T20WorldCup: సెమీ ఫైనల్ రేసులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కడ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెయాన్ మసూద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ బెర్త్ దక్షిణాఫ్రికాకు దాదాపు ఖాయమైపోయింది.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వాన వల్ల ఆగిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది దక్షిణాఫ్రికా.
గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్ ఉన్నాయి.
ఈ ఆరు టీంలో ఇప్పటి వరకు బాగా ఆడిన దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ బెర్తుకు దగ్గర అయింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ బంగ్లాదేశ్, భారత్‌లను దక్షిణాఫ్రికా ఓడించింది.
పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఒక్కటి గెలిచినా దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
భారత్ రెండు మ్యాచులు గెలిచినప్పటికీ నెట్ రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా కంటే వెనుకబడి ఉంది. ఆఖరి ఓవర్లలో మ్యాచ్ గెలవడమే ఇందుకు కారణం.
'దక్షిణాఫ్రికాను చూస్తుంటే బాగుంది. ఆ జట్టు టాప్ ఆర్డర్ కాస్త మెరుగుపడి, ట్రిస్టన్ స్టబ్స్‌ను బ్యాటర్‌గా వాడుకోగలిగితే ఈ ఏడాది ట్రోఫీని తమతో తీసుకుపోవచ్చు' అని క్రికెట్ వ్యాఖ్యాత హర్ష్ భోగ్లే ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి భారత్ పరిస్థితి ఏంటి?
గ్రూపు-2లో టీఇండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.
బంగ్లాదేశ్, జింబాబ్వేలతో భారత్ మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే టీం ఇండియా సామర్థ్యంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ ఫాంలో లేక పోవడం, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయపడటం, బలహీనంగా ఉన్న జట్టు ఫీల్డింగ్ వంటివి ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి.
'ఫీల్డింగ్‌లో మా పనితీరు బాగా లేదు. ఇందులో కారణాలు చెప్పడానికి ఏం లేదు. మాకు అవకాశాలు వచ్చినా మేం పోగొట్టుకున్నాం' అని టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా మ్యాచ్ తరువాత అన్నాడు.
బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగే మ్యాచుల్లో భారత్ ఓడిపోయినా సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఆ జట్టుకు ఉంటాయి. కానీ ఇందుకు టీం ఇండియా ఇతర టీమ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
'పాకిస్తాన్ కథ ముగిసినట్లే'
టీ20 ప్రపంచకప్ రేసు నుంచి పాకిస్తాన్ దాదాపుగా వైదొలిగినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.
'పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు వెళ్లే దారులు దాదాపుగా మూసుకు పోయాయి. చివరి రెండు మ్యాచుల్లో గెలిచినప్పటికీ జింబాబ్వే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల వల్ల పాకిస్తాన్‌కు నిరాశ తప్పదు' అని మర్హద్ అర్షద్ అనే క్రికెట్ విశ్లేషకుడు ట్వీట్ చేశారు.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది.
భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చివరి బంతికి ఓడిపోయింది. జింబాబ్వే మీద విజయానికి అవసరమైన మూడు పరుగులు చేయలేక పోయింది.
కొద్దిపాటి తేడాతో ఓడిపోవడంతోపాటు నెదర్లాండ్స్ మీద భారీ తేడాతో గెలవడం వల్ల పాకిస్తాన్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా రేసులో బంగ్లాదేశ్
తాను ఆడిన మూడు మ్యాచుల్లో బంగ్లాదేశ్ రెండు గెలిచింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో బంగ్లాదేశ్ రెండు మ్యాచులు గెలవడం ఇదే తొలిసారి.
బంగ్లాదేశ్ వద్ద ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్‌లతో బంగ్లాదేశ్ మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం క్లిష్టంగా మారుతుంది.
దక్షిణాఫ్రికా చేతిలో 104 పరుగుల తేడాతో ఓడి పోవడం వల్ల అది బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ మీద తీవ్ర ప్రభావం చూపింది.
ఇవి కూడా చదవండి:
- మాస్టర్ ప్లాన్ మార్పుతో అమరావతి భవితవ్యం మారిపోతుందా? పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?
- తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- వీర్యం ఈదుకుంటూ వచ్చి అండంతో కలుస్తుందా? ఇది నిజమా? అపోహా?
- రాత్రయ్యేసరికి నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి, పక్కమీదకు చేరగానే మన శరీరంలో వచ్చే మార్పులేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













