పార్లమెంట్ భద్రతా వైఫల్యం: పోలీసులు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి హింసిస్తున్నారంటూ కోర్టులో నిందితుల ఫిర్యాదు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఉమాంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోలీసులు తమకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇస్తూ హింసిస్తున్నారని పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఐదుగురు దిల్లీ పటియాలా హౌస్ కోర్టులో బుధవారం ఫిర్యాదు దాఖలు చేశారు. బలవంతంగా 70 ఖాళీ పేపర్లపై పోలీసులు సంతకాలు చేయించారని వారు ఆరోపించారు.
‘‘జాతీయ రాజకీయ పార్టీలతో సంబంధాలున్నట్లు, యూఏపీఏ కింద నేరాలు చేసినట్లు ఒప్పుకునేలా ఖాళీ పేపర్లపై మాతో సంతకాలు చేయించారు’’ అని నిందితులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘‘మాలో ఇద్దరితో రాజకీయ పార్టీ/విపక్ష పార్టీ నేతతో మాకు సంబంధాలున్నాయని ఒప్పుకునేలా బలవంతంగా పేపర్‌పై రాయించారు’’ అని ఒక నిందితుడు చెప్పారు.
పార్లమెంటుపై దాడి జరిగి 22 సంవత్సరాలు పూర్తయిన రోజునే అంటే 2023 డిసెంబర్ 13న మరోసారి పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం జరిగింది. దీనికి పాల్పడిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఐదుగురు నిందితులు- మనోరంజన్ డీ, సాగర్ శర్మ, లలిత్ ఝా, అమోల్ షిండే, మహేశ్ కుమావత్ తరపున తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ఈ ఐదుగురు నిందితుల తరపున కోర్టులో వాదించిన న్యాయవాది అమిత్ శుక్లా మాట్లాడుతూ- ‘‘మేం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోర్టు దృష్టికి ఈ విషయాలను తీసుకురావాలనుకున్నాం. ఎందుకంటే, చార్జ్‌షీటు దాఖలు చేసేటప్పుడు, వీటితో పోలీసులు ఏదో ఒకటి చేస్తారు’’ అని చెప్పారు. తర్వాత బెయిల్ అప్లికేషన్ దాఖలు చేసేటప్పుడు ఈ వాస్తవాలు తమకూ ఉపయోగపడతాయన్నారు.
దీనికి సమాధానమిచ్చేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరినట్లు అమిత్ శుక్లా తెలిపారు. ఫిబ్రవరి 17న వారు తమ సమాధానాన్ని తెలుపనున్నారని చెప్పారు.
‘‘కానీ, కచ్చితంగా ఈ ఆరోపణలను పోలీసులు కొట్టేస్తారని నాకనిపిస్తుంది. ఒకవేళ ఈ ఆరోపణలను వారు అంగీకరించకపోతే, ఈ ఘటనలు జరిగాయా లేదా అన్న దానిపై విచారణ చేయాలి’’ అని అమిత్ శుక్లా డిమాండ్ చేశారు.
తమ ప్రస్తుత సిమ్ కార్డులు, పాత సిమ్ కార్డులు జారీ చేసిన సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలకు తమల్ని తీసుకెళ్లినట్లు నిందితులు చెప్పారు. దీనికి కారణమేంటన్నది కేవలం ప్రాసిక్యూషన్‌కు మాత్రమే తెలుసని చెప్పారు.
తప్పుడు వ్యక్తులతో లేదా ఏదైనా రాజకీయ పార్టీతో తమకు సంబంధాలున్నాయని నిరూపించేందుకు తమ ఫోన్ నంబర్లను ‘ట్యాంపర్’ చేస్తుండొచ్చని ఈ ఐదుగురు నిందితులు భయపడుతున్నారని న్యాయవాది చెప్పారు.
ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల పాస్‌వర్డులను బలవంతంగా తమ వద్ద నుంచి తీసుకున్నారని నిందితులు తమ పిటిషన్‌లో చెప్పారు.
‘‘దిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇది చట్టవిరుద్ధం’’ అని న్యాయవాది అమిత్ శుక్లా తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ పోలీసులు ఏం చెబుతున్నారు?
‘‘మా సమాధానాన్ని కోర్టులో దాఖలు చేస్తాం’’ అని దిల్లీ పోలీసుల తరఫున కోర్టులో హాజరైన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖండ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
అంతకుముందు కూడా ఈ విషయం కోర్టు ముందుకు వచ్చిందని, దీనిపై నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించగా, అలాంటిదేమీ జరగలేదని వారు తిరస్కరించారని ఆయన చెప్పారు.
‘‘జనవరి 13న నిందితులందరూ కోర్టులో హాజరయ్యారు. అప్పుడు కూడా మౌఖికంగా ఈ ఆరోపణలను చేశారు. కానీ, నిందితులను ఒక్కొక్కర్ని ఈ విషయంపై కోర్టు ప్రశ్నించగా- దిల్లీ పోలీసుల నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని, ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. జనవరి 13 ఆర్డర్‌లో కూడా దీన్ని రికార్డు చేశారు’’ అని అఖండ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
అయితే, పోలీసులంటే భయంతో వీరందరూ ఏమీ చెప్పలేకపోయారని నిందితుల న్యాయవాది అమిత్ శుక్లా చెప్పారు.
‘‘50 ఖాళీ పేపర్లపై సంతకం చేయాలని ఒక మహిళా అధికారి బలవంతం చేసిందని చెబుతూ నీలమ్ ఆజాద్(ఆరో నిందితురాలు) ఈ విషయాన్ని లేవనెత్తారు. ఆమె ఈ విషయాన్ని తెలిపినప్పుడు, ఇతర నిందితులు కూడా ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించారని చెప్పారు’’ అని ఆయన తెలిపారు.
‘‘నేను ఈ విషయాన్ని ప్రస్తావించి, దీన్ని రిజిస్ట్రర్ చేయాలని చెప్పినప్పుడు, దీని గురించి ప్రతి ఒక్క నిందితున్ని అడుగుతామని కోర్టు చెప్పింది. కోర్టు నిందితులను ప్రశ్నించినప్పుడు, అలాంటిదేమీ జరగలేదన్నారు.
ఆ రోజు నిందితులతో పాటు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఒకవేళ ఇది చెబితే, పోలీసుల నుంచి ఏదైనా జరుగుతుందేమోనని భయపడ్డారు. అందుకే పోలీసులు తమల్ని ఒత్తిడి చేయలేదని చెప్పారు. ఆ తర్వాత జైలులో వారిని కలిసినప్పుడు, కోర్టులో ఏం చెప్పకూడదని వారిపై ఒత్తిడి ఉన్నట్లు నిందితులు చెప్పారు’’ అని అమిత్ శుక్లా తెలిపారు.
‘‘జవనరి 13న వారు పోలీసు కస్టడీలో ఉన్నారు. అదే రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. ఆ తర్వాత, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నేను వారిని కలిశాను. అప్పుడు వారు ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఇది జ్యుడీషియల్ కస్టడీ. ఈ కస్టడీలో పోలీసులు హింసించరని వారికి నచ్చజెప్పినప్పుడు, జరిగిన విషయమంతా చెప్పారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
నిందితుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
జనవరి 31న విచారణ సందర్భంగా, ఈ ఆరుగురు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని దిల్లీ పోలీసులు కోరారు. దీంతో మార్చి 1 వరకు వీరి కస్టడీని కోర్టు పొడిగించింది.
‘‘విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. వీరిని కస్టడీలో ఉంచకపోతే, సాక్షులను ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఆధారాలను తారుమారు చేయొచ్చు’’ అని ప్రభుత్వ న్యాయవాది అఖండ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
2023 డిసెంబరు 13న నిందితుల్లోని మనోరంజన్ డీ, సాగర్ శర్మ ఎంపీలుండే చోటకు వెళ్లి, నినాదాలు చేస్తూ, పొగ గొట్టంతో గ్యాస్‌ను వెదజల్లారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్లమెంట్ వెలుపల కూడా కలర్ గ్యాస్‌ను వదులుతూ, నినాదాలు చేసిన నీలమ్, అమోల్ షిండేలనూ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహేశ్ కుమావత్, లలిత్ ఝాలను కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, టీచర్ అయిన లలిత్ ఝా ఈ దాడికి మాస్టర్ మైండ్ అని తెలిసింది. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ప్లాన్‌కు ఆయనకు కుమావత్ సాయం చేశారు.
తాము నిరుద్యోగులమని, ఉద్యోగాలు రాకపోవడాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావనకు తీసుకురావాలని అనుకున్నామని నిందితులు చెప్పారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ నిందితులకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. తమకు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని వారి తరపు న్యాయవాది అమిత్ శుక్లా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జ్ఞానవాపి మసీదు ప్రాంగణం: వ్యాస్ బేస్మెంట్లో హిందువుల పూజలు.. ఇంతకూ ఇది ఎక్కడుంది? ఈ వివాదం ఎలా మొదలైంది?
- ఇమ్రాన్ ఖాన్‌తోపాటు జైలు శిక్ష పడ్డ మూడో భార్య బుస్రా బీబీ ఎవరు? ఆమె గురించి పాకిస్తాన్లో జరిగే చర్చ ఏమిటి?
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- చంపయీ సోరెన్: ఝార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ఈ నిరాడంబర ఎమ్మెల్యేకు అవకాశం ఎలా వచ్చింది
- వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














