కోరుకున్నంత మంది పిల్లలను కనలేకపోవడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, పాపులేషన్ కరెస్పాండెంట్
నమ్రతా నంగియా దంపతులు తమ కుమార్తె పుట్టినప్పటి నుంచి మరో బిడ్డను కనాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారి కుమార్తెకు ఐదేళ్లు. కానీ వారి ఆలోచన ''మనం దాన్ని భరించగలమా?'' అనే ప్రశ్నవద్దే ఆగిపోతుంటుంది.
నమ్రత ముంబయిలోని ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోనూ, ఆమె భర్త ఓ టైర్ల కంపెనీలోనూ పనిచేస్తున్నారు. ఉన్న ఒక్కబిడ్డను సాకడమే వారికి భారంగా ఉంది. పాప చదువు, స్కూల్ బస్సు, ఈత కొలను ఖర్చులు, అంతెందుకు కనీసం డాక్టర్ దగ్గరకు వెళ్లడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే.
నమ్రత పెరిగిన రోజులు వేరు . ''మేం అప్పట్లో కేవలం స్కూల్‌కు వెళ్లేవారం అంతే. చదువు తప్ప ఇతరత్రా విషయాలు ఏవీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పాపను స్విమ్మింగ్‌కు పంపాలి. డ్రాయింగ్‌కు పంపాలి. ఇంకా తనేం చేయగలదో తెలుసుకోవాలి''
నమ్రత ఎదుర్కొంటున్న సమస్య ప్రపంచ సమస్యగా మారిందని పునరుత్పత్తి హక్కులపై పనిచేసే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది. పునరుత్పాదకత క్షీణించడంపై ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ లక్షలాదిమంది ప్రజలు తమకు కావాల్సినంతమంది సంతానాన్ని పొందలేకపోతున్నారని చెప్పింది.
తల్లిదండ్రులు కావడమనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడం, కొంతమందికి తగిన భాగస్వాములు కొరవడటం వంటి కారణాలను కూడా ఈ సంస్థ పేర్కొంది.

సంతానోత్పత్తి ఆలోచనలపై 14 దేశాలలోని 14 వేల మందిని యూఎన్ఎఫ్‌పీఏ సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రతి ఐదుగురిలో ఒకరు తామ కోరుకున్నంతమంది సంతానాన్ని పొందలేకపోయామని చెప్పారు.
భారత్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇటలీ, హంగేరీ, జర్మనీ, స్వీడన్, బ్రెజిల్, మెక్సికో, అమెరికా, ఇండోనేసియా, మొరాకో, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలలో ఈ సర్వే చేశారు.
ప్రపంచ జనాభాలో మూడో వంతుకు పైగా ఈ దేశాలలోనే నివసిస్తున్నారు.
ఈ దేశాలు తక్కువ, మధ్యమ, ఎక్కువ ఆదాయాలున్న మిశ్రమంగా ఉన్నాయి. అలాగే తక్కువ ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన దేశాలూ ఇందులో ఉన్నాయి.
ఈ సర్వేలో యువకులను, అలాగే ఇప్పటికే పునరుత్పాదక వయస్సు దాటిన వారిని కూడా భాగస్వాములను చేసింది.
"ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడనట్టుగా సంతానోత్పత్తి తగ్గే దశలోకి ప్రవేశించింది. " అని యూఎన్ఎఫ్ఏ చీఫ్ డాక్టర్ నటాలియా కానెమ్ తెలిపారు.
"ఈ సర్వేలో పాల్గొన్న చాలామంది కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కోరుతున్నారని వెల్లడించారు. కానీ వారికి కావలసిన కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశమే లేకపోవడం వల్లే సంతానోత్పత్తి గణనీయంగా పడిపోతోంది. అదే నిజమైన సంక్షోభం." అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'' ఇదొక సంక్షోభం. వాస్తవమే. ఇదొక మార్పు అని నేను భావిస్తున్నా. '' అని యూరప్‌లో సంతానాన్ని పొందాలనే ఉద్దేశం ఉన్నవారిపై పరిశోధనలు చేసిన జనాభా పరిశోధకురాలు, జనాభా విధానంపై ఫిన్‌లాండ్ ప్రభుత్వానికి సూచనలు చేసే అన్నా రోట్కిర్చ్ అన్నారు.
‘‘మొత్తంగా చూస్తే ప్రజలు ఆశించినదానికంటే తక్కువమంది పిల్లలే కలుతున్న పరిణామమే ఎక్కువగా కనిపిస్తోంది’’ అని ఆమె చెప్పారు. యూరప్‌లో దీనిపై ఆమె పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది ప్రతిబింబించడం ఆసక్తికరంగా ఉందన్నారు.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 50మందికంటే (31%) ఎక్కువ మంది తాము కోరుకున్న దాని కంటే తక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్నామని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు.
ఈ ఏడాది చివరిలో 50 దేశాల్లో చేపట్టే పరిశోధన కోసం పైలట్‌గా నిర్వహించిన సర్వే పరిధి పరిమితంగా ఉంది.
ఈ దేశాలలో వయసుల విషయానికి వస్తే, శాంపుల్ సైజులు తక్కువగా ఉన్నాయి. ఇవి తుదిగా ఓ నిర్ణయానికి రావడానికి మరీ చిన్నవి.
కానీ, ఈ సర్వేలో గుర్తించిన కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అన్నిదేశాలలో 39శాతం మంది ప్రజలు తాము పిల్లలను కనకుండా ఆర్థికపరమైన పరిమితులు అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఇందులో అత్యంత ఎక్కువ ప్రతిస్పందన కొరియాలో (58%), తక్కువ ప్రతిస్పందన స్పీడన్ (19%).
మొత్తం మీద కేవలం 12 శాతం మందే తమకు కావాల్సినంతమంది సంతానం లేకపోవడానికి , సంతాన సామర్థ్యం లేదా గర్భధారణ ఇబ్బందులు కారణంగా నిలుస్తున్నాయని చెప్పారు. కానీ, ఈ సంఖ్య థాయిలాండ్‌లో అత్యధికంగా 19 శాతం, అమెరికాలో 16 శాతం, దక్షిణాఫ్రికాలో 15 శాతం, నైజీరియాలో 14 శాతం, భారత్‌లో 13 శాతంగా ఉంది.
''ఐక్యరాజ్యసమితి కనిష్ట సంతానోత్పత్తి విషయంపై స్పందించడం ఇదే తొలిసారి.'' అని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెమొగ్రాఫర్, ప్రొఫెసర్ స్టువార్ట్ గీటెల్ బాస్టెన్ చెప్పారు.ఇప్పటిదాకా యూఎన్ తాము కోరుకున్న దాని కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న మహిళలపై, గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో లేనివారిపై దృష్టిపెట్టింది.
ప్రస్తుతం తక్కువ సంతానోత్పత్తిపై అప్రమత్తంగా ఉండాలని యూఎన్ఎఫ్‌పీఏ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రస్తుతం ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతోందంటూ భయపెట్టే మాటలను వింటున్నాం. కొందరు జనాభా బాగా పెరిగిపోయిందంటున్నారు మరికొందరు బాగా తగ్గిపోయిందంటున్నారు. ఇదంతా అతిశయోక్తే అవుతుంది. ఇది అవసరానికి తగిన నిర్ణయం తీసుకునేలా చేయదు ’’ అని డాక్టర్ కానెమ్ చెప్పారు.
‘‘ఇలాంటి అతిశయోక్తులు, భయాలతో మహిళలను మరింతమంది పిల్లలను కనాలనో, వద్దనో ఒత్తిడి తెస్తున్నారు’’ అని డాక్టర్ కానెమ్ చెప్పారు.
40 ఏళ్ల క్రితం చైనా, కొరియా, జపాన్, థాయిలాండ్, తుర్కియేలలో అత్యధిక జనాభా ఉండేది. వీరంతా తమ అధిక జనాభా గురించి బాధపడుతుండేవారు. కానీ ఇప్పుడు ఈ దేశాలు సంతానోత్పత్తిని పెంచుకోవాలనుకుంటున్నాయని డాక్టర్ కానెమ్ చెప్పారు.
''ఈ దేశాలు ఆందోళన కలిగించే విధానాలు అమలు చేయకుండా దూరంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.'' అని ప్రొఫెసర్ గీటెల్ బాస్టెన్ చెప్పారు.
''తక్కువ సంతానోత్పత్తి, వృద్ధుల జనాభా పెరగడం, జనాభా స్తబ్దతను సాకుగా చూపి జాతీయవాద, వలస వ్యతిరేక, జెండర్ కన్జర్వేటివ్ పాలసీలను అమలు చేయడాన్ని మనం చూస్తున్నాం.'' అని తెలిపారు.
డబ్బు కంటే సమయం తగినంత లేకపోవడం పిల్లలు కనడానికి అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని యూఎన్ఎఫ్‌పీఏ గుర్తించింది.
ముంబయిలోని నమ్రతా విషయంలో అది నిజం.
తాను ఆఫీసుకు వెళ్లడానికి, తిరిగి రావడానికి రోజులో కనీసం మూడు గంటలు పడుతుంది. ఇంటికి వచ్చే సరికి ఆమె అలసిపోతోంది. వారి కుటుంబానికి సరైన నిద్ర కూడా దొరకడం లేదు.
ఆమె తన కూతురితో సమయం కేటాయించాలనుకుంటోంది.
''రోజంతా వర్క్ చేసిన తర్వాత, తల్లిగా మీ పిల్లలతో సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారనే అపరాధ భావన మీకు కలుగుతుంది.'' అని ఆమె చెప్పారు.
అందుకే, ప్రస్తుతం తాము ఒక్కరికే ప్రేమ చూపించాలనుకుంటున్నామని నమ్రతా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














