భారత్-పాకిస్తాన్ క్రికెట్: ఇరుజట్లు మైదానంలో బద్ధశత్రువులే, కానీ బయట మంచి మిత్రులు....

ఫజల్ మహమూద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ క్రీడాకారుడు ఫజల్ మహమూద్
    • రచయిత, వందన విజయ్
    • హోదా, సీనియర్ న్యూస్ ఎడిటర్, బీబీసీ

భారత్ క్రికెట్ మ్యాచ్‌లు అన్నప్పుడు, ఈ మ్యాచ్‌లకు ఎన్నో రంగులను పులుముకుంటూ ఉంటాయి. పాకిస్తాన్ జట్టుతో పోటీకి దిగినప్పుడు, ఈ మ్యాచ్‌ను క్రికెట్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఒకటిగా ప్రపంచమంతా భావిస్తుంటుంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఈ రెండు దేశాలు గుజరాత్‌లో శనివారం అక్టోబర్ 14న మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నప్పటికీ, క్రికెట్ చరిత్రను చూసుకుంటే మాత్రం ఇరు జట్ల క్రీడాకారుల మధ్య ఎన్నో ప్రేమపూర్వకమైన అంశాలు, ఒకరినొకరు గౌరవించుకున్న క్షణాలు, బలమైన స్నేహం, నమ్మకం నిండి ఉన్నాయి.

గత నెలలోనే క్రికెట్ ఆసియా కప్‌ ముగిసింది. ఈ సమయంలో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తండ్రి అయిన సందర్భంగా పాకిస్తానీ బౌలర్ షాహీన్ అఫ్రిది ఒక గిఫ్ట్ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియో, ఇమేజ్ ఎంతో మంది భారత్, పాకిస్తానీ క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

2022లో ఇట్లాంటి సన్నివేశమే మరొకటి జరిగింది.

పాకిస్తానీ స్కిపర్ బిస్మా మరూఫ్ కూతురితో భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులు ఆడుకున్న ఫోటో, వీడియో ఇంటర్నెట్ అభిమానులను ఆకట్టుకుంది.

క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

క్రీడా చరిత్రలో విభజన నాటి పరిస్థితులను చూసినప్పటికీ, క్రీడాకారుల మధ్య స్నేహం ఎంత స్వచ్ఛంగా ఉండేదో మనకు అర్థమవుతుంది.

1947లో భారత విభజన సమయంలో పెద్ద ఎత్తున మతపరమైన ఘర్షణలు, హింస తలెత్తినప్పుడు కూడా ఇరు జట్ల మధ్య సంబంధాలు దెబ్బతినలేదు.

అవిభాజ్య దేశం కోసం ఆడేందుకు ఎంపికైనప్పుడు, ఫజల్ మహమూద్‌ను 1947 ఆగస్ట్ 15న పుణేలో జరిగే క్రికెట్ క్యాంపుకు హాజరు కావాలని చెప్పారు.

ఫజల్ మహమూద్ పాకిస్తాన్‌కు చెందిన క్రికెట్ ప్లేయర్.

ఏ రోజైతే మహమూద్‌ను పుణేలో క్రికెట్ క్యాంపుకు హాజరు కావాలన్నారో, ఆ సమయంలో భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు విడిపోతున్నట్లు ప్రకటించుకున్నాయి.

హిందూ-ముస్లిం అల్లర్ల మధ్య రాత్రికి రాత్రే పాకిస్తాన్‌లో భాగమైన లాహోర్ నుంచి భారత్‌కు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాన్ని ఆయన చేశారు.

ఫజల్ మహమూద్ నేషనల్ టీమ్ కోసం ఎంపికైనప్పుడు ఆయన భారత క్రీడాకారుడు. కానీ, పుణే చేరుకున్న సమయానికి ఫజల్ పాకిస్తానీ అయిపోయారు.

ఈ విషయాన్ని ఫజల్ మహమూద్ తన ఆత్మ కథలో రాశారు.

సీకే నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీకే నాయుడు

ఆ క్యాంపు రద్దు అయినప్పటికీ, ఫజల్, ఆయన తోటి క్రీడాకారుడు సీకే నాయుడు మధ్య జరిగిన ఒక సన్నివేశం మాత్రం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

‘‘క్యాంపు రద్దయిన తర్వాత, నా ముందున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. మతపరమైన అల్లర్ల మధ్య నేను పుణే నుంచి నా ఇల్లున్న లాహోర్‌కు ఎలా చేరుకోవాలి అనే బెంగపట్టుకుంది’’ అని మహమూద్ ఆత్మకథ డస్క్ టూ డాన్‌లో రాశారు.

‘‘విభజన తర్వాత కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు, రక్తపాతం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణించడం చాలా కష్టమే.

పూనా(పుణె) నుంచి రైలు మార్గంలో బొంబై(ముంబాయి) చేరుకున్నాను. నాతో పాటు క్రికెటర్ సీకే నాయకుడు కూడా ప్రయాణిస్తున్నారు.

కొందరు వ్యక్తులు రైలులో నన్ను గుర్తించి, నాకు హానీ చేయాలనుకున్నారు. కానీ, అప్పుడు వారి నుంచి సీకే నాయుడు నన్ను కాపాడారు. ఆయన బ్యాట్‌ను తీసి, నా నుంచి దూరంగా ఉండాలని అందర్ని హెచ్చరించారు’’ అని రాశారు.

సీకే నాయుడు అవిభాజ్య భారత క్రికెట్ టీమ్‌కు తొలి కెప్టెన్. లెజెండరీ ప్లేయర్లలో ఆయన ఒకరు.

నాయుడు పేరుపై కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఇస్తుంటారు.

నాయుడు తన స్నేహితుడు ఫజల్ మహమూద్ తరఫున నిలబడి, తన జీవితాన్ని కాపాడటం వారిద్దరి మధ్య ఆఫ్-ఫీల్డ్(మైదానం వెలుపల) బంధాన్ని బలపర్చింది.

ప్రతి దశాబ్దంలో కూడా అభిమానుల మనసులను హత్తుకునే ఇలాంటి స్నేహపూర్వకమైన కథనాలు క్రీడాకారుల మధ్య కనిపిస్తూనే ఉన్నాయి.

ఫజల్ మహమూద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ క్రీడాకారుడు ఫజల్ మహమూద్

2012 నుంచి భారత్-పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కానీ, 1987లోనే క్రికెట్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు రావడం మొదలైంది.

1987లో భారత్‌లో హోలి పండగ సందర్భంగా ఇరు దేశాల మధ్య సిరీస్‌లు జరిగాయి.

1987లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఆనాటి క్షణాలను గుర్తుకు చేసుకున్నారు.

హోలీ రంగులతో తాము బస చేసిన హోటల్‌ను అలంకరిస్తూ రెండు జట్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయని కిరణ్ మోరే తెలిపారు.

‘‘ఆ ఏడాది హోలీ పండగ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’’ అని అన్నారు.

‘‘హోటల్ మొత్తం రంగులతో నిండిపోయింది. ఒకరినొకరం రంగులతో ముంచెత్తుకున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఎర్రగా మారిపోయింది. ఇది మాకు బెస్ట్ హోలీలో ఒకటి.

పాకిస్తానీ క్రీడాకారులు చాలా ఉత్సాహంగా ఈ పండగలో పాలుపంచుకున్నారు. హోటల్ వారు మమ్మల్ని హెచ్చరించారు. 500 పౌండ్ల(భారత కరెన్సీలో రూ.51,121) జరిమానా కూడా విధించారు. 1987లో ఇది చాలా పెద్ద మొత్తం.

హోలీ తర్వాత రోజే మేము ఒకరినొకరితో పోటీ పడ్డాం. బద్ధ శత్రువులుగా మైదానంలోకి దిగాం’’ అని ఆనాటి రోజులను కిరణ్ మోరే గుర్తుకు చేసుకున్నారు.

మైదానంలో సీకే నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైదానంలో సీకే నాయుడు

1987లో హోలీ పండగను ఎంజాయ్ చేసిన వారిలో మరో ప్రముఖ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కూడా ఉన్నారు.

అయితే ఇరు దేశాల మధ్య పర్యటనలు ఆగిపోవడంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. కానీ, ఇరు దేశాల పోటీ తీవ్రత మాత్రం అసలు తగ్గలేదు.

అప్పుడు, ఇప్పుడు క్రీడాకారుల మధ్య కొత్తగా స్నేహం చిగురిస్తూనే ఉంది. పాత స్నేహం మళ్లీ సువాసనలు వెదజల్లుతోంది.

గత ఏడాదే భారత స్పిన్ బౌలర్ బిషన్ సింగ్ బేడి తన 76 పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు పాకిస్తాన్‌లోని సిక్కు టెంపుల్‌కు వెళ్లారు.

పాకిస్తాన్‌లో సిక్కు ఆలయాన్ని సందర్శించుకునేటప్పుడు, ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టుకు చెందిన ఇంతిఖాబ్ ఆలం ఆయనకు ఘన స్వాగతం పలికారు.

భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ఈ మాజీ కెప్టెన్ల మధ్య ఆహారం, పాటలతో పాటు ఎన్నో విషయాల్లో సాన్నిహిత్యం ఏర్పడింది.

ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇరువురు షేర్ చేసుకున్నారు.

ఇంతిఖాబ్ ఆలం భారత్‌లో పుట్టారు. దేశ విభజన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్లారు.

భారత క్రికెట్ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా విభజన తర్వాత 2004లోనే తిరిగి జన్మభూమికి వచ్చారు ఇంతిఖాబ్ ఆలం.

రంజీ ట్రోఫీ సందర్భంగా పంజాబ్‌లో జట్టుకు కోచింగ్ ఇచ్చారు.

ఇలా ఇరు జట్ల క్రీడాకారుల మధ్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

భారత క్రీడాకారుడు విరాట్ కోహ్లి, పాకిస్తానీ స్కిపర్ బాబర్ అజాం ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉంటారు.

బాబర్ అజాం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరని విరాట్ కోహ్లి అంటుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)