రష్యాను యుక్రెయిన్ ఎదుర్కొంటున్నట్లు చైనాపై పోరాడగల శక్తి, సామర్థ్యాలు తైవాన్‌కు ఉన్నాయా?

వీడియో క్యాప్షన్, చైనా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నిక కానున్న షీ జిన్‌పింగ్ వైఖరి ఎలా ఉండొచ్చు?

చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధినేత షీ జిన్ పింగ్ ఈవారం మూడవ సారి అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. అయితే, తైవాన్ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

తైవాన్ ..చైనాలో భాగమే అనే పదే పదే చెప్పే షి జిన్ పింగ్.. తైవాన్ శాంతియుతంగా చైనాలో కలవాలని, కాని పక్షాన బలవంతంగా అయినా కలుపుకోక తప్పదని గతంలో అన్నారు.

2027కల్లా తైవాన్‌పై ఆక్రమణకు చైనా సిద్ధమవుతుందని సీనియర్ అమెరికన్ మిలటరీ కమాండర్లు అన్నారు. యుక్రెయిన్‌ను నుంచి నేర్చుకోవాలని తైవాన్‌కు సూచిస్తోంది అమెరికా.

అసలు తైవాన్ చైనాతో యుద్ధానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది? బీబీసీ ప్రతినిధి రూపర్డ్ వింగ్‌ఫీల్డ్ హేయిస్ అందిస్తున్న కథనం.

చైనా, తైవాన్ లౌడ్ స్పీకర్లు

జిన్‌మెన్ దీవి చైనాకు చాలా దగ్గరగా ఉంటుంది. చైనా తీరప్రాంతంలో నివసించే వారికి వినిపించేలా ఈ పెద్ద స్పీకర్ల ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తుండే వారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా పర్యటకులతో ప్రశాంతంగా కనిపిస్తోంది. కానీ గత డెభ్బై ఏళ్లలో చైనా రెండు సార్లు ఈ ఇరుకైన జలసంధిని దాటేందుకు ప్రయత్నించింది. ఈ దీవి ఇప్పటికీ ఓ కోటలా ఉంటుంది. చుట్టూ సొరంగాలు, బంకర్లు, కాపలాదారులు కూడా ఉంటారు.

తైవాన్ ప్రధాన ద్వీపం ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ తైవాన్, మెయిన్‌లాండ్ చైనాల మధ్య ఇదే అసలైన యుద్దరంగం.

సెప్టెంబర్ ఒకటిన ఓ చైనా డ్రోన్ తైవాన్ మిలటరీ అవుట్ పోస్ట్ పైన కొంత సేపు చక్కర్లు కొట్టింది. తర్వాత తైవాన్ దానిని నేలకూల్చింది.

గతంలో కూడా చైనా దళాలు తైవాన్‌లోని ఈ సముద్ర తీరానికి రావాలని విఫల ప్రయత్నం చేశాయి.

కానీ ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులున్నాయని రిటైర్డ్ కల్నల్ చెన్ షుయి త్సాయ్ అన్నారు.

''ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. చైనా సైనిక శక్తి, తైవాన్ సైనిక శక్తి మధ్య అగాధం మధ్య మరింత పెరిగింది. చైనా సైన్యం మరింతగా బలపడుతోంది. జింగ్ పింగ్ గనక తన సైనిక శక్తిని ఉపయోగించాలనుకుంటే తైవాన్ వాళ్లను అడ్డుకోలేదు'' అని చెన్ షుయి త్సాయి చెప్పారు.

తైవాన్ సైనిక విన్యాసాలు

జులైలో తైవాన్ భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. చైనా దాడులను ఎదుర్కోవడానికి ఈ దీవి సిద్ధంగా ఉందని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశ్యం.

కానీ... పెద్ద, అధునాతన, భారీ ఆయుధ సంపత్తి గల తన శత్రువుకు తమ సైనిక దళాలు ఎంత బలహీనంగా ఉన్నాయో తైవాన్ ప్రదర్శించిందనే విమర్శలు ఎదురయ్యాయి..

ఈ పదునైన విమర్శలు చేసిన వారిలో తైవాన్ సాయుధ దళాలకు గతంలో నాయకత్వం వహించి ఓ వ్యక్తి కూడా ఉన్నారు.

''మేం మారకపోతే మేం ఓటమిపాలవుతాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్షణం చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మీరు వెంటనే రంగంలోకి దిగాలి. మనం దీనిపై మళ్లీ మళ్లీ ఆలోచించి, తాపీగా నిర్ణయాలు తీసుకోవడానికి సమయం లేదు. టైం మనకు అనుకూలంగా లేదు'' అని అడ్మిరల్ లీ హ్సీ మింగ్ తెలిపారు.

ఇది అడ్మిరల్ లీ ఒక్కరి అభిప్రాయం మాత్రమే కాదు. ఒక వేళ యుద్దం వస్తే ఎలా పోరాడాలనే దానిపై వేల మంది పౌరులు శిక్షణ తీసుకుంటున్నారు.

ఇక్కడి చాలా మంది యువకులలాగే జే లై కూడా తన మిలిటరీ సర్వీసు పూర్తి చేశారు. కానీ నిజమైన పోరాటం గురించి తను నేర్చుకునన్నదేమీ లేదంటారాయన.

మీరు సుదీర్ఘ కాలంగా ప్రమాదపుటంచులో బతుకుతున్నట్టయితే, మనకేమీ కాదులే అనే ఆత్మసంతృప్తికి లోనవడం చాలా సులువు.

కానీ అడ్మిరల్ లీ చెప్పినట్టుగా, ఏ దేశం కూడా తన శత్రువు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)