జ్ఞానవాపి మసీదు ప్రాంగణం: వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువుల పూజలు.. ఇంతకూ ఇది ఎక్కడుంది? ఈ వివాదం ఎలా మొదలైంది?

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అనంత జణానే, ఉత్పల్ పాఠక్
    • హోదా, వారణాసి నుంచి బీబీసీ ప్రతినిధులు

వారణాసిలో జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు జరుపుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి.

కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే హిందువుల పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ- కోర్టు ఈ ఉత్తర్వులు ఇవ్వడం జ్ఞానవాపి కేసులో కీలక మలుపు అని చెప్పారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న ఈ భూగర్భ గృహంలో పూజలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ పక్షం డిమాండ్ చేస్తూ వస్తోంది.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, ANI

‘1993 వరకు పూజలు జరిగాయి’

‘‘మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో ఉన్న బేస్‌మెంట్‌లో ఉన్న విగ్రహానికి పూజలు జరిగేవి. కానీ 1993 డిసెంబర్ తరువాత పూజారి వ్యాస్‌ని మసీదు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బేస్‌మెంట్‌లో జరగాల్సిన రాగ, భోగ తదితర వైదిక కార్యక్రమాలు నిలిచిపోయాయి’’ అని హిందూ పక్షం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిషేధించాయని హిందూ పక్షం చెబుతోంది.

‘‘బ్రిటిషర్ల పరిపాలనలో కూడా పూజారి వ్యాస్ జీ కుటుంబం అధీనంలోనే ఈ బేస్‌మెంట్‌ ఉండేది. వారు అక్కడ 1993 డిసెంబర్ వరకు పూజలు నిర్వహించారు’’ అని హిందూ పక్షం తెలిపింది.

బేస్‌మెంట్ తలుపు తొలగించారని, పూజా సామగ్రి, పురాతన శిల్పాలు, ఇతర వైదిక ప్రాముఖ్యమున్న సామగ్రి అక్కడే ఉన్నాయని హిందూ పక్షం చెప్పింది. ‘‘బేస్‌మెంట్‌లో ఉన్న విగ్రహాలకు నిత్యపూజలు జరగడం అవసరం. ఇది మా హక్కు’’ అని నొక్కి చెప్పింది.

బేస్‌మెంట్‌లో పూజలు నిర్వహించుకోవడానికి వీలైన ఏర్పాట్లు చేయడానికి రిసీవర్‌ను నియమించాలని కోర్టు దావాలో డిమాండ్ చేశారు.

బేస్‌మెంట్ రిసీవర్‌గా జిల్లా మేజిస్ట్రేట్

రిసీవర్‌ను నియమించాలనే హిందూ పక్షం డిమాండ్‌ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేష్ అంగీకరించారు.

వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను బేస్‌మెంట్ రిసీవర్‌గా నియమించారు.

‘‘ప్రశ్నార్థకంగా ఉన్న కట్టడాన్ని జాగ్రత్తగా రక్షించాలి. దాని రూపురేఖల్లో ఎటువంటి మార్పులు రావడానికి వీల్లేదు’’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో ఆదేశించారు.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, GETTY IMAGES

వ్యాస్ బేస్‌మెంట్ ఎక్కడుంది?

జ్ఞానవాపి మసీదు ప్రాంగణ మ్యాప్‌లో వ్యాస్ బేస్‌మెంట్ ఎక్కడుందో చూపించారు.

జ్ఞానవాపికి సంబంధించి 1936లో దిన్ మహమ్మద్ కేసులో దాఖలైన మ్యాప్‌లో దక్షిణం వైపున ఇంగ్లిష్‌లో ‘‘వ్యాస్ యాజమాన్యంలోని బేస్‌మెంట్’’ అని రాసి ఉంది.

జ్ఞానవాపి యాజమాన్య హక్కుల విషయంపై పోరాడుతున్న సోమనాథ్ వ్యాస్ 1991లో దాఖలు చేసిన మ్యాప్‌లో కూడా, ‘‘వాది నంబరు 2గా సెల్లారు యాజమాన్యం’’ అని కనిపిస్తుంటుంది.

సోమనాథ్ వ్యాస్ దాఖలు చేసిన పిటిషన్‌లోని మ్యాప్ ప్రకారం బేస్‌మెంట్ ఎదురుగా నంది, కుడివైపున గౌరీ శంకరుడు , ఎడమ వైపున బరాదరి ఉన్నాయి. అక్కడే వ్యాస్ గద్దె, బావి, రావిచెట్టు, వినాయకుడు కనిపిస్తాడు. బరదారి పక్కనే మహాకాళేశ్వరుడు కూడా కనిపిస్తాడు.

జ్ఞానవాపి ప్రాంగణం చుట్టూ ఉన్న భూమిపై హిందూ పక్షానికి హక్కులున్నట్టు మ్యాప్ చూపుతోంది.

దీన్ మహమ్మద్ కేసులో జత చేసిన మ్యాప్‌లో నంది (నందీశ్వరుడు) వ్యాస్ బేస్‌మెంట్ ఎదురుగాను, దాని వెనుక గౌరీశంకర్ ఉన్నట్టు చూపారు. ఎడమ వైపు బరదారి మండపం, జ్ఞానవాపి బావి, రావిచెట్టు కూడా ఉన్నాయి.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, ANI

సోమనాథ్ వ్యాస్ పిటిషన్‌లో ఏముంది?

జ్ఞానవాపి భూ యాజమాన్య హక్కులను కోరుతూ 1991లో సోమనాథ్ వ్యాస్ కోర్టులో దావా వేశారు. అప్పుడు సోమనాథ్ వ్యాస్ వయసు 61 ఏళ్ళు.

జ్ఞానవాపి కాంప్లెక్స్ పెద్దను తానేనని ఆయన చెప్పుకొనేవారు.

అలాగే ‘‘కాశీ విశ్వనాథుడి స్నేహితుడిని’’ అని చెబుతూ సోమనాథ్, జ్ఞానవాపి స్థలంపై కోర్టులో కేసు వేశారు.

‘‘ప్లాట్ నంబర్ 9130లో కూల్చివేసిన ఆది విశ్వేశ్వరుడి దేవాలయంలోని కొంత భాగం ఇప్పటికీ ఆ స్థానంలోనే మిగిలి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘బేస్‌మెంట్ దక్షిణం వైపు ఉంది. తూర్పు వైపు ఆలయం ఉంది. దాని స్థలమంతా 1991లో నా అధీనంలో ఉంది’’ అని సోమనాథ్ వ్యాస్ తన పిటిషన్‌లో రాశారు.

హిందువులు దీనిని ఆది విశ్వేశ్వరుడి ఆలయంగా భావించి పూజలు చేస్తారని, ప్రదక్షిణలు కూడా చేస్తారని పేర్కొన్నారు.

బేస్‌మెంట్ తన అధీనంలో ఉన్నందున ప్లాట్ నంబర్ 9130 ప్రాంతమంతా తన అధీనంలోనే ఉన్నట్టని ఆయన చెప్పారు.

బేస్‌మెంట్ స్థలం, దాని కింద ఉన్న భూమి అంతా తన అధీనంలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్న నిర్మాణం(మసీదు)పైన తనకే యాజమాన్య హక్కులు ఉంటాయని, ఇది తనకు, హిందువులకు చెందుతుందని ఆయన తెలిపారు.

పండిట్ సోమనాథ్ మార్చి7, 200న మృతి చెందారు.

తరువాత ఈ కేసులో ఐదో కక్షిదారు, న్యాయవాది అయిన విజయ్ శంకర్ రస్తోగి కోర్టులో పోరాటం చేస్తున్నారు.

స్వయంభూ అయిన ఆది విశ్వేశ్వరుడి స్నేహితులుగా వీరు ఈ పోరాటం చేస్తున్నారు.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC

ముస్లిం పక్షం వాదన ఏమిటి?

వ్యాస్ కుటుంబ సభ్యులు ఏనాడూ బేస్‌మెంట్‌లో పూజలు జరపలేదని, కాబట్టి 1993లో అక్కడ పూజలు ఆపేశారనడానికి అవకాశమే లేదని ముస్లిం పక్షం వాదిస్తోంది.

బేస్‌మెంట్‌లో ఎలాంటి విగ్రహమూ లేదని మసీదు వర్గాలు చెబుతున్నాయి.

బ్రిటిష్ కాలంలో వ్యాస్ కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలు జరిపారనే వాదనను ఆ వర్గాలు ఖండించాయి.

మసీదు కట్టినప్పటి నుంచి ఈ ప్రాంతమంతా మసీదు అధీనంలోనే ఉందని, బేస్‌మెంట్‌లో ఎన్నడూ ఎటువంటి పూజలు జరగలేదని మసీదు వర్గాలు చెబుతున్నాయి.

ప్లాట్ నంబర్ 9130లో జ్ఞానవాపి మసీదు వేల సంవత్సరాలుగా నడుస్తోందని ముస్లిం పక్షం వాదిస్తోంది. బేస్‌మెంట్ కూడా అలంగిరి (జ్ఞానవాపి) మసీదులో భాగమని వాదిస్తోంది.

ఇందుకోసం వీరు 1937లో దీన్ మహ్మద్ కేసులో వచ్చిన తీర్పును తమ వాదనలో చూపుతున్నారు. ఆ కేసులో ఈ మసీదు, ప్రాంగణం, దాని పక్కన ఉన్న భూమి అంతా హనీఫా ముస్లీం వక్ఫ్‌కు చెందుతుందని తీర్పు ఇచ్చారని, ముస్లింలకు అక్కడ ప్రార్థనలు చేసుకునే హక్కుందని వాదించారు.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, ARRANGED

ఏఎస్ఐ ఏం చెబుతోంది?

భారతీయ పురావస్తు శాఖ (ఏఏస్ఐ) దర్యాప్తు పరిధిలో వ్యాస్‌జీ బేస్‌మెంట్ లేదు. కానీ జ్ఞానవాపి ప్రాంగణంలోని ఇతర బేస్‌మెంట్‌లో పరిశోధనలు చేసి, ఏం కనుక్కుందో తెలిపింది.

మసీదులో ప్రార్థనల కోసం తూర్పు వైపున బేస్‌మెంట్‌లు నిర్మించారు. అలాగే ఎక్కువ మంది నమాజు చేసుకోవడానికి వీలుగా ఓ ఫ్లాట్‌పామ్, మరింత స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు.

తూర్పు భాగంలో బేస్‌మెంట్ నిర్మించడానికి ఆలయ స్తంభాలను ఉపయోగించారు.

ఎన్‌2 అనే క్రిప్ట్‌లో గంటలు, దీపం స్టాండ్, శాసనాలు ఉన్న ఉపయోగించిన స్తంభం ఉంది.

ఎస్-2 పేరుతో బేస్‌మెంట్‌లో మట్టి కింద పూడ్చిపెట్టిన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భారత పురావస్తు శాఖ నివేదిక తెలిపింది.

జ్ఞానవాపి మసీదు వివాదం

ఫొటో సోర్స్, ALAMY

ఇప్పటి వరకు ఏం జరిగింది?

2019: డిసెంబరు 2019లో బాబ్రీ మసీదు, అయోధ్య రామాలయం వివాదంపై తీర్పు వెలువడిననెల తరువాత జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలనే డిమాండ్‌తో వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

2020: వారణాసి కోర్టు ఒరిజినల్ పిటిషన్‌పై విచారణ జరపాలనే డిమాండ్ వచ్చింది.

2020: అలహాబాద్ హైకోర్టు సివిల్ కోర్టు విచారణపై స్టే విధించి, ఈ విషయంలో తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

2021: హైకోర్టు నిషేధానికి భిన్నంగా వారణాసి సివిల్ కోర్టు ఈ కేసును ఏప్రిల్లో తిరిగి తెరిచి మసీదులో సర్వేకు ఆదేశించింది.

2021 : దీనిపై మసీదుకు చెందినవారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మరోసారి స్టే విధించింది.

2021: ఆగస్టులో ఐదుగురు హిందూ మహిళలు శృంగార గౌరీ దేవి ఆరాధన కోసం అనుమతివ్వాలంటూ వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2022: సివిల్ కోర్టు ఏప్రిల్‌లో జ్ఞానవాపి మసీదు సర్వేకు, వీడియోగ్రఫీకి ఆదేశించింది.

2022: ఈ ఆదేశాలను మసీదు ఇంతెజామియా అనేక సాంకేతిక అంశాల ఆధారంగా సవాలు చేస్తూ హైకోర్టుకు ఎక్కింది. కానీ హైకోర్టు దీనిని తిరస్కరించింది.

2022: మేలో జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీకి సంబంధించి మసీదు కమిటీ, సుప్రీంకోర్టుకు వెళ్ళింది.

2022: సుప్రీంకోర్టు ఈ కేసును విచారించక ముందే సర్వే రిపోర్టును మే 16న సమర్పించారు. దీంతో వారణాసి సివిల్ కోర్టు మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశించింది. దాంతో పాటు అక్కడ నమాజును కూడా నిషేధించింది

2022 : మే 17న శివలింగ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ అక్కడ నమాజు చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

2022: మే 20న ఈ కేసును సుప్రీంకోర్టు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీచేసి, దీనిపై విచారణ అవసరమో కాదో తేల్చాలని ఆదేశించింది.

2023: జులై 21న బెనారస్ కోర్టు ఏఎస్ఐ సర్వేకు ఆదేశించింది.

2023: ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు సర్వేకు అనుమతించింది.

2024: ఈ కేసుకు సంబంధించి ఏఎస్ఐ సర్వే రిపోర్టును సంబంధిత పార్టీలకు ఇవ్వాలని వారణాసి జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)