వర్షంలో ఐస్‌క్రీమ్ కోసం వెళ్లి అదృశ్యమైన అమ్మాయి 17 సంవత్సరాల తర్వాత ఎలా దొరికింది?

ఫొటో సోర్స్, Sidra Ikram
- రచయిత, మొహమ్మద్ జుబేర్
- హోదా, బీబీసీ కోసం
హృదయాలను కదిలించే ఈ విషాద గాథ 17 ఏళ్ల కిందట, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెక్టార్ జీ-10 రోడ్డుపై మొదలైంది.
పదేళ్ల కిరణ్ వర్షంలో ఐస్‌క్రీమ్ ఎక్కడ దొరుకుతుందా? అనుకుంటూ ఇంటి నుంచి బయటికెళ్లింది. ఆ సమయంలో కిరణ్‌కు ఐస్‌క్రీమ్ దొరికింది. కానీ తన బాల్యం, తన తల్లిదండ్రులు మాత్రం ఆమెకు దూరమయ్యారు.
కిరణ్‌ది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, కసూర్ జిల్లాలోని చిన్నగ్రామం. ఆమె తన తల్లిదండ్రలు, తోబుట్టువులు, బంధువులకు దూరంగా కరాచీలోని ఈధీ కేంద్రంలో చాలా ఏళ్లు గడిపారు.
కిరణ్ తల్లిదండ్రులు, తోబుట్టువులను కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. కిరణ్ తల్లిదండ్రులు, తోబుట్టవులు కూడా ఆమెపై దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు.
అయితే, సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పంజాబ్ పోలీసులకు కిరణ్ గురించి ఒక క్లూ దొరకడంతో 17 ఏళ్ల నిరాశ సంతోషంగా మారింది.

కిరణ్ తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నారు?
కిరణ్ తిరిగి తమ వద్దకు ఎలా చేరిందనే విషయంపై ఆమె తండ్రి అబ్దుల్ మజీద్ కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ పెద్దగా స్పందించలేదు. అయితే, ఆమె మేనమామ అసద్ మునీర్ చాలా విషయాలు చెప్పారు. ఆయన కసూర్ జిల్లా, బగ్రీ గ్రామంలో ఉంటారు.
‘‘17 ఏళ్ల కిందట, కిరణ్ పదేళ్ల వయసులో ఇస్లామామబాద్‌లోని జీ10 ప్రాంతంలో ఉన్న నా సోదరి, ఆమె పిన్ని ఇంట్లో ఉండేది. ఇంటి ఎదురుగానే జీ 10 సెంటర్ ఉండేది. ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి అక్కడికే వెళ్లింది. ఇది 2008లో జరిగింది. ఆరోజు భారీగా వర్షం కురుస్తోంది.’’
‘‘ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్లిన అమ్మాయి ఎంతసేపైనా ఇంటికి రాలేదు. పాప కోసం ఎంత వెతికినా కనిపించలేదు’’ అని అసద్ మునీర్ చెప్పారు.
‘‘చుట్టుపక్కల గాలించాం. కానీ, కిరణ్ ఆచూకీ తెలియలేదు.’’
ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్లానని, కానీ వర్షం కారణంగా వచ్చిన దారి మర్చిపోయానని కిరణ్ తెలిపారు.
ఇంటి కోసం వెతుక్కుంటూ చాలాసేపు వీధుల్లో తిరిగానని, కానీ ఇంటికి వెళ్లలేకపోయానని, తనను ఎవరో ఇస్లామాబాద్‌లోని ఈధీ సెంటర్‌కు తీసుకెళ్లారని కిరణ్ చెప్పారు.
తొలుత ఇస్లామాబాద్‌లోని ఈధీ సెంటర్‌కు, తరువాత కరాచీలోని ఈధీ సెంటర్‌కు చేరారు. అక్కడే 17 ఏళ్లపాటు ఉన్నట్లు చెప్పారు కిరణ్.
కరాచీలోని ఈధీ సెంటర్‌కు చెందిన షబానా ఫైసల్ మాట్లాడుతూ కిరణ్ 17 ఏళ్ల క్రితం ఇస్లామాబాద్‌లోని ఈధీ సెంటర్‌కు వచ్చారని చెప్పారు. ఎవరో ఆమెను అక్కడే వదిలిపెట్టారు, బహుశా ఆమె దారి తప్పిపోయి ఉండొచ్చని ఆమె వివరించారు.
"ఆమె కొంతకాలం ఇస్లామాబాద్‌లోని ఈధీ సెంటర్‌లో ఉంది. అదే సమయంలో బిల్కీస్ ఈధీ ఆ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ కిరణ్ ఆరోగ్యం బాలేకపోవడం గమనించి కరాచీలోని ఈధీ సెంటర్‌కు తీసుకొచ్చారు.
కొంతకాలం కిందట, పంజాబ్ పోలీసుల సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌తో కలిసి పనిచేస్తున్న 'మేరా ప్యారా' బృందం కరాచీలోని ఈధీ సెంటర్‌ను సందర్శించింది. వారు కిరణ్‌ను ఇంటర్వ్యూ చేశారు. తరువాత వారు ఆమె బంధువుల కోసం వెతకడం మొదలుపెట్టారు" అని షబానా ఫైసల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sidra Ikram
ఇంటర్వ్యూలో తెలిసిన సమాచారంతో...
లాహోర్ లో, 'మేరా ప్యారా' కార్యక్రమంలో సీనియర్ పోలీస్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు సిద్రా ఇక్రామ్.
పంజాబ్ పోలీసుల సేఫ్ సిటీ ప్రోగ్రామ్ కింద 'మేరా ప్యారా' ప్రాజెక్టును ప్రారంభించామని, తప్పిపోయిన పిల్లలను వారి బంధువుల వద్దకు చేర్చడమే దీని లక్ష్యం అని ఆమె చెప్పారు.
ఏడాది కిందట ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 51 వేల మంది పిల్లలను తల్లిదండ్రులతో కలిపినట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం డిజిటల్ మార్గాలతో పాటు పోలీసు రిసోర్సులను కూడా ఉపయోగిస్తున్నట్లు సిద్రా ఇక్రామ్ తెలిపారు.
" తప్పిపోయి వివిధ సంస్థలలో ఉంటున్న పిల్లలను మా బృందాలు ఇంటర్వ్యూ చేస్తాయి, అలా పొందిన సమాచారంతో వారి బంధువుల కోసం వెతుకుతాం’’ అని ఆమె చెప్పారు. కిరణ్ విషయంలో కూడా అదే జరిగిందని ఆమె అన్నారు.
"మా బృందం ఒకటి కరాచీలోని ఈధీ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ కిరణ్‌తో పాటు ఇతర నిరాశ్రయులను ఇంటర్వ్యూ చేసింది. వారి సమాచారం సేకరించింది."
"కిరణ్ కసూర్ జిల్లాకు చెందినవారు. ఆమె ఇస్లామాబాద్‌లో తన బంధువుల ఇంట్లో ఉండేవారు. కిరణ్ తన తండ్రి పేరు అబ్దుల్ మజీద్‌తో పాటు తన ఊరిపేరును కూడా గుర్తుంచుకున్నారు" అని సిద్రా ఇక్రామ్ చెప్పారు.
"మేం ఈ సమాచారాన్ని మా కసూర్ కార్యాలయానికి పంపాం. అలాగే, కిరణ్ బంధువులను గుర్తించేందుకు సాయం చేయాలని కోరాం."
కసూర్ పోలీస్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ముబాషిర్ ఫయాజ్ మాట్లాడుతూ, "కిరణ్ గురించి ఇచ్చిన సమాచారంలో ఆమె ఊరిపేరు, తండ్రి పేరు చెప్పారు. ఆ వివరాలు మాకు ఉపయోగపడ్డాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Sidra Ikram
ముబాషిర్ ఫయాజ్ మాట్లాడుతూ, "ముందుగా, ఆ ప్రాంతంలోని వృద్ధులను సంప్రదించాం. వారిని అబ్దుల్ మజీద్ గురించి అడిగినప్పుడు.. అక్కడ అబ్దుల్ మజీద్ పేరుతో చాలామంది ఉన్నారని తెలిసింది. కొంతమందికి కిరణ్ చిన్నప్పటి ఫోటోలను చూపించాం. కానీ, వాళ్లు ఆమెను గుర్తుపట్టలేకపోయారు" అని చెప్పారు.
చాలామంది అబ్దుల్ మజీద్‌లు ఉండటంతో అందరినీ సంప్రదించడం సాధ్యం కాకపోవచ్చని అనుకున్నామని ఆయన అన్నారు.
కొన్ని కేసుల్లో.. పోలీస్ పోస్టులు, స్టేషన్లలో పనిచేసిన మాజీ పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు కూడా చాలా సాయపడతారు.
"ఈ కేసులో కూడా ఏరియా అవుట్ పోస్ట్ మాజీ అధికారులను సంప్రదించినప్పుడు.. వారిలో ఒకరు కొన్నేళ్ల కిందట కిరణ్ అనే అమ్మాయి తప్పిపోయిందని, ఆమె కోసం చాలా వెతికామని చెప్పారు. ఆ అమ్మాయి తప్పిపోయినట్లు ఫిర్యాదు కూడా నమోదైందని చెప్పారు.
ఆయన మమ్మల్ని కిరణ్ చిన్నప్పుడు ఉన్న ఏరియాకు తీసుకెళ్లేందుకు సాయం చేశారు. ఆ తర్వాత, మసీదుల ద్వారా ప్రకటనలు చేశాం. ఆ ఏరియాలో ఉన్న పెద్ద వయసు వారిని కలిశాం. అలా మా కృషి ఫలించింది. 17 ఏళ్ల కిందట కిరణ్ తప్పిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్న కొందరు మమ్మల్ని అబ్దుల్ మజీద్ ఇంటికి తీసుకెళ్లారు" అని ఫయాజ్ వివరించారు.

ఫొటో సోర్స్, Sidra Ikram
అబ్దుల్ మజీద్‌కు కిరణ్ చిన్ననాటి ఫోటోలను చూపించినట్లు ముబాషిర్ ఫయాజ్ చెప్పారు.
"మజీద్ కూడా తమ కుటుంబం గ్రూప్ ఫోటోను, కిరణ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్న ఫామ్ బీని కూడా చూపించారు’’ అని ఫయాజ్ తెలిపారు.
ఫామ్ బీని పాకిస్తాన్‌లో చైల్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అని కూడా అంటారు.
అబ్దుల్ మజీదే కిరణ్ తండ్రి అనే విషయంలో ఎలాంటి సందేహం లేకపోవడంతో, ఆ తర్వాత వీడియో కాల్ చేశారు. మజీద్, వారి బంధువులు కిరణ్‌తో మాట్లాడారు. అనంతరం వారు కరాచీకి బయలుదేరారు.
అక్కడ, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం కిరణ్‌ను ఆమె తండ్రికి అప్పగించారు. నవంబర్ 25న ఆమె తిరిగి తన ఇంటికి చేరుకున్నారు.
కిరణ్ మేనమామ అసద్ మునీర్ మాట్లాడుతూ, "అబ్దుల్ మజీద్ పెద్ద కూతురు కిరణ్. ఇప్పుడు ఆయనకు కిరణ్‌తో సహా ఐదుగురు పిల్లలు. కానీ, ఆమె కనిపించకుండా పోయినప్పటి నుంచి అబ్దుల్ మజీద్ కళ్లలో ఎప్పుడూ నీళ్లు కనిపించేవి.
కూతురు గురించి మాట్లాడినప్పుడల్లా బతికే ఉండి ఉంటుందా అని మాత్రమే అడిగేవారు.
తన కూతురి గురించి తెలిసినప్పుడు, ఆనందంతో ఆయన కళ్లలో నుంచి నీళ్లు రావడం నేను చూశా" అని ఆయన అన్నారు.
తన తండ్రి, తోబుట్టువులతో తిరిగి కలవడం సంతోషంగా ఉందని కిరణ్ స్థానిక మీడియాతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














