ఇందిరాగాంధీ: రాష్ట్రపతి కావాలనుకున్నారా, శాశ్వత అధ్యక్ష తరహా పాలన కోసం ప్రయత్నించారా?

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని ఇందిరా గాంధీ 1970ల మధ్య కాలంలో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నప్పుడు, పౌర హక్కుల రద్దు, అనేకమంది ప్రతిపక్ష నాయకులు జైళ్లపాలవడం అనే దశలోకి భారత్ ప్రవేశించింది.
నిరంకుశపు తెరల చాటున, ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాకుండా, అధికారం కేంద్రీకృతమై ఉండే నిరంకుశ రాజ్యాన్ని ఊహించడం మొదలుపెట్టిందని శ్రీనాధ్ రాఘవన్ తన నూతన పుస్తకంలో వెల్లడించారు.
కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకృతం చేయడం, ఆటంకంగా మారగల న్యాయ వ్యవస్థను పక్కన పెట్టడం, పార్లమెంటరీ వ్యవస్థను డూడూ బసవన్నలా మార్చగల అధ్యక్ష తరహా పాలనను భారత దేశంలో తీసుకు వచ్చేందుకు ఇందిర పాలనకాలంలోని ఉన్నతాధికారులు, పార్టీ విధేయులు ఎలాంటి ప్రయత్నాలు చేశారనే విషయంపై "ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ఇండియా" అనే పుస్తకంలో రాఘవన్ వివరించారు.
కార్యరూపం దాల్చకపోయినప్పటికీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధులను దాటి భారత దేశంలో బలమైన అధ్యక్ష తరహా పాలనను స్థాపించాలనే అశయం కోసం చేసిన ఈ ప్రయత్నానికి ఫ్రాన్స్‌కు చెందిన చార్ల్స్ డి గాల్ పాలనలో ఒక భాగం స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇందిరా గాంధీకి సన్నిహితుడు, అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త బీకే నెహ్రూ 1975 సెప్టెంబర్‌లో ఎమర్జెన్సీని ప్రస్తుతిస్తూ "అత్యంత ధైర్యం, అధికారంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజా మద్దతు లభించింది. ఈ క్షణాన్ని కొనసాగించండి" అని ఇందిరకు రాసిన లేఖలో పేర్కొనడంతో ఇదంతా మొదలైందని ప్రొఫెసర్ రాఘవన్ రాశారు.
ఆ లేఖలో ఇంకా "పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన అవసరాలకు తగిన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఈ విధానంలో కార్యనిర్వాహక వ్యవస్థ నిరతంతరం ప్రజలు ఎన్నుకున్న శాసనవ్యవస్థపై ఆధారపడాల్సి ఉంటుంది. ‘‘ఈ శాసనవ్యవస్థ ప్రజాకర్షణ కోసం చూస్తూ, తమకు నచ్చని నిర్ణయాలను అడ్డుకుంటూ ఉంటుంది’’. అని రాశారు.
భారత దేశానికి కావాల్సింది పార్లమెంటుపై ఆధారపడకుండా, ప్రజలు నేరుగా ఎన్నుకునే అధ్యక్ష పాలన కావాలని బీకే నెహ్రు రాశారు. జాతి ప్రయోజనాల కోసం ‘కొన్నిసార్లు కఠినమైన, ప్రజలకు ఇష్టంలేని నిర్ణయాలు కూడా తీసుకునే నాయకత్వం అవసరమని’’ నెహ్రూ రాశారని ప్రొఫెసర్ రాఘవన్ తన పుస్తకంలో తెలిపారు.

భారత్‌ను అధ్యక్ష పాలనలోకి తీసుకెళ్లే ప్రయత్నం
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో డి గాల్ అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు అనుసరించిన పద్దతిని బీకే నెహ్రూ సూచించారు.
ఏడేళ్ల పదవీకాలం, పార్లమెంట్, శాసనసభల్లో దామాషా ప్రాతినిధ్యం, న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గించడం, కఠిన చట్టాలతో పత్రికా వ్యవస్థను నియంత్రించడం లాంటి వ్యవస్థ ఉండాలని ఆయన భావించారు. అంతే కాదు, సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్య్ర హక్కులకున్న న్యాయపరమైన రక్షణలను తొలగించాలని ప్రతిపాదించారు.
"దీనికి సంబంధించి రాజ్యాంగంలో ప్రాథమికమైన మార్పుల్ని ఇప్పుడే చేయండి. ఎందుకంటే మీకిప్పుడు మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది" అని బీకే నెహ్రూ ఇందిరను అభ్యర్థించారు.
ఆయన ఆలోచలను ప్రధానమంత్రి కార్యదర్శి పీఎన్ థర్ "ఆనందంతో స్వీకరించారు". ఈ అంశాల గురించి బీకే నెహ్రూ పార్టీ నాయకులతో చర్చించేందుకు ఇందిర అనుమతించారు. అయితే ఆ ప్రతిపాదనలకు తన ఆమోదముద్ర ఉందనే భావన వారిలో కలగకూడదని ఇందిరాగాంధీ "చాలా స్పష్టంగా, గట్టిగా" చెప్పారు.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
ఇందిర సమర్థించారా? వ్యతిరేకించారా?
బీకే నెహ్రూ ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన జగజ్జీవన్ రామ్, నాటి విదేశాంగమంత్రి స్వరణ్ సింగ్ నుంచి విపరీతమైన మద్దతు లభించిందని ప్రొఫెసర్ రాఘవన్ రాశారు.
హరియాణా ముఖ్యమంత్రి నిర్మొహమాటంగా "అర్థం లేని ఈ ఎన్నికల గందరగోళాన్ని వదిలించుకోండి.నన్నడిగితే మా సోదరిని (ఇందిరాగాంధీ) జీవితకాలం అధ్యక్షురాలిగా చేస్తే చాలు. ఇంకేమీ అక్కర్లేదు" అని చెప్పారు. ఈ అంశంపై నాడు దేశంలో ఉన్న ఇద్దరు కాంగ్రేసేతర ముఖ్యమంత్రుల్ని సంప్రదించినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఒక్కరే అయిష్టత వ్యక్తం చేశారు.
తన ప్రతిపాదనల గురించి బీకే నెహ్రూ ఇందిరను సంప్రదించినప్పుడు ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రొఫెసర్ రాఘవన్ రాశారు. ఈ ప్రతిపాదనపై విస్తృతంగా అధ్యయనం చేయాలని ఆమె తన అత్యంత సన్నిహితులకు చెప్పారు.
"రాజ్యాంగంపై తాజా పరిశీలన: కొన్ని సలహాలు" అనే పేరుతో ఒక డాక్యుమెంట్‌ను రహస్యంగా రూపొందించి, విశ్వసనీమైన సలహాదారులకు పంపిణీ చేశారు.
ఆ రహస్య పత్రంలో అమెరికా అధ్యక్షుడిని మించిన అధికారాలను కట్టబెట్టాలని, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థలో నియామకాలపైనా అధ్యక్షుడికి నియంత్రణ ఉండాలని ప్రతిపాదించారు. అధ్యక్షుడి నేతృత్వంలో పని చేసే నూతన "సర్వోన్నత న్యాయ మండలి"ని ఏర్పాటు చేయాలని, ఈ మండలి "చట్టాలు, రాజ్యాంగం"లోనూ జోక్యం చేసుకోవచ్చని, సుప్రీంకోర్టును కూడా సమర్థవంతంగా నిర్వీర్యం చేయవచ్చని సూచించింది.
గాంధీ ఈ రహస్య పత్రాన్ని ధర్‌కు పంపించారు. ఇది "రాజ్యాంగాన్ని అస్పష్టంగా నిరంకుశ దిశలో వక్రీకరించిందని" ఆయన గుర్తించారు. 1975లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాజ్యాంగాన్ని "క్షుణ్ణంగా పునః పరిశీలించాలని" నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే బారువా బహిరంగంగా పిలుపివ్వడం ద్వారా ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ఆలోచన ఎన్నడూ అధికారిక ప్రతిపాదనగా మారలేదు.
అయితే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణపై దీని ప్రభావం ఉంది. ఈ సవరణ ద్వారా పార్లమెంటమ అధికారాలను విస్తృతం చేసింది. న్యాయ సమీక్షను పరిమతం చేసింది. కార్యనిర్వహక అధికారాన్ని కేంద్రీకృతం చేసింది.42వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ చేసిన చట్టాలను కొట్టి వేయడాన్ని మరింత కఠినం చేసింది. వీటిని కొట్టి వేయాలంటే ఐదుగురు, ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంలో సూపర్ మెజారిటీని తప్పనిసరి చేసింది. పార్లమెంట్ అధికారాన్ని పరిమితం చేసే రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని నీరుగార్చింది.
ఈ సవరణ రాష్ట్రాల్లో కేంద్ర బలగాలను మోహరించేందుకు, రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించేందుకు, రాష్ట్రపతి పాలనను ఆరు నెలల నుంచి ఏడాది వరకు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కట్టబెట్టింది. ఎన్నికల వివాదాలను న్యాయ పరిధి నుంచి తొలగించింది.
ఇంత చేసినప్పటికీ దేశం ఇంకా అధ్యక్ష తరహా పాలనలోకి మారలేదు, అయితే అలాంటి లక్షణాలను తీసుకొచ్చింది. బలమైన కార్యనిర్వహక వ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థను తొక్కి పెట్టింది. రాజ్యాంగ వ్యవస్థలకు కోరలు పీకేసింది.
"ఒక్క దెబ్బతో ఈ సవరణ రాజ్యాంగ సమతుల్యతను పార్లమెంట్‌కు అనుకూలంగా మళ్లిస్తుంది" అని ది స్టేట్స్‌మెన్ వార్తా పత్రిక హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
పార్టీకి 'షాక్' ఇవ్వాలనుకున్నారా?
ఇంతలో, ఇందిరాగాంధీకి మద్దతు తెలిపే నాయకులు, ఆమెకు శాశ్వత అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. రక్షణ మంత్రి బన్సీ లాల్ ఆమె జీవితాంతం ప్రధాని పదవిలో ఉండాలని కోరారు .
అదే సమయంలో హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సభ్యులు, 1976 అక్టోబర్‌లో కొత్త రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అయితే ‘‘ఈ డిమాండ్లపై ఇందిరాగాంధీ ఆశ్చర్యపోయారు. వాటిని ఆమె తిరస్కరించారు. దీనికి బదులుగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో త్వరగా ఆమోదింపచేయాలని నిర్ణయించుకున్నారు’’ అని ప్రొఫెసర్ శ్రీనాథ్ రాఘవన్ రాశారు.
డిసెంబరు 1976 నాటికి ఆ బిల్లు పార్లమెంట్‌లోని రెండూ సభలలో ఆమోదం పొందింది. 13 రాష్ట్రాల శాసన సభలు దానిని ఆమోదించాయి. ఆ తరువాత అది రాష్ట్రపతి సంతకం ద్వారా చట్టంగా మారింది."
1977లో ఇందిరా గాంధీ ఓటమి తర్వాత, కొద్దికాలం మాత్రమే అధికారంలో ఉన్న జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నష్ట నివారణకు వేగంగా చర్యలకు ఉపక్రమించింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన నిరంకుశ అధికారాలను 43,44 రాజ్యాంగ సవరణల ద్వారా రద్దు చేసింది. రాజ్యాంగ వ్యవస్థల అధికారాలను పునరుద్ధరించింది.
అంతర్గత విబేధాలు, నాయకత్వం కోసం పోరు వల్ల జనతాపార్టీ ప్రభుత్వం కూలిపోవడంతో 1980 జనవరిలో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు.
ఆసక్తికరంగా, రెండేళ్ల తర్వాత పార్టీలోని కొంతమంది నాయకులు మళ్లీ అధ్యక్ష తరహా పాలనా విధానం గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవీకాలం 1982లో ముగిసింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగి భారత రాష్ట్రపతి కావాలని సీ 'తీవ్రంగా ఆలోచించారని' ఆమె ప్రధాన కార్యదర్శి తర్వాత వెల్లడించారు.
ఆమె కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద మోసి విసిగిపోయారు. "తన పార్టీకి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా దానికి కొత్త ఊపు తేవాలని భావించారు"
ఏమైందో కానీ ఆమె వెనక్కి తగ్గారు. అప్పట్లో ఆమెకు విధేయుడైన కేంద్ర హోంమంత్రి జ్ఞానీ జైల్‌సింగ్‌ను రాష్ట్రపతిగా చేశారు.
తీవ్రమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ, భారత్ ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలనా విధానం వైపు అడుగేయలేదు. వ్యూహాత్మక రాజకీయవేత్త అయిన ఇందిర తనంతట తానే వెనక్కు తగ్గారా, లేదా పార్లమెంటరీ విధానానికి దేశం అలవాటు పడిందా?

ఫొటో సోర్స్, Gamma-Rapho via Getty Images
ఇందిర మృతితో ముగిసిన ప్రతిపాదన
అధ్యక్ష తరహా విధానం వైపు మారే సంకేతాలు 1970 ప్రారంభంలో కనిపించాయి. 1967 తర్వాత భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం, అస్థిరత్వం పెరిగిందని, బలహీనమైన కూటములు దీనికి కారణమని రాఘవన్ తన పుస్తకంలో చెప్పారు.
ఈ సమయంలోనే భారతదేశానికి అధ్యక్ష తరహా విధానం మంచిదని చెప్పే వారి సంఖ్య పెరిగింది. ఈ ఆలోచనలకు స్పష్టత వచ్చి బలమైన రాజకీయ అవగాహనగా మారడానికి ఎమర్జెన్సీ ఊతమిచ్చింది.
"అధికారం మీద మరింత పట్టు పెంచుకునేలా వ్యవస్థను పునర్నిర్మించడమే ఆమె లక్ష్యం. దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక ఏమీ లేదు. ఆమె పరిపాలనలో సంభవించిన పరిణామాలు చాలా వరకు ప్రణాళిక ప్రకారం చేసినవి కాకపోవచ్చు" అని రాఘవన్ బీబీసీతో చెప్పారు.
"ఎమర్జెన్సీ కాలంలో ఆమె లక్ష్యం స్వల్పకాలికంగా ఉంది. తన అధికారానికి ఎలాంటి సవాళ్లు రాకూడదనుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలకు న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాకూడదని 42వ రాజ్యాంగ సవరణచేశారు" అని ఆయన అన్నారు.
అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని కోరుకుంటున్న వారి సంఖ్య కాంగ్రెస్‌లో ఎప్పుడూ తగ్గలేదు. 1984 ఏప్రిల్ చివర్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు సీనియర్ మంత్రి వసంత్ సాథే అధ్యక్ష తరహా పాలనా విధానం కోసం జాతీయ చర్చ జరగాలని కోరారు.
అయితే ఆరు నెలల తర్వాత, ఇందిరను ఆమె బాడీగార్డులు దిల్లీలో కాల్చి చంపడంతో ఆమెతో పాటే ఆ ఆలోచన కూడా ముగిసిపోయింది.
భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా నిలబడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














