క్యాన్సర్ ఉన్న తల్లులు పిల్లలకు చనుబాలు పట్టొచ్చా, ఏయే సందర్భాలలో తల్లిపాలు పట్టకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంబు వాగిని
- హోదా, బీబీసీ కోసం
తల్లి గర్భంలో ఉన్పప్పటి నుంచి రెండేళ్ల వయసు వచ్చే వరకు ఉండే తొలి 1000 రోజులు మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం..
ఈ సమయంలో తీసుకునే సరైన పోషకాహారం పిల్లలకు వారి జీవితకాలం ఆరోగ్యాన్ని, మేధస్సును నిర్ణయిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్, చాలా అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఈ కీలక సమయ ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ ఉంటాయి.
ఆగస్టు 1 నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్‌ఫీడింగ్ వీక్ నిర్వహించారు.
ఈ ఏడాది థీమ్ 'ప్రయారటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, బిల్డ్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్' (తల్లి పాలకు ప్రాధాన్యం ఇవ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండి").

ప్రపంచవ్యాప్తంగా కేవలం 44 శాతం మంది చిన్నారులకే ఆరు నెలల పాటు తల్లిపాలు అందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్‌లో ఇది 64 శాతంగా ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 తెలిపింది.
కేవలం తల్లిపాల వల్లనే ఏటా 8 లక్షల మందికి పైగా చిన్నారులను కాపాడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ క్రమంలో
- పిల్లలకు తొలి వెయ్యి రోజులు ఎందుకంత ముఖ్యం?
- తల్లిపాల పాత్ర ఏంటి?
- పోషకాల అవసరం
- తల్లిపాలు అందకపోతే కలిగే ప్రభావం
- భారత్‌లో పిల్లలకు తల్లిపాలు ఏమేరకు అందుతున్నాయి?
- సామాజిక ఆర్థిక ప్రభావాలు ఏమిటి? అనే అంశాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images

శరీరం-మెదడు ఎదుగుదల
- గర్భంలో ఉన్న సమయంలో చిన్నారి మెదడు, గుండె, ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి.
- పుట్టినప్పటి నుంచి రెండేళ్ల వరకు ఎముకలు, కండరాలు, అంతర్గత అవయవాలు వేగంగా పెరుగుతాయి.
- రెండేళ్ల వయసు వచ్చేసరికి మెదడు 80 శాతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.
- డీహెచ్ఏ(ఒమేగా-3), ఐరన్, జింక్ వంటి పోషకాలు మెదడు కణాలను బలపరుస్తాయి.
- ఏదైనా పోషకాహార లోపం కలిగితే, తక్కువ ఐక్యూ, తెలుసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి
- తల్లిపాలలో ఇమ్యునోగ్లోబులిన్ ఏజీఏ, లాక్టోఫెర్రిన్ అనే రోగనిరోధక శక్తిని కలిగించే పదార్థాలు ఉంటాయి.
- ఇవి డయేరియా, న్యూమోనియా, అలర్జీలు వంటి సమస్యల నుంచి చిన్న పిల్లల్ని కాపాడతాయి.
- పోషకాహార లోపం ఉంటే, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది.
భవిష్యత్‌లో సమస్యలు
తొలి వెయ్యి రోజుల్లో పిల్లలకు పోషకాహార లోపం కలిగితే, జీవితంలో ఎప్పుడైనా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

పోషకాహారాలు
- తల్లి పాలలో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీబాడీలు, హార్మోన్లు వంటివి ఉంటాయి.
- బిడ్డ పుట్టిన తర్వాత తొలి రెండు మూడు రోజుల పాటు తల్లి నుంచి వచ్చే పాలు పసుపు పచ్చ రంగులో ఉంటాయి.
- తల్లి నుంచి మొదటిసారి వచ్చే పాలను కొలొస్ట్రమ్ అంటారు.
- దీన్ని నేచురల్ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు.
- ఐజీఏ, లాక్టోఫెర్రిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉండటంతో పాటు.. మెదడు అభివృద్ధికి అవసరమయ్యే డీహెచ్ఏ, శక్తినిచ్చే లాక్టోస్ వంటివి అత్యధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు
- విరోచనాలు, న్యూమోనియా, చెవి ఇన్‌ఫెక్షన్లు, అకస్మాత్తుగా నవజాత శిశువులు మరణించే సిండ్రోమ్ రాకుండా అడ్డుకుంటాయి.
- డీహెచ్ఏ, ఏఆర్ఏ ఫాటీ యాసిడ్లు మెదడు కణాలను బలపరుస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో 5 నుంచి 7 పాయింట్లు అత్యధికంగా ఐక్యూ ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి.
- తల్లి నిత్యం బిడ్డను తనకు హత్తుకుంటూ, పర్యవేక్షిస్తుంటే పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది

- తల్లిపాలను ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ 28 శాతం, అండాశయ క్యాన్సర్ 21 శాతం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
- బిడ్డకు పాలను ఇవ్వడం వల్ల రోజులో 500 కేలరీలు కరుగుతాయి.
- దీనివల్ల తల్లి బరువు పెరగదు.
- ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రావం పెరగడం వల్ల తల్లుల్లో ఒత్తిడి తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

- తల్లి పాలివ్వకుండా బిడ్డ ఎదగడం సాధ్యమే. తల్లి పాలివ్వకపోవడం వల్ల పిల్లల ఎదుగుదలలో కొన్ని లోపాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్, ఇతర అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.
- తల్లిపాలు తాగని పిల్లల్లో న్యూమోనియా, డయేరియా వ్యాధులు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని 2023లో పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన మెటా అనాలసిస్‌లో తెలిపింది.
- మెదడు అభివృద్ధి విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పదేళ్ల అధ్యయనంలో, తల్లిపాలు తాగిన పిల్లల మెదడుల్లో 20 శాతం నుంచి 30 శాతం అధికంగా న్యూరల్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వ్యత్యాసానికి కారణం తల్లి పాలలో కనిపించే అధిక స్థాయి డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం.
- నేచర్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన 2022 అధ్యయనంలో తల్లిపాలు తాగిన పిల్లలు స్కూళ్లలో 12 శాతం ఎక్కువ ప్రతిభను కనబరుస్తున్నారు.
- ఇక దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే, లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన 2021 అధ్యయనంలో.. తల్లిపాలు సరిగ్గా తాగని పిల్లల జీవితంలో 35 శాతం టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- తల్లి పాలు తాగిన పిల్లలు పెద్దయ్యాక సగటున 20 శాతం ఎక్కువ సంపాదిస్తారని తల్లిపాల వల్ల కలిగే సామాజిక ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రపంచ బ్యాంకు 2020 నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో తల్లిపాలు ఇవ్వకపోవడం కూడా మంచిదే.
- హెచ్ఐవీ, ఎయిడ్స్, హెచ్‌టీఎల్‌వీ-1 క్యాన్సర్లు, నాడీకణాల వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పుడు, తల్లి పాలివ్వకూడదు. ఎందుకంటే, అవి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది.
- గాలాస్టోసెమియా వంటి జెనెటిక్ డిజార్డర్లతో పిల్లలు బాధపడుతుంటే, పాలలో ఉండే చక్కెరను పిల్లలు అరిగించుకోలేరు.
- ఒకవేళ తల్లి కీమోథెరపీ చేయించుకునేటప్పుడు, రేడియోయాక్టివ్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు లేదా ఇతర కొన్ని సీరియస్ మెడికేషన్లు వేసుకునే సందర్భాల్లో పిల్లలకు పాలిస్తే, అవి బిడ్డపై ప్రభావం చూపుతాయి.
- ఎక్కువగా మద్యం సేవించడం లేదా డ్రగ్స్ వాడటం, పొగ తాగడం వంటి వాటి వల్ల పాలల్లో నాణ్యత తగ్గుతుంది.
- పిల్లలకు తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసీజ్ (ఎన్‌ఈసీ) ఉంటే, పాలివ్వడాన్ని ఆపివేయచ్చు.
- ఇలాంటి సమయాల్లో వైద్యుని సూచనల మేరకు బిడ్డకు పాలిచ్చేందుకు ప్రత్యామ్నాయ విధానాలను పాటించాలి.

తల్లిపాలను నిల్వ చేయడం ఒక శాస్త్రీయ పద్ధతి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని, వాడితే, తల్లులకు సౌకర్యవంతమవుతుంది.
- ఉద్యోగాలకు వెళ్లే తల్లులకు, చదువుకునే తల్లులకు, లేదు ఇతర కారణాల వల్ల తమ పిల్లలకు నేరుగా పాలను పట్టలేని పిల్లలకు ఈ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
- తల్లిపాలను సరైన పద్ధతిలో నిల్వ చేసి తాగిస్తే పిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ యధావిధిగా అందుతాయి.
- మీరు ఉద్యోగ బాధ్యతల కారణంగా బిడ్డకు పాలు ఇవ్వలేనప్పుడు ముందుగానే చనుబాలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇది అటు తల్లి ఉద్యోగం చేసుకోవడానికి, ఇటు పిల్లల సంరక్షణకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది.
- పాలను నిల్వ చేసేటప్పుడు ఫ్రిడ్జ్‌లో 4 డిగ్రీల సెల్సియస్‌లో నాలుగు రోజుల వరకు నిల్వ చేయచ్చు. లేదంటే ఐస్ ప్యాక్‌తో చల్లని బ్యాగులో వీటిని పెట్టొచ్చు. ఇక ఫ్రీజర్‌లో -18 డిగ్రీల సెల్సియస్‌లో దీర్ఘకాలంపాటు అంటే ఆరు నెలల దాకా తల్లిపాలను నిల్వ చేయచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

- ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల తల్లిపాలతో వ్యాపారం చేయడం మొదలైంది. ఇదో తీవ్రమైన అంశం. తల్లిపాల సేకరణ, నిల్వ చేయడం ఉపయోగకపరమైన విధానం అయినప్పటికీ, దాన్ని వ్యాపారపరం చేయడం చాలా సవాళ్లను సృష్టించింది.
- ఈ చనుబాలను ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో, మిల్క్ బ్యాంకులలో అమ్ముతున్నారు. అయితే, ఈ పాల శుభ్రత, భద్రత, నైతికతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు మేరకు.. ఆసుపత్రులు, మిల్క్ బ్యాంకుల ద్వారా అత్యవసరంలో ఉన్న నెలలు నిండని శిశువులకు మాత్రమే తల్లి పాలను సేకరించి అందించాలి. ఇది సామాజిక బాధ్యతగా పరిగణించాలి.
- తల్లి పాల వ్యాపారీకరణ ప్రయత్నాలు పాల నాణ్యత, రవాణాలో భద్రతాలోపాలు, తల్లుల హక్కులపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
- దీనిపై చట్టపరమైన కఠిన నియంత్రణలు, నైౌతిక మార్గదర్శకాల అవసరం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














