వుమెన్స్ టీ20 వరల్డ్ కప్: ఆహా! అనిపించేలా ఆడిన 10 మంది క్రికెటర్లు ఎవరంటే..

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరోసారి టీ 20 ప్రపంచకప్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది.

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆరోసారి విజేతగా నిలిచింది.

ఈ టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు ఆస్ట్రేలియా జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా అవతరించింది.

అయితే, టోర్నీని తరచి చూస్తే ఆస్ట్రేలియా జట్టును కూడా నాకౌట్ భయం వెంటాడిన సందర్భం ఒకటి కనిపిస్తుంది.

భారత్‌తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్న సమయంలో కంగారూలు ఈ భయాన్ని అనుభవించారు.

దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

అయినా, ఆస్ట్రేలియా జట్టుకు విజయం అంత సులభంగా లభించలేదు. కానీ, ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగుల తేడాతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

టోర్నీలో ఆస్ట్రేలియా జట్టును భయపెట్టిన ఏకైక జట్టు భారత్.

టి20 ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

టోర్నీలో టీమిండియా ప్రయాణం

  • తొలి మ్యాచ్: పాకిస్తాన్ (146 పరుగులు)పై మరో 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది.
  • రెండో మ్యాచ్: వెస్టిండీస్ (118 పరుగులు)పై 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లతో గెలిచింది.
  • మూడో మ్యాచ్: ఇంగ్లండ్‌ చేతిలో 11 పరుగులతో ఓడింది.
  • నాలుగో మ్యాచ్: ఐర్లాండ్‌పై డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో గెలిచింది.
  • సెమీఫైనల్: ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 172 పరుగులు చేయగా, భారత్ 167 పరుగులే చేయగలిగింది.
ఆస్ట్రేలియా జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరోసారి టి20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు

డబ్ల్యూఐపీఎల్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల నుంచి ఏం నేర్చుకోవచ్చంటే...

టీ 20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత వుమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్) మొదలు కానుంది. వరల్డ్ కప్ విజేత జట్టులోని ఆసీస్ క్రికెటర్లు ఇక లీగ్‌లో ముఖాముఖి తలపడతారు.

భారతీయ క్రికెటర్లకు ముఖ్యంగా దేశవాళీ ప్లేయర్లకు ఇది మంచి అవకాశం. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలనుకునేవారికి ఆసీస్ ప్లేయర్లను అత్యంత సన్నిహితంగా పరిశీలించే అవకాశం లీగ్‌తో దక్కనుంది.

ఆస్ట్రేలియా జట్టు, వరల్డ్ కప్ విక్టరీలలో (2010, 2012, 2014, 2018, 2020, 2023) రెండు హ్యాట్రిక్‌లను సాధించింది. దీనికి కారణం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో వారి సాధికారత. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.

2020, 2022లో ఆస్ట్రేలియా జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ జట్టు ఫిట్‌నెస్ పెర్ఫార్మెన్స్ కోచ్ నోయల్ మెకార్తీ, ఇంగ్లిష్ వార్తా పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు.

‘‘ఆస్ట్రేలియా జట్టు అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడదు’’ అని ఆయన చెప్పారు.

కాబట్టి లీగ్‌లో ఆడగనున్న ఆష్లే గార్డ్‌నర్, బేత్ మూనీ, ఎలిస్ పెర్రీ వంటి ఆసీస్ క్రికెటర్ల నుంచి వర్ధమాన క్రికెటర్లు చాలా నేర్చుకోవచ్చు.

చాంపియన్లలా ఆడిన క్రికెటర్లు వీరే

తాజాగా ముగిసిన మహిళల టీ 20 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసిన క్రికెటర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ క్రికెటర్ల ప్రదర్శనను మనం మళ్లీ త్వరలోనే చూడొచ్చు. వారి ఆటకు సంబంధించిన చర్చల్ని వినొచ్చు.

డబ్ల్యూఐపీఎల్‌లో ఒక జట్టు విజయం కూడా వీరి ఆటతీరుతో ప్రభావం కావొచ్చు.

ఆష్లే గార్డ్‌నర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆష్లే గార్డ్‌నర్

1. ఆష్లే గార్డ్‌నర్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అయిన గార్డ్‌నర్, తాజా టి20 వరల్డ్ కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచింది. ఆమె 189 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు దక్కించుకున్నారు.

ఒక మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టింది. ఈ ప్రదర్శన టోర్నీలోనే అత్యంత ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

డబ్ల్యూఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన విదేశీ క్రికెటర్ ఆష్లే గార్డ్‌నర్. గుజరాత్ జెయింట్స్ జట్టు ఆమెను వేలంలో దక్కించుకుంది. ఇదే జట్టులో భారత ప్లేయర్ స్నేహ్ రాణా కూడా ఉంది.

బేత్ మూనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేత్ మూనీ

2. బేత్ మూనీ

ఫైనల్ మ్యాచ్‌ల్లో చెలరేగి ఆడటం బేత్ మూనీ ప్రత్యేకత.

2020, 2023 వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్‌లో ఈమె టాప్ స్కోరర్. 2018, 2019 మహిళల బిగ్ బాష్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ల్లో తన జట్టు అయిన బ్రిస్బేన్ హీట్‌ను గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నారు.

2020 టీ 20 వరల్డ్ కప్‌ టోర్నీలో కూడా బేత్ మూనీ, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచారు.

ఆరుసార్లు అంతర్జాతీయ టీ 20 టోర్నీ ఫైనల్స్ ఆడిన బేత్ మూనీ ఖాతాలో నాలుగు అర్ధసెంచరీలు సహా 99.33 సగటుతో 298 పరుగులు ఉన్నాయి.

డబ్ల్యూఐపీఎల్‌లో బేత్‌మూనీ కూడా గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.

స్మృతి మంధాన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతి మంధాన

3. స్మృతి మంధాన

టీ 20 ప్రపంచకప్‌ ఒక మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అలీ సిద్ధిఖీ చేసిన 102 పరుగుల తర్వాత, స్మృతి మంధాన చేసిన 87 పరుగులే రెండో అత్యధిక స్కోరు.

స్మృతి మంధాన, టీ 20 క్రికెట్‌లో 2800 పైచిలుకు పరుగులు సాధించింది.

డబ్ల్యూఐపీఎల్‌లో ఆమె రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును నడిపించనున్నారు.

అంతేకాకుండా తొలి ఎడిషన్ డబ్ల్యూఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన మహిళా క్రికెటర్‌గా స్మృతి ఘనత సాధించింది.

అలీసా హీలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలీసా హీలీ

4. అలీసా హీలీ

వరల్డ్‌కప్‌లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో అలీసా హీలీ 189 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అయిన హీలీ, లీగ్‌లో యూపీ వారియర్స్ తరఫున ఆడనున్నారు.

షబ్నమ్ ఇస్మాయిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షబ్నమ్ ఇస్మాయిల్

5. షబ్నమ్ ఇస్మాయిల్

గంటకు 127 కి.మీ. దాటే వేగంతో బౌలింగ్ చేయగల ఏకైక మహిళా క్రికెటర్ షబ్నమ్.

మహిళల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు (43) తీసిన బౌలర్ కూడా. దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నమ్ బౌలర్. అత్యధిక వేగంతో బంతులు సంధించడం, లైన్ అండ్ లెంగ్త్‌లో కచ్చితత్వాన్ని పాటించడం ఆమెకు ప్రత్యేకతలు.

తాజా వరల్డ్ కప్‌లో ఆమె 8 వికెట్లు పడగొట్టింది. మూడు మెయిడిన్ ఓవర్లు సంధించింది.

సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఫైనల్లో ఆస్ట్రేలియా జట్లు షబ్నమ్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాయి.

డబ్ల్యూపీఎల్‌లో షబ్నమ్, హీలీతో పాటు యూపీ వారియర్స్‌ తరఫున ఆడనుంది.

సోఫీ ఎకెల్‌స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోఫీ ఎకెల్‌స్టోన్

6. సోఫీ ఎకెల్‌స్టోన్

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సోఫీ ఎకెల్‌స్టోన్, వరల్డ్ కప్ టోర్నీలో తన స్పిన్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించింది.

టోర్నీలో అందరికంటే ఎక్కువగా 11 వికెట్లను దక్కించుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఎడమ వాటం బౌలర్, లీగ్‌లో యూపీ వారియర్స్‌కు ఆడనుంది.

స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై ఎకెల్‌స్టోన్ బౌలింగ్ ఆసక్తికరం కానుంది.

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్మన్ ప్రీత్ కౌర్

7. హర్మన్‌ప్రీత్ కౌర్

వరల్డ్ కప్ టోర్నీలో భారత్, సెమీఫైనల్ మ్యాచ్ విజయపు అంచుల వరకు చేరిందంటే దానికి కారణం హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసక బ్యాటింగ్.

భారత కెప్టెన్ కూడా అయిన కౌర్, టీ 20 క్రికెట్‌లో 3000 పైచిలుకు పరుగులు సాధించింది.

డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ మెరుపులను త్వరలో చూడొచ్చు.

రేణుకా సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేణుకా సింగ్

8. రేణుక సింగ్ ఠాకూర్

టీ 20 వరల్డ్ కప్-2023 టోర్నీలో భారత్ తరఫున బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్‌గా రేణుక గుర్తింపు సాధించింది.

ఈ టోర్నీలో మొత్తం 7 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మ్యాచ్‌లోనే 15 పరుగులిచ్చి 5 వికెట్లు దక్కించుకుంది.

దీప్తి శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దీప్తి శర్మ

9. దీప్తి శర్మ

టీ 20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన ఏకైక భారత క్రికెటర్ దీప్తి శర్మ. 25 ఏళ్ల దీప్తి శర్మ ఆల్‌రౌండర్. ఎడమ చేతితో బ్యాటింగ్ చేసే దీప్తి, కుడి చేతితో ఆఫ్ బ్రేక్ బంతుల్ని సంధిస్తుంది.

అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (188 పరుగులు) సాధించిన భారత క్రికెటర్‌గా ఆమెకు రికార్డు ఉంది. 2017లో ఐర్లాండ్‌తో వన్డేలో ఆమె 188 పరుగులు సాధించింది.

నేట్ సీవర్ బ్రంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేట్ సీవర్ బ్రంట్

10. నేట్ సీవర్ బ్రంట్

ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ నేట్ సీవర్ బ్రంట్, మహిళా టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై అజేయంగా 81 పరుగులు చేసి అనేక రికార్డులను సృష్టించింది.

ఈ టోర్నీలో ఇది మూడో అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన 213 పరుగులు కూడా టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో ఒక జట్టు సాధించిన అత్యధిక పరుగులు.

సీవర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్, పాకిస్తాన్‌పై 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పరుగుల పరంగా చూసుకుంటే టోర్నీలో ఇదే అతిపెద్ద విజయం.

వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వుల్వర్ట్ (230 పరుగులు) తర్వాత రెండో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ సీవర్. ఆమె ఈ టోర్నీలో 216 పరుగులు చేశారు.

సీవర్, లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనుంది.

వీరే కాకుండా, లీగ్‌లో తప్పకుండా చూడాల్సిన ఇతర మహిళా క్రికెటర్లు కూడా ఉన్నారు. వారిలో భారత్ నుంచి రిచా ఘోష్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కూడా జాబితాకు చెందినవారే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)