నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంపై ఇండియా ఏమంది? రష్యా, చైనా ఏం చెప్పాయి?

భారత్, రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలా రాజధాని కారకస్‌పై దాడి చేసి, వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

మదురోను న్యూయార్క్‌కు తరలించారు. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు స్పందించాయి.

వెనెజ్వెలాపై అమెరికా చర్య ఏకపక్షమని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విమర్శించాయి. ఈ అంశంపై భారతదేశం జాగ్రత్తగా స్పందించింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, "వెనిజ్వెలాలో ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం" అని పేర్కొంది.

"వెనెజ్వెలా ప్రజల భద్రత. శ్రేయస్సు కోసం భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సంబంధిత అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

అలాగే వెనెజ్వెలాకు ప్రయాణానికి సంబంధించి భారత్ ఒక అడ్వైజరీని కూడా జాారీ చేసింది. వెనెజ్వెలాకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించరాదని కోరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వెనెజ్వెలాకు అత్యంత సన్నిహిత దేశమైన రష్యా దీనిపై స్పందిస్తూ.. ''ఒకవేళ ఈ విషయం నిజమైతే, ఇది ఏ దేశ సార్వభౌమత్వాన్ని అయినా, అంతర్జాతీయ చట్టాన్ని అయినా తీవ్రంగా ఉల్లంఘించడమే '' అని పేర్కొంది.

చైనా కూడా దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఒక సార్వభౌమ దేశంపై అమెరికా బహిరంగంగా బల ప్రయోగం చేసి, ఆ దేశ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.

ఈ దాడులతో తమకెలాంటి సంబంధం లేదని బ్రిటన్ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అమెరికా చర్యను అర్జెంటీనా స్వాగతించింది.

ఈ దాడుల తర్వాత, దేశవ్యాప్తంగా తక్షణమే సైన్యాన్ని మోహరిస్తున్నట్లు వెనెజ్వెలా రక్షణ మంత్రి ప్రకటించారు.

వెనెజ్వెలా దాడుల గురించి ఇంతకు మించిన సమాచారం బయటికి రాలేదు.

ఈ దాడుల వల్ల సైనిక స్థావరాలకు ఎంత నష్టం వాటిల్లింది? ఈ దాడుల్లో ఎంత మంది మరణించారు? అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

నికోలస్ మదురోపై, ఆయన భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా తెలిపింది. మదురోపై, ఆయన భార్యపై న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ దావా వేయనున్నట్లు యూఎస్ అటార్నీ జనరల్ తెలిపారు.

అమెరికా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని వెనెజ్వెలా కోరింది. అంతర్జాతీయ చట్టాన్ని కచ్చితంగా గౌరవించాలని వెనెజ్వెలా విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు.

వెనెజ్వెలా పొరుగు దేశమైన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఈ దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తమ జనాభాను కాపాడేందుకు వెనెజ్వెలా ప్రజలు కొలంబియాలోకి ప్రవేశించే అవకాశం ఉన్న సరిహద్దులోకి భద్రతా దళాలను మోహరించాలని ఆదేశించారు.

వెనెజ్వెలాలో అమెరికా సైనిక చర్య వల్ల కలిగే భయంకరమైన పర్యవసనాల గురించి యూఎన్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఆందోళన చెందుతున్నారని ఐక్యరాజ్యసమితి తన ప్రకటనలో తెలిపింది.

''వెనెజ్వెలాలో పరిస్థితికి భిన్నంగా.. ఈ పరిణామాలు ప్రమాదకరమైన మలుపును సూచిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ చార్టర్‌తో పాటు అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలని సెక్రటరీ-జనరల్ నిరంతరం నొక్కి చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టం పట్ల గౌరవం లేకపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు'' అని యునైటెడ్ నేషన్స్ తెలిపింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన పోస్టులో, ''ఇటువంటి యూఎస్ అణచివేత చర్యలు వెనెజ్వెలా సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతంలో భద్రతకు, శాంతికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. చైనా వీటిని గట్టిగా వ్యతిరేకిస్తోంది'' అని తెలిపారు.

''అమెరికా అంతర్జాతీయ చట్టానికి, యూఎన్ చార్టర్ లక్ష్యాలు, సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, భద్రతను ఉల్లంఘించడం ఆపేయాలి'' అని చైనా పిలుపునిచ్చింది.

క్యూబా

ఇదే సమయంలో, క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ కూడా ఈ దాడిని ఖండించారు.

''వెనెజ్వెలాపై జరిగిన నేరపూరిత దాడిని క్యూబా ఖండిస్తోంది. అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తోంది'' అని సోషల్ మీడియా పోస్టులో మిగెల్ డియాజ్-కానెల్ కోరారు.

శాంతియుతమైన ప్రాంతంపై క్రూరంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

యురోపియన్ యూనియన్ ఏమంది?

ఈ పరిస్థితులపై సంయమనం పాటించాలని యూరోపియన్ యూనియన్ కోరగా.. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పెయిన్ తెలిపింది.

''వెనెజ్వెలాలో జరుగుతోన్న పరిణామాలను స్పెయిన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. మా ఎంబసీలు, కాన్సులేట్లు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి'' అని స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సోషల్ మీడియాలో రాశారు.

''ఉద్రిక్తతలు తగ్గించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేం కోరుతున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని, యూఎన్ చార్టర్‌ సూత్రాలను మనం తప్పనిసరిగా గౌరవించాలి'' అని అన్నారు.

చిలీ

అమెరికా సైనిక చర్య పట్ల తమ దేశం ఆందోళన వ్యక్తం చేస్తుందని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ అన్నారు.

''చిలీ ప్రభుత్వ తరఫున, వెనెజ్వెలాలో అమెరికా సైనిక చర్య పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తమ ఖండనను తెలియజేస్తున్నాం. దేశంపై ప్రభావం చూపుతోన్న ఈ తీవ్రమైన సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలి'' అని సోషల్ మీడియా రాశారు.

'' బల ప్రయోగాన్ని నిషేధించడం, జోక్యం చేసుకోకపోవడం, అంతర్జాతీయ వివాదాలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనడం, దేశాల ప్రాదేశిక సార్వభౌమాధికారం వంటి వాటితో కూడిన అంతర్జాతీయ చట్టానికి చెందిన ప్రాథమిక సూత్రాలకు మేం కట్టుబడి ఉన్నాం'' అని రాశారు.

హింస లేదా విదేశీ జోక్యం ద్వారా వెనెజ్వెలా సంక్షోభాన్ని పరిష్కరించకూడదని, అన్ని పక్షాల మద్దతుతో, చర్చల ద్వారా దీనికొక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు.

బ్రిటన్ ప్రధానమంత్రి
ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్

బ్రిటన్ ప్రధాని ఏం చెప్పారు?

వెనెజ్వెలాలో అమెరికా ఆపరేషన్‌తో తమకెలాంటి సంబంధం లేదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తానింకా మాట్లాడలేదని తెలిపారు.

''నేనింకా దీనిపై మాట్లాడలేదు. ఇది చాలా వేగంగా మారుతోన్న పరిణామం. మేం అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి'' అని ఓ ప్రకటనలో కీర్ స్టార్మర్ చెప్పారు.

కొంతమంది వామపక్ష ఎంపీలు, స్వతంత్ర ఎంపీలు దీన్ని ఖండిస్తున్నందున్న ఆయన కూడా ఈ దాడిని ఖండిస్తారా? అని అడిగినప్పుడు ''నేను తొలుత వాస్తవాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడాలనుకుంటున్నా'' అని అన్నారు.

మెక్సికో స్పందనేంటి?

యునైటెడ్ నేషన్స్ చార్టర్‌లోని ఆర్టికల్ 2ను ఉద్దేశిస్తూ ప్రస్తుత పరిస్థితిపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు.

''ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలన్నీ తమ అంతర్జాతీయ సంబంధాలలో ఏ ఇతర దేశ ప్రాదేశిక సమగ్రతను లేదా రాజకీయ స్వతంత్రాన్ని దెబ్బతీసేలా బలప్రయోగాలకు లేదా ముప్పుకు పాల్పడకూడదు. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు''

దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా అమెరికా సైనిక చర్యను స్వాగతించింది.

''స్వేచ్ఛ మరో అడుగు ముందుకేస్తోంది..'' అంటూ వెనెజ్వెలాలో అమెరికా జోక్యాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ బెటెల్ స్వాగతించారు.

మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఈ దాడులపై హెచ్చరించారు.

''వెనెజ్వెలా భూపరితలంపై బాంబులు వేయడం, ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఒక రకమైన అతిక్రమణే. దీన్ని అసలు సహించలేం. వెనెజ్వెలా సార్వభౌమాధికారంపై ఇది తీవ్రమైన దాడి'' అని అన్నారు.

మొత్తం అంతర్జాతీయ సమాజానికి ఈ ఘటన మరో అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణగా వర్ణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)