మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
లియోనల్ మెస్సీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు ‘ఫిపా’ వరల్డ్ కప్‌ను అందించాడు.
సుదీర్ఘ కాలంగా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తోన్న దేశం నిరీక్షణకు తెరదించడమే కాకుండా, తన చిరకాల స్వప్నాన్ని కూడా మెస్సీ సాకారం చేసుకున్నాడు.
ఏడుసార్లు ప్రతిష్టాత్మక ‘‘బాలన్ డి ఓర్’’ టైటిల్‌ను గెలుచుకున్న మెస్సీ 10 సార్లు లాలీగా టైటిల్‌ను నెగ్గిన జట్టులో, నాలుగు సార్లు చాంపియన్స్ లీగ్ గెలుచుకున్న టీమ్‌లో సభ్యుడు కూడా.
ఆదివారం ఖతార్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు, వరల్డ్ కప్ టైటిల్ మినహా ఫుట్‌బాల్ ఆటలోని ప్రధాన ఘనతలన్నీ మెస్సీ ఖాతాలో ఉన్నాయి.
డీగో మారడోనా నేతృత్వంలో 36 ఏళ్ల క్రితం అంటే 1986లో అర్జెంటీనా జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెస్సీ తాజాగా దేశానికి ప్రపంచకప్‌ను అందించాడు.
విజయం తర్వాత, మెస్సీ కంట కన్నీరు రావడం అందరూ చూశారు. జట్టు సభ్యులతో కలిసి గెలుపు సంబరాల్లో మెస్సీ పాల్గొన్నాడు. స్టేడియంలోని ప్రేక్షకులంతా అర్జెంటీనా జట్టుకు జయజయధ్వానాలు చేశారు.
అనంతరం మెస్సీ తల్లి ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నారు. మెస్సీ తండ్రి కూడా తన కుమారుని ఘనత చూసి సంతోషించారు. భార్య, పిల్లలు కూడా ఈ ఆనందంలో పాలుపంచుకున్నారు.
తమ తండ్రి గొప్ప ఘనత సాధించాడనే భావన మెస్సీ పిల్లల కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఇది మెస్సీకి ఆరో ప్రపంచకప్. ఇదే తన చివరి వరల్డ్ కప్ అవుతుందని మెస్సీ ఇంతకుముందే ప్రకటించాడు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
ఈ మ్యాచ్ వరకు జీఓఏటీ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే ట్యాగ్‌ను మెస్సీ పేరుకు ముందు ఎవరూ ఉపయోగించలేదు. కానీ, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రీమియర్ లీగ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు థియో వాల్కట్, మెస్సీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ సంబోధించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మెస్సీ శనివారం జరిగిన ఫైనల్లో గోల్స్ చేయడంలోని తన అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించారు.
మెస్సీ వరల్డ్ కప్‌ను అందుకున్న తర్వాత ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా మరో దిగ్గజ ఆటగాడిని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు.
ఆ దిగ్గజ ప్లేయర్ ఎవరో కాదు భారత క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
తేదీ: 2011 ఏప్రిల్ 2, వేదిక: ముంబైలోని వాంఖడే స్టేడియం.
అప్పటికే సచిన్ పేరిట వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు ఉన్నాయి.
అప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్‌లు గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడు కూడా. మ్యాచ్ ఫిక్సింగ్ తుపాను తర్వాత భారత క్రికెట్ ప్రతిష్ట పునరుద్ధరణలో పాటుపడిన ఆటగాళ్లలో సచిన్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత కెప్టెన్ అనే ముళ్ల కిరీటాన్ని కూడా సచిన్ ధరించాడు.
మిడిలార్డర్ ఆటగాడి నుంచి ఓపెనర్‌గా అవతారం ఎత్తి కొత్త బంతుల్ని సమర్థంగా ఎదుర్కోవడం, చేయి తిరిగిన బౌలర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ సిక్సర్లూ ఫోర్లు బాదడం, సెంచరీలు స్కోర్ చేయడం ఇలా సచిన్ చుట్టూనే భారత క్రికెట్ బ్యాటింగ్ అంతా తిరిగేది.
భారత క్రికెట్ అభిమానుల్లో సచిన్‌పై నమ్మకం, అభిమానం ఏ స్థాయిలో ఉండేదంటే మ్యాచ్‌లో సచిన్ అవుటైతే ఇక టీవీలు కట్టేసేవారు.
అప్పటికే క్రికెట్‌లో సచిన్ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఆయన సుదీర్ఘ కెరీర్‌లో ఒకే ఒకటి లోటుగా మిగిలిపోయింది. వరల్డ్ కప్‌ను అందుకునే అదృష్టం అతనికి ఎప్పుడూ రాలేదు.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో పటిష్టమైన వెస్టిండీస్ జట్టును ఓడించి భారత్ తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలుపొందినప్పుడు సచిన్ వయస్సు 10 ఏళ్లు మాత్రమే.
మరోవైపు, 2007లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు జట్టులో సచిన్ సహా సీనియర్ ప్లేయర్లందరికీ రెస్ట్ ఇచ్చారు. కాబట్టి టి20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో సచిన్ లేడు.
2011లో ఏమైంది?

ఫొటో సోర్స్, Getty Images
సచిన్ టెండూల్కర్ 1992 నుంచి అయిదు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతోంది. అంటే సచిన్ సొంతగడ్డపై ఆ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
సచిన్ టెండూల్కర్ కోసం ఆ ప్రపంచకప్‌ను గెలవాలని జట్టు మొత్తం పట్టుదలతో ఉంది. అభిమానులు కూడా విపరీతంగా జట్టుకు మద్దతు ప్రకటించారు.
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ జోడీ జట్టులోని ఆటగాళ్లందరికీ ఆటపరంగా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మ్యాచ్‌ను ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, ఆస్వాదిస్తూ ఆడాలని ఆటగాళ్లకు సూచించారు. ఆరోగ్యం బాలేకపోయినప్పటికీ యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడాడు.
ఈ టోర్నీ ఆసాంతం యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా ఆడాడు. ఆ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌కు ఒక కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఒక మ్యాచ్‌లో సురేశ్ రైనా అద్భుతంగా ఆడితే, మరో మ్యాచ్‌లో జహీర్ ఖాన్, ఇంకో దానిలో గౌతమ్ గంభీర్ ఇలా ప్రతీ ఒక్కరూ అవసరమైన సమయంలో జట్టుకు ఉపయోగపడే ఆటతీరు కనబరిచారు.
జట్టు సమష్టిగా ప్రదర్శన చేస్తే ఎంతటి అద్భుత ఫలితాలు వస్తాయనేది భారత జట్టు చేసి చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
జట్టుతో పాటు సచిన్ గెలిచినప్పుడు
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు 274 పరుగుల లక్ష్యం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో సచిన్ తన స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కానీ, గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును చాంపియన్‌గా నిలిపారు. ఆ విజయం తర్వాత సచిన్ టెండూల్కర్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.
సచిన్ వెంటనే వెళ్లి యువరాజ్ సింగ్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ సన్నివేశం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయింది. సచిన్ తన చేతుల్లోకి త్రివర్ణ పతాకాన్ని తీసుకోగానే యూసుఫ్ పఠాన్ వచ్చి అతన్ని తన భుజాలపైకి ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిరిగాడు. సచిన్ ఆనందంగా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు.
స్టేడియం మొత్తం ఈ క్రికెట్ దిగ్గజానికి సెల్యూట్ చేయడం ప్రారంభించింది. సచిన్ తన బ్యాటుతో ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
లక్షలాది మంది అభిమానుల ఆశలన్నీ వారిపైనే
అర్జెంటీనా, దక్షిణ అమెరికాకు చెందిన ఒక దేశం. భారత్‌లో క్రికెట్‌ను పూజిస్తారు. మెస్సీ, అర్జెంటీనాలో ‘హీరో’ అయితే, భారత్‌లో సచిన్ టెండూల్కర్‌ను దేవుడిగా కొలుస్తారు.
క్రికెట్, ఫుట్‌బాల్ రెండూ వేర్వేరు ఆటలు. కానీ సచిన్, మెస్సీ తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న తీరు దాదాపు ఒకేలా ఉంది. తన చివరి వరల్డ్ కప్‌లో మెస్సీ తన పవర్ చూపిస్తూ గోల్స్ సాధించాడు. అలాగే సచిన్ కూడా తన చివరి వరల్డ్ కప్‌లో 2 సంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 482 పరుగులు స్కోర్ చేశాడు.
అప్పుడు సచిన్, ఇప్పుడు మెస్సీ కోట్లాది మంది ఆశల్ని మోస్తూ వరల్డ్ కప్‌లో అడుగుపెట్టారు. అభిమానులంతా తమకు కప్ అందించేది ఈ ఇద్దరు ఆటగాళ్లేనని నమ్మారు. ఆ ఒత్తిడికి వీరిద్దరూ విసిగి పోలేదు. అభిమానుల ప్రేమ వారి బలాన్ని పెంచింది.
ప్రత్యేక బహుమతి
ఖతార్ వరల్డ్ కప్ ఫైనల్లో ఒక్కసారిగా అర్జెంటీనా కలలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబాపే 2 గోల్స్ చేసినప్పుడు అర్జెంటీనా ఆటగాళ్లు అచేతనంగా మారిపోయారు. అప్పుడు మెస్సీ వరల్డ్ కప్ కల ఇక నెరవేరదేమో అనిపించింది.
2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఉత్కంఠకర క్షణాలు ఎదురయ్యాయి. అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కరవుకు స్వస్తి పలకాలని విధి కూడా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.
ఈ 11 ఏళ్ల విరామంలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు తమ కలను నెరవేర్చుకోవడమే కాకుండా చాలా కాలం తర్వాత ప్రపంచకప్ రూపంలో తమ దేశానికి, అభిమానులు ప్రత్యేక బహుమతిని ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జెర్సీ నంబర్ 10
ఆదివారం మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్, మెస్సీల ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. సచిన్ టెండూల్కర్ ట్వీట్ ద్వారా మెస్సీ, అర్జెంటీనాలకు శుభాకాంక్షలు తెలిపారు.
వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభానికి ముందు ‘క్రిక్‌ట్రాకర్’ చేసిన ట్వీట్‌ను సచిన్ రీట్వీట్ చేశాడు. అందులో సచిన్, మెస్సీ పదో నంబర్ జెర్సీ ధరించి కనిపిస్తారు.
మైదానంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు పదో నంబర్ జెర్సీతోనే బరిలోకి దిగుతారు.
వీరిద్దరి మధ్య మరో సారూప్యత కూడా ఉంది. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. 2011లో సచిన్ ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోగా, ఇప్పుడు 2022లో మెస్సీ ఈ ట్రోఫీని సాధించాడు.
ఇవి కూడా చదవండి:
- ఫుట్‌బాల్ ప్రపంచకప్: అద్భుతాలు, ఆశ్చర్యాలు, మెరుపులు
- బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు
- స్వలింగ సంపర్కం ఒక వ్యాధిలాంటిదా, తల్లిదండ్రులు ఏమనుకుంటారు?
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- ‘శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















