భారత్ vs ఇంగ్లండ్: గెలుపు వరకు వచ్చి టీమిండియా ఓటమికి ఇదే కారణమా... రోహిత్ శర్మ ఏం చెప్పాడు?

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఇలా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఎందుకంటే, భారత్‌కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అంతా సజావుగానే సాగుతోంది. ప్రత్యర్థి విధించిన 231 పరుగుల లక్ష్యం కూడా పెద్దది కాదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు చూసి ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌దే విజయం అని అంతా అనుకున్నారు.
కానీ, నాలుగో రోజు ఆటలో అంతా తలకిందులైంది. నిర్ణీత సమయం ముగిసినా 30 నిమిషాలు అదనపు సమయం తీసుకొని మరీ భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది.
ఒక టెస్టులో 100పైచిలుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి భారత్ ఓడిపోయిన సందర్భాలు ఇప్పటివరకు రెండే ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో ఆ సంఖ్య మూడుకు చేరింది.
సొంతగడ్డపై ఆడిన గత 48 టెస్టుల్లో భారత్‌కు ఇది నాలుగో ఓటమి.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఇంగ్లండ్ విదేశీ గడ్డపై టెస్టు ఫార్మాట్‌లో మరో అత్యుత్తమ గెలుపును తమ ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బజ్ స్టయిల్ క్రికెట్‌తో ఆట తీరును మార్చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ 196 పరుగులకు తోడు, అరంగేట్ర స్పిన్నర్ టామ్ హర్ట్‌లీ 7 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌ను తన వశం చేసుకుంది.
హోం పిచ్, పటిష్ట భారత బ్యాటింగ్ లైనప్ ప్రకారం చూస్తే 231 పరుగులు చేయడం భారత్‌కు కష్టమేమీ కాదు.
కానీ, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ విధించిన లక్ష్యాన్ని చేధించగలమనే అనుకున్నామని అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘టాపార్డర్ ఎలా ఆడాలో మా లోయరార్డర్ చూపించింది’’- రోహిత్ శర్మ
‘‘తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత మ్యాచ్ మా నియంత్రణలోకి వచ్చింది.
కానీ ఓలీ పోప్ అత్యద్భుత బ్యాటింగ్‌తో పరిస్థితి మారింది. భారత గడ్డపై నేను చూసిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా ఓలీ పోప్ ఇన్నింగ్స్ నిలుస్తుంది.
230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమనే అనుకున్నా. కానీ, చేయలేకపోయాం. రెండో ఇన్నింగ్స్‌లో చక్కగానే బౌలింగ్ చేశాం. కానీ, పోప్ ఆడిన తీరు చాలా బాగుంది.
ఈ ఓటమికి ఒకటి, రెండు పాయింట్లను చూపించడం కష్టం. ఆ స్కోరును సాధించేలా మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. లోయరార్డర్ నిజంగా బాగా పోరాడింది. టాపార్డర్ ఏం చేయాలో చేసి చూపింది.
కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. ఇది సిరీస్‌లో తొలి గేమ్ మాత్రమే’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇదే మా గ్రేటెస్ట్ విక్టరీ’’- స్టోక్స్
తాను కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అందుకున్న విజయాల్లో ఇదే 100 శాతం గొప్పదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నారు.
‘‘ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే ఫలితమే. టామ్ హార్ట్‌లీ ఓవరాల్‌గా 9 వికెట్లు తీయడం, భుజం శస్త్రచికిత్స తర్వాత ఓలీ పోప్ ఆడిన ఇదే తొలి టెస్టు ఇదే. హార్ట్‌లీకి ఇది తొలి టెస్టు మ్యాచ్. అతనికి లాంగ్ స్పెల్ ఇవ్వాలని అనుకున్నా. అలాగే చేశాం. కారణం ఏదైనా కావొచ్చు అతను ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి మమ్మల్ని గెలిపించాడు’’ అంటూ స్టోక్స్ ప్రశంసించాడు.
టామ్ హర్ట్‌లీ తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను 131 పరుగులిచ్చి 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే,
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 (స్టోక్స్ 70, బెయిర్ స్టో 37; అశ్విన్ 3/68, జడేజా 3/88).
భారత్ తొలి ఇన్నింగ్స్: 436 (జడేజా 87, రాహుల్ 86, యశస్వీ జైస్వాల్ 80; జో రూట్ 4/79)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 (ఓలీ పోప్ 196, డకెట్ 47; బుమ్రా 4/41, అశ్విన్ 3/126).
భారత్ రెండో ఇన్నింగ్స్: 202 (రోహిత్ 39; హార్ట్‌లీ 7/62).

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్ని ఆసక్తికర అంశాలు
15: భారత గడ్డ మీద భారత్‌ను ఇంగ్లండ్ 15 సార్లు ఓడించింది. ఇదే అత్యధికం. భారత్ మీద 14 సార్లు గెలిచిన వెస్టిండీస్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
28: హైదరాబాద్ టెస్టులో భారత్ 28 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. స్వల్ప తేడాతో ఓడటం ఇది నాలుగోసారి. దీనికంటే ముందు భారత్ రెండు సార్లు 16 పరుగుల తేడాతో, ఒకసారి 12 పరుగుల తేడాతో ఓడింది.
6: అరంగేట్ర టెస్టులోనే 7 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ల సంఖ్య 6. టామ్ హర్ట్‌లీ ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీశాడు. అతని కంటే ముందు ఇంగ్లండ్ తరఫున డొమినిక్ కార్క్, జేకే లేవర్, జేసీ లాకెర్, ఏవీ బెడ్సర్, జేమ్స్ లాంగ్రిడ్జ్ ఈ ఘనత సాధించారు.
413: హైదరాబాద్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన పరుగులు. వీరిద్దరూ కలిసి ఆడిన 50 టెస్టుల పరంగా చూస్తే ఇది రెండో అత్యధికం. అంతకుముందు వీరిద్దరూ కలిసి 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో 437 పరుగులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










