ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
హిమాలయాల దిగువన సుందరంగా ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మీ సహజీవన భాగస్వామితో కలిసి ఉండాలంటే, ముందుగా అధికారులకు సహచారం అందించడంతో పాటు, సహజీవనాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది.
మతం, లింగం, లైంగికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం, 'యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)'లోని ఈ కీలక నిబంధన అందరి దృష్టినీ ఆకర్షించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ కూడా ఒకటి. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది.
పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి జీవించడాన్ని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇబ్బందికరంగానే చూస్తారు. ఇలాంటి సంబంధాలను ''లివ్-ఇన్'' బంధంగా వ్యవహరిస్తారు.
చట్టంలో ప్రతిపాదించిన దాని ప్రకారం, ఒక పురుషుడు, స్త్రీ సహజీవనంలో ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా 'లివ్ ఇన్ రిలేషన్‌షిప్'లో ఉన్నట్లు రిజిస్ట్రార్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయన 30 రోజులలోపు విచారణ నిర్వహిస్తారు. ఈ విచారణలో భాగంగా అవసరమైతే అదనపు సమాచారం, లేదా ఏదైనా సాక్ష్యాలు అడిగితే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, సహజీవనం చేస్తున్న జంట గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. ఒకవేళ పార్టనర్ వయసు 21 ఏళ్లలోపు ఉంటే వారి తల్లిదండ్రులకు విషయం తెలియజేస్తారు.
విచారణలో అధికారి సంతృప్తి చెందితే, రిజిస్టర్‌లో వారి సహజీవన సంబంధాన్ని నమోదు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. లేదంటే తిరస్కరణకు గల కారణాలను ఆ జంటకు తెలియజేస్తారు. జంటలో ఒకరు అప్పటికే వివాహితులైనా, లేదా మైనర్ అయినా, బలవంతంగా లేదా మోసపూరితంగా సహజీవనం ఏర్పరచుకున్నట్లు భావిస్తే సదరు అధికారి రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
భాగస్వామితో విడిపోవాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ అధికారికి విషయాన్ని అధికారికంగా తెలియజేసి, తమ భాగస్వామికి విడిపోతున్నట్లు ఒక కాపీని అందజేసి ఆ సహజీవన బంధాన్ని ముగించొచ్చు. అనంతరం ఈ సంబంధం రద్దు గురించి కూడా పోలీసులకు సమాచారం అందిస్తారు.
ఒకవేళ సహజీవనం చేస్తున్న జంటలు రిజిస్ట్రార్‌కి తమ సంబంధం గురించి సమాచారం ఇవ్వకపోతే, ఆ విషయం ఫిర్యాదు ద్వారానో, లేక ఇతర మార్గాల ద్వారానో తెలిస్తే వారికి నోటీసులు జారీ చేస్తారు. 30 రోజుల్లోపు ఆ జంట ఆ నోటీసులకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
ఒకవేళ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నెల రోజుల కంటే ఎక్కువగా సహజీవనంలో ఉంటే శిక్షార్హులు అవుతారు. అందుకు మూడు నెలల వరకూ జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ఇచ్చినా, లేదా వివరాలను దాచిపెట్టినా మూడు నెలల జైలు శిక్ష, 25 వేల రూపాయల వరకూ జరిమానా, లేదంటే రెండూ విధించొచ్చు.
అయితే, ఈ చట్టంపై న్యాయ నిపుణులు విమర్శలు చేస్తున్నారు.
''వ్యక్తిగత గోప్యత వ్యక్తి ప్రాథమిక హక్కు అని కొన్నేళ్ల కిందట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరు మేజర్ల సహజీవన సంబంధాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. జంట తమ సంబంధాన్ని తెలియజేసి, అధికారికంగా నమోదు చేసుకోకపోతే శిక్షార్హులు కావడమనే ఈ నిబంధన మరీ అధ్వానం. ఇది అసంబద్ధమైన నిబంధన, దీన్ని కొట్టేయాలి'' అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ అన్నారు.
లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు ప్రస్తుతం 2005 గృహ హింస చట్టాల కిందకు వస్తాయి. ఈ చట్టాల ప్రకారం, వైవాహిక సంబంధంలోని ఇతర విషయాల మాదిరిగా, ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కలిసి జీవించడాన్ని 'డొమెస్టిక్ రిలేషన్‌షిప్'గా నిర్వచించారు.
నిజానికి, దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో పెళ్లి కాని జంటలు సహజీవనం చేయడమనేది అసాధారణ విషయమేమీ కాదు. ఎందుకంటే,
ఉపాధి, ఉద్యోగాల కోసం యువతీ యువకులు వేరే ప్రాంతాలకు వెళ్లడం, సంప్రదాయ వివాహ వ్యవస్థతో విభేదించడం వంటి కారణాలతో సహజీవనం సాధారణమైపోయింది. (2018లో 1,60,000 కుటుంబాలపై నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 93 శాతం వివాహాలు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కాగా, కేవలం 3 శాతం ప్రేమ వివాహాలు.) అయితే, అప్పుడప్పుడూ నిర్వహించే సర్వేల్లో మాత్రం ఫలితాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2018 మే నెలలో ఇన్‌షార్ట్స్ 1,40,000 మంది నెటిజన్ల నుంచి పోల్ ద్వారా సర్వే నిర్వహించింది. అందులో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు వారిలో దాదాపు 80 శాతం మంది సహజీవనాన్ని భారత్‌లో నిషిద్ధంగా భావించారు. సహజీవనం, లేదా వివాహం గురించి అడిగినప్పుడు 47 శాతం మంది వివాహానికి మొగ్గుచూపారు. 2023లో లయన్స్‌గేట్ ప్లే వెయ్యి మందిపై నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, తమ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కలిసి జీవించడం ముఖ్యమని భారత్‌లోని ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.
సహజీవనంపై కొన్నిసార్లు భారత న్యాయస్థానాలు కూడా పెదవి విరిచాయి. 2012లో ఒక కేసులో దిల్లీ కోర్టు సహజీవన సబంధాలను 'అనైతికం'గా పరిగణించడంతో పాటు, అది పాశ్చాత్య పోకడగా అభివర్ణిస్తూ కేసు కొట్టివేసింది. అది కేవలం 'నగరాల్లో పెరుగుతున్న వ్యామోహం'గా పేర్కొంది.
అయితే, సుప్రీం కోర్టు సహజీవనానికి మద్దతునిచ్చింది. సమాజ సభ్యతకు విఘాతం కలిగిస్తున్నారంటూ నటి ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో, పెళ్లి కాని జంటలు కలిసి జీవించే హక్కును సుప్రీం కోర్టు 2010లో ఆమోదించింది.
దేశంలో సామాజికంగా ఆమోదయోగ్యం కాకపోయినప్పటికీ సహజీవనం నేరం లేదా పాపం కాదని చెబుతూ, సహజీవనంలో ఉన్న మహిళలు, వారి పిల్లలను రక్షణ కల్పించేలా చట్టాలను రూపొందించాలని 2013లో సుప్రీం కోర్టు పార్లమెంటును కోరింది. (ఉత్తరాఖండ్ ప్రతిపాదించిన వివాదాస్పద చట్టంలో, సహజీవనం నుంచి బయటికొచ్చిన మహిళ తన భాగస్వామి నుంచి భరణం పొందవచ్చు. అలాగే, సహజీవనంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలను చట్టబద్ధమైన సంతానంగా పరిగణిస్తారు.)
ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన చట్టం సహజీవనం చేస్తున్న జంటలను దూరం చేయడంతో పాటు వారిపై ఫిర్యాదులు చేసే వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని, అలాంటి జంటలకు ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు యజమానులు వెనకాడేలా చేస్తుందని చాలా మంది భయపడుతున్నారు.
2011 నుంచి జనగణన చేయని ఈ దేశంలో సహజీవనం చేస్తున్న జంటలను లెక్కించడం, లేదా వారి వివరాలు నమోదు చేయడమనే ఆలోచన విచిత్రంగా అనిపిస్తోందని వారు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రేకప్ మంచిది కాదు, కానీ అది మీకు మంచే చేస్తుందంటున్న నిపుణులు, ఎలా?
- స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలివే...
- వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?
- విడాకులు తీసుకోవడం ఎలా? ఏయే కారణాలతో అడగొచ్చు?
- మేడ్ ఇన్ హెవెన్: అట్టహాసంగా జరిగే వివాహ వేడుకల వెనుక దాగిన చేదు నిజాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














