ముగ్గురు పిల్లలతో నాలుగేళ్లుగా అడవిలో దాక్కున్న తండ్రిని పోలీసులు ఎందుకు కాల్చి చంపారు...

ఫొటో సోర్స్, New Zealand Police
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ న్యూస్
ముగ్గురు పిల్లలతో కలిసి ఏళ్లుగా పరారీలో ఉన్న ఒక వ్యక్తి దాక్కున్న ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను న్యూజీలాండ్ పోలీసులు విడుదల చేశారు.
ఆ ప్రాంతం న్యూజీలాండ్‌లోని క్యాంప్‌సైట్లలో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న న్యూజీలాండ్‌కు చెందిన వ్యక్తి పేరు టామ్ ఫిలిప్స్.
వైకాటో రీజియన్‌లో సోమవారం పోలీసులకు, ఆయనకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో టామ్ ఫిలిప్స్ చనిపోయారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో టామ్ పిల్లలు ఇద్దరిని పోలీసులు గుర్తించారు.
ఫిలిప్స్ మరణించిన సమయంలో ఆయనతో ఉన్న మూడో బిడ్డ సహాయంతో వీరిద్దరిని పోలీసులు గుర్తించగలిగారు.
పిల్లలంతా బాగానే ఉన్నారని, ఈ బాధాకరమైన ఘటన నుంచి కోలుకోవడానికి వారికి కాస్త సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
ఫిలిప్స్ 2021లో క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు తన పిల్లలు జైదా, మావెరిక్, ఎంబర్‌లతో అదృశ్యమయ్యారు. అప్పుడు వారంతా ఎనిమిదేళ్లలోపు చిన్నారులు.
పిల్లలకు చట్టపరమైన సంరక్షణ దొరక్కపోవడంతో ఆయన ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


‘‘పిల్లల్ని పట్టించుకోలేదు’’
పిల్లల భద్రత విషయంలో ఫిలిప్స్ ఎలాంటి శ్రద్ధ చూపలేదని, వారిని ప్రమాదంలో పడేశారని మీడియాతో పోలీస్ కమిషనర్ రిచర్డ్ చాంబర్స్ చెప్పారు.
ఇప్పుడు పిల్లలంతా అధికారుల సంరక్షణలో ఉన్నారని తెలిపారు.
దట్టమైన చెట్లతో నిండిన క్యాంప్‌సైట్‌లో పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామగ్రి పోలీసులకు లభ్యమయ్యాయి. చెట్ల మధ్య రెండు క్వాడ్ బైక్‌లు ఉన్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
అధికారులు, ఇద్దరు పిల్లల కోసం దాదాపు 12 గంటలు గాలించిన తర్వాత ఎట్టకేలకు ఈ ప్రాంతానికి చేరుకొని వారిని గుర్తించారు.
పియోపియో అనే చిన్న పట్టణంలోని ఒక వ్యవసాయ సరఫరా దుకాణంలో దొంగతనానికి యత్నం జరిగిందని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే వారు ఫిలిప్స్‌తో కాల్పులకు దిగారు.
ఫిలిప్స్ అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఒక అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
ఆ ఆఫీసర్‌ను చంపడానికి ఫిలిప్స్ వెనుకాడలేదని చాంబర్స్ తెలిపారు.

ఫిలిప్స్ ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు?
గాయపడిన అధికారికి అనేక శస్త్రచికిత్సలు జరిగాయని, ఆయన కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చాంబర్స్ చెప్పారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం ఫిలిప్స్ పరారీ అయ్యారు. అప్పటినుంచి ఆయన అదృశ్యం కేసు, న్యూజీలాండ్‌ను కుదిపేసింది. సోమవారం నాటి ఘటనతో ఈ మిస్టరీకి ముగింపు దొరికిందని అనిపిస్తున్నప్పటికీ, పోలీసులు ఇంకా చాలా సమాధానాల కోసం వెతుకుతున్నారు.
దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫిలిప్స్ ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు? ముఖ్యంగా ఆయన చేతికి తుపాకులు ఎలా వచ్చాయని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వారి తల్లితో పాటు ఫిలిప్స్ కుటుంబీకులు ఆ పిల్లలతో సంప్రదింపులు జరిపేవారా? అనే ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పలేదు.
ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంపైనే తాము దృష్టి సారించామని, వారంతా దేశంలోని ఏ చిన్నారికి ఎదురుకాని సంఘటనలను ఎదుర్కొన్నారని పోలీస్ మినిస్టర్ మార్క్ మిచెల్ అన్నారు.
పిల్లలకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని, వారికి అవసరం ఉన్నంతకాలం తోడ్పాటు అందిస్తామని న్యూజీలాండ్ మినిస్ట్రీ ఆఫ్ చిల్ట్రన్ హామీ ఇచ్చింది.
దాదాపు నాలుగేళ్లుగా తన పిల్లల్ని రోజూ మిస్ అయ్యానంటూ, చివరకు ఈ నిరీక్షణ ముగిసిందని వారి తల్లిని ఉటంకిస్తూ సోమవారం స్థానిక మీడియా సంస్థ ఆర్‌ఎన్‌జెడ్ పేర్కొంది.
కానీ, ఈరోజు జరిగిన సంఘటనలు తనను బాధించాయని ఆమె అన్నట్లు తెలిపింది
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














