టైటానిక్‌ ఓడలో దొరికిన ఆ వాచీ ధర కోటి రూపాయలు, ఇప్పుడది ఎలా ఉంది?

టైటానిక్ లో దొరికిన గడియారం

ఫొటో సోర్స్, HENRY ALDRIDGE & SON

    • రచయిత, క్రిస్టోఫర్ మేస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టైటానిక్ ఓడలో దొరికిన ఓ వాచీ 98,000 పౌండ్లకు (సుమారు రూ. 95 లక్షలు) బ్రిటన్ లో జరిగిన ఓ వేలంలో అమ్ముడుపోయింది.

ఆర్ఎమ్ఎస్ టైటానిక్ షిప్ ప్రమాదం‌లో మునిగిపోయి 110 సంవత్సరాలు దాటింది. ఇంకా ఈ ఓడకు సంబంధించిన పలు వస్తువులు వేలంలో అమ్ముడవుతూనే ఉన్నాయి.

ఈ పాకెట్ వాచీ టైటానిక్ ఓడలో ప్రయాణించిన పోస్టల్ క్లర్క్‌ ఆస్కార్ స్కాట్ వుడీ ది.

14 ఏప్రిల్, 1912న ఓడ మునిగిపోయినప్పుడు ఈ వాచీ ఆయనతోపాటు సముద్రంలో ఉండిపోయింది.

ప్రమాదం జరిగిన మరుసటి నెలలో దాన్ని సేకరించి, ఆయన భార్య లెయిలాకు అందించారు.

టైటానిక్‌లో దొరికిన ప్రయాణికుల జాబితా

ఫొటో సోర్స్, HENRY ALDRIDGE & SON

ఫొటో క్యాప్షన్, టైటానిక్‌లో దొరికిన ప్రయాణికుల జాబితా

డివైజెస్ నగరంలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్స్‌ సంస్థ టైటానిక్ షిప్‌కు చెందిన మరికొన్ని వస్తువులతోపాటు, ఈ వాచీని కూడా వేలానికి పెట్టింది.

టైటానిక్ షిప్‌లో 'ప్లోవర్ ఆన్ టోస్ట్' సహా అనేక పదార్ధాల పేర్లున్న ఫస్ట్ క్లాస్ మెనూ కార్డ్ 50,000 పౌండ్లకు( సుమారు రూ.48.5 లక్షలు) అమ్ముడైంది.

అలాగే ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల పేర్లున్న ఓ లిస్ట్ 41,000 పౌండ్లకు (సుమారు రూ.39 లక్షలు ) వేలంలో అమ్ముడైంది.

జార్జ్ బ్రెరెటన్ అనే గ్యాంబ్లర్ (జూదగాడు) దగ్గర ఈ ప్రయాణికుల లిస్టు దొరికింది. జార్జ్ బ్రెరెటన్ గ్యాంబ్లింగ్ కోసం విదేశాలకు వెళ్లేందుకు టైటానిక్ ఓడను ఎక్కారు.

"అతను అత్యంత సంపన్న వ్యక్తుల పేర్ల పక్కన స్టార్ గుర్తును పెట్టాడు’’ అని వేలం నిర్వాహకుడు ఆండ్రూ ఆల్డ్‌రిడ్జ్ బీబీసీ రేడియోతో అన్నారు.

"అమెరికాలోని గ్రాండ్ పసిఫిక్ రైల్‌రోడ్‌ యజమాని చార్లెస్ హేస్ ఈ లిస్టులో ప్రత్యేకంగా పేర్కొనదగిన వ్యక్తి. అతను అత్యంత సంపన్నుడైన అధ్యాపకుడు కూడా. అతని పేరు కింద మిలియనీర్ అని ఇంగ్లీషు క్యాపిటల్ లెటర్స్‌లో బ్రెరెటన్ ప్రత్యేకంగా రాశాడు’’ అని ఆండ్రూ పేర్కొన్నారు.

అందమైన డిజైన్‌లో ఉన్న భోజనం ప్లేట్ 20,000 పౌండ్లకు (సుమారు రూ. 19 లక్షలు) అమ్ముడైంది.

ఆ లా కార్టే రెస్టారెంట్‌లోని ఒక దిమ్మలోని కొంత భాగం 23,000 పౌండ్లకు ( సుమారు రూ.22 లక్షలు)అమ్ముడైంది.

వీడియో క్యాప్షన్, 6వందల కోట్లు, 7వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం
టైటానిక్‌లో దొరికిన మెనూ కార్డ్

ఫొటో సోర్స్, HENRY ALDRIDGE & SON

ఫొటో క్యాప్షన్, టైటానిక్‌లో దొరికిన రెస్టారెంట్ మెనూ కార్డ్

టైటానిక్‌ ఓడకు సంబంధించిన వస్తువులను వేలం వేయడంలో హెన్రీ ఆల్డ్‌రిడ్జ్ అండ్ సన్ సంస్థ పాపులర్.

షిప్‌లో ఫస్ట్-క్లాస్‌లో పని చేసిన స్టీవార్డెస్(ఎయిర్ హోస్టెస్ తరహా పని చేసే వ్యక్తి)కు చెందిన ఒక కోటు 2017లో 150,000 పౌండ్లకు (సుమారు రూ.1.45 కోట్లు) హెన్రీ ఆల్డ్‌రిడ్జ్ అండ్ సన్ సంస్థ వేలంలో అమ్మింది.

అదే సంవత్సరంలో, టైటానిక్ ప్రయాణీకుడు ఆస్కార్ హోల్వర్‌సన్ రాసిన లేఖ 126,000 పౌండ్లకు ( సుమారు రూ.1.22 కోట్లు) అమ్ముడు పోయింది.

ఆస్కార్ హోల్వర్సన్ రాసిన లేఖ

ఫొటో సోర్స్, HENRY ALDRIDGE & SON

ఫొటో క్యాప్షన్, ఆస్కార్ హోల్వర్సన్ రాసిన లేఖ

హోల్వర్సన్ ఒక సేల్స్‌మ్యాన్. తన భార్య మేరీతో కలిసి ఓడలో ప్రయాణిస్తూ, తన తల్లికి లేఖ రాశాడు.

న్యూయార్క్‌ వెళ్లేందుకు ఈ జంట సౌతాంప్టన్‌లో టైటానిక్‌ ఎక్కింది. హోల్వర్సన్ తన తల్లికి రాసిన లేఖలో ఈ ఓడను వర్ణించారు.

"ఈ పడవ పరిమాణంలో పెద్దది. రాజభవనంలోని హోటల్ లాగా ఉంది" అని పేర్కొన్నాడు.

 అలాగే, ఆ సమయానికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జాన్ జాకబ్ ఆస్టర్ కూడా తన భార్యతో కలిసి ఈ ఓడలో ప్రయాణిస్తున్నాడని హోల్వర్సన్ రాశారు.

"అతని దగ్గర మిలియన్ల కొద్దీ డబ్బు ఉన్నా, మామూలు మనిషిలాగానే ఉన్నాడు. మాతో పాటు అతను కూడా డెక్ మీద కూర్చున్నాడు’’ అని రాశారు.

ఈ లేఖ రిజర్వ్ ధరను 60,000 పౌండ్లు (సుమారు రూ. 58 లక్షలు) నుంచి 80,000 పౌండ్లు(సుమారు రూ.77 లక్షలు )గా అప్పట్లో నిర్ణయించగా, ఇది చివరకు 126,000 పౌండ్లకు( సుమారు రూ.1.22 కోట్లు) అమ్ముడుపోయింది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి సైనికుల ప్రాణాలు కాపాడుతోన్న వైద్య సిబ్బంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)