నెల్లూరు కోర్టులో దొంగలు పడిన కేసులో సీబీఐ ఏం తేల్చింది... మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పైళ్లు మాత్రమే ఎలా చోరీకి గురయ్యాయనే ప్రశ్నకు బదులేది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో రెండేళ్ళ కిందట ఓ దొంగతనం జరిగింది. దొంగలంటే డబ్బు కోసం ఇళ్ళల్లోనో, బ్యాంకుల్లోనే చొరబడతారు. లేదంటే ఏటీఎంల మీద పడుతుంటారు.
కానీ, ఈ దొంగతనం కోర్టులో జరిగింది. దొంగలకు కోర్టులో ఏం దొరుకుతుందని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ దొంగలు అక్కడ ఏమీ తీసుకుపోలేదు. ఒక కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే కొట్టేశారు.
దాంతో, రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు ఆ పైళ్ల మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించింది.
ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ తాజాగా ఓ ఛార్జిషీటు తయారు చేసి కోర్టుకు సమర్ఫించింది. సీబీఐ కూడా ఆ డాక్యుమెంట్స్ పోవడమన్నది దొంగతనంలో భాగంగానే జరిగిందని తెలిపింది.
కానీ, కోర్టులో అనేక పత్రాలు ఉండగా, కేవలం వైసీపీ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నిందితుడుగా ఉన్న ఫోర్జరీ కేసుకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే ఎలా దొంగతనానికి గురవుతాయన్న ప్రశ్నను సీబీఐ కూడా ప్రస్తావించలేదు.
దీంతో సీబీఐ విచారణ తీరు చర్చనీయాంశంగా మారింది. కాకాణి గోవర్థన్ రెడ్డి పాత్రకు సంబంధించిన ఆధారాలు లేవని సీబీఐ చెప్పవచ్చేమో గానీ, మంత్రికి సంబంధించిన పత్రాలనే ఓ ఇద్దరు దొంగలు ఎలా అపహరిస్తారన్న దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ తన అభియోగపత్రంలో పేర్కొనడంతో, ఆయన తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు. ముందు నుంచీ తన పాత్ర ఏమీ లేదనే చెబుతూ వచ్చానని, ఇప్పుడే అదే నిజమని తేలిందని ప్రకటించారు.

ఫొటో సోర్స్, UGC
అసలేం జరిగింది?
నెల్లూరులో నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 2022 ఏప్రిల్ 13న దొంగతనం జరిగింది. ఓ రాత్రి పూట కోర్టు హాల్ నుంచి కొన్ని పత్రాలు మాయమయ్యాయి. అందులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధించిన కేసులో పిటిషనర్లు సమర్పించిన ఆధారాలున్నాయి.
గతంలో కాకాణి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. కాకాణి ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ సోమిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన కీలక పత్రాలు కోర్టుకు సమర్పించారు. ఆ పత్రాలు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.
ఆ పత్రాలను భద్రపరిచిన బీరువా తాళాలను నాటి బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు మరిచిపోవడం, అందులో ఆ పత్రాలు మాత్రమే దొంగతనానికి గురికావడం పలువురిని విస్మయానికి గురి చేసింది.
ఆ కోర్టు ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన 17 కోర్టులున్నాయి. దొంగతనం జరిగిన కోర్టు హాలులో మొత్తం 11 బీరువాలున్నాయి. తాళం వేయకుండా మరచిపోయినట్లుగా చెబుతున్న అల్మరాలో కూడా వివిధ కేసులకు సంబంధించిన ఫైళ్లున్నాయి. అయినప్పటికీ, కేవలం కోర్టు సముదాయంలోని ఆ హాల్‌లోకి వెళ్లిన దొంగలు, తాళం వేయని ఆ బీరువా నుంచి ఆ ఒక్క ఫైల్ మాత్రమే దొంగతనం చేయడం అనుమానాలను రేకెత్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుమోటోగా తీసుకున్న హైకోర్టు...
తొలుత ఈ కేసుని నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేశారు. దొంగతనం జరిగినట్టుగా నిర్ధారించారు. దానికి బాధ్యులుగా సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ అని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న ఈ ఇద్దరు దొంగలు కోర్టులో దొంగతనానికి వెళ్లి, సదరు పత్రాలను అపసంహరించారని చెప్పారు.
కోర్టు ప్రాంగణంలో ఉన్న ఇనుము దొంగతనం కోసం వచ్చిన దొంగలను చూసి కుక్కలు మొరగడం, వారు ఆ భవనం మొదటి అంతస్తులోకి వెళ్లి, గది తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఫైల్స్ దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే, నెల్లూరు పోలీసుల దర్యాప్తు తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసుల విచారణలో కనీసం వేలిముద్రలు కూడా సరిగా సేకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించి నిందితుల ఆనవాళ్లు పట్టుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుబట్టింది.
2022 నవంబర్ 25న ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. సమగ్ర దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీ డైరెక్టర్ సైతం ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీబీఐ అధికారులు విచారణ సాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐ చార్జ్‌షీట్‌లో ఏముంది?
సుమారు 14 నెలల పాటు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపింది. మొత్తం 88 మందిని విచారించింది. కోర్టు సిబ్బంది, స్థానిక పోలీసులు, పిటిషనర్‌తో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సహా అనేక మంది నుంచి వివరాలు సేకరించిన తరువాత దర్యాప్తు నివేదికను కోర్టు ముందుంచింది.
సీబీై చార్జ్ షీట్ ప్రకారం సయ్యద్ , రసూల్ అనే వారు చిల్లర దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆయన సన్నిహితులు, పీఏల కాల్ డేటా రికార్డులను పరిశీలించగా నిందితులతో వారు మాట్లాడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ కేసులో కాకాణికి సంబంధించిన ఫైల్స్ దొంగతనం జరిగినప్పటికీ, వాటిని కోర్టు బయటే పడేశారని వివరించింది. కాబట్టి మంత్రి కాకాణి మీద వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చేసింది.
జైలులో ఉన్న నిందితులను కూడా వారి బంధువులు మినహా కాకాణి మనుషులు ఎవరూ కలిసిన దాఖలాలు లేవని కూడా చెప్పింది. కోర్టులో బీరువా తాళాలు మరచిపోయిన నాగేశ్వర రావుది కూడా తప్పులేదని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది.
దాంతో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. తన మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. తనను నిందించిన వారు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

ఫొటో సోర్స్, UGC
రివ్యూ పిటిషన్ పరిశీలిస్తాం: సోమిరెడ్డి
సీబీఐ దర్యాప్తు తీరును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో ఏపీ పోలీసులు చెప్పిన అంశాలను మాత్రమే సీబీఐ పునరావృతం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
"సీబీఐ దర్యాప్తు తీరు సంతృప్తిగా సాగలేదు. అనేక ఆధారాలు సమర్పించినా లోతుగా విశ్లేషించలేదు. చిల్లర దొంగలతో మంత్రి ఫోన్ నుంచి సంభాషణలు జరగలేదని సీబీఐ చెప్పడం విడ్డూరంగా ఉంది. చిల్లర దొంగతనాలు చేసుకునే ఆ దొంగలే ల్యాప్ ట్యాప్‌లో ఉన్న డేటాను కూడా తొలగించారని సీబీఐ భావిస్తోందా? ప్రస్తుతం ఛార్జిషీట్ మాత్రమే వేశారు. కోర్టు అనుమతిస్తే కేసు క్లోజ్ అవుతుంది. కానీ, ఆ తర్వాత మళ్లీ రివ్యూ పిటీషన్ వేసే అవకాశం ఉంటుంది. దానిని పరిశీలిస్తున్నాం" అని సోమిరెడ్డి బీబీసీతో అన్నారు.
కోర్టుల నుంచి కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ దొంగిలించే పరిస్థితి వచ్చినా, దర్యాప్తు సంస్థలు పైపైన మాత్రమే విచారించడం విడ్డూరంగా ఉందన్నారు సోమిరెడ్డి.
అనేక ప్రశ్నలు: ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు
కోర్టుకు సమర్పించిన ఆధారాలు ఇలా చౌర్యానికి గురి కావడం గతంలో ఎన్నడూ లేదని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
"ఈ ఘటన మీద దర్యాప్తు సమర్థవంతంగా జరగాలి. భవిష్యత్తులో ఎవరూ అలాంటి ప్రయత్నం చేయకుండా తగిన చర్యలుండాలి. ప్రస్తుత దర్యాప్తు సాగిన తీరు అందుకు భిన్నంగా ఉంది. సీబీఐ అంత మందిని విచారించిన తర్వాత కూడా కొత్త విషయాలు ఏమీ కనుక్కోలేదంటే ఆశ్చర్యమే. ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. నిందితులను జైలుకెళ్లి ఎవరూ కలవలేదని, బెయిల్‌కు ష్యూరిటీలు కూడా సమర్పించేందుకు ముందకు రాలేదు కాబట్టి కాకాణికి సంబంధం లేదనే నిర్ధారణకు రావడం ఆశ్చర్యంగా ఉంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన చార్జిషీట్ మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి" అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
న్యాయస్థానాలతో పాటుగా అత్యున్నత దర్యాప్తు సంస్థ గౌరవం పెంచేలా వ్యవహరించడం అవసరమంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం ఎంపీగా స్థానికేతరులే ఎందుకు గెలుస్తున్నారు?
- ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ
- రొమ్ము క్యాన్సర్: బ్రాలో పెట్టుకొనే ఈ సరికొత్త పరికరం వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుంది
- 10 క్యాన్సర్ లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి
- బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














