CBSE: పుస్తకాలు చూసి పరీక్షలు రాసే విధానం ఎలా ఉండబోతోంది?

విద్యార్థులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పరీక్షలంటే బోలెడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క వాక్యం గుర్తు లేకపోయినా, మొత్తం సమాధానం గుర్తుకు రాదు. కాబట్టి పరీక్ష అయ్యే వరకూ చదివింది గుర్తుంటే చాలు. ఇదీ ఇప్పుడు సగటు విద్యార్థి పరీక్షల్లో పాస్ అవడం కోసం ఆలోచించే విధానం. అయితే ఇకపై విద్యార్థులు ఈ టెన్షన్ లేకుండా పరీక్షలకు పుస్తకాలను తీసుకువెళ్లి చూసి రాసే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని సీబీఎస్ఈ ఆలోచిస్తోంది. దీన్నే ఓపెన్ బుక్ పరీక్షా విధానం అంటారు.

9, 10, 11, 12 (ఇంటర్) తరగతుల్లో ప్రయోగాత్మకంగా ఓపెన్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టే చర్చ జరుగుతోంది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనలతో ఈ చర్చ మొదలైంది.

అయితే, ఫైనల్ పబ్లిక్ పరీక్షల్లో కాకుండా ముందుగా ఇతర పరీక్షల్లో ఈ పద్ధతిని పరిశీలిస్తారు. ముందుగా కొన్ని సబ్జెక్టుల్లో ఈ పద్ధతి ప్రవేశ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామని సీబీఎస్ఈ అధికారులు మీడియాతో చెప్పారు.

దేశంలో ఓపెన్ బుక్ పద్దతి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2020లో దిల్లీ యూనివర్సిటీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ కోసం ఈ పద్దతి ప్రవేశపెట్టింది. అయితే అంత విస్తృతంగా అమలు చేయలేదు.

తెలంగాణలో కూడా ఇటువంటి ప్రయోగం జరిగింది. 2021-22 నుంచి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ వాళ్లు పాలిటెక్నిక్‌కు ఈ విధానం అమలు చేశారు. ఆ విధానం సత్ఫలితాలు ఇచ్చింది. అప్లైడ్ ఇంజినీరింగ్ మేథమేటిక్స్ పరీక్షలో పాస్ పర్సెంటేజ్ 24 శాతం పెరిగిందని తేలింది. ఈ పద్ధతిలో తెలంగాణ బోర్డు ఐదు పుస్తకాలను సూచిస్తుంది.

ఆ ఐదు పుస్తకాల నుంచి ఏవైనా రెండు పుస్తకాలను విద్యార్థులు పరీక్ష హాలుకు తీసుకుని వెళ్లవచ్చు. అయితే కొన్ని బోర్డులు ఫలానా పుస్తకమే తీసుకెళ్లాలనే ఆంక్షలు పెట్టవు. ఏదైనా తెచ్చుకోవచ్చు. పరీక్ష రాసేప్పుడు ప్రశ్నలకు సమాధానం కోసం టెక్ట్స్ బుక్‌లు, నోట్స్, మెటీరియల్స్ లేదా ఇతర అనుమతించిన పుస్తకాలు తీసుకెళ్లవచ్చు.

మనం చదుకునేప్పుడు ఈ పద్ధతి ఉంటే ఎంత బావుండేదో కదా అనిపిస్తుంది కొందరికి. కానీ అక్కడే ఉంది అసలు చిక్కు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్షల్లో ప్రశ్నలు విద్యార్థులను ఆలోచింపచేసేలా ఉంటాయి. ఇండైరెక్టుగా అడుగుతారు. అంటే రాసే ముందు ఆ ప్రశ్న బాగా చదివి, అర్థం చేసుకుని సమాధానం రాయాలి. అంటే ఈ పద్ధతిలో కాన్సెప్టు మీద అవగాహన ఉంటే తప్ప సమాధానం రాయలేరు.

అలాగే తీసుకెళ్లిన పుస్తకాల్లో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎక్కడ ఉందో గుర్తించగలగాలి. అంటే ఆ మెటీరియల్ పూర్తిగా అర్థం కావాలి. లోతుగా అర్థం చేసుకోవడం, తార్కికంగా ఆలోచించడం అతి ముఖ్యమైనవి.

చాలా సందర్భాల్లో మామూలు పరీక్షల కంటే పుస్తకాలు చూసి రాసే ఈ విధానం కష్టమైనదని కూడా అనిపించవచ్చు.

కేవలం జ్ఞాపకశక్తి ఉంటే చాలు పరీక్ష పాస్ కావచ్చనే పరిస్థితి ఈ విధానంలో ఉండదు. పాఠాలు చెప్పే పద్ధతీ మారాలి.

అప్లికేషన్ బేస్డ్, డెసిషన్ మేకింగ్, ఆప్టిట్యూడ్, అండర్ స్టాండింగ్ కాన్సెప్ట్, కనెక్టింగ్ డాట్స్… ఇవన్నీ ఈ విధానంలో కీలకం.

టెక్ట్స్ బుక్‌లు చదవాలి. రిఫరెన్సు పుస్తకాల మీద అవగాహన ఉండాలి. ఒక రకంగా ఈ పరీక్ష కూడా వారికి ఒక సాధనలాగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

ప్రశ్నకు సమాధానాన్ని బట్టీ పట్టి రాయడం కాకుండా, ప్రశ్నను విశ్లేషించుకుని, అర్థం చేసుకుని సమాధానం రాయాల్సి ఉంటుంది.

విద్యార్థి తన విశ్లేషణను అక్కడ ఉన్న ప్రశ్నకు లేదా సమస్యకు అన్వయించడం, సమస్యను పరిష్కరించే దిశగా, సృజనాత్మకంగా ఆలోచించడంతో పాటూ ఇతరత్రా నైపుణ్యాలు కూడా అవసరం పడతాయి.

దీని వల్ల తార్కికంగా ఆలోచించి చురుకుగా నిర్ణయాలు తీసుకోగలగడం అలవాటు అవుతుంది.

సబ్జెక్టు గురించి ఏమీ అవగాహన లేకుండా చివరి నిమిషంలో పరీక్షకు వెళ్లే వారికి ఉపయోగం ఉండదు.

అయితే, పిల్లలకు ఫలానాది గుర్తుండడం లేదనీ, చాంతాడంత సమాధానం గుర్తు పెట్టుకోవాలనే ఒత్తిడి ఉండదు.

పిల్లలకు ఉన్నత స్థాయిలో ఆలోచించగలగడం అలవాటు అవుతుంది. ఒక రకంగా ఆ అంశంపై జీవితాంతం గుర్తుండిపోయే అవగాహన వస్తుంది.

భవిష్యత్తులో పెద్ద కోర్సులు, ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు సులభం అవుతుంది. సిలబస్‌లో కొన్నే చదవడం, కొంత భాగం వదిలేయడం.. ఇలాంటి సమస్యలు రావు.

మొత్తంగా మన భాషలో చెప్పాలంటే, ఏదో రకంగా పాసై పోవడం కష్టం. విద్యార్థులకు కచ్చితంగా ‘‘సబ్జెక్టు’’ వస్తుంది.

పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఓపెన్ బుక్ విధానంలో పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఉంటాయో స్లేట్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ బీబీసీకి వివరించారు.

‘‘పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న కిరిబాటి దీవి రాజధాని తరవా. అదే ఫసిపిక్‌ మహాసముద్రం సరిహద్దున ఉన్న అమెరికా దేశంలోని హవాయి దీవి రాజధాని హోనోలులు. రాకేశ్ అనే యాత్రికుడు ఈ హోనోలులు నుంచి తరవాకు ప్రయాణం అయ్యాడు. హోనోలులో విమానం గాల్లో ఎగిరే సమయానికి సోమవారం ఉదయం ఆరు గంటలు. విమానం బయల్దేరిన గంటకు విమానంలో టిఫిన్ పెట్టారు. తన డైరీలో, సోమవారం పొద్దున్న ఏడు గంటలకు టిఫిన్ తిన్నాను అని రాసుకున్నాడు. టిఫిన్ తిన్న ఐదు గంటల తరువాత భోజనం పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేశాను అని రాసుకున్నాడు. తన వాచీలో సాయంత్రం ఏడు గంటలు అవుతున్నప్పుడు తరవాలో విమానం దిగాడు. రాత్రి 9 కల్లా హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేయవచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే తన వాచీలో రాత్రి 9 గంటలు అయ్యేసరికి హోటల్‌కు చేరుకున్నాడు. మరో రెండు గంటల తరువాత డిన్నర్‌కు వెళ్లాడు. ఆ వెంటనే డైరీలో మంగళవారం రాత్రి డిన్నర్ చేశాను అని రాసుకున్నాడు.’’

‘‘రాకేశ్ సోమవారం డిన్నర్, మంగళవారం బ్రేక్‌ఫాస్ట్, మంగళవారం లంచ్ ఎందుకు మిస్ అయ్యాడు? సోమవారం లంచ్ చేశాక నేరుగా మంగళవారం డిన్నర్ చేసాడు. మరి అతనికి ఆకలి వేయలేదా?’’ ఇదీ ప్రశ్న..

ఓపెన్ బుక్ ప్రశ్నలు ఎంతలా ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయో వివరించారు అమర్నాథ్.

‘‘ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకం చూసి రాయవచ్చు. పుస్తకాలు చూసి రాయడం అంటే కాపీ కొట్టడం అని చాలా మంది అనుకొంటారు. పుస్తకాలు చూసి పై ప్రశ్నకు సమాధానం రాయండి. లేదా హైస్కూల్‌లో ఉన్న మీ పిల్లలని రాయమనండి. అప్పుడు మీకు విషయం అర్థం అవుతుంది. బట్టీ కొట్టి రాయడం సులువు. పుస్తకం చూసి నేరుగా ఉన్న ప్రశ్నకు సమాధానం కాపీ కొట్టడం సులువు.

కానీ, విశ్లేషణాత్మకంగా ఉన్న ప్రశ్నలకు పుస్తకాలు చూసి రాయడం కష్టం. దానికోసం పుస్తకాన్ని అంతకు ముందు అనేక సార్లు చదివి ఉండాలి. కాన్సెప్ట్ బాగా అర్థమై ఉండాలి. దీన్నే ఇంగ్లీషులో CONCEPTUAL CLARITY అంటారు. పరీక్ష పత్రంలో ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అప్పుడు దానికి తగిన సమాధానం రాయగలుగుతారు’’ అంటూ ఆ విధానం గురించి వివరించారు.

తమ పాఠశాల విద్యార్థులను కూడా ఈ పద్ధతిలో ఆలోచించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఇప్పుడు ఈ రకమైన నైపుణ్యం అవసరం గురించి కూడా అమర్నాథ్ వివరించారు.

‘‘కృత్రిమ మేధ యుగం వచ్చేసింది. గూగుల్, యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి వాటిల్లో అపారమైన సమాచారం దొరుకుతోంది. సమాచారాన్ని బుర్రలో నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. కావాల్సిందల్లా ఆ సమాచారం నిజమా కాదా అని తెలుసుకోగలిగే క్రిటికల్ థింకింగ్. సమాచారాన్ని ఆకళింపు చేసుకొని విశ్లేషించి అవసరాలకు తగ్గట్టు వాడుకోగలగడం.

అంటే అందుకోసం కాంప్రెహెన్షన్ ఎనాలిసిస్ అప్లికేషన్ స్కిల్స్, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుక్కునే శక్తి (COMPLEX PROBLEM SOLVING SKILLS), సమస్యకు భిన్న కోణాల నుండి పరిష్కారం వెతకగలిగే శక్తి (LATERAL THINKING) కావాలి. ఈ నైపుణ్యాలే వ్యక్తిగతంగా నాకు భిన్న అంశాలపై అవగాహన పెంచుకోవడానికీ, పంచుకోవడానికీ ఉపయోగపడ్డాయి’’ అని చెప్పారు అమర్నాథ్.

ఈ ఓపెన్ బుక్ విధానం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నప్పటికీ, అదే ప్రధాన పరీక్ష విధానంగా లేదు. ఈ విధానం ఒక్కో దేశంలో ఒక్కో రకంగా అమలవుతోంది.

ఇంకా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా కొన్ని ప్రైవేటు స్కూళ్లు అంతర్గత పరీక్షల కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విద్యా రంగ పరిస్థితుల్లో ఇది ఎంత వరకూ ఉపయోగపడుతుంది అన్నది కీలకం.

ప్రస్తుత విద్యా వ్యవస్థ పాఠాలు చెప్పడం అనే పద్ధతి దాటి, పరీక్షకు సన్నద్ధం అవ్వడమనే పద్ధతిలో ప్రశ్నలు – సమాధానాల చుట్టూ తిరుగుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ బుక్ అనే ఆదర్శ పరీక్ష వ్యవస్థ అమలు చేయాలంటే దానికి ముందుగా చాలా సన్నద్ధత కావాలి అంటున్నారు విద్యా రంగంలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వ్యక్తులు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఓపెన్ బుక్ పరీక్షలు గొప్ప పద్ధతే అనుమానం లేదు. దానికి చాలా సృజనాత్మకత రావాలి. పుస్తకాలతో విస్తారమైన పరిచయం లేకుండా రాయలేరు. ఎందుకంటే ఓపెన్ బుక్ పరీక్షలు వైడ్ రేంజులో ఉంటాయి. పుస్తకం ఆమూలాగ్రం చదివేసి పరీక్ష రాసేలా ఉండదు. ఆ సబ్జెక్టుకు సంబంధించి అనేక పుస్తకాలతో సంబంధం ఉండేలా విస్తృత ప్రశ్నలు అడుగుతారు’’ అని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేశ్ పట్నాయక్ చెప్పారు

‘‘బుక్ రీడింగ్, ఇంటర్నల్ డిబేట్.. ఈ రెండూ బాగా అలవాటు ఉంటేనే ఈ విధానం పనికొస్తుంది. అయితే మరి మన విద్యా వ్యవస్థ అందుకు సిద్ధంగా ఉందా?’’ అని ప్రశ్నించారు రమేశ్ పట్నాయక్.

‘‘ఓపెన్ బుక్ పరీక్ష గొప్పది అనుకుంటే, దాని కంటే ముందు ఇంకో స్టేజ్ ఉంది. మన వ్యవస్థ ఇంకా ఆ స్టేజీకి కూడా వెళ్లలేదు. మన దగ్గర కమర్షియల్ పాఠశాలల వల్ల విద్య ఒక ప్యాకేజీలా అయింది. అంటే పాఠాలు చెప్పడం, అర్థం చేసుకోవడం లేదిప్పుడు. తరగతి గదిలో పూర్వంలాగా పాఠాలు చెప్పడం లేదు. కేవలం ప్రశ్న – జవాబులే చెప్తున్నారు. ఈ ప్రశ్నకు ఈ జవాబు రాస్తే.. పదికి పది మార్కులు వస్తాయి అనేదే ఇప్పుడు బోధిస్తున్నారు. అంటే మొత్తం సిలబస్‌ను, సబ్జెక్టును ప్యాకేజీలుగా విడగొట్టి మార్కుల లక్ష్యంగా చదివిస్తున్నారు’’ అని పట్నాయక్ అన్నారు.

‘‘ఈ వ్యవస్థలో ఓపెన్ బుక్ పెట్టలేరు. అసలు ఓపెన్ బుక్ తేవాలి అంటే ముందుగా తరగతి గదిలో మార్కుల కోసం ప్యాకేజీల్లాగా ప్రశ్న – జవాబు చెప్పకుండా, పాఠాలు చెప్పడం, చెప్పిన పాఠంలో అనుమానాలు తీర్చి, ఆ పాఠం అర్థమయ్యేలా చేయడం ముఖ్యం. దాని తరువాత దశ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఈ ఓపెన్ బుక్ వస్తుంది’’ అని చెప్పారు.

‘‘వ్యాపారం చేసే పాఠశాలలకు పిల్లలను ఆకర్షించడానికి యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ కోసం ర్యాంకులు కావాలి. ర్యాంకుల కోసం మార్కులు రావాలి. అటువంటి కమర్షియల్ వ్యవస్థలో ఓపెన్ బుక్ పరీక్ష పనికిరాదు. ఇక ప్రస్తుతం ఉన్న టీచింగ్ విధానంలో సృజనాత్మకత లేదు. పాఠం వెనుక విశ్లేషణాత్మక విధానం లేదు. ఓపెన్ బుక్ విధానంలో పాఠాన్ని దాటి విశ్లేషణ ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

స్కూల్ విద్యార్థిని

ఫొటో సోర్స్, Getty Images

ఓపెన్ బుక్ విధానంలో భారతీయ విద్యా వ్యవస్థలో ఈ సమస్యలు వస్తాయి

  • ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు ఉండరు. అక్కడ పాఠాలు చెప్పేవారే లేనప్పుడు ఇక ఓపెన్ బుక్ అక్కడ సక్సెస్ కాదు.
  • కమర్షియల్ స్కూల్స్ వాళ్లు కేవలం మార్కులు – ర్యాంకుల మోడల్‌లో పనిచేస్తారు. ఓపెన్ బుక్ ప్రకారం వీళ్లు పనిచేయడం కష్టం. ఒకవేళ అలా చేస్తే అది ప్రత్యక్షంగా వారి వ్యాపారం మీద ప్రభావం పడుతుంది.
  • చాలా అత్యున్నత ప్రమాణాలు పాటించే నూటికి ఒక్క శాతం స్కూళ్లు మాత్రమే దీన్ని పక్కాగా అమలు చేస్తాయి. అప్పుడు ఆ ఒక్క శాతం స్కూళ్లలో చదివే వారు గొప్పవారుగా, మిగతా వాళ్లు పనికిరాని వారుగా మిగిలిపోతారు.

దేశమంతా ఈ వ్యవస్థ రావాలి అంటే ముందు ఈ తేడాలను అధిగమించాలి అంటారు పట్నాయక్. కింది స్థాయి నుంచీ వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ వెళ్తే ఈ పద్ధతి తేవచ్చు అన్నది నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)