Narendra Modi: రిషి సునక్‌కు మోదీ కంగ్రాట్స్ చెప్పారు. కానీ, షీ జిన్‌పింగ్‌ ఎందుకు చెప్పలేదు?

భారత్, చైనా

ఫొటో సోర్స్, SERGEI GUNEYEV

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

షీ జిన్‌పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆ దేశంలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే, ఈసారి షీ జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించలేదు. జిన్‌పింగ్‌ రెండోసారి అధ్యక్షుడు అయినప్పుడు మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

2020 మేలో గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

అయితే, గత నెల ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్, ఇతర దేశాధినేతలతో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఆ ఫొటోలో వారిద్దరూ కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉన్నారు కానీ, వారి మధ్య దూరం చాలా ఎక్కువ. అందుకే, అంత దగ్గరగా వచ్చినప్పటికీ, వారు కరచాలనం చేసుకోలేదు. ఒకరి ఉనికిని ఒకరు గుర్తించినట్టు ప్రవర్తించలేదు కూడా.

వీరిద్దరి మధ్య ఎవరు ముందు పలకరిస్తారనే పోటీ నెలకొని ఉందని చైనా మూలాలున్న సింగపూర్‌ జర్నలిస్ట్ సన్ షీ వ్యాఖ్యానించారు.

"2020లో గల్వాన్ లోయలో ఘర్షణలకు ముందు ఉన్న స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి ఎవరు మొదటి అడుగు వేస్తారన్నది ఈ ఇరువురు నాయకుల మధ్య ఉన్న అతిపెద్ద ప్రశ్న. ఎస్‌సీఓ సదస్సులో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోకపోవడం చాలా నిరాశపరిచింది" అని సన్ షీ బీబీసీతో అన్నారు.

ఇప్పుడు షీ జిన్‌పింగ్‌ గతంలో కంటే మరింత శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారని, చైనాలో మహ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్ షియావోపింగ్‌ కన్నా ఎత్తుకు వెళ్లారని నిపుణులు అంటున్నారు.

ఇక చైనాలో షీ జిన్‌పింగ్ అధికారానికి తిరుగులేదని, జీవితకాలం పాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని మోదీ మౌనం మంచి చేస్తుందా?

ఇటీవలే బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు కూడా.

కానీ, షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపలేదు. అయిదేళ్ల క్రితం రెండోసారి అధ్యక్షుడయినప్పుడు మాత్రం అభినందనలు చెప్పారు. దీన్ని చైనా రాజకీయ రంగంలో వారు ఎలా చూస్తున్నారు?

భారత ప్రధాని మోదీ మౌనాన్ని చైనాలో మంచి దృష్టితో చూడట్లేదని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ అధ్యయనాల ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ బీబీసీతో అన్నారు.

"షీ జిన్‌పింగ్‌ను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ప్రధాని మోదీ మౌనం ప్రమాదకరమైన సంకేతాన్ని ఇచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలు, వైరుధ్యాలను మరింత బహిర్గతం చేసింది. అంతే కాకుండా, పరస్పర ప్రయోజనాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది. నిజం చెప్పాలంటే, రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించడంలో లేదా పరిష్కరించడంలో ప్రధాని మోదీ మౌనం ఎలాంటి మంచి చేయదు. 2020 జూన్ నుంచి ద్వైపాక్షిక సంబంధాల పునాది తీవ్రంగా దెబ్బతిన్నదని మనం గుర్తించాలి. అగ్ర నాయకుల మధ్య అర్ధవంతమైన చర్చలు నిలిచిపోయాయి. అటువంటి చర్చలు జరిపేందుకు సుముఖత కూడా చూపించట్లేదు. ఇలాంటి పరిస్థితులలో సంబంధాలను మెరుగుపరచుకోవడం మరింత కష్టమవుతుంది" అని ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనీస్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైసల్ అహ్మద్ మాట్లాడుతూ, దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో ఆటుపోటులు ఉంటూనే ఉంటాయని, వాటిని వ్యక్తం చేసే తీరు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుందని అన్నారు.

"స్నేహంలో సమస్యలు రావచ్చు. వీటిని కొన్నిసార్లు దౌత్యం ద్వారా లేదా ప్రతీకాత్మకంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ అవసరం ఉంది. 2020లో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, ఆయనకు అభినందనలు తెలుపడానికి షీ జిన్‌పింగ్‌కు రెండు వారాల కంటే ఎక్కువ సమయం పట్టిందని గుర్తుంచుకోవాలి" అని డాక్టర్ ఫైసల్ అహ్మద్ అన్నారు.

"ప్రస్తుతానికి షీ జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది, ఆయన అధికారికంగా చైనా అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టినప్పుడు ప్రధాని మోదీ కచ్చితంగా అభినందిస్తారని ఆశిస్తున్నా" అన్నారు జర్నలిస్ట్ సన్ షీ.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

షీ జిన్‌పిన్ బలం పెరగడం భారత్‌పై ప్రభావం ఉంటుందా?

షీ జిన్‌పింగ్ బలం పెరగడం, మూడవసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న.

"షీ జిన్‌పింగ్ చైనా ఆధునిక చరిత్రలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు అవుతాడనడంలో సందేహం లేదు. అధికారంపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉంది. అందుకే భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతో, అంతర్జాతీయ సమస్యలపై మరింత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తారన్నది నా అంచనా" అన్నారు సన్ షీ.

షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం భారతదేశం పట్ల తన విధానాన్ని స్థిరంగా కొనసాగిస్తుందని ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ అభిప్రాయపడ్డారు.

"జిన్‌పింగ్ భారతదేశం, చైనా వంటి రెండు గొప్ప నాగరికతలలోని ఉన్నత విలువలకు, ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి మద్దతిస్తారు. చైనా-భారత్ సహకారం ద్వారా 'ఆసియా శతాబ్దం' నిబద్ధతకు కట్టుబడి ఉంటారు. ఈ కోణంలోంచి చూస్తే, జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు కావడం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు, నిరంతర అభివృద్ధికి దోహదపడుతుంది" అని ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ అన్నారు.

భారతదేశ ప్రస్తుత వైఖరి చూస్తుంటే రెండు దేశాల మధ్య సంబంధాలలో చెప్పుకోదగ్గ తేడా ఏమీ కనిపించడం లేదని శివ నాడార్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం ప్రొఫెసర్ జబిన్ టీ జాకబ్ అన్నారు.

షీ జిన్‌పింగ్ తిరిగి చైనా అధ్యక్షుడు కావడంపై వ్యాఖ్యానిస్తూ ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన కథనంలో పై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

"2020లో చైనా సరిహద్దుల వద్ద ఏర్పడిన ఉద్రిక్తతలకు పరిష్కారం కనుగొనడంపై భారత్ ఒత్తిడి పెడుతూనే ఉంది. తన అధికార పరిధిలో చైనా ఆర్థిక ప్రయోజనాలకు గురిపెడుతూనే ఉంది. అలాగే, అమెరికాతో రాజకీయ భద్రతా సహకారాన్ని పెంపొందించుకుంటోంది" అని జబిన్ టీ జాకబ్ వ్యాఖ్యానించారు.

షీ జిన్‌పింగ్ తిరిగి అధికారంలోకి రావడం ద్వైపాక్షిక సంబంధాలకు మేలు చేస్తుందని డా. ఫైసల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

"భారత్, చైనాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది. 'గ్లోబల్ వాల్యూ చెయిన్'లో పరస్పర భాగస్వామ్యం, పరస్పర పెట్టుబడులు ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి" అని ఆయన అన్నారు.

2014లో గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014లో గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

మొదట ఎవరు చొరవ తీసుకుంటారు?

2018, 2019లలో మోదీ, జిన్‌పింగ్ ల మధ్య 'అనధికారిక' సమావేశాలు బాగానే జరిగాయి. భారీ మీడియా కవరేజీ వచ్చింది. 2017లో డోక్లామ్‌లో జరిగిన గొడవలను ఇరు దేశాలు మరిచిపోయాయని అనిపించింది. ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయని, ఇద్దరు బలమైన నాయకులు అడుగులు ముందుకు వేస్తున్నారని అందరూ భావించారు.

కానీ, 2020 జూన్ 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి వీగిపోయాయి. గల్వాన్‌లో చైనా చొరబాటే ఘర్షణలకు కారణమని భారత్ ఆరోపించింది. అందుకే సంబంధాలను మెరుగుపరిచేందుకు చైనా మొదట చొరవ తీసుకోవాలని భారత్‌లోని ప్రజలు కోరుకుంటున్నారు.

కానీ, రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలోపేతం కావాలంటే భారత్ మొదటి అడుగు వేయాలని జర్నలిస్ట్ సన్ షీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"భారతదేశం వ్యవహరికంగా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాలి. చైనా ఇకపై సరిహద్దులో భారత్‌ను రెచ్చగొడుతుందని నేను అనుకోను. చైనా ఇప్పటికే తన అతిపెద్ద ప్రత్యర్థి అమెరికాను ఎదుర్కొంటోంది. షీ జిన్‌పింగ్ దృష్టి అమెరికాపై ఉంటుంది తప్ప భారత్‌పై కాదు. భారత్ కొంచం స్నేహపూర్వకమైన సంకేతాలు అందిస్తే జిన్‌పింగ్ తప్పకుండా ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది చైనా సంస్కృతి. కాకపొతే, చైనా ప్రజల ముందు తాను కఠినంగా కనిపించాలి కాబట్టి ఆయనే మొదటి అడుగు వేయడం అంత సులభం కాదు. అందుకే బంతి ఇప్పుడు భారత్ కోర్టులో ఉంది" అని సన్ షీ అభిప్రాయపడ్డారు.

కానీ, గత రెండేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా మోదీ చొరవ తీసుకోవడం కూడా అంత సులువు కాదు. అయితే, వ్యూహాత్మక రంగంలో, భారతదేశం-చైనాల మధ్య సహకారం మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్ ఫైసల్ మహ్మద్ అభిప్రాయపడ్డారు.

"డోక్లామ్ ఘర్షణల అనంతరం, అనధికారిక సమావేశాల తరువాత ఇరు దేశాలు పరస్పరం ఒక అవగాహనకు వచ్చాయి. మోదీ, జిన్‌పింగ్ అధికారంలో ఉన్నంతవరకు సైనికపరంగా, దౌత్యపరంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని ఆయన అన్నారు.

ఇరు దేశాల నుంచి చొరవ ఉంటుందని, ఇప్పటికే కొంతమేరకు చొరవ ప్రదర్శించారని ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ అన్నారు.

"వివాదాస్పద సరిహద్దు ప్రాంతం నుంచి చైనా, భారత్ సైన్యాలు తొలగిపోయాయి. 2020 జూన్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణల ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడానికి ఇరు దేశాలు వేర్వేరు దృష్టికోణాల నుంచి ప్రయత్నిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడాలంటే భారత్ మరికొన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

"రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో చైనా చురుగ్గా వ్యవహరించింది. దురదృష్టవశాత్తు, 2020లో చైనా పెట్టుబడులు, సంస్థలు, కార్మికులపై భారతదేశం విధించిన ఆంక్షలు ఇంకా ఉన్నాయి. వాటిని తొలగించాలి" అని ప్రొఫెసర్ హువాంగ్ యున్‌సాంగ్ అన్నారు.

అంతర్జాతీయంగా చాలా అనిశ్చితి, అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్, చైనాల మధ్య సంబంధాల్లో స్థిరత్వం రావడం చాలా ముఖ్యమని, ఇరు దేశాలు చొరవ తీసుకుంటే అదేమంత కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

'ఇద్దరు నాయకులు ఎక్కువ కాలం అధికారంలో ఉండడం లాభదాయకం'

మోదీ, జిన్‌పింగ్ ఎక్కువకాలం అధికారంలో ఉన్నారని, మరింత కాలం అధికార పదవుల్లో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ గెలిస్తే, చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"దీర్ఘకాలం పదవిలో కొనసాగిన నాయకులపై ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఇద్దరూ దీర్ఘకాలం అధికారంలో ఉండడం ద్వైపాక్షిక సంబంధాలకు మేలు చేస్తుంది" అని ప్రొఫెసర్ హువాంగ్ యున్సాంగ్ అన్నారు.

మరో ఏడాది వరకు షాంఘై కార్పోరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతిలోనే ఉంటాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో భారత్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా అధ్యక్షుడు క్రమం తప్పకుండా దీనికి హాజరవుతారు.

ఈ సదస్సుకు ముందే ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకపోతే, ఈ సదస్సు విజయం, భారత్ అధ్యక్షత ప్రశ్నార్థకంలో పడుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి బహుశా ఇది ఒక మంచి అవకాశం కావచ్చు.

"ఈ సదస్సు నేపథ్యంలో భారత్ స్నేహ హస్తం చాస్తుందని ఆశిస్తున్నా. భారత్, చైనాలు బ్రిక్స్‌ (BRICS)లో సభ్య దేశాలు. ఇద్దరి మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవలసిన బాధ్యత ఇరువురి పైనా ఉంది" అని జర్నలిస్ట్ సన్ షీ అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాదికైనా భారత్, చైనాల మధ్య దూరం తగ్గుతుందని, దగ్గరగా ఉంటూ దూరం పాటిస్తున్న వైఖరి మారుతుందని విశ్లేషకులు ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్టు పార్టీ సమావేశాలో మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపేశారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)