అమెరికా అదుపులో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలాపై అమెరికా జరిపిన భారీ దాడిలో, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు.
''"అమెరికా వెనెజ్వెలాపై విజయవంతంగా భారీ దాడి చేసింది. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యతోసహా అదుపులోకి తీసుకుని దేశం బయటకు తరలించాం. ఈ చర్య అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సమన్వయంతో జరిగింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని ట్రంప్ పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మదురోను ఎక్కడికి తరలించారు?
వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అంతర్జాతీయ డ్రగ్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నారని అమెరికా గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మదురో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.
మదురోను ఎలా అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతం ఆయనను ఎక్కడికి తరలించారన్న వివరాలపై అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఘటనపై వెనెజ్వెలా ప్రభుత్వం కూడా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
మదురో అరెస్ట్‌కు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి 5 కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. గత కొన్ని నెలలుగా వెనెజ్వెలా పరిసర ప్రాంతాల్లో అమెరికా భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించడం కూడా గమనార్హం.
ఈ పరిణామాలన్నీ వెనిజ్వెలా లోపలే ఎవరో మదురోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి అమెరికా పరోక్షంగా ప్రోత్సహిస్తున్న సంకేతాలుగా ఆ ప్రాంతంలో విశ్లేషకులు భావించారు.
అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ వెనెజ్వెలా అధ్యక్ష దంపతులను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికాలో బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు అధికారులు తెలిపారు.
ఉదయం జరిగిన దాడులకు సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంది. ఈ దాడులలో మిలటరీ వసతులకు ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
పౌరనివాసాలపై దాడులు జరిగాయని వెనెజ్వెలా రక్షణమంత్రి వ్లాదిమిర్ పాడ్రినో చెప్పారు. ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే విషయాలను సేకరిస్తున్నామని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














