పుట్టగొడుగులు: మ్యాజిక్ మష్రూమ్స్ అంటే ఏంటి... వీటితో చేసే ఔషధంతో డిప్రెషన్ తగ్గిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్
పుట్టగొడుగుల్లో మ్యాజిక్ మష్రూమ్స్ ప్రత్యేకమైనవి. ఇవి భ్రాంతి కలిగించే పుట్టగొడుగులు. వీటిలోని పదార్థంతో తయారు చేసిన ఒక ఔషధం.. తీవ్ర కుంగుబాటు (సివియర్ డిప్రెషన్) లక్షణాలను 12 వారాల వరకూ తగ్గించగలదని ఓ ప్రయోగం సూచిస్తోంది.
ఆ ప్రయోగంలో 25 మిల్లీగ్రాముల సైలోసైబిన్‌తో కూడిన టాబ్లెట్ రోగులను స్వప్నస్థితిలో ఉంచుతుందని, దీనిద్వారా సైకలాజికల్ థెరపీ మరింత విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని వెల్లడైంది.
అయితే దీనివల్ల తలెత్తే స్వల్పకాలిక ఇతర ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) భయంపుట్టించేవిగా ఉండొచ్చునని.. అలాంటి పరిస్థితుల్లో సాయం అందించటానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
ఈ ఔషధంపై మరింత ఎక్కువ కాలం పరిశీలించే పెద్ద అధ్యయనాలు ఇంకా అవసరమని నిపుణులు అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది ప్రజలు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలకు స్పందించని తీవ్ర క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, వారిలో 30 శాతం మంది ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ఒక అంచనా.
మానసిక ఆరోగ్య సమస్యలపై సైలోసైబిన్ ప్రభావాలను శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.
దీనిపై ఇటీవలి అధ్యయనాలు ఆశాజనకమైన ఫలితాలు అందించాయి. అయితే దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేయగలిగేంత సుదీర్ఘ అధ్యయనాలు ఇంకా జరగలేదు.
తాజాగా యూరప్, ఉత్తర అమెరికాలకు చెందిన 233 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు.
ఈ పరీక్షల్లో ఒక్కొక్కరికి 1 మిల్లీగ్రాము, 10 మిల్లీగ్రాములు, 25 మిల్లీగ్రాముల డోసుల చొప్పున సైలోసైబిన్ ఔషధాన్ని అందించారు. 25 మిల్లీగ్రాముల ఔషధంతో ఉత్తమ ఫలితాలు లభించినట్లు గుర్తించారు.

'మెలకువ కల'
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు 40 ఏళ్లకు అటూ ఇటూగా ఉంది. వీరిలో చాలా మంది ఏడాదికి పైగా తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారని.. కింగ్స్ కాలేజ్ లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, సైకాలజీ, న్యూరోసైన్స్, సౌత్ లండన్ అండ్ మాడ్స్‌లీ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు చెందిన పరిశోధకులు చెప్పారు.
వారికి కాంప్360 సైలోసైబిన్ 25 మిల్లీగ్రాముల డోసుతో పాటు సైకోథెరపీ అందించిన తర్వాత:
- మూడు వారాలకు పరీక్షలు నిర్వహించినపుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి డిప్రెషన్ లేదని వెల్లడైంది
- 12 వారాలకు ప్రతి ఐదుగురిలో ఒకరు గణనీయంగా మెరుగుపడ్డారు
ఈ ఔషధం ''మెదడు మీద నేరుగా ప్రభావం చూపుతోందని, మెదడును మరింత మృదువైన స్థితిలో ఉంచుతోందని.. దీనివల్ల థెరపీ అందించటానికి అవకాశం కలిగిస్తోందని ఈ అధ్యయన రచయిత, కన్సల్టెంట్ సైకోథెరపిస్ట్ డాక్టర్ జేమ్స్ రుకర్ చెప్పారు.
సైలోసైబిన్ ఔషధం తీసుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన గదిలో మంచం మీద పడుకుని ఉన్న రోగులు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఒక విధమైన భ్రాంతి స్థితిని అనుభవించారు. అది 'మెలకువ కల'లాగా అనిపించిందని రోగుల్లో ఒకరు అభివర్ణించారు.
''అది చాలా సానుకూలం కావచ్చు. అలాగే ప్రతికూలమైన అంశం కూడా కావచ్చు'' అని డాక్టర్ జేమ్స్ బీబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు.
''ఉదాహరణకు.. మీతోను, మీ మనోభావాలతోను మీరు మళ్లీ అనుసంధానమవుతున్నట్లుగా అనిపించే సమయంలో.. గతం నుంచి బాధాకరమైన జ్ఞాపకాలు తిరిగిరావచ్చు'' అని ఆయన చెప్పారు.
వీరికి మద్దతు అందించటానికి ఒక థెరపిస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
భద్రతాపరమైన ఆందోళనలు
ఈ రోగులకు ఔషధం అందించిన మరుసటి రోజు లేదా ఒక వారం తర్వాత.. వారి అనుభవం గురించి మాట్లాడేలా మానసిక మద్దతు అందించారు.
''రోగులు 'నాలో పొరపాటు ఏమిటి?' అనే ఆలోచన నుంచి 'నాకు ఏమైంది?' అనే ఆలోచనకు వచ్చారని సైకోథెరపిస్ట్ లియామ్ మోడ్లిన్ తెలిపారు.
అన్ని బృందాల్లోనూ కొందరు రోగులు సైడ్ ఎఫెక్ట్స్‌కు లోనయ్యారు. తలనొప్పులు, వికారం, తీవ్రమైన అలసట వంటి సమస్యలతో పాటు ఆత్మహత్య గురించిన ఆలోచనలు కూడా వారికి వచ్చాయి.
ఇది అసాధారణమేమీ కాదని పరిశోధకులు అంటున్నారు. కానీ ఇది భద్రతా పరమైన ఆందోళన కలిగిస్తోందని ఇతర నిపుణులు చెప్తున్నారు.
'ఎక్కువ కాలం కొనసాగే సమస్య'
అయితే తాజా పరీక్ష ద్వారా.. ''సైకోడెలిక్స్ గురించి మరింతగా, ఎక్కువగా, సుదీర్ఘంగా ప్రయోగాలు నిర్వహించటం సరైనదే''నని చెప్పటానికి బలమైన ఆధారాలు లభించాయని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరోలోని సైకియాట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఆండ్రూ మసింటోష్ పేర్కొన్నారు.
''దశాబ్దాలుగా సిఫారసు చేస్తున్న యాంటీడిప్రెసంట్లకు.. సైలోసైబిన్ ప్రత్యామ్నాయాన్ని అందించవచ్చు'' అని ఆయన చెప్పారు.
కానీ ఈ ఔషధం ప్రభావాలు 12 వారాల తర్వాత క్షీణించటం మొదలవుతోందనే విషయాన్ని మరికొందరు నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
''డిప్రెషన్ అనేది దీర్ఘ కాలం కొనసాగే సమస్య కావచ్చు. కాబట్టి 12 వారాలకన్నా ఇంకా ఎక్కువ కాలం ఈ ఔషధాన్ని పరిశీలించాలి'' అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ రవి దాస్ అభిప్రాయపడ్డారు.
సైలోసైబిన్ ఔషధంపై మరింత ఎక్కువ కాలం కొనసాగే అధ్యయనం త్వరలో ప్రారంభం కానుంది. డిప్రెషన్ తిరగబెట్టకుండా నిరోధించటానికి ఎన్ని డోసులు అవసరం అనే అంశాన్ని అందులో పరీక్షిస్తారు.
ఈ ఔషధాన్ని రోగులకు అందించటానికి అనుమతి రావటానికి మూడేళ్లు పట్టవచ్చునని పరిశోధకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















