శుభ్‌మన్ గిల్: సెంచరీ కొట్టాక అతను అభివాదం చేశాడు... డబుల్ సెంచరీ అయ్యాక మైదానం అతనికి అభివాదం చేసింది

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, BCCI

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

182 పరుగుల వ్యక్తిగత స్కోరు నుంచి వరుసగా మూడు సిక్సర్లతో డబుల్ సెంచరీ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి!

వన్డేల్లో 194 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు ఎంతటి దిగ్గజ ప్లేయర్ అయినా కాస్త దూకుడు తగ్గించుకుంటాడు.

పైగా ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన ఫెర్గూసన్ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఇంకాస్త సంయమనం పాటిస్తాడు.

కానీ, 23 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు ఇవేవీ కనిపించలేదు. కూల్‌గా తన పని చేస్తూ వెళ్లాడు. 182 పరుగుల స్కోరు నుంచి ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు.

ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కునిగా (23 ఏళ్ల 132 రోజులు) రికార్డులకెక్కాడు.

ఈ ఇన్నింగ్స్‌తో అతన్ని ‘ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా బ్యాటింగ్’ అని క్రికెట్ నిపుణులు పిలుస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పరుగుల దాహం

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాధించాడు.

గిల్ ప్రత్యేకత ఏంటంటే బ్యాటింగ్‌లోకి దిగాక భారీగా పరుగులు చేయాలని తపిస్తాడు. 30-40 పరుగులు చేస్తే తనకు సంతృప్తి ఉండదు.

గత సిరీస్‌లో వ్యాఖ్యాతగా ఉన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడుతూ, గిల్ భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే భారీ సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయాలని అన్నారు.

హైదరాబాద్‌లో బుధవారం న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ ఇదే చేసి చూపించాడు.

అతను 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు సాధించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మిగతా భారత బ్యాట్స్‌మెన్ అంతా పరుగులు చేయలేక విఫలమైన చోట, గిల్ ఇన్నింగ్స్ భారత్‌కు దాదాపు 350 పరుగుల స్కోరును అందించింది.

ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, భారత్ తరఫున అయిదో బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు.

గిల్ కంటే ముందు భారత్ నుంచి రోహిత్ శర్మ, సచిన్ తెందూల్కర్ , వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్ వన్డేల్లో 200 పరుగుల మార్కును దాటారు.

మరో ముగ్గురు గేల్, గప్టిల్, ఫఖర్ జమాన్ మాత్రమే వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు.

ఈ ఇన్నింగ్స్‌తో న్యూజీలాండ్‌తో తొలి వన్డేలో భారత్ గెలవడమే కాకుండా భారత వన్డే జట్టులో అతనికి చోటు దాదాపు ఖాయమైంది.

భారత్ కొంతకాలంగా వన్డేల్లో రోహిత్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడి కోసం వెదుకుతోంది. ఇషాన్ కిషన్ ఈ రేసులో నిలిచాడు. కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు.

కానీ, శ్రీలంకతో సిరీస్‌లో సెంచరీతో పాటు తాజాగా డబుల్ సెంచరీ చేసిన గిల్ తన విలువను చాటుకున్నాడు. ఓపెనర్‌ రేసులో ఇషాన్ కంటే ముందు వరుసలో నిలిచాడు.

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, ANI

డబుల్ సెంచరీతో గిల్ ఖాతాలో రికార్డులు

డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ ఖాతాలో రెండు పెద్ద రికార్డులు వచ్చి చేరాయి.

మొదటిది, వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా గిల్ ఘనత సాధించాడు. ప్రస్తుతం గిల్ వయస్సు 23 ఏళ్ల 133 రోజులు. దీంతో ఇప్పటివరకు ఇషాన్ కిషాన్ (24 ఏళ్లు) పేరిట ఉన్న ఈ రికార్డు గిల్ చెంత చేరింది.

రెండోది, ఈ ఇన్నింగ్స్‌తో అతను వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా అతను నిలిచాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌లలో గిల్ 1,000 పరుగులు మార్కును అందుకున్నాడు. దీంతో వెయ్యి పరుగులు వేగంగా చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా గిల్ రికార్డు సాధించాడు.

ఈ కేటగిరీలో వరల్డ్ రికార్డు పాకిస్తాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్ పేరిట ఉంది. అతను 18 ఇన్నింగ్స్‌లలోనే వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేశాడు.

పాక్‌కే చెందిన ఇమాముల్ హక్ కూడా గిల్ తరహాలోనే 19 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగులు సాధించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఇదే కాకుండా న్యూజీలాండ్‌పై భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే (208). 1999లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లోనే సచిన్ తెందూల్కర్ 186 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు భారత క్రికెటర్‌కు కివీస్‌పై ఇదే అత్యధిక స్కోరు. దీన్ని గిల్ తన పేర రాసుకున్నాడు.

తన కెరీర్‌లో భారత్ తరఫున ఆడిన మ్యాచ్‌ల్లో తాను సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవరాల్‌గా గిల్ వన్డేల్లో మూడు సెంచరీలు, టెస్టుల్లో ఒక సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్‌ల్లో 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న గిల్, మైదానంలో కూర్చొన్న 31,000కి పైగా అభిమానులకు అభివాదం చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. 150 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్‌తోనే పూర్తిచేశాడు.

150 నుంచి 200 పరుగులు చేయడానికి అతనికి కేవలం 23 బంతులే అవసరం అయ్యాయి. 49వ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో ఫైన్‌లెగ్, లాంగాఫ్, లాంగాఫ్ దిశగా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకోగానే మైదానంలోని అభిమానులంతా అతనికి జేజేలు పలికారు.

శుభ్‌మన్ గిల్

ఫొటో సోర్స్, RANDY BROOKS/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శుభ్‌మన్ గిల్
  • బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజీలాండ్‌పై గెలుపొందింది.
  • టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 349 పరుగులు చేసింది.
  • శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేశాడు.
  • న్యూజీలాండ్ తరఫున మైఖేల్ బ్రేస్‌వెల్ 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు సాధించాడు.
కుల్దీప్ యాదవ్‌‌తో గిల్

ఫొటో సోర్స్, ANI

‘‘వికెట్లు పడుతున్నా ఆడాలనుకున్నా’’-గిల్

‘‘దూకుడుగా ఆడాలని ముందే అనుకోలేదు. కానీ, సర్కిల్ లోపల ఎక్స్‌ట్రా ఫీల్డర్ ఉన్నప్పుడు ఇతర జట్లు, మిడిల్ ఓవర్లలో పరుగులు చేయడాన్ని మేం చూస్తున్నాం. ఈరోజు కూడా వికెట్లు పడుతున్నప్పటికీ బౌలర్లపై ఎదురుదాడి చేయాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నా.

ఎందుకంటే బ్యాటర్ బౌండరీలు బాదాలనే ఉద్దేశాన్ని చాటకపోతే, బౌలర్లకు డాట్ బాల్స్ వేయడం సులభం అవుతుంది. అందుకే వికెట్లు పడుతున్నప్పటికీ నేను ధాటిగా ఆడాలనే నా ఉద్దేశాన్ని చాటాలని అనుకున్నా. వికెట్లు పడుతున్నా బౌలర్ల నుంచి చెత్త బంతి వస్తే దాన్ని బౌండరీకి తరలిస్తానని చెప్పాలనుకున్నా.

డబుల్ సెంచరీ చేయడం చాలా అద్భుతంగా ఉంది. శ్రీలంకతో మొదటి వన్డే, మూడో వన్డేలో కూడా భారీ స్కోరు సాధించాలని నేను భావించా. కానీ, దురదృష్టవశాత్తు చేయలేకపోయా. ఒకసారి నేను క్రీజులో కుదురుకున్నాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే నా దృష్టి ఉంటుంది. అనుకున్నది జరిగితే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని పాత్రికేయుల సమావేశంలో గిల్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో ఓ దశలో గిల్ 11 బంతుల వ్యవధిలో ఆరు సిక్సర్లు బాదడం చూస్తే అతను ఎంత ధాటిగా బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది.

వీడియో క్యాప్షన్, భారీ కిట్‌తో హరియాణా బస్సులో ప్రయాణిస్తూ రోజూ ఎత్తిపొడుపు మాటల్ని భరించిన ఓ యువతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)