సౌదీ అరేబియా: ప్రేయసితో రోనాల్డో సహజీవనానికి ‘షరియా’ నుంచి మినహాయింపు ఇస్తారా?

క్రిస్టియానో రోనాల్డో, జార్జినా

ఫొటో సోర్స్, EPA/RAUL CARO CADENAS

ఫొటో క్యాప్షన్, క్రిస్టియానో రోనాల్డో, జార్జినా

దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకరైన క్రిస్టియానో రోనాల్డో ఇటీవల సౌదీ అరేబియాలోని అల్-నస్ర్ క్లబ్‌లో చేరారు. ఆ తర్వాత సౌదీలో ఆయన తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

కొన్ని ఫోటోల్లో సౌదీ అధికారులతో భోజనం చేస్తూ రోనాల్డో కనిపించారు. మరికొన్ని వీడియోల్లో సౌదీ ప్లేయర్లతో ఆయన ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తున్నారు.

అయితే, సౌదీ అరేబియాలో రోనాల్డో వ్యక్తిగత జీవితంపైనా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌ జార్జినాతో సౌదీలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో ఆయన ఉంటున్నారు.

సౌదీలోని ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం, ఇక్కడ సహజీవనంపై నిషేధం అమలులోనుంది.

ఇక్కడ పెళ్లి కాకుండా కలిసి జీవించడం లేదా సెక్స్ చేయడం నేరం. దీనికి కఠినమైన శిక్షలు కూడా విధిస్తారు.

అయితే, రోనాల్డో సహజీవనంపై ఇటు ఆయన గానీ, సౌదీ అరేబియా అధికారులు గానీ, అల్-నస్ర్ ఫుట్‌బాల్ క్లబ్ కానీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

క్రిస్టియానో రోనాల్డో, జార్జినా

ఫొటో సోర్స్, EPA/STR

మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్

సౌదీ అరేబియాకు వచ్చిన తర్వాత రోనాల్డో, జార్జినాలకు అల్-నస్ర్ క్లబ్ భారీ విందును ఏర్పాటుచేసింది. దీనికి బుర్ఖా వేసుకుని జార్జినా హాజరయ్యారు.

సౌదీ క్లబ్‌తో రోనాల్డో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అరబ్ దేశాల ఫుట్‌బాల్ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయిగా స్పోర్ట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, రోనాల్డో రాకతో ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాల్లో మినహాయింపులు, రాజకీయ నాయకుల చర్యలపైనా మీడియాలో చర్చ జరుగుతోంది.

షరియా చట్టల నుంచి రోనాల్డో, అతడి భార్య జార్జినాలకు మినహాయింపు ఇవ్వొచ్చని ఇక్కడి ఫుట్‌బాల్ వర్గాలు మీడియాతో చెబుతున్నాయి.

సౌదీ యువరాజు మహ్మమద్ బిన్ సల్మాన్.. ‘‘సౌదీ అరేబియా విజన్ 2030’’లో ఇలాంటి మినహాయింపులు కూడా ఒక భాగమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు స్పోర్ట్స్ ఇలాంటి కొన్ని మినహాయింపులు ఇస్తున్నారని కూడా అంటున్నారు.

క్రిస్టియానో రోనాల్డో, జార్జినా

ఫొటో సోర్స్, Reuters

గత కొన్ని నెలల్లో రోనాల్డో కెరియర్ చాలా మలుపులు తిరిగింది. ఇప్పుడు ఆయన కెరియర్ పీక్ దశల్లో ఉన్నారు.

మాంచెస్టర్ యునైటెడ్‌తో ఏడాది క్రితం రోనాల్డో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్లబ్‌లో సీనియర్ మేనేజ్‌మెంట్‌తో అతడికి విభేదాలు వచ్చాయి. వీటిపై బహిరంగంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఆ ఇంటర్వ్యూ తర్వాత రోనాల్డోను దూరం పెట్టాలని క్లబ్ కూడా నిర్ణయం తీసుకొంది.

గతేడాది ఫిఫా ప్రపంచ క్లబ్‌లోనూ పోర్చుగల్ జట్టు మేనేజర్‌తో విభేదాల నడుమ రౌండ్ 16 మ్యాచ్‌లో ఆయన్ను విడిగా పెట్టారు.

అయితే, స్విట్జర్లాండ్‌పై మ్యాచ్‌ను జట్టు గెలిచినప్పటికీ, క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకోపై పోర్చుగల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

37 ఏళ్ల రోనాల్డోకు అది చివరి ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌గా మీడియాలో వార్తలు వచ్చాయి. మొరాకోతో మ్యాచ్‌ తర్వాత భావోద్వేగాలతో ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

క్రిస్టియానో రోనాల్డో, జార్జినా

ఫొటో సోర్స్, Reuters

రోనాల్డో.. షరియా..

సౌదీ అరేబియాలో అమలవుతున్న షరియా చట్టాల ప్రకారం.. పెళ్లికాని వారు కలిసి జీవించకూడదు.

ఎవరైనా మహిళా, పురుషుడు కలిసి హోటల్ లేదా అద్దె ఇంటి కోసం వెళ్లినప్పుడు అక్కడివారు పెళ్లి పత్రాలు అడుగుతారు. వీటిని పైఅధికారులకు వారు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ చట్టాలను ఉల్లంఘిస్తే, తీవ్రమైన శిక్షలు విధిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా విదేశీయుల విషయంలో ఈ చట్టాల్లో మార్పులు చేస్తూ వచ్చారు.

2019లో సౌదీ వీసా విధానాలను కూడా సరళీకృతం చేశారు. వీటి ప్రకారం, అవివాహత విదేశీ జంటలు కూడా ఇక్కడ హోటల్ రూమ్స్ తీసుకోవచ్చు. ఒంటరి మహిళలకు కూడా ఇక్కడ హోటల్ రూమ్స్ ఇస్తారు.

వీడియో క్యాప్షన్, 'నీళ్లు తాగండి' అన్న రొనాల్డో... 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా

ప్రస్తుతం సౌదీ అరేబియాలో రోనాల్డో, జార్జినా చాలా కాలం ఉండాల్సి రావొచ్చు. కాబట్టి వారికి ఇచ్చే మినహాయింపులపై చర్చ జరుగుతూనే ఉంటుంది.

‘‘సౌదీ చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కానీ, ఇతర విదేశీయులకు ఇచ్చినట్లే రోనాల్డో, జార్జినాకు కూడా మినహాయింపులు ఇస్తారు’’అని ఒక లీగల్ నిపుణుడు మీడియాతో చెప్పారు.

‘‘రోనాల్డో చాలా గొప్ప ఆటగాడు. అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా సౌదీ రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటారు’’అని ఇద్దరు సౌదీ న్యాయవిభాగం అధికారులు చెప్పినట్లు స్పానిష్ వార్తా సంస్థ ఈఎఫ్ఈ ఒక కథనాన్ని ప్రచురించింది.

వీడియో క్యాప్షన్, డేవిడ్ బెక్‌హమ్: 12 గంటలకు పైగా క్యూలో నిలబడి క్వీన్ ఎలిజబెత్ 2కు నివాళులు

‘‘అయితే, పెళ్లి కాకుండా కలిసి జీవించడం ఇప్పటికీ ఇక్కడ నేరమే. కానీ, చాలా కేసుల్లో ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. కానీ, ఏదైనా నేరం జరిగితే, అప్పుడు ఈ నిబంధనలను కూడా కలిపి శిక్ష విధిస్తారు’’అని ఆ అధికారులు చెప్పారు.

రోనాల్డో, జార్జినా దాదాపు ఏడేళ్ల నుంచి కలిసి జీవిస్తున్నారు. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్‌కు ఆడుతున్నప్పటి నుంచి వీరిద్దరికీ పరిచయముంది.

రోనాల్డో, జార్జినాలకు పెళ్లి కాలేదు. కానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వీరికి సౌదీ మినహాయింపులు ఇవ్వొచ్చనే వార్తల నడుమ ఒక సౌదీ నెటిజన్ ట్విటర్‌లో అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఇక్కడ ఆంక్షలు, చట్టాలు పేదవారి కోసమేనా?’’అని ఆయన ప్రశ్నించారు.

మరికొందరు మాత్రం మినహాయింపులకు స్వాగతం పలుకుతూనే, అసలు వారిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అని ప్రశ్నిస్తున్నారు.

(కాపీ: అనంత్ ప్రకాశ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)