చంపయీ సోరెన్: ఝార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ఈ నిరాడంబర ఎమ్మెల్యేకు అవకాశం ఎలా వచ్చింది

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, చంపయీ సోరెన్
    • రచయిత, రవి ప్రకాష్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

కాళ్లకు సాధారణ చెప్పులు, వదులు దుస్తులు, తెల్లటి జుట్టుతో కనిపించే చంపయీ సోరెన్‌ నిరాడంబర జీవితాన్ని గడుపుతారు.

ఎవరికి కష్టమొచ్చినా, సోషల్ మీడియాలో ఆ వివరాలు పోస్ట్ చేసి, సంబంధిత శాఖను ట్యాగ్ చేస్తారు.

వెంటనే ఆ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారు. రాజకీయ నేతగా సోరెన్ దినచర్యలో ఇదీ ఓ భాగమే.

ఝార్ఖండ్ సీఎంగా ఆయనే సరైన అభ్యర్థి అని అధికార కూటమి ఎమ్మెల్యేలంతా చంపయీ సోరెన్ పేరునే ప్రకటించారు. ఆయన్నే ఎన్నుకున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలలో మార్పులు జరుగుతున్నాయి.

చంపయీ సోరెన్

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, చంపయీ సోరెన్‌

హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆయన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే బుధవారం అనూహ్యంగా చంపయీ సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది.

బుధవారం రాత్రి ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన అనంతరం కాంగ్రెన్ నాయకులు ఆలంగిర్ ఆలం మీడియాతో మాట్లాడారు.

"హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మా కూటమి తరపున చంపయీ సోరెన్‌ పేరును గవర్నర్‌కు నివేదించాం. అందుకు 43 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా గవర్నర్‌కు సమర్పించాం. మాకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ప్రమాణ స్వీకారం ఏ తేదీన ఉంటుందో గవర్నర్ వెల్లడించాల్సి ఉంది. ఈ లేఖను చూశాక, స్పందిస్తానని ఆయన మాతో చెప్పారు" అని చెప్పారు.

చంపయీ సోరెన్

ఫొటో సోర్స్, RAVI PRAKASH

బలమైన నేతగా..

ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన 67 ఏళ్ల చంపయీ సోరెన్ పట్ల పార్టీ అధినేత శిబు సోరెన్, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్‌లకు నమ్మకం ఉంది.

హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, ఆహార సరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చంపయీ సోరెన్.

ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం నాటి నుంచి శిబు సోరెన్‌తో ఆయనకు అనుబంధం ఉంది.

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సరాయ్‌కెలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా ఏడోసారి విజయం సాధించారు.

సరాయ్‌కెలా ఖర్‌సాంవా జిల్లా గమ్హారియాలోని జిలింగ్‌గోఢాకు చెందిన చంపయి సోరెన్ రైతు కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి సెమల్ సోరెన్ 101 ఏళ్ల వయసులో 2020లో మరణించారు.

ఆరుగురి సంతానంలో చంపయీ సోరెన్ మూడోవారు. తల్లి గృహిణి. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న సోరెన్‌కు ఏడుగురు సంతానం.

1991లో సరాయ్‌కెలా ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారిగా విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణ మార్డీ రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. అనంతరం 1995 ఎన్నికల్లో గెలుపొందినా, 2000లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

2005 నుంచి వరుసగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆరుసార్లు వరుసగా గెలుపొందారు.

11 నవంబర్ 1956లో జన్మించిన చంపయీ సోరెన్ పదో తరగతి వరకే చదువుకున్నారు.

హేమంత్ సోరెన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హేమంత్ సోరెన్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు

హేమంత్ సోరెన్ ఎందుకు రాజీనామా చేశారు?

జనవరి 31న మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులను తన ఇంటికి రావాల్సిందిగా సూచించారు హేమంత్ సోరెన్.

జనవరి 20న కూడా ఇదే కేసులో ఈడీ ఆయన్ను విచారించింది. ఆ సమయంలో విచారణ పూర్తి కాలేదు.

జనవరి 29న ఈడీ అధికారులు దిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లినా, ఆయన్ను కలవడానికి వీలుపడలేదు.

ఆ సమయంలో హేమంత్ సోరెన్ ఆదృశ్యమయ్యారంటూ వార్తలు వినిపించాయి. అయితే, మరుసటి రోజున రాంచీలో కనిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేలతో సమావేశాల్లోనూ కనిపించారు.

మైనింగ్ స్కామ్‌కు సంబంధించి కూడా ఈడీ ఆయన్ను విచారించి, వాంగ్మూలం రికార్డు నమోదు చేసింది. ఆ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు హేమంత్ సోరెన్.

అయితే, ఈడీ కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఇదంతా చేస్తోందని జేఎంఎమ్ విమర్శించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసి, న్యాయపోరాటం చేయాలని హేమంత్ సోరెన్ భావించారని కథనాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)