ఓటాన్ అకౌంట్ బడ్జెట్: ఎవరెవరు ఏం ఆశిస్తున్నారు? కేంద్రం ఆలోచనలు ఎలా ఉండొచ్చు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డబ్బు మనమే సంపాదించి మనమే ఖర్చు పెట్టినా దాన్ని పరోక్షంగా నియంత్రించేది ప్రభుత్వాలే. మన ఖర్చులు పెరిగినా, తగ్గినా, మన ఆదాయం పెరగాలన్నా, తగ్గాలన్నా మన కష్టం, ఆలోచనతో పాటూ ప్రభుత్వ విధానాలూ కీలకమే.
ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అలాంటి విధానాలను రూపొందించేదే బడ్జెట్.
బడ్జెట్ అనే పదం బౌగట్టీ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఫ్రెంచ్‌లో ఈ పదానికి అర్థం తోలు సంచి అని. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏముంటుందో అని సామాన్యులు, ఉద్యోగులు వ్యాపార, వాణిజ్య, కార్పోరేట్ వర్గాలు ఎదురు చూస్తుంటారు.
మన ప్రమేయం లేకుండా మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది బడ్జెట్.
కార్పొరేట్ రంగంతో పాటూ ప్రత్యక్ష పన్నులు చెల్లించే ఉద్యోగులు, కొత్త ఇల్లు కొన్న, కొంటున్న మధ్య తరగతి వారు, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తారు. ఏవైనా ధరలు తగ్గుతాయోమో అని గమనిస్తారు.
కాకపోతే ఈసారి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే మధ్యంతర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. మళ్లీ ఎన్నికలు అయ్యాక గెలిచిన కొత్త ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశ పెడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్ నుంచి ఏమి ఆశిస్తున్నారు?
కేంద్రంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ పెడతాయి. కానీ తేడా ఏంటంటే, రాష్ట్రాల బడ్జెట్ అనేది ఆ రాష్ట్ర జమాఖర్చుల లెక్కలు. వారు ఏ శాఖకు ఎంత ఖర్చు పెడతారు.. అందుకు నిధులు ఎక్కడ నుంచి తెస్తారు అనేది ఉంటుంది.
అంటే ప్రధానంగా ప్రభుత్వం పెట్టే అభివృద్ధి, సంక్షేమాల ఖర్చుల చుట్టూ తిరుగుతుంది. నేరుగా సామాన్యుడి జేబు మీద ఆ ప్రభావం ఉండదు. కానీ కేంద్ర బడ్జెట్ ప్రభావం నేరుగా సామాన్యుడి మీద ఉంటుంది.
సీనియర్ బిజినెస్ అనలిస్టు నాగేంద్ర సాయి, బీబీసీతో పంచుకున్న అభిప్రాయం ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాపార-వాణిజ్య వర్గాల్లో బడ్జెట్ విషయంగా ఎదురు చూస్తున్న అంచనాలు ఇలా ఉన్నాయి..
వ్యక్తిగత పన్నులు: గత బడ్జెట్‌లో న్యూ ట్యాక్స్, ఓల్డ్ ట్యాక్స్ రెజిం పేరుతో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. క్రమంగా వివిధ సెక్షన్లను ఎత్తేస్తూ, పన్నుల ప్రక్రియను సరళతరం చేయాలని చూస్తోంది.
ప్రజలను పొదుపు అలవాట్ల నుంచి వినియమం వైపు మళ్లించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తోంది. అందుకే ఏదైనా అత్యల్ప మార్పులు తప్ప వ్యక్తిగత పన్నుల విషయంలో భారీ మార్పులు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయని పెద్దగా అనుకోవడం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ కొద్దిగా పెంచవచ్చనే ఆశ ఉంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)లో కొద్దిగా మార్పులు తీసుకురావొచ్చని అంతా భావిస్తున్నారు. ఎన్‌పిఎస్ ద్వారా వచ్చే యాన్యుటీని ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఎక్కువగా ఉంది.
కొత్త పన్నుల విధానంలో దీనిపై పన్ను విధించడం వల్ల అనేక మంది నిరాశ చెందడంతో ప్రభుత్వం ఈ విషయంపై ఈ బడ్జెట్లోనే ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇది ఊరటనిచ్చే అంశం.

ఫొటో సోర్స్, Getty Images
ఏఏ రంగాలకు ప్రాధాన్యత దక్కవచ్చంటే..
మౌలిక వసతుల రంగం: మౌలిక రంగంపై ప్రభుత్వం భారీ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంచవచ్చనిపిస్తోంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారులు, సరకు రవాణాకు ప్రత్యేక రైల్వే లైన్, మెట్రో రైల్ నెట్‌వర్క్స్ వంటి వాటిని విస్తృతంగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనితో పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గత బడ్జెట్లో పది లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న క్యాపెక్స్ ఈసారి 20 శాతానికి పెంచవచ్చని ఓ అంచనా.
రైల్వే: ఈ శాఖకు ఈసారి రెండున్నర నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఉండొచ్చని అంచనా. కొత్తగా మరిన్ని వందే భారత్ రైళ్లు, లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక హైస్పీడ్ ట్రాక్స్, కారిడార్స్ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ కోసం ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించవచ్చు.
వాస్తవానికి దేశవ్యాప్తంగా 400 వందే భారత్ రైళ్లు నడపాలనే కేంద్రం లక్ష్యంలో ఇప్పటి వరకూ పూర్తయింది పది శాతమే. మొత్తంగా రాబోయే పదేళ్ల కాలానికి పది లక్షల కోట్లు కేవలం రైల్వేలకే ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
దేశీయ పర్యాటకం: లక్షద్వీప్, అయోధ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి ఇప్పటికే అనేక సందర్భాల్లో పిలుపునిస్తూనే ఉన్నారు.
కొత్త హోటళ్ల నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం, ఉడాన్ స్కీమ్ కింద మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం వంటివి చేపట్టే అవకాశం ఉంది. ఈ సారి పర్యాటక రంగం కూడా బడ్జెట్‌పై ఆశలు పెట్టుకుంది.
కార్పొరేట్ రంగం: ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతం ఉంది. కార్పొరేట్ టాక్స్ అంటే కంపెనీలు కట్టే ఇన్ కమ్ టాక్స్ అనుకోవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది కాంపిటీటివ్‌గా ఉన్నప్పటికీ దీనిపై మరింత సరళీకరణ అవసరం ఉంది. ఎందుకంటే ఉత్పాదక రంగంలో భారత్ ఇప్పటికీ వెనుకబడే ఉంది.
చైనా ప్లస్ స్ట్రాటజీలో భాగంగా భారత దేశం మరింతగా పెట్టుబడులు ఆకర్షించాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికైనా కొద్దో గొప్పో ఊరట ఇవ్వకతప్పదు. అలాంటి ప్రణాళిక ఏదైనా చేపడితే ఈ సారి కార్పొరేట్ రంగం కొద్దిగా బెనిఫిట్ పొందొచ్చు.
‘‘వీటితో పాటూ ఎలక్ట్రిక్ వెహికల్స్, రూఫ్ టాప్ సోలార్స్‌కు మరింత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. దీనిపై ఆసక్తికర ప్రకటనలు రావొచ్చని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.’’ అని అన్నారు నాగేంద్ర సాయి.

ఫొటో సోర్స్, Getty Images/Mint
మన సంగతి సరే.. దేశం సంగతో?
బడ్జెట్లో మనకేంటి అనడంతో పాటూ ఏ రకమైన విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే దాని ప్రభావం పరోక్షంగా సామాన్యుడిపై ఉంటుంది. ప్రత్యక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఆ విధానమే నడపిస్తుంది.
అయితే ఎన్నికలు ముందు వస్తున్న ఈ బడ్జెట్లో మొత్తం ఆర్థిక గతిని మలుపుతిప్పే స్థాయి ప్రకటనలు చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఊరించేలా ఉంటుందన్నది వారి అభిప్రాయం.
‘‘గత ఏడాది కేంద్ర బడ్జెట్ సుమారు 45 లక్షల కోట్లు.. ఈసారి 10 శాతం పెంచి 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. బీజేపీ గత ఐదేళ్లుగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందని అని చెబుతూ వస్తున్నారు. ఈసారి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాల ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులకు మేలు చేసేవి, ఇన్ కమ్ టాక్స్ స్లాబ్ విషయంలోనూ మార్పులు ప్రకటించవచ్చు.
అలాగే గృహ నిర్మాణం, గృహాల కొనుగోళ్లు లాంటి అంశాల్లోనూ రాయితీలు ఇవ్వవచ్చు. ఉచితాలను ప్రధానమంత్రి మోదీ వ్యతిరేకిస్తున్నా, ఎన్నికలు సమయంలో వాటి గురించి ప్రస్తావించక తప్పని పరిస్థితి ఉంది. మార్కెట్ ఎకానమీలో అంతరాలు పెరుగుతున్నాయి. పేదలకు ఫలితాలు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో.. సంక్షేమ పథకాలే పేదలకు కాస్త ఊపిరి.’’ అని బీబీసీతో అన్నారు ఆర్థిక రంగ నిపుణులు అందె సత్యం.

ఫొటో సోర్స్, EPA/JAGADEESH NV
పెరుగుతున్న ధరల్ని తగ్గించేదెలా?
దేశవ్యాప్తంగా అందరి మనసుల్లోనూ ఉన్నప్పటికీ, పెద్దగా చర్చ జరగని ధరల పెరుగుదల అంశంపై ఈసారి బడ్జెట్లో కాస్త చర్చ ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
‘‘ప్రస్తుతం బీజేపీ పాలన విషయంలో ప్రజల్లో ఉన్న అతిపెద్ద అసంతృప్తి పెరుగుతున్నధరలు. సంక్షేమం పరంగా ఎంత చేసినా ధరల్ని తగ్గించకపోతే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించడం కష్టం. కాబట్టి ద్రవ్యోల్బణం కట్టడికి ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ లోటు అర శాతం వరకూ తగ్గించి చూపే ప్రయత్నం చేయవచ్చు అనుకుంటున్నాను. అలాగే రక్షణ బడ్జెట్ కూడా పెంచే అవకాశం ఉంది. బడ్జెట్ ను వాస్తవిక అంచనాలతో రూపొందించడం మంచిది. లేకపోతే బడ్జెట్ క్రెడిబిలిటీ పోతుంది.’’ అని అన్నారు సత్యం.
ఆర్ధికరంగంలో భారత దేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందనీ, త్వరలోనే ఉన్నత స్థాయికి వెళుతుందని బీజేపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. తరచుగా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఆ ట్రిలియన్ల ఎకనామీకి చేరాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు.
‘‘ప్రపంచ వ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఈ మధ్యే మనం హాంకాంగ్‌ను దాటాం. 4.33 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించాం. ఇక మన తదుపరి లక్ష్యం జపాన్ (6.36 ట్రిలియన్ డాలర్స్). అయితే ఈ ఫీట్ అందుకోవడం ఈజీ కాదు. యూఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు, క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉండడం, రూపాయి విలువ క్షీణత వంటి అంశాలు ఇబ్బందిగా మారొచ్చు. విదేశీ మదుపరుల వైఖరి ఈ మధ్య మారుతోంది. అందుకే ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో పూర్తిగా పాపులిస్ట్ మెజర్స్ వైపు మొగ్గితే రిఫార్మ్స్ విషయంలో ఇబ్బందులు తప్పవు. గ్రోత్‌ను గాడిలో పెట్టే విషయంలో కూడా చాలా అప్రమత్తత జాగ్రత్త అవసరం. ’’ అన్నారు నాగేంద్ర సాయి.

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్లో తెలుసుకోవల్సిన అంశాలు
బడ్జెట్లో చాలా పదాలు ఆర్థిక పరిభాషలో ఉన్నప్పటికీ, ఐదు కీలక పదాలు మాత్రం అందరూ తెలుసుకోవాలి.. ఆ ఐదు పదాలు, వాటి అర్థాలు ఇవే..
రెవెన్యూ ఖాతా లేదా రెవెన్యూ రాబడులు:
పన్ను రెవిన్యూ: భూమి పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషను రుసుములు, జీఎస్టీ, రాష్ట్ర అబ్కారీ, వాహనాలపై పన్ను, వినోదపు పన్ను, కేంద్ర పన్నులలో వాటా
పన్నుకు సంబంధించని రెవిన్యూ: వడ్డీ రాబడులు, మూలధనం పెట్టుబడిపైన డివిడెంట్లు, జరిమానా రుసుములు, బోధనా రుసుములు, అటవీ ఉత్పత్తులపైన రాబడి, గనులు, ఖనిజాల నుంచి రాబడులు, వివిధ శాఖలు వసూలు చేసిన యూజర్ ఛార్జీలు.
సహాయక గ్రాంట్లు, విరాళాలు: వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సహాయక గ్రాంట్లు, భారత రాజ్యాంగం 275 ఆర్టికల్ నుంచి వచ్చే గ్రాంట్లు, ఎక్సైజ్ పన్నుల్లో కేంద్ర వాటా
రెవిన్యూ ఖర్చు: వివిధ శాఖల నిర్వహణకుగాను ప్రభుత్వం తీసుకొన్న అప్పుల మీద వడ్డీ చెల్లించటానికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు తీసుకోటానికి, భవనాలు, రోడ్లు, నీటిపారుదల వనరులు, వివిధ ఆస్తుల నిర్వహణ మరమత్తులకు పెట్టే ఖర్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆస్తుల సృష్టికి ఉపయోగపడని ఖర్చు.
మూలధనం: ప్రభుత్వానికి రాబడి ఇవ్వగలిగనివి, భూమి కొనుగోలు, భవనాల నిర్మాణం వంటి శాశ్వత ఆస్తుల మీద చేసిన ఖర్చు. ప్రభుత్వానికి రాబడి ఇచ్చే నీటిపారుదల, విద్యుత్ శక్తి ప్రాజెక్టులు దీని క్రిందికి వస్తాయి. కొత్తగా కట్టే భవనాలు కూడా. లక్షల్లో ఖర్చయ్యే యంత్రాలు, పరికరాల ఖర్చుతో సహా రోడ్ల గురించి అయ్యే వ్యయం కూడా ఇదే.
రెవిన్యూ మిగులు లేక లోటు: రెవెన్యూ ఖాతా మీద చేసిన ఖర్చు రెవిన్యూ రాబడుల కన్నా తక్కువగా ఉన్నప్పుడు, ఆ తేడా ఆ ఏడాదిలో రెవిన్యూ మిగులు. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తేడాను రెవిన్యూ లోటుగా చెబుతారు.
అప్పు ఖాతా: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లేక పరిష్కరించిన రుణాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రభుత్వోద్యోగులకు, తదితరులకు ఇచ్చిన అప్పులు, అడ్వాన్సులు, వారి నుండి తిరిగి వసూలు చేసిన డబ్బు, అప్పు ఖాతా క్రిందికి వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- ప్యాకేజ్డ్ ఫుడ్: ‘ఒక్క బిస్కెట్ తగ్గినందుకు రూ.లక్ష పరిహారం’ ఇలాంటివి మీరూ పొందవచ్చు ఎలాగంటే...
- హాజి మలాంగ్: ‘ఈ దర్గాకు విముక్తి కల్పించి హిందువుల పరం చేయాలి’ అన్న వాదన ఎందుకు వినిపించింది, వివాదం ఏంటి?
- భారత్ vs ఇంగ్లండ్: గెలుపు వరకు వచ్చి టీమిండియా ఓటమికి ఇదే కారణమా... రోహిత్ శర్మ ఏం చెప్పాడు?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














