ఫిఫా వరల్డ్ కప్: జాతీయ గీతాలాపనలో ఇరాన్ ఆటగాళ్ళ మౌనం... స్వదేశంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన

మౌనంతో నిరసన తెలిపిన ఇరాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మౌనంతో నిరసన తెలిపిన ఇరాన్ జట్టు
    • రచయిత, షైమా ఖలీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌లో ఒక విశేషంచోటు చేసుకుంది. అది ఆటలో కాదు. ఒక జట్టు ఆటగాళ్లు, తమ దేశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఫీఫా వేదికగా నిరసన తెలిపారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్న తరుణంలో, ఆ దేశ జట్టు సభ్యులు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ముందు జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉండగా, జాతీయగీతం పాడకుండా మౌనంగా నిలబడి, తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలిపారు.

ఇరాన్ జాతీయ గీతం వినిపిస్తుండగా, కొందరు ఫుట్‌బాల్ అభిమానులు ‘విమెన్, లైఫ్, ఫ్రీడం’ అన్న నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని కనిపించారు.

అయితే, ఇరాన్ జాతీయ టెలిజన్ ఈ కార్యక్రమానికి కవరేజ్‌ను తగ్గించింది. మైకులో జాతీయగీతం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా స్టేడియం వైడ్‌షాట్ దృశ్యాలను ప్రసారం చేసింది.

ఇటీవలి కాలంలో ఇరాన్‌లో హిజాబ్‌కు, మోరల్ పోలిసింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబరులో మహాసా అమినీ అనే 22 ఏళ్ల మహిళ మోరల్ పోలీసుల కస్టడీలో మరణించడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

హిజాబ్ సరిగా ధరించలేదని మహాసాను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇరాన్ భద్రతా దళాల కఠిన అణిచివేత చర్యల కారణంగా సుమారు 400 మందికి పైగా నిరసనకారులు మరణించారని, 16,800 మందిని అరెస్టు చేశారని మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించారు.

అయితే, ఈ ఆందోళనలను విదేశీ శత్రువుల ప్రోత్సాహంతో నడుస్తున్న ‘అల్లర్లు’గా ఇరాన్ నాయకులు అభివర్ణిస్తున్నారు.

నిరసన తెలుపుతున్న ఇరాన్ అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసన తెలుపుతున్న ఇరాన్ అభిమానులు

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను తరచూ విమర్శించే వ్యక్తి, ఇటీవలి నిరసన ఉద్యమాల్లో ప్రముఖంగా కనిపిస్తున్న మాజీ ఫుట్‌బాలర్‌ను గుర్తు చేసుకుంటూ ఇరాన్ అభిమానులు ‘అలీ కరిమి’ అంటూ నినాదాలు చేయడం కూడా ఇక్కడ వినిపించింది.

అలాగే బీ షరాఫ్ అంటూ కూడా అభిమానులు నినాదాలు చేశారు. పర్షియన్ భాషలో ఈ మాటకు ‘ఏమాత్రం గౌరవించలేనిది, దుర్మార్గమైనది’ అని అర్ధం. ఇరాన్‌లో భద్రతా దళాలకు వ్యతిరేకంగా నిరసనకారులు తరచూ ఈ మాటను ఉపయోగిస్తున్నారు.

ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న వారు ఇటీవల ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు మీద కూడా విమర్శలు కురిపించారు. వారు నిరసనలకు మద్ధతు ఇవ్వడం లేదని, పైగా ఈ మధ్య దేశాధ్యక్షుడిని కూడా కలిశారని ఆరోపించారు.

సోమవారం నాటి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు కెప్టెన్ ఎహ్సాన్ హజ్సాఫీ మాట్లాడారు. ఉద్యమంలో మరణించిన వారికి మద్ధతు తెలిపారు.

‘‘ప్రపంచ కప్ నిబంధనలకు అనుగుణంగా, క్రీడాస్ఫూర్తి దెబ్బతినకుండా ఆటగాళ్లు తమ దేశంలోని మహిళా హక్కుల నిరసనకారులకు మద్ధతు ప్రకటించారు’’ అని జట్టు మేనేజర్ కార్లోస్ క్వీరోజ్ అన్నారు.

సెప్టెంబరులో రెండు వామప్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడినప్పుడు కూడా ఇరాన్ ఆటగాళ్లు వారి జాతీయ జట్టు బ్యాడ్జ్‌ను వాడలేదు.

హిజాబ్ లేకుండా ఇరాన్ మహిళల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజాబ్ లేకుండా ఇరాన్ మహిళల నిరసన

వారిని ఫుట్‌బాల్ ఆడనివ్వండి -క్విరోజ్

గ్రూప్-బి లో సోమవారం 2-6 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఇరాన్ ఓటమి పాలైంది. స్వదేశంలో రాజకీయ అశాంతి తమ జట్టు ఆటతీరును దెబ్బతీసిందని క్వీరోజ్ అన్నారు.

‘‘ఫుట్‌బాల్ కాకుండా వేరే విషయాలతో జట్టును డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వారిని మా జట్టు సభ్యులు పట్టించుకోరు. వారు ఇక్కడికి కేవలం ఫుట్‌బాల్ ఆడటానికి మాత్రమే వచ్చారు’’ అని క్వీరోజ్ అన్నారు..

‘‘వారిని ఫుట్‌బాల్ ఆడనివ్వండి. ఎందుకంటే వారు దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఇతర జాతీయ జట్లలాగే తమ దేశానికి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్నారు. అన్ని జాతీయ జట్లకు స్వదేశంలో ఏదో ఒక సమస్య ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ప్రపంచ కప్‌లో ఆడటానికి వచ్చిన వారిని, తమకు సంబంధం లేని పనులు చేయమని కోరడం సరికాదు. వాళ్లు ప్రజలు గర్వించే పనులు చేయాలని కోరుకుంటున్నారు’’ అని మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ అసిస్టెంట్ ఒకరు వ్యాఖ్యానించారు.

‘‘ఈ టీమ్ సభ్యుల మనసులో ఇప్పటి వరకు ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఫుట్‌బాల్ క్రీడాకారులుగా తమ మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పడానికి వారు ప్రయత్నించారు’’ అని ఆయన అన్నారు.

మ్యాచ్ ఆఫ్ టైమ్‌లో ఈ సంఘటన గురించి మ్యాచ్ ఆఫ్ ది డే ప్రజెంటర్ గ్యారీ లినేకర్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘ఇది శక్తివంతమైన, కీలకమైన సందేశం. ఫుట్‌బాల్ తన శక్తిని మంచి కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని ఆయన అన్నారు.

జాతీయ జెండాపై నినాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాతీయ జెండాపై నినాదాలు

ఇది కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ కాదు, అంతకంటే ఎక్కువ

ఆటలో ప్రతీకాత్మక హావభావాల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం అంతటా జాతీయ గీతం వినిపిస్తుండగా, ఇరాన్ ఆటగాళ్లు మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు.

స్టేడియంలో నాతో మాట్లాడిన ఓ అభిమాని దీని గురించి చెబుతూ ‘‘ఇది నా దేశ ప్రజల కోసం. అక్కడ మా గొంతులు నొక్కుతున్నారు. ప్రజలను చంపుతున్నారు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇరాన్‌ టీమ్‌కు మద్ధతుగా అక్కడ పెద్ద ఎత్తున గొంతులు వినిపించాయి. ఇరాన్..ఇరాన్ అంటూ నినాదాలు చేశారు. ఇరాన్ జాతీయ జెండాపై కూడా నినాదాలు రాశారు.

జుట్టును ఏమాత్రం కప్పుకోకుండా అనేక మంది ఇరాన్ మహిళలు తమ దేశ జెండాలు పట్టుకుని కనిపించారు. వాళ్ల టీమ్ తమ నెట్ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దగా నినాదాలు చేశారు. వాస్తవానికి ఫుట్‌బాల్ ఉల్లాసభరితమైన గేమ్. కానీ ఇది అంతకంటే ఎక్కువ.

ఇరాన్, బ్రిటన్ జెండాల మధ్య ఒక ఇరానీ మహిళ తమ దేశంలో నిరసనకారులకు సంఘీభావంగా ‘‘విమెన్, లైఫ్, ఫ్రీడం’’ అనే నినాదాలున్న పోస్టర్‌ను పట్టుకుని నిలబడి ఉంది. ఆమె తన ముఖాన్ని చూపించడానికిగానీ, తన పేరును చెప్పడానికిగానీ ఇష్టపడలేదు. కానీ, ఆమె తన సందేశాన్ని అందించాలని కోరుకుంది.

నేను స్టాండ్‌ గుండా వెళుతుండగా, మరొక ఇరానియన్ అభిమాని నాతో గుసగుసలాడుతూ మాట్లాడారు.

"దయచేసి మా స్టోరీ చెప్పండి. కానీ, మా ఫొటోలు వాడవద్దు. నేను ఏదో ఒకరోజు మళ్లీ మా దేశానికి వెళ్లాలి. అక్కడ సమస్యలను కోరుకోవడం లేదు’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)