గుజరాత్‌లో ఈసారి బీజేపీ పరిస్థితి ఏంటి? ‘కాంగ్రెస్ ఏదో కొత్తగా ప్రయత్నిస్తోంది, జాగ్రత్త’ అని మోదీ ఎందుకు హెచ్చరించారు?

ఫొటో సోర్స్, @BJP
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
గత నెల రోజులుగా గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
2017 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నడిచింది. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో బీజేపీ 99 సీట్లకే పరిమితమైంది.
కానీ, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలో అడుగు పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో అక్కడ కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు కష్టంగా మారాయి. కాంగ్రెస్ కంటే బీజేపీకి చిక్కులు ఎక్కువ అయ్యాయి.
2012లో బీజేపీ 115 సీట్లను గెలిచింది. కానీ, 2017లో కాంగ్రెస్ కారణంగా బీజేపీ సీట్ల సంఖ్య 99కి తగ్గిపోయింది.
2001లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం అయిన తర్వాత బీజేపీకి ఇంత తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి. అయితే, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
2017 ఎన్నికల్లో సీట్లు కోల్పోయామన్న బాధ నుంచి బీజేపీ తేరుకోలేకపోయింది. అందుకే బీజేపీ అగ్ర నాయకత్వం ఈసారి పూర్తిగా గుజరాత్ ఎన్నికలపైనే దృష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో మూడుసార్లు అక్కడ పర్యటించారు.
ఆయనే కాకుండా హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్‌ను సందర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్.

ఫొటో సోర్స్, Getty Images
ఆమ్ ఆద్మీ రాకతో గట్టి పోటీ
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి గుజరాత్‌పై పూర్తి దృష్టి సారించారు. బీజేపీకి ఇక్కడ సవాలు విసురుతున్నారు.
'భారత్ జోడో యాత్ర' కారణంగా రాహుల్ గాంధీ పెద్దగా గుజరాత్‌లో పర్యటించకపోవచ్చు. కానీ, ఆయన పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ కారణంగానే బీజేపీ గతంలో కంటే కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
అక్టోబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ చేస్తోన్న 'సైలెంట్ క్యాంపెయిన్' గురించి హెచ్చరించారు.
''గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా హడావిడి చేసేది. బీజేపీని తుదముట్టిస్తామంటూ గొప్పలు చెప్పుకునేది. కానీ గత 20 ఏళ్లుగా మనం ఓటమనేది చూడలేదు. అందుకే ఈసారి కాంగ్రెస్ కొత్తగా ఏదో ప్రయత్నిస్తోంది. కాబట్టి మనమంతా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది'' అని మోదీ సూచనలు ఇచ్చారు.
బీజేపీ ముందు ఈసారి కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల హిందుత్వ రాజకీయాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో ఢిల్లీ మోడల్‌ను చూపిస్తూ గుజరాత్ ఎన్నికల్లో గెలవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచడం నుంచి దిల్లీ తరహాలో మొహల్లా క్లినిక్‌లు, ఉచిత విద్య, మరిన్ని ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతోంది.
వీటితో పాటు బీజేపీ తరహాలో హిందూ గుర్తింపు గురించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతోంది.

ఫొటో సోర్స్, @AAP
బీజేపీ భయపడుతోందా?
కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ సవాలుగా చూస్తుందని బీబీసీతో సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఘన్‌శ్యామ్ షా అన్నారు. ''ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ భాషనే ఓటర్లతో మాట్లాడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు హిందుత్వ భాషనే ఎత్తుకుంది'' అని ఆయన చెప్పారు.
''ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా, బీజేపీపై బాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాష్ట్రంలో ప్రభావవంతమైన పటీదార్ కమ్యూనిటీకి చెందినవారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లోని దిగువ మధ్య తరగతిపై దృష్టి పెడుతోంది. ఈ వర్గం ఎదుర్కొంటోన్న ఆర్థిక కష్టాలు.. ఉద్యోగం, విద్యకు సంబంధించి వారు ఎదుర్కొంటోన్న సమస్యల నేపథ్యంలో వారిని ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానాలు ఆకర్షిస్తున్నాయి. అందుకే బీజేపీకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎక్కువ సవాళ్లు ఎదురవుతున్నాయి'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, TWITTER @AAMAADMIPARTY
బీజేపీకి ఈ దూకుడు వైఖరి ఎందుకు?
బీజేపీకి కాంగ్రెస్ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే ఎక్కువ సవాళ్లు ఎదురవుతున్నాయని మరికొందరు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. బీజేపీ భయపడుతున్నట్లుగా కనిపిస్తోందని అందుకే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని వారు అంటున్నారు.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఇసుదాన్ గడ్వీపై గుజరాత్ సర్కారు చర్యను ప్రజలు బీజేపీ భయాందోళనతో చేసిన పనిగా చూస్తున్నారు.
'వైబ్స్ ఆఫ్ ఇండియా' ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ దీపక్ త్రివేది మాట్లాడుతూ బీజేపీ భయపడటం లేదని అన్నారు.
''బీజేపీకి భయం లేదు. 2007 నుంచి నేను బీజేపీని చూస్తున్నా. అప్పటినుంచి మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ, శాసన సభ, లోక్‌సభ ఇలా ఏ ఎన్నికలైనా బీజేపీ దూకుడుగానే వ్యవహరిస్తోంది.
బీజేపీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పోరాడుతుంది. మైక్రో మేనేజ్‌మెంట్‌పై పూర్తి శ్రద్ధ పెడుతుంది. మొదట ఈ పని నరేంద్ర మోదీ చేసేవారు. ఇప్పుడు అమిత్ షా చేస్తున్నారు. బీజేపీ వైఖరిలో వారి ఆందోళన కనిపించడం లేదు. ఎన్నికలపై పూర్తి శ్రద్ధ కనబడుతోంది. గతంలో కంటే ఎక్కువగా ఎన్నికలపై దృష్టి సారించింది.
పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదు. కానీ, కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు నాకు తెలిసిందేంటంటే ప్రజల నుంచి కాంగ్రెస్‌ను దూరం చేయడం అంత సులభం కాదు. ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ నుంచి సవాళ్లు ఉంటాయి. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో గుజరాత్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి'' అని వివరించారు.

ఫొటో సోర్స్, ANI
ఈ ఎన్నికలు మోదీకి చాలా కీలకం
ఆమ్ ఆద్మీ పార్టీని తొలుత ప్రజలు బీజేపీ 'బి' టీమ్ అని భావించేవారని దీపక్ త్రివేది చెప్పారు.
''తమ నాయకుడు ఇషుదాన్ గడ్వీకి వ్యతిరేకంగా సర్కారు తీసుకున్న చర్య తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. క్షేత్రస్థాయిలో చాలా తీవ్రంగా పని చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది.
గుజరాత్ ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్నందున ఇందులో గెలుపు మోదీకి, బీజేపీకి చాలా కీలకం.
గుజరాత్ లోక్ సభ స్థానాలు కూడా బీజేపీకి సవాలుగా నిలిచాయి. 2019 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. కానీ, 2024లో ఇదే ఫలితం పునరావృతం కావడం కష్టంగా అనిపిస్తోంది.
1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లను గెలుచుకుంది. ఈ మ్యాజికల్ ఫిగర్‌ను మోదీ నేతృత్వంలోని బీజేపీ ఇప్పటివరకు అందుకోలేకపోయింది. అందుకే గుజరాత్‌లో బీజేపీకి మరోసారి అత్యధిక సీట్లను కట్టబెట్టాలని మోదీ ఆశిస్తున్నారు. ఈ మ్యాజికల్ ఫిగర్‌ను అందుకోవడం కోసమే మోదీ నాయకత్వంలోని బీజేపీ గుజరాత్ ఎన్నికలకు పూర్తి ప్రాధాన్యతను ఇస్తోంది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రతీ ఎన్నికల్లో బీజేపీ పోరాటం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు చాలామంది అగ్రనేతలను బీజేపీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది.
ఇదే బీజేపీ వ్యూహమని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు. కౌన్సిలర్ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా బీజేపీ పూర్తి శ్రద్ధతో పోరాడుతుందని చెప్పారు.
''హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న బీజేపీ వ్యూహంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ, బీజేపీ ఈ ఎన్నికల్లో చిత్తశుద్ధితో పోరాడింది. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ ఎందుకు అంత శ్రద్ధ వహిస్తుందనే ప్రశ్న ఇప్పుడు అర్థరహితమైనది.
కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. వీటి తర్వాత 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI
గుజరాత్ అసెంబ్లీ ప్రస్తుత స్థితి ఏంటి?
2017 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మద్య ప్రత్యక్ష పోటీ జరిగింది. బీజేపీ 40.9శాతం ఓట్లను సాధించి 99 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్‌లోని మొత్తం 182 శాసనసభ స్థానాల్లో 40 రిజర్వుడు సీట్లు. ఇందులో 27 సీట్లు ఎస్టీలకు, 13 ఎస్సీలకు కేటాయించారు.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ వద్ద 111 మంది శాసనసభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 62కి తగ్గిపోయింది. ఎన్సీపీ, భారతీయ ట్రైబల్ పార్టీకి చెరో ఎమ్మెల్యే ఉండగా, ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'శారీరక శక్తి కన్నా మెదడు ప్రమాదకరం' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
- కాంతార మూవీ రివ్వూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి
- ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











