టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?

ఫొటో సోర్స్, DANIEL POCKETT-ICC,GETTY
- రచయిత, దినేశ్ ఉప్రేతి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు క్రికెట్ అభిమానులా? ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు ఎవరొస్తారు, ఫైనల్‌లో ఏ జట్లు తలపడతాయి అంటూ సమీకరణాలు వేస్తున్నారా? అయితే మీరు గుర్తుంచుకోవల్సిన తేదీ.. 2022 నవంబర్ 6, ఆదివారం.
టీ20 వరల్డ్ కప్‌లో పోటాపోటీగా ఉండబోతున్న రోజు. క్రికెట్ అభిమానులు మరో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చో, లేదో తేల్చే రోజు.
ఆదివారం అడిలైడ్ ఓవల్‌లో మొదట దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఇది ముగిసిన కొన్ని గంటల తరువాత, అదే మైదానంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అడిలైడ్ ఓవల్‌కు కొన్ని వందల మీటర్ల దూరంలో మెల్‌బోర్న్‌లోని ఎంఎస్‌జీ మైదానంలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
గురువారం సిడ్నీ మైదానంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌కు వర్షం కొద్దిసేపు అంతరాయం కలిగించింది. దాంతో, డక్‌వర్త్-లూయిస్ నియమాన్ని అమలుచేశారు. ఆ తరువాత పాకిస్తాన్ జట్టు 33 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
సెమీ ఫైనల్, ఫైనల్స్ సంగతి అలా ఉంచితే, నిజానికి సూపర్ 12, ముఖ్యంగా గ్రూప్ 2 మ్యాచ్‌లే మంచి ఉత్కంఠ కలిగిస్తున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ తరువాత నాకౌట్ దశకు చేరుకునే సమీకరణాలు మారిపోతున్నాయి.
ప్రస్తుత పరిస్థితులలో భారతదేశం, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లలో ఎవరైనా సెమీ-ఫైనల్‌కు చేరుకోవచ్చు.
ఒకవేళ గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటే.. గ్రూప్-1లో టాప్-2 ర్యాంకుల్లో ఉన్న జట్లతో తలపడతాయి. అప్పుడు, నవంబర్ 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌లు తలపడే అవకాశం ఉంటుంది.
ఈ అవకాశం ఎంతవరకు ఉంది?
ముందు, ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత, వాటి స్థానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఫొటో సోర్స్, TWITTER/SOCIAL
భారత్
ఆడిన మ్యాచ్‌లు - 4, పాయింట్లు - 6, నెట్ రన్ రేట్: 0.730, మిగిలి ఉన్న మ్యాచ్ - జింబాబ్వేతో
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందనే గ్యారెంటీ లేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిపోవడం వలన వచ్చిన పాట్లు ఇవి. నవంబర్ 6 వరకు ఈ చిక్కు ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
నవంబర్ 6న భారత్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఎలా ఉన్నాయి?
జింబాబ్వేపై భారత్ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎనిమిది పాయింట్లతో సెమీఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఏడు పాయింట్లతో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.
జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయి, బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలిస్తే.. నెట్ రన్ రేట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ ఆధారంగా ముందుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.
జింబాబ్వే చేతిలో ఓడిపోయినా, రెండు పరిస్థితుల్లో భారత్‌కు సెమీ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
మొదటిది, దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఓడిపోవాలి. రెండవది, బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌ను ఓడించాలి, నెట్ రన్ రేట్‌లో భారత్ కంటే కింద ఉండాలి.
ఆదివారం జరిగే గ్రూప్ 2 మ్యాచుల్లో చివరిది భారత్-జింబాబ్వే మ్యాచ్. అంటే ఆరోజు భారత్ బరిలోకి దిగకముందే సెమీ ఫైనల్స్‌కు చేరుతుందో లేదో దాదాపు తెలిసిపోతుంది.
పాకిస్తాన్
ఆడిన మ్యాచ్‌లు-4, పాయింట్లు-4, నెట్ రన్ రేట్: 1.117, మిగిలిన మ్యాచ్ - బంగ్లాదేశ్‌తో
పాకిస్తాన్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించినప్పటికీ, సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం పలు 'అయినా', 'కానీ'ల మీద ఆధారపడి ఉంది.
ఆదివారం నాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఓడించినా, నాకౌట్‌కు చేరుకోవడానికి అది సరిపోదు. భారత్, దక్షిణాఫ్రికా తమ తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే పాక్ ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది.
పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా బంగ్లాదేశ్‌పై గెలవాలి.
దానిటో పాటు, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవాలి. లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిపోవాలి. అలా జరిగితే, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా రెండూ 6-6 పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉంటాయి. అయితే, పాకిస్తాన్‌కు మూడు విజయాలు, దక్షిణాఫ్రికాకు రెండు విజయాలు ఉంటాయి కాబట్టి, నంబర్ ఆఫ్ విన్స్, నెట్ రన్ రేట్ పరిగణనలోకి వస్తాయి.
రెండవది, జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, ఇరు జట్లకు ఆరు పాయింట్లు ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా, పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా
ఆడిన మ్యాచ్‌లు-4, పాయింట్లు-5, నెట్ రన్ రేట్: 1.441, మిగిలిన మ్యాచ్ - నెదర్లాండ్స్‌తో
దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా నెదర్లాండ్స్‌ను ఓడించాలి. వర్షం విలన్‌గా మారితే, ఇరు జట్లకు పాయింట్లు పంచుకోవాల్సి వస్తే దక్షిణాఫ్రికా కష్టాల్లో పడుతుంది.
వాతావరణ విభాగం సమాచారం ప్రకారం, ఆదివారం వర్షం పడకపోవచ్చు. కాబట్టి, దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచే దిశగా కసరత్తులు చేయడం మంచిది.
బంగ్లాదేశ్
ఆడిన మ్యాచ్‌లు-4, పాయింట్లు-4, నెట్ రన్ రేట్: -1.276, మిగిలిన మ్యాచ్ - పాకిస్తాన్‌తో
బంగ్లాదేశ్ ఇక టోర్నమెంటులో ముందుకు సాగడం కష్టమే. ఆ జట్టు నెట్ రన్ రేట్ బాగా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ ముందుకు వెళ్లలేకపోవచ్చుగానీ, ఇతర జట్ల అవకాశాలను చక్కగా చెడగొట్టగలదు.
అయితే, బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరుకునే ఒకే ఒక్క అవకాశం ఉంది.
ముందు, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలవాలి. తరువాత, జింబాబ్వే భారత్‌ను పెద్ద మార్జిన్‌తో ఓడించాలని ప్రార్థించాలి. ఆపై, దక్షిణాఫ్రికా జట్టు నెదర్లాండ్స్‌పై ఒక్క పాయింట్ కన్నా ఎక్కువ సాధించకూడదు.
ఇన్ని జరిగితే, బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌కు వెళుతుంది. లేదంటే ఇక ఈ టోర్నమెంటులో ఆ జట్టు ప్రయాణం ముగిసినట్టే.

ఫొటో సోర్స్, GIUSEPPE CACACE
జింబాబ్వే
ఆడిన మ్యాచ్‌లు-4, పాయింట్లు-3, నెట్ రన్ రేట్: -0.313, మిగిలిన మ్యాచ్‌లు - భారత్‌తో
జింబాబ్వే భారత్‌ను ఓడించినా, మొత్తం 5 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వర్షంతో కొట్టుకుపోతే, మూడు జట్లకు పాయింట్లు సమానంగా ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా జింబాబ్వే చాలా వెనుకబడి ఉంది.
ఒకవేళ భారత్‌ను 50 పరుగుల తేడాతో ఓడిస్తే, నెదర్లాండ్స్ కూడా అదే తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాలని ప్రార్థించాలి.
కాబట్టి, జింబాబ్వే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు బలహీనంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, SAEED KHAN,GETTY
2007 ఫైనల్స్‌లో భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు ఒక్కసారి మాత్రమే టైటిల్ మ్యాచ్‌లో తలపడ్దాయి. విజయం భారత్ ఖాతాలో పడింది.
2007 సెప్టెంబర్ 24, వేదిక - జోహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)
మీడియం పేసర్ జోగిందర్ శర్మ వేసిన ఆ బంతిని మిస్బా ఉల్ హక్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో గాలిలోకి లేపడం, ఎస్ శ్రీశాంత్ దాన్ని క్యాచ్ పట్టుకోవడం.. ఈ క్షణాలు ఇప్పటికీ భారతీయుల్ల హృదయాల్లో నిక్షిప్తమై ఉంటాయి. పాకిస్తానీయులకు ఆ క్షణాలు ముల్లు గుచ్చుతున్నట్టే ఉంటుంది.
2007లో తొలి టీ20 ప్రపంచకప్ జరిగింది. భారత్, పాకిస్తాన్‌లు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు, ఆపై ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
అప్పుడే, మహేంద్ర సింగ్ ధోనీ కొత్తగా కెప్టెన్ అయ్యాడు. భారత జట్టులో ఎక్కువమంది అంతగా అనుభవం లేని ఆటగాళ్లే. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.
ఓపెనర్ గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్‌లో రోహిత్ శర్మ రన్ రేట్‌ను పెంచుతూ 30 పరుగులు జతచేశాడు.
భారత్ ఆరంభం నుంచి బౌలింగ్‌పై పట్టు బిగించడంతో, పాకిస్తాన్ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతూ వచ్చాయి. కానీ, మిస్బా-ఉల్-హక్ చివరి ఓవర్ వరకు పట్టువిడవకుండా బ్యాటింగ్ చేశాడు. మిస్బా మైదానంలో ఉన్నంతసేపు భారత్‌కు టెన్షన్ తప్పలేదు.
చివరి ఓవర్ జోగిందర్ శర్మకు ఇవ్వాలని ధోనీ నిర్ణయించాడు. అక్కడే మ్యాజిక్ జరిగింది. మిస్బా బ్యాట్ ఝళిపించాడు కానీ, బంతి శ్రీశాంత్ చేతికి చిక్కింది. అలా, పాకిస్తాన్ కేవలం 5 పరుగుల తేడాతో కప్ ఓడిపోయింది.
తొలి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ సంబరాలు అంబరాన్నంటాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న ఈ పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
- చైనా, అమెరికాలు బద్ధ శత్రువులుగా మారుతున్నాయా, మూడోసారి అధ్యక్షుడైన షీ జిన్‌పింగ్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
- ఇమ్రాన్ ఖాన్ మీద దాడి ఘటనతో పాకిస్తాన్ ఉద్రిక్తం... ఇస్లామాబాద్‌లో పాఠశాలలు బంద్
- మహిళల గర్భకోశం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. అన్ని అవయవాలనూ దెబ్బతీసే, చికిత్స కూడా లేని డేంజరస్ పొర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











