‘‘ఎయిర్ స్పేస్ మూసేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటన వలసవాదపు బెదిరింపు’’ అంటున్న వెనెజ్వెలా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అయిఫే వాల్ష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వెనెజ్వెలా చుట్టూ ఉన్న గగనతలాన్ని మూసి వేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటన వలసవాద బెదిరింపు ధోరణిలో ఉందని వెనెజ్వెలా ఆరోపించింది.
ట్రంప్ వ్యాఖ్యలు " మా దేశ ప్రజలపై మరో విపరీత, చట్ట వ్యతిరేక, అన్యాయమైన చర్య" అని వెనెజ్వెలా విదేశాంగ శాఖ పేర్కొంది
మరో దేశపు గగనతలాన్ని మూసివేసే చట్టబద్దమైన హక్కు అమెరికాకు లేదని, ఆన్‌లైన్‌లో ట్రంప్ ప్రకటన విమాన ప్రయాణాల అనిశ్చితికి దారి తీస్తుందని వెనెజ్వెలా విదేశాంగ శాఖ తెలిపింది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కరేబియన్ ప్రాంతంలో సైన్యాన్ని మోహరిస్తోంది అమెరికా. తనను పదవి నుంచి దించేందుకే అమెరికా డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేస్తోందన్న వాదనను వెనెజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మదురో తోసిపుచ్చారు.
"అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, డ్రగ్ డీలర్లు, మానవ అక్రమ రవాణాదారులారా, వెనెజ్వెలా దాని చుట్టూ ఉన్న గగనతలం మొత్తాన్ని మూసివేసినట్లు పరిగణించండి" అని డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందన కోసం బీబీసీ వైట్‌హౌస్‌ను సంప్రదించింది. వారి నుంచి ఎలాంటి తక్షణ స్పందన రాలేదు.

"వెనెజ్వెలా, దాని చుట్టుపక్కల సైనిక కార్యక్రమాలు పెరిగాయి" అని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఉంటున్న తమ దేశపు వలసదారులను స్వదేశానికి రప్పించేందుకు వారానికొసారి తాము నడుపుతున్న విమాన సేవలను అమెరికా ఏకపక్షంగా నిలిపివేసిందని వెనెజ్వెలా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
"ఈ అనైతిక దురాక్రమణ చర్యను వ్యతిరేకించాలని మేము అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, బహుళాజాతి సంస్థలను కోరుతున్నాం" అని వెనెజ్వెలా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
విమానాల రాకపోకల్ని పునరుద్దరించడానికి 48 గంటల గడువు పూర్తికాకపోవడంతో వెనెజ్వెలా ఇప్పటికే ఆరు దేశాలకు చెందిన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇందులో ఐబెరియా, టీఏపీ పోర్చుగల్, లాతామ్, జీఓఐ, అవానిక, టర్కిష్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దాడి చేసేంత దగ్గరగా అమెరికా బలగాల మోహరింపు
వెనెజ్వెలాపై దాడి చేసేంత దగ్గరగా 15 వేల మంది అమెరికన్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్‌ను అమెరికా మోహరించింది.
1989లో పనామాపై దాడి తర్వాత ఈ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని ఈ స్థాయిలో మోహరించడం ఇదే తొలిసారి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మీద పోరాటానికి ఇది తప్పదని వాషింగ్టన్ చెబుతోంది
వెనెజ్వెలా నుంచి భూమార్గం ద్వారా అమెరికాకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపేందుకు అమెరికా చేపట్టిన కార్యక్రమం త్వరలోనే మొదలవుతుందని ట్రంప్ హెచ్చరించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లుగా చెబుతున్న పడవలపై అమెరికన్ దళాలు 21 దాడులు చేశాయి. ఇందులో 80 మందికి పైగా మరణించారు. అయితే ఆ పడవల్లో మాదకద్రవ్యాలు తీసుకువెళ్లినట్లు అమెరికా ఎటువంటి ఆధారాలను అందించలేదు.
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆ దేశపు ప్రతిపక్షాలతో పాటు అనేక దేశాలు ఆరోపించాయి. దీంతో ఆ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడైన మదురోను పదవి నుంచి దించేందుకే అమెరికా ఈ చర్య చేపట్టినట్లు వెనెజ్వెలన్ ప్రభుత్వం భావిస్తోంది.
కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే సంస్థను కూడా అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీనికి మదురో నాయక్వం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా ఏదైనా గ్రూపు మీద ఉగ్రవాద సంస్థగా ముద్ర వేస్తే, ఆ గ్రూపు ఏ దేశంలో ఉన్నా సరే అమెరికన్ చట్ట సంస్థలు, సైనిక సంస్థలకు ఉగ్రవాద సంస్థపై దాడి చేసేందుకు విస్తృత అధికారాలు లభిస్తాయి.
కార్టెల్ ఆఫ్ ది సన్స్‌ను టెర్రరిస్టు గ్రూపుగా ప్రకటించడాన్ని తిరస్కరిస్తున్నట్లు వెనిజులా విదేశాంగా శాఖ ప్రకటించింది.
కార్టెల్ ఆఫ్ ది సన్స్ గ్రూపులో ఉన్నత స్థానంలో ఉన్న సభ్యుడైన వెనెజ్వెలా న్యాయ మంత్రి డియోసడో కాబెల్లో.. ఈ సంస్థను ఒక గొప్ప ఇన్నోవేషన్ అని చెబుతున్నారు.
కార్టెల్ ఆఫ్ ది సన్స్ అని పిలిచే కార్టెల్ డి లెస్ సొలెస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తూనే "వెనెజ్వెలా సైన్యం, నిఘా, పాలక వర్గం, న్యాయ విభాగాలను భ్రష్టు పట్టించింది" అని అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టంగా చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














