పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో శాస్త్రవేత్తల ప్రయోగాల్లో నిర్ఘాంతపరిచే ఫలితాలు

కుష్టు వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చరిత్ర అంతటా కుష్టు వ్యాధి సోకిన వారిని వెలివేసి దూరంగా తరిమేసేవారు
    • రచయిత, జేమ్స్ గళాఘర్
    • హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్

మానవ శరీరానికి సురక్షితంగా మరమ్మతు చేయటానికి, అవయవాలను మళ్లీ పుట్టించటానికి.. లెప్రసీ (కుష్టు) బ్యాక్టీరియా తోడ్పడగలదని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో పరిశోధకులు చెప్తున్నారు. జంతువుల మీద చేసిన ప్రయోగాల్లో.. అవయవాల్లో ఆరోగ్యవంతమైన పెరుగుదలను ప్రేరేపించటం ద్వారా కాలేయాల పరిమాణాన్ని దాదాపుగా రెట్టింపు చేయగల అసాధారణ సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉన్నట్లు బయటపడింది. ఈ బ్యాక్టిరియా సోకటానికి మరింత కణజాలాన్ని అందించటం కోసం తెరచాటున చేసే ఒక స్వార్థపూరిత క్రియ వల్ల అవయవ కణజాలం పెరుగుతుంది. అయితే ఆ పనిని ఈ బ్యాక్టీరియా ఎలా చేస్తోందనేది కనిపెడితే.. వైద్య చికిత్సలో నూతన శకానికి తెర తీయగలుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కుష్టు వ్యాధి నరాలకు, చర్మానికి, కళ్లకు సోకినపుడు అంగవైకల్యం సంభవిస్తుంది. చరిత్ర అంతటా.. ఈ వ్యాధి సోకిన వారిని వెలివేసి దూరంగా తరిమేసేవారు. కానీ ఈ కుష్టు వ్యాధిని కలిగించే బాక్టీరియా మైకోబాక్టీరియమ్ లెప్రేలో ఇతర అసాధారణ గుణాలు కూడా ఉన్నాయి. ఒక రకమైన శరీర కణజాలాన్ని మరో రకమైన కణజాలంలోకి మార్చగల ‘జీవ రసవాదం (బయొలాజికల్ ఆల్కెమి)’ వంటి గుణం ఈ బాక్టీరియాకు ఉండటం శాస్త్రవేత్తలను కట్టిపడేస్తోంది.

జంతువు

ఫొటో సోర్స్, Getty Images

‘జీవ పరుసవేది’

దీంతో.. ఈ బాక్టీరియో సోకే మరో జంతువు – ఆర్మడిలో (తెలుగులో ‘అలుక’ అంటారు) మీద శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

అమెరికాలో నిర్వహించిన ప్రయోగాల్లో.. శరీరం మీద దళసరి పెళుసల రక్షణతో ఉండే ఆర్మడిలోకు కుష్టు బాక్టీరియా సోకిన తర్వాత.. ఆ బాక్టీరియా కాలేయానికి చేరుకుని, ఆ అవయవం నిర్వహణను హైజాక్ చేస్తుందని, తనకు అనుకూలంగా పనిచేయిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

‘‘అది ఏమాత్రం ఊహించనిది’’ అని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరోలోని సెంటర్ ఫర్ రీజెనరేటివ్ మెడిసిన్ ప్రొఫెసర్ అనుర రామ్‌బుక్కన నాతో చెప్పారు.

ఈ ప్రయోగం ఫలితాలను ‘సెల్ రిపోర్ట్స్ మెడిసిన్’ మేగజీన్‌లో ప్రచురించారు. లెప్రసీ బాక్టీరియా సోకిన తర్వాత కాలేయం పరిమాణం దాదాపుగా రెట్టింపుకు పెరిగినట్లు ఆ ఫలితాలు చూపుతున్నాయి.

అలాంటి పెరుగుదల లోపభూయిష్టమో, క్యాన్సర్ వల్లనో అని సాధారణంగా భావిస్తారు. కానీ సవివరంగా విశ్లేషించినపుడు ఆ కాలేయం ఆరోగ్యంగా ఉండటమే కాదు, చక్కగా పని చేస్తోందని కూడా వెల్లడైంది. అందులో రక్త నాళాల వంటివన్నీ యధాతథంగా సంపూర్ణంగా ఉన్నాయి.

‘‘ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. ఆ బాక్టీరియా దీనిని ఎలా చేయగలిగింది? ఈ పని చేయగల సెల్ థెరపీ (కణ చికిత్స) ఏదీ లేదు’’ అని ప్రొఫెసర్ అనుర పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

‘వెనక్కు మళ్లిన వయసు’

కాలేయంలో పెరుగుదల గడియారానికి ఈ బాక్టీరియా తనకు కావలసినట్లుగా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.

పూర్తిగా పెరిగిన కాలేయం కణాలు.. శరీంలో వందలాది పనులు చేసే జీవక్రియ పవర్‌హస్‌లు.

కానీ ఈ బ్యాక్టీరియా ఆ కణాలను ఒక దశ వెనక్కు తీసుకెళుతోంది. ఒక రకంగా పూర్తిగా పెరిగిన మనిషి తిరిగి టీనేజీ దశలోకి వెళ్లినట్లు. అంటే.. ఆ కణాల సంఖ్య వేగంగా పెరిగి, మళ్లీ వయోజన దశకు చేరుకుంటుంది.

ఇలా పెరిగిన కణాల్లోని విభిన్న విభాగాల డీఎన్ఏను విశ్లేషించినపుడు.. ఆ జంతువు అసలు వయసుకన్నా చాలా వయసు తక్కువ లేదా పిండదశలోని జంతువులో కాలేయం ఇంకా రూపొందుతున్న దశలో ఉండే తరహాలో అవి ఉన్నట్లు వెల్లడైంది.

‘సహజ ప్రక్రియ’

అయితే ఇదంతా ఎలా జరుగుతోందనే కచ్చితమైన వివరాలు ఇంకా అంతుచిక్కలేదు. నోబెల్ బహుమతి గెలుచుకున్న ఒక పరిశోధనలో.. కణాల గడియారాన్ని.. అవి శరీరంలోని అవయవాల్లో ఏ రకమైన కణంగానైనా మారే సామర్థ్యాన్ని సంతరించుకునేంత వెనక్కు బలవంతంగా తిప్పటం సాధ్యమేనని వెల్లడైంది. కానీ ఇది ఆ కణాలను క్యాన్సర్‌పూరితంగా మార్చే ప్రమాదముంది.

వీడియో క్యాప్షన్, ‘‘పొడుగు పెరగడానికి సర్జరీలతో కాళ్లు విరగ్గొట్టి అతికించుకుంటున్నారు’’

‘‘ఈ క్రిములు (లెప్రసీ బాక్టీరియా) ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నాయి. ఇది మరింత సురక్షితమైన విధానం. అలా చేయటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి ఇది సహజమైన ప్రక్రియ’’ అని ప్రొఫెసర్ అనుర నాతో అన్నారు.

కాలేయ మార్పిడి కోసం నిరీక్షిస్తున్న రోగుల్లో కాలేయాన్ని మరమ్మతు చేయటానికి, శరీరంలో మిగతా చోట్ల వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న అవయవాలను బాగు చేసి మునుపటి స్థితికి వెనక్కు తీసుకెళ్లటానికి.. ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చుననేది శాస్త్రవేత్తల ఆశ.

‘‘ఈ బాక్టీరియా అనుసరిస్తున్న వ్యూహాన్ని, వీటి వినూత్న విధానాన్ని ఉపయోగించుకుని.. అవయవాల పునర్నిర్మాణానికి, మరమ్మతుకు కొత్త చికిత్సలను రూపొందించాలన్నది స్వప్నం’’ అని ప్రొఫెసర్ అనుర పేర్కొన్నారు.

‘‘ఈ విధానాన్ని గనుక ఒడిసిపట్టగలిగితే.. మనం ప్రతి మూడు నెలలకో ఆరు నెలలకో తీసుకునే ఇంజక్షన్ లేదా టీకా వంటి వ్యవస్థలోకి దానిని మార్చగలం’’ అని చెప్పారు. అయితే ఈ ఆలోచనలన్నీ ఇంకా ఆలోచనల దశలోనే ఉన్నాయి.

‘‘ఈ పరిశోధన ఆర్మడిలోలను నమూనా జంతువులుగా పెట్టి చేసిన ప్రయోగాలు. కాబట్టి మానవ కాలేయం మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత వరకూ ఫలిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన డాక్టర్ డేరియస్ విడేరా పేర్కొన్నారు.

అంతేకాక.. ఈ అధ్యయనంలో ఉపయోగించిన బాక్టీరియా జబ్బు కలిగించేది కాబట్టి.. ఈ ప్రయోగాన్ని క్లినికల్ రూపంలోకి మార్చటానికి ముందు దీనిని గణనీయంగా మెరుగుపరిచే పద్ధతులు అవసరమవుతాయని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి: