ కరస్పాండెంట్
అమెరికా, యూరప్ దేశాలను గత 80 ఏళ్లుగా ఏకతాటిపై నిలిపిందేమిటంటే, రక్షణ రంగంలో ఉమ్మడి భాగస్వామ్యం.
అలాగే ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టబద్ధమైన పాలన వంటి ఉమ్మడి విలువలపై ఉన్న నిబద్ధత. ఈ శకానికి 1947 మార్చిలో బీజంపడింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ తన 18 నిమిషాల ప్రసంగంలో, సోవియట్ యూనియన్ విస్తరణ నుంచి యూరప్‌ను రక్షించడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
నేటో, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు అమెరికా నాయకత్వంలోనే ఏర్పడ్డాయి.
దేశాల మధ్య పరస్పర బాధ్యతలు, ఉమ్మడి లక్ష్యాలతో 'నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ'కు అమెరికా కట్టుబడి ఉంది. నియంతృత్వ శక్తుల నుంచి ప్రజాస్వామ్య ప్రపంచాన్ని రక్షించాలని ఈ వ్యవస్థ ఉద్దేశం.

అయితే ఇప్పుడు, 2025 డిసెంబర్‌లో ప్రచురితమైన కొత్త అమెరికా జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్‌ఎస్) ప్రకారం, అమెరికా దృష్టిలో ఆ ఉమ్మడి ప్రయాణం ముగిసింది.
అమెరికా పాత్ర గురించి ప్రపంచం ఇప్పటివరకు ఏవైతే నమ్మిందో, అవన్నీ ఇకపై ఉండబోవని ఈ వ్యూహం సంకేతాలిస్తోంది.
ఈ సమీక్షాపత్రంలో 'నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ' అనే పదాన్ని ఉదహరిస్తూ, దాన్ని 'సో-కాల్డ్' అని పేర్కొంటూ కొటేషన్ మార్కులలో ఉంచారు. అంటే కేవలం విరామ చిహ్నాల ద్వారానే ఆ వ్యవస్థ ప్రాధాన్యాన్ని లేదా చట్టబద్ధతను అమెరికా ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మార్పు గురించి ముందే సంకేతం...
అమెరికా వ్యూహంలో మార్పు గురించి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2025 ఫిబ్రవరిలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లోనే యూరోపియన్ మిత్రదేశాలను హెచ్చరించారు.
యూరప్‌కు అసలైన ముప్పు రష్యా నుంచి కాదని, అది అంతర్గతంగానే పొంచి ఉందని వాన్స్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వాక్ స్వాతంత్య్రాన్ని సెన్సార్ చేసేవారు, రాజకీయ వ్యతిరేకతను అణచివేసేవారు, తద్వారా యూరప్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేవారి నుంచే అసలు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆయన వామపక్ష ఉదారవాద వర్గం (లెఫ్టిస్ట్ లిబరల్ నెట్‌వర్క్)పై తీవ్ర విమర్శలు చేశారు.
వాన్స్ ప్రసంగం యూరోప్‌పై ప్రకటించిన 'సిద్ధాంతపరమైన యుద్ధం' అని ఫ్రాన్స్‌కు చెందిన వార్తాపత్రిక 'లీ మోండే' అభివర్ణించింది.
2025 డిసెంబర్‌లో విడుదలైన అమెరికా జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ-ఎన్ఎస్ఎస్), వాన్స్ చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఒక సిద్ధాంత స్థాయికి తీసుకెళ్లింది.
"రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఉన్న ప్రపంచ విలువలను ప్రోత్సహించే దేశంగా అమెరికా ఇప్పుడు ఎంతమాత్రం లేదు" అని గతంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన, రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌యూఎస్‌ఐ) మాజీ డైరెక్టర్ కారిన్ వాన్ హిప్పెల్ వ్యాఖ్యానించారు.
"అమెరికా ఇప్పుడు చాలా భిన్నమైన దిశలో పయనిస్తోంది" అని అన్నారు.
కాబట్టి, ప్రపంచం ఆ పాత వ్యవస్థ నుంచి దూరంగా జరుగుతుంటే, మరి దేనివైపు వెళ్తోంది? దీనివల్ల మిగతా ప్రపంచానికి, ముఖ్యంగా యూరప్‌కు ఎలాంటి పరిణామాలను కలిగిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
'ఇప్పుడు మనం ఒక భిన్నమైన ప్రపంచంలో ఉన్నాం'
"ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు నాటకీయంగా అమెరికా వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అవి మా ప్రయోజనాలకు గానీ, లేదా మరే ఇతర నిర్దిష్ట ప్రయోజనాలకు గానీ ఉపయోగపడటం లేదు" అని వాషింగ్టన్‌లోని ప్రముఖ కన్సర్వేటివ్ థింక్ ట్యాంక్ 'హెరిటేజ్ ఫౌండేషన్' ఉపాధ్యక్షురాలు విక్టోరియా కోట్స్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దగ్గర గతంలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కోట్స్ పనిచేశారు. ఆమె దృష్టిలో, మారుతున్న ఈ ప్రపంచంలో అంతర్జాతీయ వ్యవస్థలో మార్పులు రావడం అనివార్యం.
"మనం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే 80 ఏళ్ల క్రితం, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 'నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ'ను ఏర్పాటు చేసినప్పుడు, చైనా అనేది ఆందోళన కలిగించే అంశంగా లేదు. మనం నేడు పూర్తిగా ఒక భిన్నమైన ప్రపంచంలో ఉన్నాం" అని పేర్కొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 'నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ'ను ఒక విశిష్టమైన తరం సృష్టించింది. గొప్ప శక్తుల మధ్య జరిగే భౌగోళిక రాజకీయాల నడుమ పెరిగిన ఆ తరం, ఆ పాత వ్యవస్థ రెండుసార్లు ఎలా వినాశకరమైన ప్రపంచ యుద్ధాలకు దారితీసిందో కళ్లారా చూసింది.
ఆ చేదు అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన వారసత్వమే ఈ అంతర్జాతీయ వ్యవస్థ. ఇందులో కొన్ని లోపాలు, అసంపూర్ణతలు ఉన్నప్పటికీ అది ఆ తరం అనుభవం నుంచి ఉద్భవించింది.
అయితే, అమెరికా విదేశీ విధానం ఆ తర్వాత కాలంలో దారి తప్పిందని ఎన్ఎస్ఎస్ నేరుగా వాదిస్తోంది. దీనికి అమెరికా విదేశీ విధాన రూపకర్తలను అది నిందిస్తోంది.
"గత పాలకులు అమెరికా విధానాలను అంతర్జాతీయ సంస్థల నెట్‌వర్క్‌తో ముడిపెట్టారు. వీటిలో కొన్ని సంస్థలు పూర్తిగా అమెరికా వ్యతిరేకతతో నడుస్తున్నాయి. మరికొన్ని 'ట్రాన్స్‌నేషనలిజం' పేరుతో దేశాల స్వతంత్ర సార్వభౌమత్వాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయి" అని ఎన్ఎస్ఎస్ పేర్కొంది.
ఇటువంటి అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తగ్గించడానికి భవిష్యత్తులో అమెరికా ప్రయత్నిస్తుందని సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
అమెరికా ఎన్ఎస్ఎస్‌పై రష్యా ప్రశంసలు...
"ప్రపంచానికి ప్రాథమిక రాజకీయ ప్రమాణం 'దేశం' మాత్రమే, అది అలాగే ఉంటుంది. దేశాల సార్వభౌమ హక్కుల కోసం మేము నిలబడతాం. దేశాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా మితిమీరి జోక్యం చేసుకునే అంతర్జాతీయ సంస్థల చొరబాట్లను మేము వ్యతిరేకిస్తాం" అని ఎన్ఎస్ఎస్ పేర్కొంటోంది.
అంతేకాకుండా, ఈ ఎన్ఎస్ఎస్ పత్రం 'అధికార సమతుల్యత' గురించి వివరిస్తూ, "పెద్ద, ధనిక, బలమైన దేశాల ప్రభావం మిగతా వాటికంటే ఎక్కువగా ఉండటం అనేది అంతర్జాతీయ సంబంధాలలో ఒక సనాతన సత్యం" అని చెబుతోంది.
ఈ ఎన్ఎస్ఎస్ పత్రంపై రష్యా ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఇందులోని చాలా అంశాలు తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది.
"ట్రంప్, షీ జిన్‌పింగ్, పుతిన్, వారిని అనుసరించే మరికొందరు నియంతృత్వ నేతలు మనల్ని మళ్లీ 'మహాశక్తుల రాజకీయాల' కాలానికి తీసుకువెళ్లాలని చూస్తున్నారని నేను భావిస్తున్నాను" అని 2010 నుంచి 2013 వరకు బ్రిటన్ సాయుధ దళాల అధిపతిగా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ లార్డ్ రిచర్డ్స్ వ్యాఖ్యానించారు.
అయితే, లండన్ కింగ్స్ కాలేజ్‌లో వార్ స్టడీస్ ప్రొఫెసర్ సర్ లారెన్స్ ఫ్రీడ్‌మాన్ మాత్రం ఈ కొత్త భద్రతా వ్యూహం కనిపిస్తున్నంత తీవ్రంగా గతంతో తెగదెంపులు చేసుకోలేదని భావిస్తున్నారు.
"మనం 'నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ' అనే పదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పదం గత దశాబ్ద కాలంగా మాత్రమే ఎక్కువగా వాడుకలోకి వచ్చింది" అని ఆయన వాదిస్తున్నారు.
"మనం గతాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, ఆ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు వియత్నాం యుద్ధం. కాబట్టి, కొన్నిసార్లు గత కాలం గురించి ఒక రకమైన అతిశయోక్తి లేదా గొప్పగా చెప్పుకోవడం చూస్తుంటాం. సంక్లిష్టమైన గత చరిత్ర పట్ల అతిగా మక్కువ చూపే విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి" ప్రొఫెసర్ సర్ లారెన్స్ ఫ్రీడ్‌మాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మన్రో సిద్ధాంతానికి సంబంధించి బలమైన పునరుద్ధరణ...
వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో అమెరికా చేపట్టిన సైనిక చర్య, ఆ దేశ నాయకుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను బందీలుగా పట్టుకోవడానికి దారితీసింది. అమెరికా తన సార్వభౌమత్వాన్ని ఏకపక్షంగా, బలవంతంగా చాటుకోవడానికి ఇదొక తొలి ఉదాహరణ.
ట్రంప్ ప్రభుత్వ చర్యల చట్టబద్ధతను కొంతమంది అంతర్జాతీయ చట్ట నిపుణులు ప్రశ్నించారు. సైనిక బలగాల వినియోగానికి సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలను అమెరికా ఉల్లంఘించి ఉండవచ్చని వారు వాదించారు.
అయితే, తమ చర్యలు చట్టబద్ధంగా సమర్థించదగినవేనని అమెరికా వాదిస్తోంది.
"అమెరికా చట్టం ప్రకారం ఇది కచ్చితంగా చట్టబద్ధమే" అని మొదటి దఫా ట్రంప్ ప్రభుత్వంలో అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా పనిచేసిన రాబర్ట్ విల్కీ గతంలో బీబీసీతో అన్నారు.
"మదురో పాలనను మా యూరోపియన్ భాగస్వాములు చాలామంది గుర్తించలేదు. కాబట్టి ఆయన ఒక అక్రమ నాయకుడు. ఆ కారణంగా, దేశాధినేతలకు ఉండే సాధారణ రక్షణ కవచాలు ఆయనకు వర్తించవు. ముఖ్యంగా అమెరికా రాజ్యాంగ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అవి ఐక్యరాజ్యసమితి చెప్పే దేనికంటే కూడా పైచేయిగా ఉంటాయి'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడమే...
పశ్చిమ గోళార్ధంలో అమెరికా అత్యున్నత శక్తిగా ఉండే హక్కును కలిగి ఉందని, తన ప్రయోజనాలకు అనుగుణంగా లాటిన్ అమెరికా, కరీబియన్ పొరుగు దేశాలను మార్చుకోవాలని జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) పేర్కొంటోంది.
ఇది 1823 నాటి 'మన్రో సిద్ధాంతాన్ని', పశ్చిమార్ధ గోళంలో అమెరికా ఆధిపత్యాన్ని మరింత బలవంతంగా పునరుద్ఘాటించడమే. ఇప్పుడు కొలంబియా, పనామా, క్యూబా దేశాలు కూడా అమెరికా అధ్యక్షుడి టార్గెట్ జాబితాలో ఉన్నాయి.
"ఇది ప్రధానంగా పనామా కాలువతో మొదలవుతుంది" అని విక్టోరియా కోట్స్ చెప్పారు.
"ఈ కాలువపై నియంత్రణ అమెరికాకు ఎంత అవసరమో మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది" అని కోట్స్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం లాటిన్ అమెరికాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. అమెరికా తన "ఇంటి పెరడు"లాంటి ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించాలని ఎన్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
పనామా కాలువను 1999లో పనామా దేశానికి అప్పగించినప్పుడు, "చైనా ఒక వివేకవంతమైన దేశం అని మేము భావించాం. కానీ అది నిజం కాదని తేలింది" అని కోట్స్ వ్యాఖ్యానించారు.
" ఆ కాలువపై అమెరికా తన ప్రధాన స్థానాన్ని నిలుపుకోవడం చాలా కీలకం. అమెరికా నుంచి పనామాకు ఈ సందేశం మొదటిసారి స్పష్టంగా అందుతోందని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'అమెరికా సామర్థ్యం అపరిమితమైనదేమీ కాదు...'
తన పొరుగు దేశాలను నియంత్రించగల అమెరికా సామర్థ్యం అపరిమితమైనదేమీ కాదని వాదించే వారిలో సర్ లారెన్స్ ఫ్రీడ్‌మాన్ ఒకరు.
"భద్రతా సమీక్ష ప్రకారం ఇది మా ప్రాంతం, మేము అనుకున్నది చేస్తాం అని చెప్పవచ్చు, కానీ ఇప్పటికీ అక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. వారు మదురోను, ఆయన భార్యను బందీలుగా పట్టుకుని ఉండవచ్చు. కానీ వారు ఇంకా పాత పాలనతోనే పోరాడాల్సి వస్తోంది. ట్రంప్ ఏం చెప్పినప్పటికీ, వారు ఆ దేశాన్ని (వెనెజ్వెలాను) పరిపాలించడం లేదు" అని అన్నారు.
కొత్త వ్యూహం ప్రకారం, నియంతృత్వ దేశాలు తమ మానవ హక్కుల రికార్డును మెరుగుపరుచుకోవాలని అమెరికా ఇకపై ఒత్తిడి చేయదు.
1776 నాటి అమెరికా స్వాతంత్ర్య ప్రకటన నుంచి తీసుకున్న ఒక వాక్యాన్ని ఉటంకిస్తూ, ఈ భద్రతా సమీక్ష, "ప్రకృతి నియమాలు, ప్రకృతి దేవుడి ప్రకారం, అన్ని దేశాలు ఒకదానితో ఒకటి 'ప్రత్యేకమైన, సమాన హోదా' పొందే హక్కును కలిగి ఉన్నాయి" అని ప్రకటించింది.
ఉదాహరణకు మధ్యప్రాచ్య దేశాల విషయంలో, ముఖ్యంగా గల్ఫ్ రాచరిక దేశాలు తమ సంప్రదాయాలను, చారిత్రక ప్రభుత్వ రూపాలను వదులుకోవాలని వారిని మందలించే తప్పుడు ప్రయోగాన్ని ఇకపై అమెరికా వదిలివేస్తుందని ఈ ఎన్ఎస్ఎస్ పేర్కొంటోంది.
"మధ్యప్రాచ్యంతో విజయవంతమైన సంబంధాలకు అసలైన కీలకం ఏమిటంటే, ఆ ప్రాంతాన్ని, అక్కడి నాయకులను, ఆ దేశాలను అవి ఎలా ఉన్నాయో అలాగే అంగీకరిస్తూ, ఉమ్మడి ప్రయోజనాలపై కలిసి పనిచేయడమే" అని ఆ పత్రం వివరిస్తోంది.
అయితే, సంప్రదాయాలు, చారిత్రక ప్రభుత్వ రూపాల పట్ల చూపుతున్న ఇదే స్థాయి గౌరవం, ప్రజాస్వామ్య దేశాలైన యూరప్ మిత్రదేశాలకు మాత్రం వర్తించడం లేదు.
ఈ సమీక్షా పత్రం ఐరోపా ఖండంతో, ముఖ్యంగా బ్రిటన్, ఐర్లాండ్‌తో అమెరికాకు ఉన్న ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని ప్రస్తావించినప్పటికీ, ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, పాశ్చాత్య ప్రపంచంలో అసలు దేన్ని రక్షించుకోవాలి అనే నిర్వచనాన్ని మార్చడానికి ఇది ప్రయత్నిస్తోంది.
ఈ సమీక్ష దాని పరిధిలో ఒక నాగరికతకు సంబంధించిన మార్పు. ఇది ఇకపై 'ట్రూమాన్ సిద్ధాంతం' ఉమ్మడి విలువలపై ఆధారపడిన నాగరికత గురించి కాకుండా, కేవలం ఆయా దేశాల 'సార్వభౌమాధికారానికే' ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ గురించి వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఎస్ఎస్ యూరప్‌ను ఏ స్థితిలో ఉంచుతుంది?
యూరప్ ప్రస్తుతం పయనిస్తున్న దిశ పట్ల అమెరికా ఎన్ఎస్ఎస్ సమీక్షా పత్రం అత్యంత కఠినమైన విమర్శలు చేసింది. భవిష్యత్తులో కొన్ని యూరప్ దేశాలను నమ్మదగిన మిత్రదేశాలుగా పరిగణించవచ్చా లేదా అనే ప్రశ్నలను ఇది లేవనెత్తింది.
ఇది యూరప్‌లోని 'ఆర్థిక క్షీణత' గురించి ప్రస్తావిస్తూనే, అంతకంటే భయంకరమైన, స్పష్టమైన 'నాగరికత తుడిచిపెట్టుకుపోయే' ప్రమాదం అక్కడ పొంచి ఉందని పేర్కొంది.
ఈ పత్రంలోనే, "రాబోయే కొన్ని దశాబ్దాలలోపు, కొన్ని నేటో సభ్య దేశాలలో మెజారిటీ జనాభా 'ఐరోపాయేతరులు' అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ దేశాలను దీర్ఘకాలిక భద్రతా భాగస్వాములుగా కొనసాగించడంలో సందేహాలను కలిగిస్తోందని ఈ వ్యూహం సూచిస్తోంది'' అని మరోచోట ఉంది.
"ఇది సంకుచిత జాతీయవాదంతో కూడిన పత్రం" అని కారిన్ వాన్ హిప్పెల్ వాదిస్తున్నారు.
"పూర్తిగా ఒక భావజాలంతో ఇది నిండి ఉంది. పాశ్చాత్య దేశాలలో 'క్రైస్తవ శ్వేతజాతీయుల' ఆధిపత్యం తగ్గిపోతోందనే ఆందోళన దీని వెనుక ఉన్న అసలు సందేశం. అమెరికా, యూరోప్‌లో ఇప్పటివరకు ఉన్న ఆ ఆధిపత్యానికి ముప్పు వాటిల్లుతోందని వారు భావిస్తున్నారు" అని అన్నారు.
"వారు ఈ విషయాలను ఎక్కడా నేరుగా చెప్పనప్పటికీ, దాని అంతరార్థం మాత్రం ఇదేనని అనుకుంటున్నాను" అని ఆమె చెప్పారు.
కానీ విక్టోరియా కోట్స్ వాదన ప్రకారం, ఆమె దృష్టిలో 'మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పెద్ద పోరాటం' కచ్చితంగా నాగరికతకు సంబంధించిందే.
"సార్వభౌమాధికారం అనేది కూడా ఒక కీలకమైన అంశం" అని ఆమె చెబుతున్నారు.
"యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టును గమనిస్తే, ముఖ్యంగా బ్రెగ్జిట్ తర్వాత తమ జాతీయ ప్రయోజనాలను ఈయూ ప్రధాన కార్యాలయం 'బ్రస్సెల్స్'కు లోబడి ఉంచడం సరైన వ్యూహమేనా అని చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి" అని చెప్పారు.
"ఎన్ఎస్ఎస్‌ను ప్రశ్నిస్తున్న సంస్థలలో ఐరోపా సమాఖ్య ఒకటి అని నేను కచ్చితంగా అనుకుంటున్నాను" అని కారిన్ వాన్ హిప్పెల్ అన్నారు.
యూరప్ ఖండంలో తమ కార్యకలాపాలను నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ చేసే ప్రయత్నాలను వ్యతిరేకించే 'అమెరికన్ టెక్ దిగ్గజాల' ప్రయోజనాలకు కూడా ఈ ఆలోచనలు సరిగ్గా సరిపోతున్నాయి.
గత నెలలో ఎలాన్ మస్క్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేస్తూ, యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేయాలని, సార్వభౌమాధికారాన్ని తిరిగి ఆయా దేశాలకే అప్పగించాలని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'యూరప్ గమనం పట్ల ప్రతిఘటనను పెంపొందించడం'
యూరప్ తన "ఆత్మవిశ్వాసాన్ని" ఎలా తిరిగి పొందాలో ఎన్ఎస్ఎస్ సమీక్షా పత్రం స్పష్టంగా పేర్కొంది.
"యూరప్‌లో పెరుగుతున్న దేశభక్తి పార్టీల ప్రభావం మాకు గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తోంది. యూరప్ తన ప్రస్తుత గమనాన్ని సరిదిద్దుకోవడానికి సహాయం చేయడమే మా లక్ష్యం. మాతో పోటీ పడటానికి మాకు ఒక బలమైన ఐరోపా అవసరం."
దీని కోసం అమెరికా అనుసరిస్తున్న విధానం ఏమిటంటే, "ఐరోపా దేశాల లోపలే, అక్కడి ప్రస్తుత గమనం పట్ల ప్రతిఘటనను పెంపొందించడం."
అయితే, "ప్రతిఘటనను పెంపొందించడం" అంటే అసలు అర్థం ఏమిటనేది అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
రష్యా నుంచి ముప్పు పెరుగుతున్న తరుణంలో, అమెరికా ఇకపై నమ్మదగిన మిత్రదేశం కాకపోవచ్చునని ఐరోపాలోని కొందరు అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు.
మ్యూనిచ్‌లో వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ప్రసంగం తర్వాత, జర్మనీ చాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ మాట్లాడుతూ, నేటోని పునర్నిర్మించి, అమెరికా నుంచి యూరప్ "స్వతంత్రం సాధించాల్సిన" అవసరం ఉందని పేర్కొన్నారు.
కానీ దీనికి సమయం పడుతుంది.
"ఇది స్వల్పకాలంలో సాధ్యం కాదు" అని సర్ లారెన్స్ అంటున్నారు.
"యూరప్ దేశాలు అమెరికాపై పూర్తిగా ఆధారపడ్డాయి, అది వారి సొంత నిర్ణయం. ఎందుకంటే అలా చేయడం చాలా సులభం" అని చెప్పారు.
"అమెరికా సహాయం లేకుండా పనిచేయడం ఆచరణాత్మకంగా మంచిదే అయినప్పటికీ, వారితో ఉన్న సంబంధాల నుంచి విడదీసుకోవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. పైగా ఇది చాలా ఖరీదైన వ్యవహారం."
"కాబట్టి యూరప్ ఒక కష్టమైన పరిస్థితిలో ఉంది: వారు అమెరికన్లను నమ్మలేరు, అలాగని వారు లేకుండా సులభంగా పని చేయలేరు" అని సర్ లారెన్స్ అభిప్రాయపడ్డారు.
''సమీప భవిష్యత్తులో యూరప్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎదుర్కోబోయే అత్యంత కీలకమైన ప్రశ్న గురించి లార్డ్ రిచర్డ్స్ ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేశారు: ఐరోపా "రెండు రాళ్ల మధ్య నలిగిపోయే" ప్రమాదం ఉంది.
"ఐరోపా సమాఖ్య ఒక మహాశక్తిగా ఎదగలేదు, అలాగే అందులోని ఏ ఒక్క దేశం కూడా ఆ స్థాయికి చేరుకోలేదు," అని ఆయన వాదిస్తున్నారు. "కాబట్టి, ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఎవరి ప్రభావ వలయం కింద ఆశ్రయం పొందాలో కచ్చితంగా నిర్ణయించుకోవాలి" అని అన్నారు.
"దీనికి సమాధానం ఏమిటంటే, వారు మళ్లీ అమెరికా ప్రభావ వలయంలోనే, పునర్నిర్మితమైన నేటో పరిధిలోనే కొనసాగే అవకాశం ఉంది" అని సర్ లారెన్స్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు'
రక్షణ రంగంపై ఖర్చును పెంచాలనే నిబద్ధత ఎప్పుడో జరగాల్సింది అని లార్డ్ రిచర్డ్స్ కూడా విశ్వసిస్తున్నారు.
"యూరోపియన్ దేశాలు తమ రక్షణ కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పటినుంచో జరగాల్సిన మార్పు. కానీ బ్రిటన్‌లో ఇది ఇంకా కొత్త నిధుల రూపంలోకి మారలేదు. నిజానికి, ఈ సంవత్సరం సాయుధ దళాలు ఎక్కువ ఖర్చు చేయడం కంటే, ఉన్న నిధులను ఆదా చేయాల్సిన అవసరం ఉంది" అని లార్డ్ రిచర్డ్స్ చెబుతున్నారు.
రక్షణ ఖర్చులను పెంచాలని అమెరికా చాలా ఏళ్లుగా యూరప్‌పై ఒత్తిడి తెస్తోందని సర్ లారెన్స్ గుర్తు చేశారు.
"యూరప్ స్వీయ రక్షణ కోసం మరింత కృషి చేయాలనే సందేశం చాలా కాలంగా ఉంది. ఒబామా, బైడెన్ ఇద్దరూ దీన్ని ముందుకు తెచ్చారు'' అని చెప్పారు.
ట్రంప్ గత ఏడాది యూరప్ మిత్రదేశాల నుంచి ఒక కీలకమైన హామీని పొందారు. అదేమిటంటే, ఆయా దేశాల రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచడం. ఇలా చేయడం ద్వారా ఆయన యూరప్‌కు ఒక రకంగా భద్రతాపరమైన మేలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే, దీర్ఘకాలంలో ఇది అమెరికాపై ఆధారపడకుండా యూరప్‌కు ఒక స్వతంత్ర నిర్వహణ సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
"వ్యయం గణనీయంగా పెరిగింది" అని సర్ లారెన్స్ చెప్పారు.
"జర్మనీ ఈ విషయంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. కాబట్టి మార్పు మొదలైంది, చాలామంది ఆశించినంత వేగంగా కాకపోయినా అది జరుగుతోంది" అని అన్నారు.
యూరప్‌కు అమెరికా ఎలా 'సహాయం' చేయాలనుకుంటుందో ఎన్ఎస్ఎస్ భద్రతా సమీక్షలో స్పష్టంగా ఉంది.
"తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలనుకునే, మా ఆలోచనలతో ఏకీభవించే దేశాలతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం" అని పేర్కొంది.
అంతిమంగా ఈ నివేదిక వెల్లడించేదేమిటంటే, అమెరికా, యూరప్‌లను వేరే చేసే సైద్ధాంతిక విభజన కంటే, రెండు ఖండాలను ఒకేలా ప్రభావితం చేసే చీలిక గురించే.
అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపులా ఉన్న దేశాలకు కొన్ని ఉమ్మడి ఆందోళనలు ఉన్నాయని పారిస్‌కు చెందిన జర్నలిస్ట్, 'ఫార్ రైట్ ఫ్రాన్స్: లీ పెన్, బార్డెల్లా అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ యూరప్' రచయిత విక్టర్ మాలెట్ వాదించారు.
''వలసల పట్ల ఆందోళనలు, ఆర్థిక వ్యవస్థ పట్ల భయాందోళనలు... వీటితో పాటు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లోని నేషనల్ ర్యాలీ, జర్మనీలోని ఏఎఫ్‌డీ వంటి పార్టీల మద్దతుదారులకు, మేధావులు, మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే విద్యావంతులైన లిబరల్ వర్గానికి మధ్య ఒక అసాధారణమైన సాంస్కృతిక అగాధం ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.
''ఇది కచ్చితంగా వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేస్తున్న తిరుగుబాటు'' అని అన్నారు.
అసమానతలే దీనికి ప్రధాన కారణమని ఆయన భావిస్తున్నారు.
''అమెరికాలో ప్రపంచంలోనే అత్యంత ధనిక వినియోగదారులు ఉన్నారు. కానీ సగటు అమెరికన్లు ఇప్పటికీ జీవనోపాధి కోసం కష్టపడుతున్నారు. పశ్చిమ యూరప్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది'' అని విక్టర్ మాలెట్ తెలిపారు.
ఎన్‌ఎస్ఎస్‌లో భాగంగా, కొన్ని పద్ధతులను రద్దు చేస్తామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించే 'వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితం' (డీఈఐ) వంటి విధానాలను పక్కనపెట్టాలని నిర్ణయించింది.
ఈ నివేదిక ప్రకారం, అమెరికా పౌర సమాజంలో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ 'సాంస్కృతిక యుద్ధాలు' ఇప్పుడు దేశ విదేశీ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా, ఇవి పాశ్చాత్య దేశాల భద్రతపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
ఒక పాశ్చాత్య మిత్రదేశమైన యుక్రెయిన్‌పై దాడి చేసినప్పటికీ, ఈ నివేదికలో రష్యాను ఒక శత్రు దేశంగా ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.
ఎందుకంటే, ఈ సాంస్కృతిక యుద్ధాలలో ట్రంప్ తాలూకా 'మాగా' (ఎంఏజీఏ) మద్దతుదారులు కొందరు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒక శత్రువుగా చూడటం లేదు. బదులుగా, శ్వేతజాతీయుల, క్రైస్తవ జాతీయవాద నాగరికతను కాపాడటంలో ఆయనను ఒక సహజ మిత్రుడిగా భావిస్తున్నారు. తన దేశాన్ని, సంప్రదాయాలను, గుర్తింపును గర్వంగా కాపాడుకునే వ్యక్తిగా వారు పుతిన్‌ను చూస్తున్నారు. సరిగ్గా అవే లక్షణాలను వారు డోనల్డ్ ట్రంప్‌లో కూడా చూసి ఆరాధిస్తారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













