వెనెజ్వెలా: అధికారపక్షానికి చెందిన రోడ్రిగ్జ్‌కే పగ్గాలు అప్పగించడానికి కారణం ఏమిటి? ట్రంప్ వ్యూహమేంటి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత వారాంతంలో వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో జరిగిన నాటకీయ పరిణామాల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అందులో కొన్నింటికి సమాధానాలు దొరికాయి. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.
వెనెజ్వాలాలో "తాత్కాలికం" అని అమెరికన్ అధికారులు భావిస్తున్న ప్రభుత్వానికి కళ్లజోడు పెట్టుకున్న మహిళ నాయకత్వం వహిస్తున్నారు.
డెల్సీనే ఎందుకు?
డెల్సీ రోడ్రిగ్జ్.. ఈమె పదవీచ్యుతుడైన నియంత మదురోకు డిప్యూటీ. మాజీ మార్క్సిస్ట్ సాయుధపోరాట యోధుడి కుమార్తె కూడా.
మరి ఆమెలో ట్రంప్ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించిన అంశం ఏంటి? 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని అందరూ భావిస్తున్న ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరీనా మచాదోకు మద్దతివ్వడానికి బదులు, వాషింగ్టన్ ఈ "హ్యూగో చావెజ్ అభిమాని" అధికారంలో ఉండాలని ఎందుకు నిర్ణయించుకుంది?
చాలా సింపుల్. ఇందులో పెద్ద కారణాలేమీ లేవంటున్నారు వెనెజ్వెలాలో అమెరికా మాజీ రాయబారి చార్లెస్ షాపిరో.
"అమెరికాకు అక్కడ ప్రజాస్వామ్యం కంటే స్థిరమైన ప్రభుత్వం ఉండటమే ముఖ్యం" అని ఆయన చెప్పారు. 2002-2004 మధ్య బుష్ ప్రభుత్వ పాలనా కాలంలో చార్లెస్ షాపిరో కారకస్‌లో అమెరికా రాయబారిగా పని చేశారు.
"నియంత లేకున్నప్పటికీ వాళ్లు నియంతృత్వ పాలన కొనసాగేలా చూస్తున్నారు. నియంత అనుచరులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమని భావిస్తున్నా" అని ఆయన చెప్పారు.
అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?
మొత్తం ప్రభుత్వాన్ని మార్చేయడం, మచాదో ప్రతిపక్ష ఉద్యమాన్ని బలపరచడం.
దీని వల్ల వేరే ప్రమాదాలు ఉన్నాయి. అధికారం కోసం ప్రతిపక్ష నాయకుల్లో అంతర్గత పోరాటం మొదలైతే మదురోకు అనుకూలంగా ఓటు వేసిన 30 శాతం మంది అభిప్రాయాన్ని బలపరిచినట్లు అవుతుంది.


ఫొటో సోర్స్, Getty Images
రోడ్రిగ్జ్‌కు ముందే తెలుసా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఉయం ఒక ప్రెస్ కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాదోకు వెనెజ్వెలా ప్రజల్లో "గౌరవం లేదని" రోడ్రిగ్జ్ "దయగల వ్యక్తి" అని చెప్పడం చూసి పరిశీలకులు నిర్ఘాంతపోయారు.
"మరియా కోరీనా మచాదోకు అర్హత లేదని ట్రంప్ చెప్పడం విని నేను ఆశ్చర్యపోయాను" అని కారకస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కెవిన్ విటకెర్ చెప్పారు.
"ఆమె ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. మచాదోకు అర్హత లేదని చెప్పడం అంటే మొత్తం ఉద్యమాన్ని అవమానించినట్లే" అని కెవిన్ అన్నారు.
మదురోను తొలగించి రోడ్రిగ్జ్‌ను పదవిలో కూర్చోబెట్టిన వేగం చూస్తుంటే, మాజీ ఉపాధ్యక్షురాలు కూడా ఈ ప్లాన్‌లో భాగమై ఉండవచ్చని కొంతమంది పరిశీలకులు అనుమానిస్తున్నారు.
"మేం మదురో వెంటపడ్డాం. ఉపాధ్యక్షురాలు బతికి బయటపడ్డారు" అని సీఐఏ మాజీ అధికారి లిండ్సే మొరాన్ చెప్పారు.
"ఉన్నత స్థానాల్లో సమాచారం అందించే వారు ఉండవచ్చు. నా అనుమానం ఏంటంటే ఆ ఉన్నత సమాచారం అందించిన వారు ఉపాధ్యక్షురాలి కార్యాలయంలో ఉండి ఉండవచ్చు. అయితే ఉపాధ్యక్షురాలు నేరుగా ఇలాంటి పని చేసి ఉండరు" అని లిండ్సే అన్నారు.
కారకస్‌లో నివసిస్తున్న ఫిల్ గున్‌సన్ ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌లో సీనియర్ అనలిస్టు. రోడ్రిగ్జ్ విషయంలో వినిపిస్తున్న కుట్ర సిద్ధాంతం నిశిత పరిశీలనకు నిలబడదని చెప్పారు.
మదురోకు విశ్వాస పాత్రులైన వెనెజ్వెలా రక్షణమంత్రి జనరల్ వ్లాదిమిర్ పడ్రినో లోపెజ్, అంతర్గత మంత్రి డియోస్‌డాడో కాబెల్లోకు ఇప్పటికీ అపారమైన అధికారం ఉందని ఫిల్ గున్‌సన్ చెప్పారు.వీరిద్దరూ మదురోకు విశ్వాసపాత్రులని చెప్పారు.
"దేశంలో తన రక్షణను పణంగా పెట్టి మదురోను అమ్మేయాలని ఆమె ఎందుకు అనుకుంటారు. అలా చేసి, ఇప్పటికీ దేశంలో తుపాకులను నియంత్రించేగలిగే శక్తి ఉన్న నేతలకు వ్యతిరేకిగా ఎందుకు మారతారు" అని గున్‌సన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికార మార్పిడిపై ముందే సంకేతాలు
మచాదోకు మద్దతివ్వడం వల్ల ప్రమాదకర స్థాయిలో అస్థిర పరిస్థితులు ఏర్పడవచ్చనే హెచ్చరికల వల్లే రోడ్రిగ్జ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి ఉండవచ్చు.
"వెనెజ్వెలాలో అధికార మార్పిడి గురించి వాషింగ్టన్ జాగ్రత్తగా ఉంది" అని 2025 అక్టోబర్‌లో వెలువడిన ఐసీజీ నివేదిక తెలిపింది.
"మదురోను పదవి నుంచి తొలగించిన తర్వాత హింస చెలరేగే ప్రమాదాన్ని ఏ దశలోనూ తక్కువ చేసి చూడకూడదు" అని ఆ నివేదిక కోరింది.కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భద్రతా బలగాల్లోని కొందరు వ్యక్తులు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
రోడ్రిగ్జ్ సహా మదురో ప్రభుత్వంలోని సభ్యులంతా తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు సుముఖంగా ఉన్నారని అమెరికన్ నిఘా వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయని చెప్పే నివేదికను ప్రస్తావిస్తూ సోమవారం వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం రాసింది.
ఈ నివేదిక గురించి వైట్‌హౌస్ బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే భవిష్యత్‌లో రోడ్రిగ్జ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.
‘‘ట్రంప్ పాలనా వైఖరి భావోద్వేగాలు కాకుండా, ప్రయోజనాలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యవహరిస్తున్నట్టుగా ఉంది’’ అని వాషింగ్టన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో అసోసియేట్ ఫెలో హెన్రీ జీమర్ చెప్పారు.
అయితే సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయని ఆయన అన్నారు.
"మదురోను బంధించడం తేలికైన వ్యవహారం కాదు. వెనెజ్వెలా విస్తృత పునర్నిర్మాణం, చమురు, మాదక ద్రవ్యాలు, ప్రజాస్వామ్య లక్ష్యాల విషయంలో గమ్యం చేరడానికి చాలా సమయం పడుతుంది" అని హెన్రీ జీమర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి రోడ్రిగ్జ్‌తో తాము వ్యవహారం నడపగలమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
"ఆర్థిక సంస్కరణలకు ఆమె అనుకూలం. ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమెకు తెలుసు. విదేశీ పెట్టుబడులకు ఆమె వ్యతిరేకి కాదు" అని గున్‌సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
అమెరికా మూడు దశల ప్రణాళిక
అమెరికన్ చమురు సంస్థలకు ఎర్ర తివాచీ పరచడం, డ్రగ్ కార్టెల్స్‌ను అణచివేసే కార్యక్రమానికి సహకారం అందించడం, క్యూబా, చైనా, రష్యాతో వెనెజ్వెలా సంబంధాలను తగ్గించాలని అమెరికా కోరితే రోడ్రిగ్జ్ కాదనకపోవచ్చని జీమర్ చెబుతున్నారు.
"ఇలాంటివన్నీ ఆమె చేయగలరు. అయితే అమెరికా ప్రజాస్వామ్య మార్పు దిశగా నిజమైన ప్రగతిని కోరుకుంటే అది కష్టమైన వ్యవహారం" అని జీమర్ అన్నారు.
ప్రస్తుతానికి వాషింగ్టన్ ప్రాధాన్యత జాబితాలో ప్రజాస్వామ్యానికి అంత ప్రాధాన్యం లేదు.
బుధవారం జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఇదే కనిపించింది. వెనెజ్వెలా కోసం మూడు దశల ప్రణాళిక ఉందని అందులో వెనెజ్వెలా సుస్థిరత, అమెరికా పర్యవేక్షణలో వెనెజ్వెలాలోని 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెటింగ్ ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు.
"సమన్వయ ప్రక్రియ" అని రూబియో ప్రస్తావిస్తున్న ఈ ప్రణాళికలో ప్రతిపక్ష దళాలకు క్షమాభిక్ష, రాజకీయ ఖైదీల విడుదల, పౌర సమాజ పునర్నిర్మాణం ఉన్నాయి.
"మూడో దశ వాస్తవంగా మార్పుకు సంబంధించినది" అని ఆయన చెప్పారు. అయితే అదేంటో స్పష్టంగా వివరించలేదు.

ఫొటో సోర్స్, Reuters
ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా?
వెనెజ్వెలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం అధ్యక్షుడు "విధి నిర్వహణకు శాశ్వతంగా అందుబాటులో లేకుండా పోయిన" 30 రోజుల్లోపు ఎన్నికలు జరగాలి. మదురో న్యూయార్క్ జైలులో విచారణ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితికి ఇది వర్తిస్తుంది.
అయితే ఇప్పట్లో ఎన్నికలు ఉండవని సోమవారం ఎన్‌బీసీ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
"ముందు దేశాన్ని గాడిలో పెట్టాలి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేరు" అని ఆయన అన్నారు.
వెనెజ్వెలాలో అవినీతిమయమైన, శిథిలావస్థలో ఉన్న పెట్రోలియం మౌలిక వసతుల్లో అంతర్జాతీయ చమురు కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి ట్రంప్ ప్రభుత్వం మాట్లాడుతోంది. అయితే నిజం చేదుగా ఉండవచ్చు" అని గన్‌సన్ చెప్పారు.
"ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే, శాంతి భద్రతల పరిస్థితి బాగా లేకపోతే, పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమయ్యేందుకు లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు" అని ఆయన చెప్పారు.
వెనెజ్వెలా మాజీ నాయకుడు హ్యూగో చావెజ్ 2013లో చనిపోవడానికి ముందు నికోలస్ మదురోను తన వారసుడిగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని చావెజ్ "డెడాజో" అని పిలిచారు. డెడాజో అనే స్పానిష్ పదానికి "ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కన పెట్టి వేలు చూపడం ద్వారా నాయకుడిని ఎన్నుకోవడం" అనే అర్థం వస్తుంది.
డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్షురాలు కావడం కూడా అలాంటిదేనని షాపిరో భావిస్తున్నారు.
"ఇది ట్రంప్ డెడాజో" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












