ఏపీ: జగన్‌పై దాడి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది.. నిందితుడి తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
2019 సాధారణ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన జగన్‌పై దాడి కేసు మరోసారి తెరమీదకు వచ్చింది.
విశాఖ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా పలు వివాదాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయమవుతున్నాయి. నాలుగేళ్ల కిందట జరిగిన ఈ దాడి ఘటన రాష్ట్ర రాజకీయాలలో ఇంకా లైవ్‌లోనే ఉంది.
అది నాటి ప్రధాన ప్రతిపక్ష నేత(జగన్) మీద జరిగిన దాడి కావడంతో ప్రకంపనలు సృష్టించింది. నేటికీ రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది.
2018 అక్టోబర్ 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విచారణ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిధిలో ఉంది.
నిందితుడు జనుపెల్ల శ్రీనివాసరావు నేటికీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు.
కేసు విచారణలో జాప్యం మీద నిందితుడు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో కేసు ఎందుకు ముందుకు సాగడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అసలు ఆ రోజు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది?
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర సమయంలో ఈ ఘటన జరిగింది.
విజయనగరం జిల్లాలో యాత్ర సాగుతుండగా తన కేసుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు.
మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఎయిర్ పోర్టు లాంజ్‌లో ఉండగా ఆయన మీద దాడి జరిగింది.
ఆ సమయంలో జగన్ ఎడమచేతికి గాయమైంది. ఆ తర్వాత ఆయన తాను ముందుగా నిర్ణయించుకున్న విమానంలోనే హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు.
జగన్ మీద హత్యాయత్నం జరిగిందంటూ విశాఖ ఎయిర్ పోర్టు పీఎస్‌లో తొలుత కేసు నమోదయింది.
ఘటన స్థలంలోనే నిందితుడు జనుపెల్ల శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని, ఆయన వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
కోడి పందేల్లో వాడే కత్తి కావడంతో ఈ కేసు కోడికత్తి కేసుగా రాజకీయ వర్గాల్లో ప్రాచుర్యం పొందింది.
ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏకి..
ఆ తర్వాత జనవరి 1, 2019న కేసుని ఎయిర్ పోర్ట్ అథారిటీ సిఫార్సుతో ఎన్‌ఐఏకి బదిలీ చేశారు.
ఆర్సీ-01/2019/NIA/HYD నెంబర్ తో ఈ కేసు రిజిస్టర్ చేశారు. విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ లభించింది.
ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ వేసిన పిటీషన్‌ని కోర్టు అంగీకరించడంతో రెండు నెలల తర్వాత ఆగస్ట్ 13న నిందితుడు మళ్లీ జైలుకి వెళ్లారు.
అప్పటి నుంచి రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం జైలులోనే గడుపుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
శిక్ష అనుభవించినట్లే
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ని విడుదల చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులు కొంతకాలం కిందట ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళనకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అంతకుముందు శ్రీనివాస్ తల్లి సావిత్రి జులై 9న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి కూడా లేఖ రాశారు. ఈ కేసులో విచారణ ముందుకు సాగనందున తన కొడుకుని వదిలిపెట్టాలని ఆమె కోరారు.
ఘటన జరిగి నాలుగేళ్లైన సందర్భంగా అక్టోబర్ 25న తాడేపల్లిలోని సీఎంవో వద్ద శ్రీనివాస్ తల్లి, సోదరుడు ఆందోళనకు ప్రయత్నించారు. దీంతో శ్రీనివాస్ తల్లి, సోదరుడు సుబ్బరాజు, ఆయన అడ్వకేట్ సలీంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"ఎన్ఐఏ పరిధిలో అనేక కీలక కేసులు ఉంటాయి. ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఉండదు. అందుకే విచారణ జరగడం లేదు. కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. నేరం రుజువైనప్పటికీ ఈ కేసులో పడే శిక్షను ఇప్పటికే శ్రీనివాస్ అనుభవించినట్టయింది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. జాప్యం తగదు. తమ బిడ్డ జైలులో మగ్గుతుండడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ రాస్తే శ్రీనివాస్‌కి విముక్తి లభిస్తుంది" అంటూ అడ్వకేట్ సలీం బీబీసీతో అన్నారు.
జగన్‌కు గాయమైన సమయంలో తీసిన బ్లడ్ శాంపిల్ పరీక్షల్లో ఎటువంటి విష ప్రయోగం లేదని నివేదికలు వచ్చాయని ఆయన తెలిపారు. తన క్లయింట్ విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని సలీం అభిప్రాయపడ్డారు.
నిరాహారదీక్ష చేస్తాం..
నిందితుడు శ్రీనివాసరావు తన స్వగ్రామం ఠాణేలంక నుంచి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలలో పనిచేశారు. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తుండగా ఈ నేరానికి పాల్పడినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థలో సర్వీస్ బాయ్‌గా పనిచేస్తూ లాంజ్‌లోకి వెళ్లి ఈ దాడి చేసినట్టు ఎన్ఐఏ చెబుతోంది. కేసు విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొన్న ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థ యాజమాన్యం, ఇతర సిబ్బందిని కూడా ఏపీ పోలీసులు తొలుత విచారించారు.
ఎన్ఐఏ పరిధిలో ఉన్న కేసులో విచారణకు అవకాశం లేనందున తమ కుమారుడిని విడిచిపెట్టాలంటూ శ్రీనివాస రావు తల్లి కోరుతున్నారు. సీఎంకి వినతిపత్రం అందిస్తామంటూ వెళ్లినా అంగీకరించలేదని, ఇక తమ కుటంబమంతా కలిసి దీక్ష చేపడతామని బీబీసీతో అన్నారు.
"కేసు విచారణ జరగకపోయి, బెయిల్ కూడా ఇవ్వకపోవడంతో నా కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. మానసికంగానూ కుంగిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ అయినా ఇచ్చి బయటకు వదలాలని కోరుతున్నాం" అంటూ నిందితుడి తల్లి సావిత్రి బీబీసీతో అన్నారు.
మరోవైపు ఈ కేసు ఇంకా విచారణ సాగుతోందని ఎన్ఐఏ హైదరాబాద్ అధికారులు అన్నారు. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేమని, కేసులో పూర్తి ఆధారాలు లభించాల్సి ఉందని బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఆరోపణలు, ప్రత్యారోపణలు
జగన్ మీద దాడి జరిగిన వెంటనే నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. జగన్ వెంట ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్ని శ్రీను మీద టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు దొరక్కుండా ఆయనే అంతా చేశారని కూడా అన్నారు.
అదే సమయంలో నిందితుడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. జగన్ మీద దాడి చేసిన కత్తికి విషం పూసి ఉంటారని కూడా సందేహించింది. జగన్‌ను హత్య చేసేందుకు వేసిన ప్రణాళిక అని వైసీపీ ఆరోపించింది.
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టులో తన పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన తరుణంలో అప్పట్లో 'కోడికత్తి డ్రామా' ఆడారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
హత్య కేసులోనూ నిందితులకు బెయిల్ వస్తోందని, ఈ చిన్న కేసులో బెయిల్ లేకుండా శ్రీను జైల్లో మగ్గడానికి కారణాలు అనుమానంగా ఉన్నాయంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.
చట్టం పరిధిలో ఉన్న కేసు విషయంపై తాము ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు.
"రాజకీయ దుమారం రేపిన కేసు ఇది. అందులో రాజకీయాల మాట ఎలా ఉన్నప్పటికీ నిందితుడు నాలుగేళ్లుగా రిమాండ్‌లో ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది. దాడికి గురైన బాధితుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు విషయంలో పాలనాపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వానికి చొరవ ఉంటే కేసు వెనక్కి తీసుకోమని కోరే అవకాశం ఉంది. కేసు విచారణ వేగవంతం చేయాలని కూడా కోరవచ్చు. ఇలా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ ఓ కీలక కేసుని నాన్చడం భావ్యం కాదు" అంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎన్ఐఏ కేసుల్లో ఎటూ తేలకపోవడంతో ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి జాబితాలో ఈ కేసు నిందితుడు కూడా ఉండడం విచారకరమని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ప్రజా ప్రతినిధులపై కేసుల మాదిరిగానే..
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ప్రజా ప్రతినిధుల మీద కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హత్యారోపణలు సహా తీవ్ర నేరాలున్న కేసులను కూడా ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది.
కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు కూడా ఉపసంహరించుకున్నారు.
రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబెట్టిన కేసు మాత్రం రైల్వే పోలీసుల పరిధిలో కొనసాగుతోంది.
వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు పాల్గొన్న వివిధ ఆందోళనలకు సంబంధించిన కేసులు, ఎన్నికల సమయంలో పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకున్నారు.
"ఈ కేసు కూడా తీవ్రత రీత్యా చాలావాటితో పోలిస్తే చిన్నది. దాడిలో నిందితుడు పాత్రధారే తప్ప సూత్రధారి కాదని వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా మాట్లాడాయి. అటువంటప్పుడు చట్టం పరిధిలో ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఈ కేసు ఉపసంహరించుకోవాలని కొందరు అంటున్నారు. కానీ ఉపసంహరణపై ఇప్పటికే పలు వివాదాలున్నాయి. అదే సమయంలో ఎన్ఐఏ పరిధిలో ఉన్న కేసుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కేవలం ప్రతిపాదన చేయగలదు. దానికి కూడా బాధితుడిగా ఉన్న వైఎస్ జగన్ అనుకూలంగా ఉంటారని భావించలేం. అప్పట్లో రాజకీయాలకు ఈ కేసు కేంద్రస్థానంగా ఉన్నందున అందులో వేలు పెట్టే అవకాశాలు తక్కువే" అని న్యాయ నిపుణుడు వి.రామారావు అన్నారు.
రాజకీయాలతో ముడిపడిన కేసు కావడంతో రాజీపడే అవకాశాలు స్వల్పమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియా: 151 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఎందుకు జరిగింది
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- చర్చిలో స్నేహం చేసింది.. ఆస్తి కోసం ఆమెను చంపి తల, మొండెం వేరుచేసి దూరంగా పడేసింది
- ఇక ట్విటర్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















