ఆసియా కప్ కోసం భారత్, పాక్‌కు వెళ్లడం గురించి రోజర్ బిన్నీ ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్తుందా? లేదా అనే విషయాన్ని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ చెప్పారు.
కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్యర్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ... వచ్చే ఏడాది భారత జట్టును పాక్‌కు పంపే అంశంపై బీసీసీఐ ఇంకా భారత ప్రభుత్వంతో చర్చించలేదని అన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
‘‘ఇది బీసీసీఐ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. దేశం నుంచి బయటకు వెళ్లి ఆడటానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లడమే కాదు, విదేశీ జట్లు భారత్‌లో పర్యటించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే’’ అని రోజర్ బిన్నీ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
‘‘మాకు ఆమోదం లభించగానే, ముందుకు సాగుతాం. పాక్ పర్యటన గురించి సొంతంగా నిర్ణయం తీసుకోలేం. దీనిపై ప్రభుత్వంపై ఆధారపడాల్సిందే. కానీ, ఇంకా దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడలేదు’’ అని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.







