చరిత్రాత్మక తీర్పుల వెనకున్న 5 ప్రజాప్రయోజన వ్యాజ్యాలివీ.. ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఎందుకు?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్జున్ పర్మార్
    • హోదా, బీబీసీ గుజరాతీ

భారత్‌లో పెండింగ్ కేసులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు ఈ విషయంపై ఆందోళన వ్యక్తంచేశారు. కేసులను త్వరతగతిన పరిష్కరించాలని న్యాయమూర్తులను వీరు అభ్యర్థించారు.

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సమాచారం ప్రకారం.. భారత్‌లో మొత్తంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

అయితే, ఈ పెండింగ్ కేసులలో ఎక్కువగా రిట్‌లు, ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు (పీఐఎల్) ఉన్నాయని బీబీసీ దాఖలుచేసిన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)తో వెలుగులోకి వచ్చింది.

సుప్రీంకోర్టుతోపాటు 11 హైకోర్టుల్లో బీబీసీ సమాచార హక్కు దరఖాస్తులను దాఖలుచేసింది. దీంతో మొత్తంగా 2,94,731 రిట్ పిటిషన్లు, 10,146 ప్రజాప్రయోజన వ్యాఖ్యలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టులో, 226 కింద హైకోర్టుల్లో రిట్‌లు, ప్రయోజన వ్యాఖ్యలను దాఖలుచేసేందుకు నిబంధనలు ఉన్నాయి.

వీటిని అనుసరించి దేశ పౌరులు ఎవరైనా తమ హక్కుల కోసం సుప్రీం కోర్టు లేదా హైకోర్టులకు వెళ్లొచ్చు.

ఎన్‌వీ రమణ

ఫొటో సోర్స్, ANI

‘‘తమ ప్రాథమిక హక్కులను అమలయ్యేలా చూడాలని వీటి ద్వారా ఎవరైనా కోర్టులను ఆశ్రయించొచ్చు’’అని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నందిత బాత్రా వ్యాఖ్యానించారు.

‘‘ఈ కేసులను వేగంగా పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ, భారత న్యాయ వ్యవస్థలో కొన్ని చిక్కుల వల్ల వీటిని పరిష్కరించడానికి చాలా ఆలస్యం అవుతోంది’’అని బీబీసీతో ఆమె చెప్పారు.

అయితే, ఈ పిటిషన్లను పరిష్కరించడానికి భారత్‌లోని కోర్టులు ప్రాధాన్యం ఇస్తాయని నల్సార్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సెలర్ డాక్టర్ ఫైజాన్ ముస్తాఫా చెప్పారు. ‘‘భారత్‌ న్యాయ వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల కేసుల పెండింగ్ పెరుగుతోంది. అయితే, చాలాసార్లు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయి. అందుకే వీటి విషయంలో కోర్టులు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి’’అని ఆయన వివరించారు.

చాలా రిట్‌లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించినప్పటికీ, వీటిపై కోర్టులో నిర్ణయం తీసుకోవడం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటుంది. ఒక్కోసారి వీటిపై నిర్ణయం తీసుకోవడానికి ఏళ్ల సమయం కూడా పడుతుంది.

ఈ పిటిషన్లలో చాలా వాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో సంబంధమున్నప్పటికీ, అత్యవసర విచారణ అన్నివేళలా సాధ్యంకావడం లేదు.

కొన్ని రిట్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు భారత న్యాయ వ్యవస్థలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. వ్యక్తిగత గోప్యతా హక్కులతో మొదలుపెట్టి ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్లుగా గుర్తించడం లాంటి కోర్టు తీర్పులు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపించాయి.

భారత న్యాయ వ్యవస్థలో చరిత్రాత్మకంగా నిలిచిన కొన్ని రిట్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై నిపుణులు బీబీసీతో మాట్లాడారు.

కేశవానంద భారతి

ఫొటో సోర్స్, TWITTER/CHOUHANSHIVRAJ

ఫొటో క్యాప్షన్, కేశవానంద భారతి

కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) – ‘‘సేఫ్టీ వాల్వ్ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ’’

కేరళ భూసంస్కరణల చట్టం–1963కు వ్యతిరేకంగా ఈ రిట్ పిటిషన్ దాఖలైంది.

ఈ కేసును విచారించినప్పుడే ‘‘బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ (ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం)’’ను సుప్రీం కోర్టు తీసుకొచ్చింది.

రాజ్యాంగానికి సవరణ చేయడంలో పార్లమెంటుకు అపరిమిత అధికారాలు ఉన్నాయని ఈ కేసులో కేంద్రం వాదించింది. అయితే, రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను సవరణలో వెనక్కి తీసుకోలేరని పిటిషన్‌దారులు చెప్పారు. ఆ ముఖ్యమైన ఫీచర్లను సవరిస్తే, వాటిని రాజ్యాంగ వ్యతిరేక సవరణలుగా పరిగణించాలని కోరారు.

పిటిషన్‌దారుల వాదనలను కోర్టు సమర్థించింది. రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంటుకు అపరిమిత అధికారాలేమీ లేవని స్పష్టంచేసింది. ముఖ్యంగా బేసిక్ స్ట్రక్చర్ (ప్రాథమిక నిర్మాణం) మార్చడానికి వీలులేదని తేల్చింది.

ప్రాథమిక నిర్మాణం (బేసిక్ స్ట్రక్చర్) అంటే ఏమిటో కూడా 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్వచించింది. రాజ్యాంగంలోని అంశాలకు ప్రాధాన్యం, సెక్యులర్ నిర్మాణం, పౌరులు గౌరవప్రదంగా జీవించేలా చూడటం (ప్రాథమిక హక్కుల ద్వారా) లాంటివి బేసిక్ స్ట్రక్చర్‌లో భాగమని పేర్కొంది.

ఉదాహరణకు ఒకవేళ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను మొత్తంగా తీసివేయాలని భావించినా లేదా దేశాన్ని సెక్యులరిజం వైపు నుంచి ఒక మతం వైపు నడిపించాలని చూసినా కుదరదు. ఒకవేళ ఇలాంటి సవరణలను తీసుకొస్తే, బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతాన్ని చూపించి సుప్రీం కోర్టు కొట్టివేయగలదు.

బేసిక్ స్ట్రక్చర్ ప్రాముఖ్యతపై నాని పాల్ఖివాలా స్మారక ఉపన్యాసం సమయంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రోహింగ్టన్ నారీమన్ మాట్లాడారు. ‘‘విపరీతమైన రాజ్యాంగ సంస్కరణలను ఈ సిద్ధాంతం సాయంతో సుప్రీం కోర్టు కొట్టివేసేంది. ఇది చాలాసార్లు కీలకంగా పనిచేసింది’’అని ఆయన అన్నారు.

‘‘10 జడ్జిమెంట్స్ దట్ చేంజెడ్ ఇండియా’’ పుస్తకంలో రచయిత, న్యాయవాది జియా మోదీ.. కేశవానంద భారతి తీర్పును ‘‘ద సేఫ్టీ వాల్వ్ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ’’గా అభివర్ణించారు.

మరోవైపు ఈ తీర్పును ‘‘భారత భవిష్యత్ రాజ్యాంగం’’గా రాజ్యాంగ నిపుణుడు ఉపేంద్ర భక్షి 1974లో అభివర్ణించారు.

మేనకా గాంధీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మేనకా గాంధీ

మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా – ప్రతి ఒక్కరికీ సురక్షితంగా జీవించే హక్కు

1978లో మేనకా గాంధీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే, దీనికి గల కారణాలను ప్రభుత్వం ఆమెకు వెల్లడించలేదు. మరోవైపు ఆమె తన వాదన చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు.

దీంతో రిట్ పిటిషన్ ద్వారా ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛగా జీవించే హక్కు (ఆర్టికల్ 21)లో విదేశాలకు వెళ్లే హక్కు కూడా భాగమని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు.

ఈ వాదనకు సుప్రీం కోర్టు మద్దతు పలికింది. విదేశాలకు వెళ్లడంతోపాటు ‘‘జీవించే హక్కులో’’ చాలా అంశాలను కోర్టు ఆ తర్వాత కాలంలో జతచేసింది.

వీడియో క్యాప్షన్, ఆభరణాల తయారీతో సెక్స్ వర్కర్ల కొత్త జీవితం

చాలా మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకు ఆర్టికల్ 21 కేంద్రంగా మారింది. మేనకా గాంధీ కేసు తర్వాత, వ్యక్తిగత గోప్యతా హక్కు, స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కు, విద్యా హక్కు, ఆహార హక్కులు కూడా దీనిలో చేర్చారు.

ఈ కేసుల ప్రాముఖ్యం గురించి బాత్రా మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా కేశవానంద భారతి కేసులో పార్లమెంటు అపరిమిత అధికారాలకు న్యాయవ్యవస్థ చెక్ పెట్టింది. సవరణల పేరుతో రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఎలాంటి మార్పులూ చేయకూడదని స్పష్టంచేసింది’’అని చెప్పారు.

‘‘ఇక మేనకా గాంధీ కేసు విషయానికి వస్తే.. జీవించే హక్కును వెనక్కి తీసుకోవడానికి అనుసరించే విధానాలు నిష్పాక్షికంగా ఉండాలని స్పష్టంచేసింది. ఈ రెండు కేసులనూ చాలా కేసుల విచారణ సమయంలో కోర్టులు ప్రస్తావిస్తుంటాయి. ఇవి మానవ హక్కుల పరిధిని మరింత విస్తరించాయి’’అని బాత్రా అన్నారు.

ఎల్‌జీబీటీ

ఫొటో సోర్స్, Reuters

నవ్‌తేజ్‌సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ప్రజాప్రయోజన వ్యాజ్యం) – స్వలింగ సంపర్కుల శృంగారం అసహజం కాదు

ఈ కేసులో భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377 చెల్లదని సుప్రీం కోర్టు ప్రకటించింది.

అసహజ శృంగారం నేరంగా ఈ సెక్షన్ పరిగణిస్తోంది. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య సమ్మతితో జరిగే శృంగారం కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరమే.

రాజ్యాంగం అందించిన స్వేచ్ఛలన్నీ ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి కూడా అందించడంలో ఈ తీర్పు ఉపయోగపడింది. ఇప్పుడు తమ ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఎల్‌జీబీటీ ప్రతినిధులు ఎవరైనా కోర్టును ఆశ్రయించొచ్చు.

ట్రాన్స్‌జెండర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌ఎల్ఎస్ఏ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ప్రజాప్రయోజన వ్యాఖ్యం) – ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు

ఈ కేసులో ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్‌గా సుప్రీం కోర్టు గుర్తించింది. దీంతో చట్టపరంగా వారికి గుర్తింపు వచ్చినట్లు అయింది.

మరోవైపు థర్డ్‌ జెండర్లకు రిజర్వేషన్లు కూడా కల్పించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఈ వర్గానికి చెందిన వారు సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించాలని కోర్టు సూచించింది. దీంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది.

వీడియో క్యాప్షన్, గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం

శబరిమల దేవాలయం కేసు (ప్రజాప్రయోజన వ్యాజ్యం) – సమానత్వం

కేరళలోని శబరిమల దేవాలయంలో రుతుక్రమ వయసులో ఉండే మహిళలు ప్రవేశించకుండా ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఈ కేసులో సుప్రీం కోర్టు ఎత్తివేసింది.

‘‘ఈ నిషేదాన్ని మహిళలను చిన్నచూపు చూడటంగానే పరిగణించాలి’’అని తీర్పు సమయంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

ఈ నిషేధం పూర్తిగా వివక్షపూరితమైనదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ఇచ్చిన స్వేచ్ఛగా ప్రార్థించుకునే హక్కును ఇది ఉల్లంఘిస్తోందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

‘‘ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దేశంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిధిని విస్తరించడంలో కీలకంగా పనిచేశాయి. ముఖ్యంగా మహిళలు, ఎల్‌జీబీటీ ప్రతినిధులకు హక్కులను ప్రసాదించాయి. సమానత్వ హక్కును మరోసారి పునరుద్ఘాటించాయి’’అని అడ్వొకేట్ కేఆర్ కోష్టి చెప్పారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదించడంలో కోష్టికి అనుభవముంది. సుప్రీం కోర్టు, గుజరాత్ హైకోర్టులో ఆయన కేసులు వాదించారు.

మరోవైపు ప్రజాప్రయోజన వ్యాజ్యాల ప్రముఖ్యత గురించి బాత్రా మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఎన్నిలక బాండ్ల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడం లాంటి ఎన్నో కీలకమైన నిర్ణయాలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో తీసుకున్నారు. ఇలాంటి ముఖ్యమైన వ్యాజ్యాలపై వేగంగా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మన ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి’’అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)