నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు

నీలం సంజీవ రెడ్డి, ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన ఒకే ఒక్కడు డాక్టర్ నీలం సంజీవ రెడ్డి.

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి- ఈ ఐదు కీలక పదవులూ చేపట్టిన ఒకే ఒక్క నాయకుడు ఆయన.

అనంతపురం జిల్లా ఇల్లూరులో 1913 మే 19న మధ్య తరగతి రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు, ప్రస్తుత శింగనమల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

మదనపల్లెలోని థియోసాఫికల్ హైస్కూల్‌లో, అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో ఆయన రాజకీయాలకు ఆకర్షితులయ్యారు.

మహాత్మ గాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన సంజీవ రెడ్డి, కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రథమ పౌరుడి స్థానానికి ఎదిగారు.

ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.

రెండు సార్లు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. లోక్‌సభ స్పీకర్‌గా ఉండగానే రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆరో రాష్ట్రపతిగా 1977 జులై 25 నుంచి 1982 జులై 25 వరకు ఆయన పనిచేశారు.

ఆయనకు 1935లో నాగరత్నమ్మతో వివాహమైంది.

వీరికి నలుగురు సంతానం. వీరిలో ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

జీవితాన్ని మలుపుతిప్పిన మహాత్ముడి పర్యటన

1929 జులైలో గాంధీ అనంతపురం పర్యటన సంజీవ రెడ్డి జీవితంలో కీలక మలుపుగా చెబుతారు.

గాంధీ ప్రసంగాలు, ఆలోచనలకు ఆకర్షితులైన సంజీవ రెడ్డి.. గాంధీ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి ఖాదీ ధరించడం మొదలుపెట్టారు.

చదువుకు స్వస్తి చెప్పి 1931 నుంచి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్రోద్యమంలో జైలుకు కూడా వెళ్లారు.

యూత్ కాంగ్రెస్ నేతగా చురుగ్గా పనిచేసిన సంజీవ రెడ్డి 1937లో కాంగ్రెస్ ఆంధ్ర ప్రాంత (ఆంధ్ర ప్రావిన్షియల్) సెక్రటరీ పదవికి ఎంపికయ్యారు. పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.

1946లో మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే, మద్రాస్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి కార్యదర్శిగానూ ఎంపికయ్యారు.

ఆ తర్వాతి ఏడాది భారత రాజ్యాంగ రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభకు ఆయన్ను ఎన్నుకున్నారు.

రాజ్యాంగ సభ సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. రాష్ట్రాల అసెంబ్లీలు వారిని ఎన్నుకున్నాయి.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

సంజీవరెడ్డి 1949లో తిరిగి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1949 ఏప్రిల్ నుంచి 1951 ఏప్రిల్ వరకు మద్రాస్ రాష్ట్రంలో ప్రొహిబిషన్, గృహనిర్మాణం, అటవీ శాఖల మంత్రిగా పనిచేశారు.

1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు.

మరుసటి ఏడాది, అంటే 1952లో రాజ్యసభ సభ్యుడయ్యారు. కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.

1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు క్యాబినెట్‌లో సంజీవ రెడ్డి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం బెజవాడ గోపాల్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి

1956లో ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

అంతకుముందే ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఎన్జీ రంగా నేతృత్వంలోని కృషి కార్ లోక్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో బెజవాడ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కింది. ఆయన అనంతరం 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

అట్టడుగు వర్గాలకు విద్య, రాజకీయ చైతన్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆయన భావించేవారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

1956 నవంబర్ నుంచి 1959 డిసెంబర్ వరకు సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు.

జాతీయ రాజకీయాల్లోనూ ఆయన బాగా ఎదిగారు. 1959 డిసెంబర్‌లో ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1962 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) చీఫ్ బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన అనంతరం దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు.

సంజీవరెడ్డి 1962లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు రెండేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. రవాణా సంస్థల జాతీయీకరణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టడంతో, దానికి బాధ్యత వహిస్తూ 1964లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

శాస్త్రి, ఇందిర క్యాబినెట్‌‌లలో చోటు

ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపిన తొలితరం తెలుగు నాయకుల్లో సంజీవ రెడ్డిని ఆద్యుడిగా చెప్పవచ్చు.

లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగానూ ఆయన పనిచేశారు.

సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన 1964లో రాజ్యసభకు ఎంపికయ్యారు.

లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో 1964 జూన్ నుంచి 1966 జనవరి వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.

1966 జనవరి నుంచి 1967 వరకు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో రవాణా, విమానయానం, సముద్రయానం, పర్యాటక శాఖల మంత్రిగా ఉన్నారు.

నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, rashtrapatibhavan.gov.in

లోక్‌సభ ప్రతిష్ట పెంచేలా నిర్ణయాలు

సంజీవ రెడ్డి రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఈ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగానూ చరిత్రకెక్కారు.

1967లో నాలుగో లోక్‌సభ‌కు జరిగిన ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి గెలుపొందారు. 1967 మార్చి 26 నుంచి 1969 జులై 19 వరకు స్పీకర్‌గా వ్యవహరించారు.

స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే సంజీవరెడ్డి కాంగ్రెస్‌తో తన 34 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు.

స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావించిన ఆయన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

స్పీకర్‌గా సభ ప్రతిష్ట పెంచేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రోజున అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించారు. పూర్వాపరాలు పరిశీలించాలనే కారణంతో అత్యవసర విషయాలను ఆలస్యం చేయకూడదని ఆయన విశ్వసించారు.

విజిటర్స్ గ్యాలరీ నుంచి కరపత్రాలు విసిరి, నినాదాలు చేస్తూ సభను ధిక్కరించినందుకు జైలు శిక్ష విధించింది కూడా ఆయన హయాంలోనే.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు సంజీవరెడ్డి స్పీకర్‌గా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి.

నీలం సంజీవ రెడ్డి, ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఇందిర చెప్పిన ఆ ఒక్కమాటతో ఓటమి

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 1969 జులై 19న సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్ పదవికి సంజీవరెడ్డి రాజీనామా చేశారు. అయితే, ఆయన అనుకున్నట్లు జరగలేదు.

కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సంజీవ రెడ్డి, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అన్న ఒక్కమాటతో రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరి చేతిలో ఓడిపోయారు.

1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో అప్పటివరకు ఉప రాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరిని తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించారు.

రాష్ట్రపతి పదవి కోసం ఇద్దరు తెలుగు నేతలు సంజీవ రెడ్డి, వీవీ గిరి మధ్య పోటీ ఏర్పడింది.

అప్పుడు కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. దీంతో కాంగ్రెస్ బలపరిచిన సంజీవ రెడ్డి గెలుపు ఖాయమని భావించారు. కానీ, అలా జరగలేదు. ఇందిరకు ఇష్టం లేకపోవడమే అందుకు కారణమని చెబుతారు.

జగ్జీవన్ రామ్‌ను బరిలో దింపాలని ఇందిర అనుకున్నారు. కానీ చివరకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి ఇందిర ఆమోదం తెలపక తప్పలేదు.

తాను కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వీవీ గిరి ప్రకటించారు. ఇందిర సూచన మేరకే గిరి రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రధానిగా ఉన్న ఇందిర ఈ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన సంజీవరెడ్డికి ఓటు వేయాలని చెప్పకుండా, ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని తన సభ్యులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేతలు మొదటి ప్రాధాన్య ఓటును పార్టీ బలపరిచిన సంజీవరెడ్డికి, రెండో ప్రాధాన్య ఓటును జనసంఘ్ బలపరిచిన అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్‌కు వేయాలని సూచించారు. అయితే, ఇందిర మాటల అంతరార్థం గ్రహించిన కాంగ్రెస్ సభ్యులు చాలా మంది సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి ఓటు వేయడంతో సంజీవరెడ్డి ఓడిపోయారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమితో నీలం సంజీవరెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు.

ఇందిరా గాంధీ, నీలం సంజీవ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

జనతా పార్టీతో రీఎంట్రీ

తర్వాత కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సంజీవ రెడ్డి జనతా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ్ పిలుపుతో మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అయ్యారు.

ఇందిర విధించిన ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కూటమి రికార్డు విజయం సాధించింది.

అప్పట్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా సంజీవ రెడ్డి పోటీ చేసి, ఎంపీ అయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1977 మార్చి 26న ప్రమాణం చేశారు.

అయితే, నాలుగు నెలలే ఆయన ఈ పదవిలో కొనసాగారు.

అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానంలో సంజీవరెడ్డిని ఎన్నుకునేందుకు అప్పటి జనతా ప్రభుత్వం నిర్ణయించింది.

ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న ఇందిర కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు.

సంజీవరెడ్డి 1977 జులై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1982 జులై వరకు ఆయన పదవిలో కొనసాగారు.

1996 జూన్ ఒకటో తేదీన 83 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)