క్రికెట్ ప్రపంచ కప్: భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక్క క్యాచ్

వరల్డ్ కప్‌తో కపిల్ దేవ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1983 జూన్ 25 ఉదయాన్నే కపిల్‌దేవ్ కళ్లు తెరిచినప్పుడు ఆయన పక్కనే పడుకుని ఉన్న రోమి(కపిల్ దేవ్ భార్య ) అప్పటికింకా నిద్రపోతున్నారు. ఆయన లేచి హోటల్ గదిలో కిటికీ పరదాలు తొలగించి గట్టిగా ఊపిరి తీసుకుని బయటకు చూసినప్పుడు బయట సూర్యుడు వెలుగులు విరజిమ్ముతున్నాడు.

కపిల్‌దేవ్ భార్యను నిద్ర లేపలేదు. శబ్దం చెయ్యకుండా ఆయనే టీ పెట్టుకున్నారు. కిటికీ దగ్గర కూర్చొని పక్కనే ఉన్న లార్డ్స్ మైదానాన్ని చూస్తూ ఉండిపోయారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు కపిల్ దేవ్ టీమ్ సభ్యులనుద్దేశించి మాట్లాడారు.

“ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏదైనా కానివ్వండి. మనం మన బెస్ట్ ఇవ్వాలి. డూ ఆర్ డై. మ్యాచ్ తర్వాత మనం ఇలా చేస్తే బావుండేది, అలా చేస్తే బావుండేది లాంటి మాటలు మాడ్లాడుకోకూడదు” అన్నారు.

టాస్ గెలిచిన తర్వాత క్లైవ్ లాయిడ్ భారత జట్టుని బ్యాటింగ్ చెయ్యమని కోరడంతో కపిల్‌దేవ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తాను టాస్ గెలిచినా కూడా ముందు బ్యాటింగ్ తీసుకోవాలని కపిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు.

లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచితే అప్పుడు వారిని ఓడించవచ్చని భారత జట్టు భావించింది.

ప్రపంచ కప్‌తో కపిల్ దేవ్

ఫొటో సోర్స్, Getty Images

183 పరుగులకే ఔటైన భారత జట్టు

వెస్టిండీస్ మొదట్లోనే భారత్‌ను గట్టి దెబ్బ కొట్టింది. అప్పట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరైన సునీల్ గావస్కర్‌ను రెండు పరుగులలోపే ఔట్ చేసింది. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ శ్రీకాంత్, మిడిలార్డర్‌లో వచ్చిన మోహిందర్ అమర్‌నాథ్ తప్ప మిగతా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చెయ్యలేదు.

శ్రీకాంత్, అమర్‌నాథ్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఇద్దరూ 90 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఆండీ రాబర్ట్స్ బౌలింగ్‌లో శ్రీకాంత్ మోకాలిపై కూర్చుని ఆఫ్‌సైడ్ వైపు బంతిని బౌండరీ దాటించిన షాట్ మ్యాచ్ మొత్తంలోనే మధురమైన క్షణంగా గుర్తుండి పోతుంది.

భారత జట్టు వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ-బల్‌బీర్ సంధు ఎలాగోలా శ్రమించి స్కోరుని 183 పరుగులకు చేర్చారు.

1983 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీకాంత్

ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ ఈ జోడి పట్ల ఎంతగా విసిగిపోయారంటే 11వ నెంబర్ ఆటగాడైన సంధుపైకి బౌన్సర్ వేశారు. ఆ బాల్ సంధు హెల్మెట్ తాకింది.

సంధుకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. “నువ్వు బాగానే ఉన్నావా అని అడిగేందుకు నేను సంధు వైపు పరుగెత్తాను. ఆ సమయంలో సంధు హెల్మెట్ తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. నువ్వు హెల్మెట్‌ను ఎందుకు చేతిలో పట్టుకున్నావు. అది పగిలిపోయిందా అని అడిగాను’’ అంటూ సయ్యద్ కిర్మాణీ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత టెయిలెండర్‌కి బౌన్సర్ వేసినందుకు అంపైర్ డికీ బర్డ్ మార్షల్‌ను గట్టిగా అరిచాడు. సంధుకు క్షమాపణ చెప్పాలని కూడా అన్నాడు.

మార్షల్ సంధు వద్దకు వచ్చి, ‘‘మ్యాన్ ఐ డిడ్‌నాట్ మీన్‌ టు హర్ట్ యు. ఐయామ్ సారి ( నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. నన్ను క్షమించు) అని అడిగాడు.

అప్పుడు సంధూ ‘‘మాల్కం, డూ యూ థింక్ మై బ్రెయిన్ ఈజ్ ఇన్ మై హెడ్.. నో.. ఇట్ ఈజ్ ఇన్ మై నీ. (నా మెదడు నా తలలో ఉందని అనుకుంటున్నారా మాల్కం.. అది నా మోకాళ్లలో ఉంది). అని సంధూ అనడంతో మాల్కం గట్టిగా నవ్వాడు. దీంతోవాతావరణం తేలికగా మారింది.

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్

కపిల్ దేవ్ అద్భుతమైన క్యాచ్

డ్రెస్సింగ్ రూమ్‌లో కపిల్ మరోసారి జట్టు సభ్యులతో మాట్లాడాడు‘‘మనం 183 పరుగులు చేసాం. వెస్టిండీస్ జట్టు 183 పరుగులు చేయాలి. వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో పరుగు కోసం చెమటోడ్చేలా చేయాలి. మీ సర్వశక్తులు ఒడ్డి ఆడండి. మీ వంద శాతం ఇవ్వండి. ఫీల్డింగ్‌లో బంతి మిమ్మల్ని దాటి అవతలకు వెళ్లకూడదు. మనం ఓడిపోయినా పోరాడి ఓడిపోవాలి. మీరు మీ జీవితంలో మూడు గంటలు అత్యుత్తమ క్రికెట్ ఆడండి” అని టీమ్ సభ్యులకు చెప్పాడు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత స్కోరు 5 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బల్వీందర్ సంధూ వేసిన బంతి బయట నుంచి లోపలకు తిరుగుతు వచ్చి గార్డన్ గ్రీనిడ్జ్ బ్యాటును దాటుకుని వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఈ బంతిని “బాల్‌ ఆఫ్ ద టోర్నమెంట్‌గా” పిలిచారు.

ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది కపిల్ దేవ్ పట్టిన క్యాచ్. మదన్‌లాల్ బౌలింగ్‌లో వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కపిల్ దేవ్ 25 గజాలు వెనక్కి పరుగెత్తి క్యాచ్ పట్టారు.

మొహిందర్ అమర్‌నాథ్ జీవిత చరిత్ర 'జిమ్మీ ది ఫీనిక్స్ ఆఫ్ 1983'లో అరుప్ సైకియా "ఈ క్యాచ్ దాదాపు మిస్ అయింది. దాన్ని అందుకోవడానికి యశ్‌పాల్ శర్మ కూడా పరిగెడుతున్నాడని మదన్‌లాల్ తన కంటి మూల నుంచి చూశాడు. కపిల్ అని అరుస్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. క్యాచ్ వైపు కదులుతున్నాడు కానీ ప్రేక్షకుల గోలలో యశ్‌పాల్‌కి ఏమీ వినిపించలేదు. అతను కూడా బంతి వైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. యశ్‌పాల్ శర్మ, కపిల్ దేవ్ ఒకరినొకరు ఢీకొనకుండా ఉండడం విశేషం" అని రాశారు.

వివియన్ రిచర్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్స్‌లో ఔటైన తర్వాత పెవిలియన్‌కు వస్తున్న వివియన్ రిచర్డ్స్

బౌలింగ్ చేస్తానని అడిగిన మదన్‌లాల్

రూల్స్ ప్రకారం ఆ ఓవర్ మదన్‌లాల్‌కి ఇవ్వకూడదు. అంతకు ముందు మదన్‌లాల్ వేసిన ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టడంతో కపిల్ దేవ్ మదన్‌లాల్‌ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయితే మదన్‌లాల్ కపిల్ వద్దకు వచ్చి ఇంకొక్క ఓవర్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని అడిగాడు. కపిల్ దేవ్ భయపడుతూనే మదన్‌లాల్‌కు బంతి ఇచ్చాడు.

మదన్‌లాల్ ఈసారి కపిల్‌దేవ్‌ని నిరాశ పరచలేదు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ “వివియన్ రిచర్డ్స్ మరో 10 ఓవర్లు కొనసాగితే మ్యాచ్ మాకు దక్కదని మాకు తెలుసు. రిచర్డ్స్ లాఫ్టెడ్ షాట్‌ను కపిల్ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆ మూడు నాలుగు సెకన్లు నా జీవితంలో అత్యంత విలువైనవి. కపిల్ ఆ క్యాచ్ పట్టిన వెంటనే, ఈరోజు ఏదో అద్భుతం జరుగుతుందని నాకు అనిపించిందని” అని మదన్‌లాల్ చెప్పాడు.

వివియన్ రిచర్డ్స్‌ను ఔట్ చేసిన మదన్‌లాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివియన్ రిచర్డ్స్‌ను ఔట్ చేసిన మదన్‌లాల్

43 పరుగులతో గెలిచిన ఇండియా

మ్యాచ్‌ను మలుపు తిప్పిన సంఘటన ఏదంటే.. మొదట ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి బలమైన స్థితిలో ఉన్న వెస్టిండీస్, 76 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్ వికెట్ కీపర్ జెప్ డూజాన్-మాల్కం మార్షల్ పోరాడినా అమర్‌నాథ్ వాళ్లిద్దర్నీ పెవిలియన్‌కు పంపించాడు.

కపిల్‌దేవ్ బౌలింగ్‌లో ఆండీ రాబర్ట్స్‌ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ కావడంతో విండీస్ జట్టు 126 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. హోల్డింగ్, గార్నర్ చివరి వికెట్‌కు మరో 14 పరుగులు జోడించారు. కానీ అమర్‌నాథ్ గార్నర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసినప్పుడు వెస్టిండీస్ జట్టు లక్ష్యానికి 43 పరుగుల దూరంలో ఉంది.

భారత్ విజయం సాధించిన తర్వాత రోజు టైమ్స్ పత్రిక “ కపిల్ మెన్ టర్న్‌ ద వల్డ్ అప్‌సైడ్ డౌన్ ( కపిల్ టీమ్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది) “అని హెడ్ లైన్ పెట్టింది. మరో బ్రిటిష్ పత్రిక “టైగర్స్ ఫైండ్ దెయిర్ క్లాస్( పులి పంజా విసిరింది) అని పతాక శీర్షిక పెట్టింది.

ఈ విజయంతో భారత జట్టు క్రికెట్ చరిత్రను తిరగరాసింది.

ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్టంప్‌లు తీసుకుని పరుగెత్తుతున్న భారత ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్టంప్‌లు తీసుకుని పరుగెత్తుతున్న భారత ఆటగాళ్లు

తెల్లవారు జామున మూడు గంటల వరకూ కొనసాగిన వేడుకలు

ఈ విజయం భారత జట్టు మద్దతుదారులకి చాలా ఉత్సాహాన్నిచ్చింది. అది ఏ స్థాయిలో ఉందంటే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు సభ్యులు లార్డ్స్ పక్కనే ఉన్న హోటల్‌కి చేరుకోవడానికి మూడు గంటలు పట్టింది.

ఇద్దరు పాకిస్తానీ ఆటగాళ్ళు సర్ఫరాజ్ నవాజ్, అబ్దుల్ ఖాదిర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కపిల్ తన ఆత్మకథ ‘స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్’ లో ‘‘మేము డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాగానే, సౌతాల్ నుంచి పంజాబీ బృందం మమ్మల్ని చుట్టుముట్టింది. వారు డ్రమ్స్‌తో వచ్చారు. డాన్స్ చేయడం ప్రారంభించారు. హోటల్‌కు చేరుకున్న తర్వాత, మేము కూడా తెల్లవారుజామున మూడు గంటల వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము, మొదట వారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గెలుచుకున్న అమర్‌నాథ్‌కి ఇచ్చిన షాంపైన్ బాటిల్‌ను పూర్తి చేశారు. తరువాత చాలా మద్యం తాగారు, బార్‌లో ఉన్న మద్యం అయిపోయింది’’ అని కపిల్ రాశారు.

"నేను చాలా అరుదుగా మద్యం తాగుతానని తెలిసినప్పటికీ అభిమానులు నన్ను షాంపేన్ తాగమని బలవంతం చేశారు. ఈసారి నేను వారి అభ్యర్థనను తిరస్కరించలేదు. రాత్రిపూట అప్పటికే రెస్టారెంట్లు మూసి వెయ్యడంతో మేము ఖాళీ కడుపుతో నిద్రపోయాము. సౌతాల్‌లో రెస్టారెంట్లన్నీ అటుగా వెళుతున్న వారందరికీ ఉచిత ఆహారం స్వీట్లు ఇస్తున్నాయని మాకు తర్వాత తెలిసింది” అని కపిల్ గుర్తు చేసుకున్నారు.

కపిల్ దేవ్ ఆత్మకథ

ఫొటో సోర్స్, MACMILLAN

క్రికెట్ ప్లేయర్లకు కొత్త అవకాశాల్ని తీసుకొచ్చిన విజయం

భారత్ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత దిల్లీ, కలకత్తా, బొంబాయిలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందంగా డాన్సులు చేశారు.

మిహిర్ బోస్ తన పుస్తకం 'ది నైన్ వేవ్స్'లో ‘‘భారతదేశంలోని లక్షల మంది టెలివిజన్ సెట్లలో ఈ దృశ్యాలను చూశారు. వారిలో నలుగురు క్రికెట్ ఆసక్తి ఉన్న పిల్లలు, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ఉన్నారు. వీళ్లు తర్వాతి కాలంలో భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకలా మారారు. ద్రవిడ్‌కు అప్పటికి 10 సంవత్సరాలు అని తర్వాత నాతో చెప్పాడు. అతను టీవీలో చూసిన మొదటి మ్యాచ్ ఇదే." అని రాశారు

ఈ విజయంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ టోనీ లూయిస్‌ తొలి కామెంట్‌ చేశాడు. "లంచ్‌ సమయంలో భారత్‌ 4 వికెట్లకు 100 పరుగులు చేసిన సమయంలో భారత్‌ గెలుస్తుందని నేను చెప్పాను. నిజానికి బంతి చాలా స్వింగ్‌ అవుతోంది. సమస్య ఏమిటంటే, బౌలర్లు తమ లైన్‌ను నియంత్రించుకోలేక మళ్లీ మళ్లీ వైడ్‌గా బౌలింగ్ చేస్తున్నారు. పిచ్ బౌన్స్ సరిగ్గా లేదు. ఒక ఓవర్‌లో 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న జోయెల్ గార్నర్ విసిరిన బంతి గావస్కర్ ముక్కు దగ్గరికి వెళుతోంది. అతని తదుపరి బంతి అతని మోకాళ్ల కిందకు వెళ్లినట్లు అనిపించింది."

మదన్‌లాల్, రోజర్ బిన్నీ ఇద్దరూ వెస్టిండీస్ బౌలర్ల కంటే ఎక్కువ కదలిక తెచ్చారని, మొహిందర్ అమర్‌నాథ్ కూడా మ్యాచ్ చివరి దశలో అద్భుతంగా రాణించారని గుండప్ప విశ్వనాథ్ అన్నారు.

"ఇండియా టీమ్ ఇన్నింగ్స్ పూర్తయి డ్రెస్సింగ్ రూమ్‌కి వస్తున్నప్పుడు మీరు ఈ రోజు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నారా అని నేను మాల్కం మార్షల్‌ను అడిగాను. అప్పుడు మాల్కం చెప్పిన సమాధానం నన్ను ఏదో ఆలోచింపజేసింది.

‘‘నేనే కాదు, మీరు కూడా బ్యాటింగ్ చేయాల్సి రావచ్చు.’’ అని ఆయన అన్నారని గార్నర్ చెప్పారు.

మార్షల్ ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేసేవారని, తాను పదో నంబర్‌లో బ్యాటింగ్ చేసేవాడినని జోయల్ గార్నర్ గుర్తు చేసుకున్నాడు.

భారత జట్టు చాలా బలహీనంగా ఉందని, టోర్నమెంట్ నుంచి వెళ్లిపోవడం మంచిదని టోర్నీ ప్రారంభానికి ముందే బ్రిటిష్ సమీక్షకుడు డేవిడ్ ఫ్రిత్ తన రివ్యూలో రాశాడు.

డేవిడ్ ఫ్రిత్ రివ్యూలు చాలా తీవ్రంగా ఉంటాయని పేరు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, ALEPH BOOKS

బొంబాయిలో అపూర్వ స్వాగతం

కప్పు గెలుచుకున్న వారం తర్వాత భారత జట్టు లండన్ నుంచి బొంబాయి బయలుదేరింది. జట్టు సభ్యులు ఎక్కిన విమానంలో కేక్ కట్ చేసేందుకు ఎయిరిండియా ఏర్పాట్లు చేసింది. బాంబే విమానాశ్రయంలో దిగగానే జట్టు సభ్యులను చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు.

అప్పుడా సమయంలో అక్కడ జోరున వర్షం కురుస్తోంది. అయినప్పటికీ క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు దాదాపు ముప్పై వేల మంది విమానాశ్రయానికి చేరుకున్నారు.

జట్టుకు స్వాగతం పలికేందుకు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. ప్రపంచ కప్‌ను ప్రజలు చూసేలా ఆటగాళ్లు అంతా ఉన్న వాహనానికి ముందు ఓ ప్రత్యేక వాహనంలో ఉంచారు.

ఈ కప్పుని ప్రత్యేక అనుమతితో బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. అది రన్నింగ్ ట్రోఫీ కాబట్టి, దీనిని ఇంగ్లీష్ గడ్డ నుంచి బయటకు పంపించేందుకు అనుమతి లేదు. దీంతో కప్పుని తీసుకు వచ్చేందుకు భారత జట్టు బాండ్ చెల్లించాల్సి వచ్చింది.

భారత జట్టు వాంఖడే స్టేడియానికి చేరుకోగానే అక్కడ యాభై వేల మంది నిలబడి స్వాగతం పలికారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ సమయంలో భారత క్రికెట్ బోర్డు దగ్గర జట్టు సభ్యులకు సన్మానం చేసేందుకు సరిపడా డబ్బు లేదు.

భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వే సహకారంతో దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో లతా మంగేష్కర్ సంగీత కచేరీ నిర్వహించి వచ్చిన మొత్తం నుంచి ఒక్కో క్రీడాకారుడికి లక్ష రూపాయల చొప్పున అందజేశారు.

బొంబాయిలో భారత జట్టుకు ఘన స్వాగతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొంబాయిలో భారత జట్టుకు ఘన స్వాగతం

స్వాగతించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి

తర్వాత భారత జట్టు దిల్లీ చేరుకుంది, అక్కడ హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని ఇందిరా గాంధీ జట్టు సభ్యులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఆటగాడితో కరచాలనం చేశాడు. మొదట ఇంగ్లీషులో, ఆ తర్వాత హిందీలో ప్రసంగించారు. దీని తరువాత, అధ్యక్షుడు జ్ఞానీ జైల్ సింగ్ జట్టు సభ్యులందరినీ తేనీటి విందు కోసం రాష్ట్రపతి భవన్‌కు పిలిచారు.

‘‘ప్రపంచకప్ ఆయన చేతుల్లో ఉంచి ‘ఇది మీ కోసమే’ అని చెప్పా. అప్పుడు జైల్ సింగ్ సరదాగా ఇది మనందరిదా అని అడిగారు. అవును మనం మరో మూడు నుంచి ఆరు నెలల వరకూ దీన్ని మనతోనే ఉంచుకోవచ్చు అని అన్నాను.’’ అని కపిల్‌దేవ్ వెల్లడించారు.

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను ప్రధాని ఇందిరా గాంధీ సత్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను ప్రధాని ఇందిరా గాంధీ సత్కరించారు.

‘‘ దీనికి జైల్ సింగ్ మాట్లాడుతూ..మనం తిరిగి ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుందా? అని అన్నారు. నేను లేదు అని చెప్పగానే అక్కడున్న టీమ్ సభ్యులంతా గట్టిగా నవ్వారు.’’ అని కపిల్ వెల్లడించారు.

ఇందిరాగాంధీ తమవైపు చూసి రాష్ట్రపతి ముందు అలా నవ్వకూడదని సూచించారని, కానీ తనకు అది అర్ధం కాలేదని కపిల్ చెప్పారు.

‘‘నేను అలా నవ్వుతూనే ఉన్నాను. కాసేపటి తర్వాత నాకొకకటి అనిపించింది. రాష్ట్రపతి మా విజయం పట్ల చాలా గర్వంగా ఉన్నారు. కానీ, కప్పు ఎందుకు తిరిగి ఇవ్వాలో ఆయనకు అర్థం కాలేదు’’ అని కపిల్ రాశారు.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)