లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?

గయానా

ఫొటో సోర్స్, LEANDRO PRAZERES / BBC NEWS BRASIL

ఫొటో క్యాప్షన్, గయానాలో ఖరీదైన షాపింగ్ మాల్స్ ఇప్పుడిప్పుడే వెలుస్తున్నాయి.
    • రచయిత, లియాండ్రో ప్రజెరెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1982లో గయానా నుంచి కెనడా వెళ్లే సమయానికి శివ్ మిసిర్ వయసు 19 ఏళ్లు కాగా, హేమంత్‌ మిసిర్ వయసు 16 సంవత్సరాలు.

ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటైన గయానాను వదిలి మెరుగైన జీవితం కోసం వారిద్దరూ కెనడాకు వెళ్లారు. అప్పటికే ఆ దేశానికి చెందిన వేల మంది యువకులు అదే బాటలో ఉన్నారు.

వారిలో చాలా మంది ఉత్తర అమెరికా చేరుకుని రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు.

మళ్లీ 39 ఏళ్ల తర్వాత, 2021లో వాళ్లు తమ ప్రవాసాన్ని వీడి స్వదేశం బాట పట్టారు.

ఇటీవలి కాలంలో గయానా ఆర్థిక వ్యవస్థ బిలియన్ల పెట్రో డాలర్లను సృష్టిస్తుండటంతో ఈ అన్నదమ్ములు మళ్లీ ఇక్కడికి రావాలని కోరుకున్నారు.

గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లో ఖరీదైన ఆస్తులను అద్దెకివ్వడం, కొనుగోళ్లు, అమ్మకాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు.

దేశంలో చమురు నిక్షేపాల అన్వేషణ మొదలైన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ దేశపు మధ్య తరగతి వర్గానికి శివ్, హేమంత్‌ మిసిర్‌ ప్రతినిధులు.

గయానా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది.

చమురు నిక్షేపాల అన్వేషణ కారణంగా 2019 నుంచి అది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారిపోయింది.

గయానా

ఫొటో సోర్స్, LEANDRO PRAZERES / BBC NEWS BRASIL

ఫొటో క్యాప్షన్, శివ్ మిసిర్‌లాంటి అనేక మంది తిరిగి వారి దేశానికి వస్తున్నారు.

నయా దుబాయ్

దక్షిణ అమెరికాలోని సురినామ్, వెనెజ్వేలా మధ్య ఉన్న ఒక చిన్న దేశమే గయానా.

ఇక్కడ కేవలం 8 లక్షల మంది జనాభా ఉంటారు. మొదట డచ్‌ కాలనీ అయిన ఈ దేశంలో ఎక్కువగా చెరకు పండేది.

1966లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర దేశంగా మారింది.

2015లో అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్ మొబిల్ ఆ దేశ తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది.

ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్, అమెరికన్ హెస్, చైనాకు చెందిన సీఎన్‌‌‌వోవోసీ సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్షార్షియం గయానా తీరంలో 200 కిలోమీటర్లకు పైగా పరిధిలో చమురు బావులను తవ్వింది.

ఇక్కడ సుమారు 11 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు ఇంతకుముందు గుర్తించారు. ఈ నిల్వలు 17 బిలియన్ బారెళ్ల వరకు ఉండొచ్చని ఇటీవలి అంచనాలు చెబుతున్నాయి.

బ్రెజిల్‌ మొత్తం చమురు నిల్వలు సుమారు 14 బిలియన్ బారెళ్లు కాగా, గయానా నిల్వలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.

2019 వరకు గయానా ప్రజలకు వ్యవసాయం, బంగారం, వజ్రాల మైనింగ్, అటవీ ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరు.

గయానా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత గయానా రూపురేఖలు మారిపోయాయి.

‘ఒక దేశం లాటరీని గెలుచుకున్నట్లు ఉంది’

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా ప్రకారం 2019-2023 మధ్య ఆ దేశ జీడీపీ 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అంటే 184% పెరిగింది.

2022లోనే జీడీపీ 62%గా నమోదైంది.

“ఆ దేశానికి లాటరీ తగిలినట్లే ఉంది. ఇది జీవితంలో చాలా అరుదుగా వచ్చే అవకాశం” అని గయానా, సురినామ్‌లకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధిగా పని చేస్తున్న డిలెట్టా డోరెట్టి బీబీసీతో అన్నారు.

చమురు ఉత్పత్తి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయి. రాజధాని జార్జ్‌టౌన్‌లాంటి నగరాలలో ఈ అభివృద్ధి తాలూకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆసుపత్రులు, హైవేలు, వంతెనలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. అమెరికాకు చెందిన మారియట్, బెస్ట్ వెస్ట్రన్ వంటి ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్ చైన్‌లు కూడా ఇక్కడ హోటళ్లను నిర్మిస్తున్నాయి.

గయానా

ఫొటో సోర్స్, LEANDRO PRAZERES / BBC NEWS BRASIL

ఫొటో క్యాప్షన్, గయానాలో రోడ్లపక్కన ఇలాంటి భారీ నిర్మాణాలు కనిపిస్తున్నాయి.

కొత్త మధ్యతరగతి

ఈ ఆర్థిక వృద్ధి కారణంగానే శివ్, హేమంత్ వంటి వాళ్లు శాశ్వతంగా కాకపోయినప్పటికీ గయానాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

2021 నుంచి వారిద్దరూ తమ కొత్త వ్యాపారాన్ని మేనేజ్ చేసుకోవడానికి తరచూ టొరంటో (కెనడా), జార్జ్‌టౌన్ మధ్య ప్రయాణాలు చేస్తున్నారు.

చమురు ద్వారా వచ్చే డబ్బు అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతిని, దేశంలోని ప్రస్తుత ఉన్నత వర్గాలకు కొత్త అవకాశాలను సృష్టించిందని వారు వివరిస్తున్నారు.

“ప్రజలు ఇప్పుడు చాలా భద్రంగా ఉన్నారు. ఈ ప్రగతిలో తామూ భాగమని భావిస్తున్నారు.” అని శివ్ మిసిర్ చెప్పారు.

‘‘గయానాలో చాలా మంది ధనవంతులు రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. లేదంటే ఆయిల్ బిజినెస్ చైన్‌లలో పని చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.

అమెరికా, కెనడాలలో నివసిస్తున్న అనేక మంది గయానీలు తనకు తెలుసని, తమ దేశంలో చమురు ఉత్పత్తి మొదలైన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.

"చాలామంది గయానీస్ తిరిగి వస్తున్నారు. అత్యాధునిక గృహాలు, ప్రైవేట్ సెక్యూరిటీలాంటి అనేక సౌకర్యాలు ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. వాళ్లు చాలా మంది తమ జీవితంలో ఎక్కువ భాగం అమెరికా, కెనడాలలో గడిపారు" అని ఆయన చెప్పారు.

దేశంలో కొనుగోలు శక్తి పెరిగిందని, కానీ తమ దేశంలో మోడ్రన్ షాపింగ్ మాల్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పారు.

గయాన

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గయానాలో కొత్త మధ్య తరగతి వర్గం పుట్టుకొస్తోందని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా, యూకే, యూరప్‌లలో విద్యాభ్యాసం

డచ్, బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న గయానాకు అమెరికాతో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి విమానంలో నాలుగు గంటల ప్రయాణం చేస్తే అమెరికా చేరుకోవచ్చు.

గయానాలో చాలా మంది ధనికులు చదువుకోవడానికి తమ పిల్లలను అమెరికా, యూకే, కెనడా, యూరప్‌లకు పంపిస్తుంటారు.

శివ్, హేమంత్‌లు 2019లో స్థాపించిన రియల్ ఎస్టేట్ కంపెనీ జార్జ్ టౌన్‌లో వ్యాపార కలాపాలు ప్రారంభించింది. అదే సంవత్సరం ఆ దేశంలో చమురు నిల్వలు బయటపడ్డాయి.

చెరకు, వరి పండే ప్రాంతాలు ఒకప్పుడు ఈ దేశానికి ముఖ్యమైన సంపద వనరులు. కానీ, ఇప్పుడు జార్జ్‌టౌన్ శివారులో విలాసవంతమైన గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి.

మారియట్, స్టార్‌బక్స్‌లాంటి ఫ్రాంచైజీలు పుట్టుకొచ్చాయి.

ఏప్రిల్ 2023లో ప్రారంభమైన స్టార్‌బక్స్‌లో 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ‘‘దేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన మార్కెట్’’ అని బీబీసీతో అన్నారు స్టార్‌బక్స్ ప్రతినిధి.

గయానా

ఫొటో సోర్స్, LEANDRO PRAZERES / BBC NEWS BRASIL

ఫొటో క్యాప్షన్, గయానాలో ఖరీదైన హౌసింగ్ ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి.

జనాభాలో 39.8% మందికి భారతీయ మూలాలు

17, 19 శతాబ్దాల మధ్య చక్కెరను ఉత్పత్తి చేయడానికి ఆఫ్రికన్ బానిసలను ఉపయోగించుకున్న యూరోపియన్లు గయానా దేశాన్ని తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు.

1833లో బానిసత్వం రద్దు కావడంతో అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియా నుంచి ముఖ్యంగా భారత్, చైనా, పోర్చుగీస్ దేశాల నుంచి గయానాకు వలస కూలీలను తీసుకొచ్చింది.

ప్రస్తుత జనాభాలో 39.8% మందికి భారతీయ మూలాలు ఉన్నాయి. 30% మంది ఆఫ్రికన్ సంతతి, 10.5% మంది స్థానికులు, 0.5% మంది ఇతర మూలాలున్నవారు ఉన్నారు.

ప్రపంచ బ్యాంకు ఇటీవల సేకరించిన డేటా ప్రకారం, దక్షిణ అమెరికాలో ప్రజల మధ్య అత్యంత అసమానతలు ఉన్న దేశాలలో గయానా, సురినామ్‌ ముందున్నాయి.

భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త రిచర్డ్ సింగ్ జార్జ్‌టౌన్‌లో వాడిన ఇంపోర్టెడ్ కార్ల బిజినెస్ చేస్తున్నారు.

సిటీ సెంటర్‌లో ఉన్న ఆయన షోరూమ్‌లో 20కి పైగా విదేశీ కార్లున్నాయి. ఆయనకు చిన్నప్పటి నుంచి కార్లు, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం.

రిచర్డ్ సింగ్ ఎక్కువగా జపాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముతుంటారు. జపాన్‌లాగే గయానాలో కూడా కార్లకు కుడి వైపు స్టీరింగ్ ఉంటుంది.

చమురు కారణంగా ఆదాయం పెరిగినప్పటికీ అనేక మంది ధనవంతులు ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్లు కొనడానికి ఇష్టపడతారని చెప్పారు.

ఎందుకంటే కొత్త కార్లకు ఇక్కడ పన్నులు ఎక్కువగా ఉంటాయి. పైగా, విడిభాగాలు ఎక్కువగా దొరకవు. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ ఉంటుంది.

జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న బీఎండబ్ల్యూ కార్లు ఆయన షోరూమ్‌లో కనిపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు గుర్తించినప్పటి నుంచి తమ దేశపు కస్టమర్ల వైఖరిలో మార్పు కనిపించిందని అన్నారు.

‘‘మా షోరూమ్‌కు ఇప్పుడు కేవలం పెద్ద పెద్ద వ్యాపారులు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది వస్తున్నారు’’ అన్నారు రిచర్డ్ సింగ్.

చమురు, గ్యాస్ పరిశ్రమకు చెందిన అనేక మంది విదేశీయులు కూడా తమ దేశానికి వస్తుండంటో వారి కోసం ప్రత్యేకంగా కార్లు ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది స్థానిక యంత్రాంగం.

గయనాలో ధనవంతుల లైఫ్ స్టైల్ మీద అవగాహన ఉన్న రిచర్డ్ సింగ్, దేశంలో కొత్త మధ్య తరగతి వర్గం పుట్టుకొస్తోందని చెప్పారు.

గతంలో ఫార్ములా వన్ రేసులు చూడటానికి తాను మయామీ వెళ్లేవాడినని, అయితే తమ దేశం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని ఆయన అన్నారు.

‘‘గయానా ఆర్థికంగా ఇంకా అనేక కొత్త శిఖరాలకు చేరుకుంటుందని నేను అనుకుంటున్నా’’ అన్నారు రిచర్డ్ సింగ్. తమ దేశాన్ని దుబాయ్‌తో పోల్చడంలో ఏ మాత్రం తప్పులేదని ఆయన అన్నారు.

‘‘నేను దుబాయ్ గురించి చాలా విన్నాను. 90లలో అది ఒక ఎడారి భూమి. ఇప్పుడు మీరు గుర్తు పట్టలేరు’’ అన్నారు రిచర్డ్ సింగ్.

‘‘ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే, ఇది గయానా అంటే మీరు నమ్మలేరు. అది మా ఆశయం. అది జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)