ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికి రావడంతో క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి ప్రభావం పడనుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లెయిన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తారని చాలామంది అనుకోలేదు.
కొన్ని నెలల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్ ప్రకటించారు. డీల్ విలువ 4,400 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 3.6 లక్షల కోట్లు.
'ద బర్డ్ ఈజ్ ఫ్రీడ్' అంటే 'పక్షికి స్వేచ్ఛ లభించింది' అంటూ మస్క్ ట్వీట్ చేయడమే కాదు తన ట్విటర్ ఖాతాలో బయోను 'చీఫ్ ట్విట్'గా మార్చారు.
ట్విటర్ కొనుగోలు అయిపోయిందని మస్క్ చెబుతున్నా ఇంత వరకు ట్విటర్ నుంచి అధికారికంగా సమాచారం అయితే బయటకు రాలేదు. ఇప్పటికీ ట్విటర్ ప్రధాన కార్యాలయం మౌనంగానే ఉంది.
బహుశా అధికారికంగా సమాచారం పంపడానికి అక్కడ ఎవరూ లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను ఆ పదవి నుంచి మస్క్ తీసేసినట్లు వార్తలు వచ్చాయి. చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నెడ్ సెగల్, లీగల్ అండ్ పాలసీ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్స్ లింక్డిన్ ప్రొఫైల్ చూస్తే ఆయన ట్విటర్‌లో లేనట్లుగా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మస్క్ నాయకత్వంలోని ట్విటర్ ఎలా ఉండనుంది?
వాణిజ్య ప్రకటనలు ఇచ్చే వారి కోసం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు మస్క్. 'మానవాళికి సాయం చేసేందుకు' ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అందులో ఆయన రాశారు.
'డిజిటల్ ప్రపంచంలో అన్ని గొంతులకు సమాన అవకాశాలు ఉండాలన్నది' కూడా తన ఆశయమని మస్క్ తెలిపారు. అయితే ఈ ప్రయత్నంలో తాను విఫలం కావొచ్చని కూడా చెప్పారు.
వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న వారిని మాత్రమే ఉద్దేశించి మస్క్ మాట్లాడటమంటే ప్రస్తుతానికి ట్విటర్ 'డిజిటల్ అడ్వర్టైజింగ్ మోడల్'ను అలాగే కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం డిజిటల్ వాణిజ్య ప్రకటనల విభాగంలో కాస్త అనిశ్చితి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల కంపెనీలు ప్రకటనల మీద ఎక్కువ డబ్బును ఖర్చు చేయలేక పోతున్నాయి. ఫలితంగా గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతోంది.
ట్విటర్ వేదికగా అన్ని గొంతులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చని గతంలో మస్క్ చెప్పారు. వామపక్ష భావజాలం గల వారికి, లిబరల్స్‌కు ప్రయోజనం చేకూరేలా ట్విటర్ పని చేస్తుందనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. కానీ కంపెనీ వాటిని ఖండిస్తోంది.
వివాదాస్పద ట్విటర్ ఖాతాల మీద గత మేనేజ్‌మెంట్ పెట్టిన నిషేధాన్ని ఎత్తివేయాలని మస్క్ నిర్ణయించి ఉండొచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్విటర్ సస్పెండ్ చేసింది.
చట్టాలకు లోబడే ట్విటర్ పని చేస్తుందని చెబుతున్న మస్క్, అయితే కానీ 'అందరికీ ఉచితంగా అయితే లభించదు' అని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పామ్, సూపర్ యాప్స్
ట్విటర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య మీద సంస్థకు మస్క్ మధ్య వివాదం నడిచింది.
స్పామ్, బోట్ ఖాతాల సంఖ్యను తక్కువ చేసి చూపారంటూ గతంలో మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వాటి సంఖ్య చాలా తక్కువగా ఉందని ట్విటర్ చెబుతూ వచ్చింది. ఇప్పుడు నకిలీ ఖాతాల మీద మస్క్ కత్తి ఝుళిపించే అవకాశం ఉంది.
ఇదే జరిగితే చాలా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య మీద ప్రభావం పడొచ్చు. కాబట్టి ఈ చర్యను చాలా మంది హర్షించక పోవచ్చు.
'ఎక్స్, ద ఎవ్రిథింగ్ యాప్' అనే దానికి ట్విటర్ కొనుగోలు తొలి అడుగుగా మస్క్ ఇస్తున్న సంకేతాల ఆధారంగా తెలుస్తోంది. కానీ దాని గురించి పూర్తి వివరాలు అయితే ఆయన చెప్పలేదు. చైనాకు చెందిన 'వియ్‌చాట్' వంటి సూపర్ యాప్‌ను మస్క్ తయారు చేయాలని అనుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.
సూపర్ యాప్ అంటే అందులోనే అన్ని సేవలు ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్‌తో పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, డబ్బులు పొదుపు చేయవచ్చు, టికెట్లు బుక్ చేసుకోవచ్చు... ఇలా రోజూవారీ పనులు చేసుకునేలా అన్ని సేవలు అందులోనే ఉంటాయి.
ఇంతవరకు పశ్చిమదేశాల్లో అటువంటి యాప్ రాలేదు. వాట్సాప్, ఫేసుబుక్ మెసేంజర్ వంటి వాటిలో అనేక సేవలను ఉంచడం ద్వారా మెటా అటువంటి ప్రయత్నం చేస్తోందనే వాదన ఉంది.

ఫొటో సోర్స్, Reuters
క్రిప్టోకరెన్సీ చెల్లింపులు
ఇక క్రిప్టోకరెన్సీ మీద మస్క్‌కు ఉన్న ప్రేమ మనకు తెలిసిందే. బహుశా ఈ కారణంతోనే
ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో-ఎక్స్ఛేంజ్ బినాన్సీ కూడా ట్విటర్‌లో పెట్టుబడులు పెట్టింది.
బహుశా రానున్న రోజుల్లో చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీని ట్విటర్ అనుమతించొచ్చు.
ఇది కానీ నిజమైతే క్రిప్టోకరెన్సీ అభిమానులకు ఇది మంచి వార్త అవుతుంది. ఇదే సమయంలో నియంత్రణ లేని క్రిప్టోకరెన్సీతో రిస్క్ ఉంటుందని భావించే వారికి ఇది రుచించక పోవచ్చు.
మస్క్‌కు దూరదృష్టి ఉంది. ఆయనలో సృజనాత్మకత, అనుకున్నది సాధించాలనే తపనా ఉంది. కానీ అదే సమయంలో ఆయనలో నిలకడ కూడా తక్కువ. అయితే ట్విటర్‌లో మార్పు అయితే మొదలైందని భావించొచ్చు. ఇప్పటికే సంస్థ నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సదర్: హైదరాబాద్‌లో 'దున్నపోతుల పండుగ' ఎందుకు చేస్తారు? 'నాన్-లోకల్' దున్నపోతులపై వివాదం ఎందుకు?
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముడుపోతున్నారో-తెలంగాణ ఫిరాయింపుల్లో మునుగోడు చాప్టర్
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













